" షాక్ "
ఏమిటబ్బా ఈ ఫ్రిడ్జ్ ఇలా షాక్ కొడుతుందేమిటీ.. అనుకున్నాను. ఆ ఫ్రిడ్జ్ వెనకాల ఎవాపరేట్ బాక్స్ లోని నీరు తీయబోతూ అలా షాక్ కి గురయ్యాను. వెనక ఉన్న లోహపు రేకుని మళ్ళీ త్రాకి చూశాను. జిల్ జిల్ మంటూ ఏదో కదిలినట్లుగా ఉంది. ఇలా కాదు అనుకొని, కరెంట్ టెస్టర్ పెట్టి చూశాను. నిజమే!.. కరెంట్ లైవ్ గా ఉంది. అప్పుడు కాళ్ళకి చెప్పులు కూడా లేవు.కొద్దిగా ఎలెక్ట్రికల్ పని వచ్చు కాబట్టి, క్షణములో మామూలుగా అయ్యాను. ఒక్క ఫ్రిడ్జ్ యేనా? లేదా మిగతా అన్ని సామానులా.. అని అన్నింటినీ టెస్టర్ తో పరీక్షించాను. అన్నింట్లో వాటి మొత్తం బాడీకి కరెంట్ లైవ్ గా ఉంది. అన్నింటికీ ఎర్తింగ్ ఉంది కాబట్టి సరిపోయింది. షాక్ ప్రభావం అంతగా చూపలేకపోయింది.
సాకెట్ లోని ఎర్తింగ్ పాయింట్ వద్ద టెస్ట్ చేశాను. అందులో లైవ్ గా కరెంట్ ఉంది. సో, ఏదో మూడు పిన్నుల ఎలేక్టికల్ పరికరం పాడు అయ్యిందన్న మాట. ఒక్కో ఎలెక్ట్రికల్ వస్తువులను కరెంట్ సాకెట్ లనుండి తొలగిస్తూ, ఎర్తింగ్ పాయింట్ వద్ద చూస్తూ, పోయాను.
ఫ్రిడ్జ్ ని సాకెట్ నుండి తీసేసినా.. అయినా కరెంట్ ఉంది.
వాషింగ్ మెషీన్.. అయినా ఉంది.
హట్ ప్లేట్.. ఉంది.
రైస్ కుక్కర్.. ఉంది..
కంప్యూటర్.. అయినా కరెంట్ ఉంది.
ఇలా ప్రతీ త్రీ పిన్ కరెంట్ ఉపకరణాలనీ తీసేస్తూ వచ్చాను.
అన్నీ అయిపోయాయి.
ఇక టూ పిన్స్ కి వచ్చాను. మూలగా అమాయకముగా ఉన్న టీవీ మీద దృష్టి పోయింది. దాని కనెక్షన్ వైర్ ని సాకెట్ నుండి తీశాను. చిత్రం.. కరెంట్ ఎర్తింగ్ పాయింట్లో కనిపించటం లేదు.
మళ్ళీ యధావిధిగా టీవీ ప్లగ్ పెట్టాను. ఎర్తింగ్ పాయింట్ లో కరెంట్ లేదు. ఇదేదో చిత్రముగా ఉందే అనుకున్నాను.
మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ యధావిధిగా షాక్.
ఇక లాభం లేదని టీవీ ని చెక్ చేశాను. ఎందుకైనా మంచిది అని టీవీ స్టెబిలైజర్ ని చెక్ చేశా. య్యేస్ - అందులోనే ప్రాబ్లెం. స్టెబిలైజర్ కి ఉన్న అవుట్ పుట్ సాకెట్ లోని నెగెటివ్ పాయింట్ లో కూడా లైవ్ గా కరెంట్ వస్తున్నది. ఒఫ్ఫో!..ఇదా సంగతి అనుకుంటూ.. ఎప్పుడో కొన్న, ఎప్పుడూ విప్పని ఆ స్టెబిలైజర్ యొక్క సీల్స్ విప్పి, ఓపెన్ చేశాను.
అందులో బోలెడంత దుమ్ము.. ఆ దుమ్ములోనే ఒక సాలీడు మాత ఎంచక్కా ఫ్లాట్ కట్టుకొని హాయిగా రెస్ట్ తీసుకుంటున్నది.
ఒక బ్రష్ తో ఆ స్టెబిలైజర్ ని శుభ్రం చేశాను. అప్పుడు ఒక స్క్రూ క్రింద పడింది. ఇది ఎక్కడిదా?.. అని చూశా. అవుట్ పుట్ సాకెట్ లోని నెగెటివ్ పాయింట్ ది ఊడిపోయి, క్రింద పడింది. ప్రాబ్లెం అర్థం అయ్యింది. ఆ పాయింట్లో ఉన్న వైర్ అప్పుడప్పుడు తాకుతూ, తాకక పోయేసరికి అలా అవుతున్నది. ఆ సాకెట్ కి ఆ స్క్రూ బిగించాను. అప్పుడు ఎర్తింగ్ పాయింట్లో కరెంట్ లైవ్ గా రావటం ఆగిపోయింది. ఒక చిన్న స్క్రూ వల్ల ఎంత ప్రమాదం ఏర్పడుతుందో చూడండి. ఎర్తింగ్ కనెక్షన్ ఉండటముతో ఈరోజు ఇంకా ఈపోస్ట్ వ్రాస్తున్నాను. లేకుంటే ............
No comments:
Post a Comment