ఒకరిని దూషించే ముందు,
మరొకరిని నిందించే ముందు,
ఇంకొకరిని తప్పు పట్టే ముందు,
వేరొకరిని అవమానించే ముందు,
ఆ మనిషి స్థానమున -
నిన్ను ఊహించుకో!..
అప్పుడు ఆ బాధేమిటో తెలుస్తుంది.
అవును.. ఒకరు తప్పు చేస్తే - వారిని తిట్టే ముందు, ఆస్థానమున మనల్ని ఊహించుకోవాలి. అలాని ఎందుకంటే - మనం ఆ స్థానాన ఉంటే - అలాంటి పొరబాటు చేస్తామా? లేదా? అని ఆలోచించుకోవాలి. మనం ఆ స్థానాన ఉంటే అవతలి వ్యక్తి చేసిన తప్పే మనం చేసేటట్లయితే, మనకి ఆ వ్యక్తిని తప్పు పట్టే అర్హత లేదు. ఇలా నిర్ణయం తీసుకోవటంలో నిజాయితీ ఉండాలి. ఒకవేళ అవతలివారి స్థానములో మనం ఉన్నప్పుడు - వారికన్నా ఇంకా మెరుగైన ప్రదర్శన చేసేవాళ్ళం అయితే - అప్పుడు వారిని విమర్శించే అర్హత వస్తుంది.
నిజానికి అవతలివ్యక్తి యొక్క పోనీలే అనే మనస్తత్వమే ఒక్కోసారి మనల్ని అలా విమర్షించేలా చేస్తుంది. ఇది ఎలా అంటే - మనం వారిని విమర్శించినప్పుడు అవతలి వ్యక్తి మనతో - " ఓహో!. అలాగా.. నిజముగా నాకు తెలీదు ఇలా చెయ్యాలి అనీ.. మీరొకసారి చేసి చూపిస్తే నేర్చుకుంటాను. మీవల్ల ఒక విషయం నేర్చుకున్నవాడినీ అవుతాను.." అని అంటే - అప్పుడు ఆ విషయం మనం వారికి ప్రదర్శించే సత్తా ఉండాలి. అప్పుడు మనలో అంతటి ప్రతిభ లేకున్నట్లయితే - మనం మొహం ఎలా చూపెట్టగలం.?
నన్ను విమర్శించేవారిని నేను ఇలాగే ప్రశ్నిస్తాను. చాలామంది ఎలా చెయ్యాలో చేసి చూపలేరు. అప్పుడు వారికి మనసుకి తగిలేలా ఒక చిన్న ఆధిపత్యపు చిరునవ్వు నవ్వుతాను. వారు గిల గిల కొట్టుకుంటారు. అది చాలు వారికి అదే శిక్ష. ఒకవేళ వారు చూపిస్తే, చిన్నగా " కృతజ్ఞతలు.. మీరు ఇలా అర్థమయ్యేలా చూపించాక, ఇక ఆ లోపాన్ని మళ్ళీ నాలో చూపించను.. ఎనీ వే థాంక్స్ వన్సగైన్ .." అని చెబుతాను.
ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి. ఆ లోపాలని పెద్దగా చేసి చూడవద్దు. అలా చూసినప్పుడు ప్రతి వ్యక్తిలో లోపాలే కనిపిస్తాయి.
ఈ క్రింది వీడియో చూడండి. సాగరసంగమం సినిమాలోనిది. ఈ సన్నివేశములో - ఒక ఆడిటోరియంలో శైలజ ఒక నృత్యప్రదర్శన ఇస్తుంది. ఆ ప్రదర్శన గురించి అందరూ మెచ్చుకుంటారు. పత్రికల్లో కూడా బాగుంది అని రివ్యూలు వస్తాయి - ఒక్క బాలు (కమల్ హాసన్) ది తప్ప. ఈ బాలు ఆ నృత్యాన్ని విమర్శిస్తాడు. అదేమిటీ అని దౌర్జన్యముతో అడిగిన శైలజ ప్రియుడిని, ఆమెనీ - అందరి ముందూ ఆమె చేసిన నృత్య భంగిమలని మళ్ళీ చెయ్యమని చెప్పి, తను చేశాక, అసలు నృత్యం అంటే ఏమిటో తన ముందు చేసి చూపిస్తాడు. ఒకే భాగాన్ని వేరు వేరు నృత్య రీతుల్లో చేసి చూపిస్తాడు. అది చూశాక నాట్యం అంటే ఏమిటో అందరికీ తెలుస్తుంది. నన్ను బాగా ఇంప్రెస్ చేసిన సన్నివేశం అది. క్రింద వీడియోలో మీరూ ఒకసారి, వీలైతే మళ్ళీ ఇంకొకసారి చూడండి.
No comments:
Post a Comment