స్నేహం అన్నది నిజముగా మధురమైన భావన.. కష్టాలూ, కన్నీళ్ళూ, ఆనందాలూ, ఆలోచనలూ, భావాలూ, కోరికలూ, ఇష్టాలూ, అయిష్టాలూ, ఆప్యాయతలూ, అనురాగాలూ... ఇవన్నీ మన తల్లితండ్రులతో పంచుకోలేం. ఏవో కొన్నింటిని మాత్రమే పంచుకుంటాము. ఈరోజుల్లో చాలామంది తల్లితండ్రులు స్నేహితుల్లా పిల్లలతో మెలుగుతున్నారు. అది మంచి శుభపరిణామం. ఈకాలం పిల్లలు అదృష్టవంతులు అనుకుంటాను నేను.
తల్లి తండ్రులకన్నా ఎక్కువగా మన మదిని తెరిచేది కేవలం స్నేహితుల వద్దనే.. ఉన్న పరిచయస్థుల్లో కొంతమంది స్నేహితులు అవుతారు. అలాంటి వారిలో ముఖ్య స్నేహితులు అంటే వ్రేళ్ళ మీద లెక్క పెట్టేవాళ్ళు ఉంటారు. మళ్ళీ ఇందులో ఒకరో ఇద్దరో మాత్రం ఆత్మీయ నేస్తాలు అయి ఉంటారు. వాళ్ళు మాత్రమే మన గుండె గదిలోన నిలిచిపోతారు. వాళ్ళతో మాత్రమే మన ఆలోచనలు.. అన్నీ పంచుకుంటాము. మనసంతా తెరచి ఉంచుతాము. వారిని మన ఆత్మీయ స్నేహితులు అని పిలుచుకోవచ్చును. ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే Soul mate friend అని డిసైడ్ అవచ్చును. ఈ సోల్మేట్ ఫ్రెండ్ అన్న పదం క్రొత్తగా ఉంది కదూ..
ఎన్నో వడపోతల తరవాత మీరు అలా నిర్ణయించుకున్న మీ ఫ్రెండ్ - మీకు దొరికాడూ అంటే మీరు అదృష్టవంతులే అన్నమాట. అలాంటి ఒక మంచి నేస్తాన్ని సమకూర్చుకున్నందులకు మీకు అభినందనలు. మన జీవనయానములో అలాంటి స్నేహితులను - మన మదిలో ఉన్నది అంతా చెప్పుకోవటానికి కనీసం ఒక్కరైనా మనకి ఉండాలి. అలా ఉండేలా ప్రయత్నం చెయ్యండి. ఒకవేళ అలాంటి స్నేహితురాలు / స్నేహితుడు కానీ మీకు లభిస్తే, ఆ ప్రయత్నములో మీరు విజయం సాధించారు అన్నమాటే! అలాంటి స్నేహితులు ఇంకా దొరకుంటే - త్వరగా ప్రయత్నాలు చెయ్యండి.
త్వరలో మీకు అలాంటి స్నేహితులు దొరకాలని ఆశిస్తూ..
No comments:
Post a Comment