Tuesday, September 11, 2012

భాగస్వామి ఆసరా

మొన్న నా మిత్రుడి వద్దకి వెళ్లాను. తన ఇంటిమీద క్రొత్తగా నిర్మిస్తున్న అంతస్థులోకి నన్ను తీసుకెళ్ళాడు. అందులోని పోర్షన్ ల రూపు ఎలా ఉంటుందో చూపసాగాడు. చాలా బాగా కడుతున్నారు. దాదాపుగా అంతా ముగిసింది. ఎలెక్ట్రికల్, పంబ్లింగ్, కార్పెంటరీ పని మిగిలుంది.

అలా చూస్తుండగా క్రింద నుండి ఒక ముస్లిం జంట వచ్చింది. నలబై నుండి యాభై ఏళ్ళ వయస్సులో ఉంటారు వాళ్ళిద్దరూ. ఎవరబ్బా! క్రొత్తగా ఆ పోర్షన్ లో దిగటానికి అన్నట్లు అడగటానికి వచ్చారేమో అనుకున్నాను. ఆయన భుజాన ఫోల్దబుల్ అల్యూమినియం నిచ్చెన, చేతిలో ఒక పాత, లావాటి బ్యాగు కాసింత బరువుగా ఉంది. ఆమె చేతిలో ఒక బుట్టిలాంటిది ఉంది.

వారిని చూడగానే మా ఫ్రెండ్ వారిని సాదరముగా పిలిచాడు. కాసేపు వారితో ఆ పోర్షన్ రూములన్నీ కలియదిరుగుతూ మాట్లాడసాగాడు. అప్పుడు అర్థం అయ్యింది - ఆయన చేసే పని ఆ పోర్షన్ కి కరెంట్ వైరింగ్ అనీ.

ఆరోజుకి అయ్యే ఎలెక్ట్రికల్ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకున్నాడు. చాక్ పీస్ తో, గీతలు గీసుకున్నాడు. ఎక్కడెక్కడ ఏమేని రావాలో అన్నీ అడుగుతున్నాడు. ఇక - వాళ్ళావిడనేమో పనిచెయ్యటానికి నిచ్చెనని సిద్ధం చేసింది. అలాగే బ్యాగు నుండి తనకి  అవసరమైన పరికరాలు అన్నీ బయటకి తీసి సిద్ధం చేసింది. అలా బయట పెట్టాక ఆయనకేసి చూసింది. వాళ్ళిద్దరి కళ్ళు మాత్రమే మాట్లాడుకున్నాయి. ఆ చూపులతో వాళ్ళిద్దరికే తెలిసిన భాష ఏదో మాట్లాడుకున్నారు.

ఆమె తన చేతి సంచీతో లోపలి గదిలోకి వెళ్ళి, కాసేపట్లో బయటకి వచ్చింది. ఇప్పుడు ఆమె సాంప్రదాయమైన బురఖా తీసేసి, మగవారి పొడుగు చేతుల చొక్కా, దానికి ముందట నాలుగు జేబులు ఉన్నది ధరించి, వచ్చింది. ఆయననేమో నడుముకి ఎలెక్ట్రికల్ సామాను బిగించే పనిముట్లని పెట్టుకోవటానికి ప్రత్యేకముగా చేయించుకున్న బెల్ట్ నడుముకి ధరించాడు. మరు నిమిషములోనే వాళ్ళిద్దరూ ఆ విద్యుత్ వైరింగ్ చెయ్యటం మొదలెట్టారు.

వారు చాలా పక్కా ప్రొఫెషనలిజం తో పనిని మొదలెట్టారు. చాలా ఫాస్ట్ గా, నేర్పుతో, నైపుణ్యముగా చేస్తున్నారు. ఆయన కుర్చీ నిచ్చేనెక్కి పని చేస్తుండగా, ఆమె క్రింద ఉండి, చిన్న చిన్న పనులు చేస్తూ, ఆయనకీ కావలసినవి అందిస్తున్నది.

ఈ హౌస్ వైరింగ్ పని అంతా వచ్చిన నాకు వారు చేస్తున్న పనిని చూస్తూ, నా మిత్రునితో పిచ్చాపాటీ మాట్లాడుతున్నాను. మధ్యమధ్యలో చేసే ఆవిడ పనిని చూస్తున్నాను. ఒక పనివాడి నైపుణ్యం ఏమిటో మరో అంతటి పనివాడే గుర్తు పడతాడు అన్నట్లు, ఆవిడ చేసే పనిలో నైపుణ్యం ఏమిటో చూశాను.

