Monday, February 4, 2013

Soul mate friend - 1

Soul mate friend - ఈ పదం క్రొత్తగా ఉందా? ఉంటుంది కూడా.. సోల్ మేట్ అనే పదానికి ఫ్రెండ్ అనే పదం కలిపి చెబుతున్నాను. క్రొత్తగా వినటానికి ఉన్నా, పాత అర్థమే అది. Sole అంటే ఆత్మ. mate అంటే జోడీ, చెలికాడు / చెలికత్తె . friend అంటే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను.. స్నేహితుడు. ఈ ఫ్రెండ్ అని కలపకుండా చెబితే - ప్రాణ సఖుడు అని అర్థం వస్తుంది. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది స్నేహితుడి గురించి. అందుకే ఆ పదానికి స్నేహితుడు - friend అని కలిపాను.

అసలు ఈ soul mate అనేది నా నేస్తం తన ఫోటో కామెంట్ గురించి అన్నప్పుడు మొదటిసారిగా విన్నాను. ఆ పదం గురించి తెలుసుకుంటే పైన చెప్పినట్లు అర్థం తెలుసుకున్నాను. ఆ పదానికే ఫ్రెండ్ అని కలిపాను. ఈ పదంని తెలుగు లోకి మారిస్తే -  ఆత్మ స్నేహితుడు అని చెప్పవచ్చు. క్రొత్తగా ఉంది కదూ.. 

ఇక్కడ నేను చెప్పేది ఆ పదానికి కొంత వివరణ అంతే! 

ఈ సృష్టిలో అందమైనది స్నేహమేనోయి అన్నారు. నిజమే. చాలా అందమైనది. మనిషి సంఘజీవి. సహచర మిత్రుడు లేనివాడు చాలా అరుదు. అలాంటివాడు లోలోన కుమిలిపోతాడు, ఒంటరిగా ఉంటాడు, ఎప్పుడూ బాధతో, ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉంటాడు. మొహం లో చాలా గంభీరత ఉంటుంది. ఎక్కువగా మాట్లాడరు. వారి మాటల్లో విచారం ఎప్పుడూ తొంగి చూస్తుంది. ఏవైనా ఇలా చేస్తే - పని జరుగుతుంది అన్నప్పుడు - అబ్బే! అలా కుదరదు అని తేలికగా, అపనమ్మకముగా చెప్పేస్తారు. ఇలాంటి లక్షణాలు మీలో గనుక ఉంటే - మీకు స్నేహితులు అయినా ఉండక పోవాలి. లేదా మీరే మీ స్నేహితుల గుంపు నుండి ఒంటరిగా మసలేలా ఉండాలి. అదే నిజమైతే మీరు మారాలి. 

నేను క్రొద్దిసంవత్సరాల క్రిందటి వరకూ స్నేహాన్ని నమ్మేవాడిని కాదు. ఆ విషయం నా సోషల్ సైట్స్ సీరిస్ పోస్ట్స్ లలో చెప్పాను. అది నా పొరబాటు కొంత.. నాకు దొరికినవారు అలా.. ఒక గ్యాంగ్ ( ఈ గ్యాంగ్ గురించి తరవాత చెబుతాను.. ఆ టపా వ్రాశాక ఇక్కడ లింక్ ఇస్తాను) తప్ప మిగతా అంతా అవసరార్ధం స్నేహాలే!. అందుకే విరక్తి వచ్చేసింది. అందుకే ఆ పోస్ట్ లలో చెప్పినట్లు ఈ ఆన్లైన్ లో అట పాట అన్నట్లు మొదట్లో ఉన్నా, తరవాత మంచి స్నేహాల వల్ల మారాను. 

ఇప్పుడు ఒక యాభై మంది పరిచయాలు ఏర్పడి, స్నేహితులుగా మారారు. వారిలో కొందరు నా శ్రేయోభిలాషులు, సన్నిహితులుగా మారారు. కొద్దిమంది ఈ sole mate friends అయ్యారు. వీరందరికీ కృతజ్ఞతలు. వీరికి సర్వదా రుణపడి ఉన్నాను.

ఇప్పుడు సోల్ మేట్ ఫ్రెండ్ గురించి చెబుతాను.. ఇది నా వెర్షన్ మాత్రమే! ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కోలా ఉంటాయి.