చూడటానికి సాదా పనిలా ఉన్నా, చాలా పక్కా ప్రొఫెషనలిజం చూపుతూ చాలా నేర్పుగా పని చెయ్యసాగింది. కాసింత సేపటిలోనే ఆమె ఆ పనిలో ఆరితేరినట్లుందని అర్థమయ్యింది. చదువు ఏమీ రాని గృహిణి అంత బాగా పనులు చెయ్యటం, అందునా మగవారే ఇబ్బందులు పడుతూ చేసే ఆ హౌస్ వైరింగ్ పనిని చాలా వేగముగా, నైపుణ్యముగా చేస్తున్నది.

నా మిత్రుడు నా మదిలోని భావాలు చదివి, ఆ వైరింగ్ చేసే ఆయనతో మాట్లాడటం మొదలెట్టాడు. అలా మొదలైన మాటల్లో.... ఆయన తన కథ చెప్పటం మొదలెట్టాడు.

ఆయనకి ముగ్గురు ఆడపిల్లలు. అబ్బాయిలు ఎవరూ లేరు. తమకి అబ్బాయిలు లేకున్నా అమ్మాయిలనే బాగా పెంచుకోవాలని, బాగా అభివృద్ధిలోకి తీసుకరావాలని వారి తాపత్రయం. తమలాగా వారు కష్టపడకూడదు అని వారి నిర్ణయం. ఒక అమ్మాయిని డిగ్రీ కాగానే, మంచి సంబంధం వస్తే, పెళ్లి చేశారు. రెండో అమ్మాయి హాస్టల్లోఉంటూ కంప్యూటర్ సైన్స్ చేస్తుంది. మూడో ఆమె రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటూ ఇంటర్ చేస్తున్నది.

ఇక తరవాత ఆమె గురించి చెప్పాడు. తను చదూకోలేదు అంట. మొదట్లో బాగా ఇబ్బందులు పడ్డ ఆ కుటుంబం ఒకానొక దశలో సర్వం కోల్పోయారు. ఆ సమయములో అయిన వారందరూ మొహం చాటు చేశారు. అప్పుడే ఆయన పక్షవాతం + లో బీపీ కి గురయ్యాడు. ఒక్కోసారి తినడానికి తిండి లేక నీళ్ళు త్రాగి పడుకున్న రోజులూ ఉన్నాయంట. అప్పుడే - ఆవిడ చాలా సేవ చేసి, ఆయనని ఆ జబ్బుల నుండి బయటకి తీసుకోచ్చేసింది. అంతలోగా కుటుంబం గడవటానికి మంచం మీద పడుకొని, తనకి వచ్చిన ఏకైక పని - కరెంట్ పనిని ఆమెకి నేర్పించాడు. అలా మొదలైన ఆ పనిలో ఆమె నిష్ణాణితురాలైంది.

ఆ తరవాత ఇల్లూ, షాపూ ఒకే దగ్గర ఉన్నది తీసుకొని, భర్తకి ఎక్కువగా వచ్చిన పనిని వెనకరూములో చేస్తూ, ఆయనకీ పనిలో సహాయము చెయ్యసాగింది. అలా అలా చేస్తూ, సర్వం కోల్పోయిన జీవితాన్ని చక్కపెట్టుకున్నారు. కొద్దిగా స్థితిమంతుల స్థాయికి చేరుకున్నారు. అయినా ఎక్కడా సాంప్రదాయం వీడలేదు. బాగుపడ్డ జీవితం క్రెడిట్ అంతా ఆయనదే అని తనకే ఇచ్చింది ఆవిడ. ఎక్కడా లోకానికి పరిచయం కాలేదు.

ఆ తరవాత పిల్లలు హాస్టల్లో చేరాక, ఒక్కతే ఇంట్లో ఉండబుద్ది కాక, కంపెనీ ఇచ్చినట్లు ఉంటుందని, ముచ్చట్లు పెడుతూ పని చేసినట్లూ ఉంటుందనీ, అసిస్టంట్ గా ఉంటూ చేదోడు వాదోడుగా ఉంటుంది అన్నట్లు, ఎవరికీ బయటకి తెలీకుండా / కనిపించకుండా ఉంటూ, ఇంటి పోర్షన్ వైరింగ్ గదుల్లోనే ఉంటూ చేస్తున్నది. .. అంటూ చెప్పాడు.

ఇంత చెప్పినా ఆవిడ ఎక్కడా గర్వముగా చూడలేదు. కనీసం తలెత్తి చూడనేలేదు. అదో పిచ్చి సోది అన్నట్లు అస్సలు పట్టించుకోలేదు. ఆవిడ పనిలో ఆవిడ నిమగ్నమైనది.

ఆమెని పిలిచి, క్రింద ఉన్న బండిలో ఉన్న సామాను తెమ్మని చెప్పి పంపాడు. (మాకు ఇది చెప్పటానికే ఆమెని అలా దూరముగా పంపాడని ఆ తర్వాత అర్థం అయ్యింది) అలా ఆమె వెళ్ళగానే మళ్ళీ మొదలేడుతూ -

నేను జబ్బు పడ్డప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. కానీ ముగ్గురు పిల్లలూ, నా భార్య కళ్ళల్లో మెదిలి అడ్డువచ్చారు. వాళ్ళ జీవితాలని నడిరోడ్డు మీద వదిలేయ్యాల్సి వస్తుందని, అడుక్కు తినేలా చేసేలా ఉంటుందని.. అంటూ వచ్చిన ఊహ నన్ను అలా చెయ్యకుండా ఆపింది. ఆవిడ నాకు చేసిన సేవ, ఆమె పడిన కష్టాలూ అన్నీ చూసినవాడిని. నాకంటూ మళ్ళీ ఒక జీవితాన్ని ఇచ్చినవారికి ఏమీ ఇచ్చుకోలేను. అప్పుడు ఆస్థి అంటూ ఏమీ మిగల్లేదు.. ఉన్నదల్లా వైరింగ్ లో నైపుణ్యము + కష్టపడటం. వీళ్ళ కోసం ఏదైనా చెయ్యాలని అనుకున్నాను. గౌరవముగా బ్రతికేలా చెయ్యాలని అనుకున్నాను. అందుకే పిల్లల్ని బాగా చదివిస్తున్నాను. పెద్దమ్మాయి లైఫ్ బాగుంది. మిగతా ముగ్గురు బాగుండాలి కదా.. అందుకే - నేను హటాత్తుగా ----- పోతే, (గొంతు బొంగురు పోయింది ఆయనది) వారిని ఒక స్థాయిలో చూడటానికి, చదువు రాని మా ఆవిడకి అన్ని కరెంట్ పనులూ నేర్పాను. అన్నీ చేస్తుంది. నేను లేకున్నా ఒంటరిగా ఉండి, అన్ని పనులు చేసేలా నేర్పాను. ఆమెకి మొదట్లో ఆసక్తి లేకున్నా జీవితములో వచ్చే కష్టాలేమిటో తెలుసుకుంది కాబట్టి, బాగా ఆసక్తితో పని నేర్చుకుంది. ఎంతోమందికి పని నేర్పించాను. కానీ ఎవరూ మనవారు కాదు కదా.. నా వాళ్ళకి నేర్పిస్తే, మా జీవితమే బాగుంటుంది కదా.. త్వరలో ఆమెకి ఎయిర్ కండీషనర్ లు రిపేర్ చేసేలా మంచి సంస్థలో శిక్షణ ఇప్పిద్దామని అనుకుంటున్నాను. మొన్నే ఆమెకి  తెలీకుండా వెళ్ళి రిఫ్రిజరేషణ్ శిక్షణ సంస్థలో అడిగి వచ్చాను. ఆవిడని ఒప్పించి పంపాలి. నేను ఒకవేళ ఏమైనా వాళ్ళు బాగుండాలి కదా.. అని పునాది వేస్తున్నా.." అని అంటుండగానే బండిలోని సామానుతో ఆవిడ వచ్చింది. మొఖం ఒకసారి చేతితో రుద్దుకొని, కళ్ళలోని నీటిని పనిలో పనిగా తుడి చేసుకొని ఏమీ తెలీనట్లు మామూలుగా వైరింగ్ చేయసాగాడు.

చెమర్చిన గుండెతో నా మిత్రుని వద్ద, వారి వద్ద సెలవు తీసుకొని వచ్చాను. 

4 comments:

శిశిర said...

స్ఫూర్తినిచ్చే జీవితాలని పరిచయం చేశారు. ధన్యవాదాలు.

శిశిర said...

స్ఫూర్తినిచ్చే జీవితాలని పరిచయం చేశారు. ధన్యవాదాలు.

సుభ/subha said...

Heart touching andii...

Raj said...

శిశిర గారూ మరియు సుభ గారూ.! ధన్యవాదములు..

Related Posts with Thumbnails