సోల్ మేట్ ఫ్రెండ్ ని అలా ఇలా చూసి, ఎంచుకోలేం. ఎన్నెన్నో చూసి, ఎన్నెన్నో వడపోతల తరవాత ఎంచుకుంటాం. ఏదో అలా కలసి మాట్లాడినంత మాత్రాన, ప్రాణ స్నేహితులు గా ఏర్పడరు.

ప్రాణ స్నేహితులు అన్నవారిలో మన అభిరుచులకి తగ్గట్లుగా, మన వేవ్ లెంత్ కి తగినట్లుగా సరిపడినవారినే అలా స్నేహితులుగా అర్హతనిస్తాం.

న మనస్తత్వం గురించి, బాగా తెలిసినవారైనాక అప్పుడు ఇలా ప్రాణ స్నేహితులు అన్న హోదానిస్తాం. అంతకు ముందే ఇచ్చేసుకుంటే అది తొందర తప్ప మరేం కాదు.

ప్రాణ స్నేహితులు ఆడవారై ఉండొచ్చును, లేదా మొగవారై ఉండొచ్చు. అలా ఎంచుకొనేటప్పుడు ఆస్థి, అంతస్థులు, మతం, హోదా, సామాజిక వర్గం, దగ్గర దూరం, పరువూ, ప్రతిష్టలూ, ఐశ్వర్యం, కలిమి, లేమి, పెద్దా చిన్న.. లాంటి అడ్డంకులు రావు. ఇవి చూసుకుంటే ఇక ప్రాణ స్నేహితులు ఏర్పడరు. అలాని చూసుకొని, నా ప్రాణ స్నేహితునికి ఇలా గొప్పగా ఉంది అనుకుంటే అది కొద్దిరోజులే. కలకాలం నిలబడని స్నేహం అది. ఆతరవాత బాధనే మిగులుతుంది. 
స్నేహం, ప్రేమా రెండు ఒకేలా ఉంటాయి. రెండూ పరిచయం, ఆకర్షణ పునాదుల మీదే ఏర్పడతాయి. రెండింటిలో ఒకేలా ప్రవర్తిస్తాం. భావాలూ, చేతలూ ఒకేలా అనిపిస్తాయి.. కానీ కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ఉదాహరణకి (వయసులో వచ్చే) ప్రేమలో వయస్సు వల్ల వచ్చే ఆకర్షణ, వ్యామోహం ఉంటుంది. కానీ ఈ రెండింటికి మధ్య ఒక సన్నని గీత వేరు చేస్తుంది. దూరాన నుండి చూస్తే ఒకేలా ఉంటాయి. అబ్బాయి, అమ్మాయి నిజముగా స్నేహమే చేస్తున్నారే అనుకుందాం. దూరాన నుండి అది ప్రేమలాగే కనిపిస్తుంది. స్నేహం అనేది వారిని బాగా గమనించిన వారికే అర్థం అవుతుంది. ఆ తేడాలు గమనించగలం.. కానీ అవి ఏమిటో చెప్పలేం.

స్నేహం - పరిచయం, స్నేహితుడు, శ్రేయోభిలాషి, ఆప్తుడు, ప్రాణస్నేహితుడు.. అన్న రూపములో ఎదిగితే; ప్రేమ - ఆకర్షణ , పరిచయం, ఇష్టం, అభిమానం  ఆరాధన.. లా సాగుతుంది. ఇందులో ఆరాధన స్థాయికి వచ్చాక ఇక ఆ మనిషి తన ఆస్తిత్వం కోల్పోతాడు. అంతవరకూ రానిచ్చుకోకండి. రెండింటిలో వేరోకదానిలో ఉన్నవీ కనిపిస్తాయి. ప్రేమలో కనిపించే అభిమానం స్నేహంలో కూడా ఉంటుంది. అందుకే ఈరెండూ ఒకేలా ఉంటాయి. నిర్వచించటం చాలా కష్టం.

స్నేహములో కానీ, ప్రేమలో కానీ మనిషి పూర్తిగా మారిపోతాడు. మునపటి కన్నా ఆనందమయ జీవనాన్ని గడుపుతాడు. అది కొనసాగటానికి అలాగే మరింత ధృడముగా చర్యలు తీసుకోవాలి. 


(మిగతా ఇంకో టపాలో చెప్పుకుందాం..) 

No comments:

Related Posts with Thumbnails