ఒకసారి వేరే ఊరిలో ఉన్న మిత్రుడిని కలవటానికి వెళ్ళాల్సివచ్చింది. వెళ్లాను. సాదరముగా ఆహ్వానం లభించింది. కాసేపు కుశల ప్రశ్నలు అయ్యాక అలా ఔటింగ్ కి వెళ్ళాము. వాడి క్రొత్త బండి నడపమని కీస్ ఇచ్చాడు. వాడు వెనకాల కూర్చున్నాడు.
ఒక చిన్న హోటల్ వద్ద ఆపాడు. అది చూడటానికి చాలా చిన్నది. కారు షేడ్డులా ఉండే - ఇంకా చెప్పాలంటే అంతకన్నా తక్కువ స్థాయి హోటల్. ఏంట్రా వీడు దీనిలోకి పట్టుకొచ్చాడు అనుకున్నాను. ఇంకా మంచి హోటల్స్ అంటూ ఏమీ లేవా?.. అని మనసులో అనుకున్నాను. వాడు నా భావాలు అవేమీ పట్టించుకోకుండా ఆ హోటల్ లోనికి దారి తీశాడు. కూర్చోవటానికి ఇబ్బందిగా ఉండే పాతకాలం నాటి - జాయింట్లు లూజయిన కుర్చీలూ, ఈగలు వాలుతున్న బెంచీలు చూసి మనసులో ఈ హోటల్ కి పట్టుకోచ్చావేమిట్రా అంటూ వాడిని తిట్టుకున్నాను. వాడు మాత్రం నా భావాలు ఏమీ పట్టించుకోకుండా మామూలుగానే ఉన్నాడు.
ఆ చాయ్ చేసేవాడు రాగానే మావాడు ఏమి ఆర్డర్ చెబుతాడా అని ఎదురుచూశాను. ఏం కావాలి సార్ అన్న హోటల్ వాడి ప్రశ్నకు నా స్నేహితుడు " దో పోనా.." అన్నాడు. వాడు అర్థమయ్యినట్లు, తీసుకరావటానికి వెళ్ళిపోయాడు.
నాకు మాత్రం అర్థం కాలేదు - ఏమిటా అని. వీడు పోనా అని చెప్పటమేమిటీ? వాడు ఏమీ మాట్లాడకుండా సరేనంటూ తలూపి వెళ్లిపోవటమేమిటీ - నాకేం అర్థం కాలేదు. అసలు ఈ పోనా అంటే ఏమిటీ? బుర్ర బ్రద్దలు అవుతుండగా - ఈ ప్రశ్నని వాడినే అడిగా. గీతలో అర్జునుడు అడిగిన ప్రశ్నకు, శ్రీకృష్ణుడిలా చిద్విలాసముగా నవ్వి, "నీవు నిమిత్తమాత్రుడివి. ఆర్డర్ చేసింది నేనూ, బిల్ కట్టేది నేనూ, త్రాగేవాడివి నీవూ.." అన్న స్టైల్లో నావంక చూసి నవ్వాడు. అంతే కాని జవాబు చెప్పలేదు.
నా అనుమానం పటాపంచాలు చెయ్యటానికి ఆ హోటల్ వాడు పోనా పట్టుకోచ్చేశాడు. ఏమిటా అని చూస్తే వాడి చేతుల్లో రెండు కప్పులు. ఒహొ!.. పోనా అంటే టీ నా? అనుకున్నాను. మా ముందు పెట్టి వెళ్లిపోయాడు. మామూలు టీ నేనా? ఇంత బిల్డప్ దేనికో అనుకున్నాను.
టీ ని చూశాను. టీ అనే ద్రవం మీద ఏమిటో తెల్లగా, ముద్దగా ఉంది. ఏమిటబ్బా అని చూశాను. "అది పాల మీద ఉండే మలాయ్" అన్నాడు నా నేస్తం. ఆ హోటల్ వాడు ఇచ్చిన స్పూన్తో నా మిత్రుడు ఆ టీ కప్పు లో కలియత్రిప్పాడు. నేనూ అలాగే చేశాను. అడుగున ఉన్న చక్కెర అందులో కలసిపోవడం మొదలయ్యింది. అంటే కప్పులో కాస్త చక్కెర వేసి, ఆ తరవాత చిక్కటి పాలతో చేసిన టీ పోసి, ఆపైన కాస్త పాల మీగడ వేస్తారన్నమాట.
మొదటిసారిగా ఆ పోనా ని త్రాగా. ఆహా!. ఏమి రుచి. ఏమిటో అనుకున్నాను. ఆ రుచి ఆస్వాదనలోనే ఆ కప్పు పోనా అయిపోయింది. ఇంకోటి త్రాగుతావారా? అని మా ఫ్రెండ్ అడిగితే ఊ అన్నాను. ఇంకో రెండు కప్పులు తెప్పించాడు..ఆ రెండు కప్పులూ నేనే త్రాగా. ఆలా నా జీవితములో ఒక క్రొత్త రుచిని చవిచూశాను. అలా అక్కడున్నంత సేపూ ఆ పోనానే త్రాగాను. మా వూరికి వచ్చాక, ఎక్కడికన్నా వెళ్ళినపుడు ఆ పోనా కోసం ట్రై చేశాను కాని ఎక్కడా దొరకలేదు. కొన్ని హోటల్స్ లలో అడిగితే అదేమిటీ అన్నట్లు మొఖాలు పెట్టారు. వెతకగా వెతకగా ఇరానీ హోటల్స్ లలో మాత్రమే దొరుకుతుందని తెలుసుకున్నాను. మీరూ ఒకసారి త్రాగటానికి ప్రయత్నించండి.
Monday, October 25, 2010
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
ఒకవేళా నగరంలో పోనా దొరికినా అంత చిక్కటిపాలు ఎక్కడుంటాయండీ రుచిరావడానికి?
ఇప్పుడు కొన్నింటి దగ్గర చిక్కటి పాలతోనే చేస్తున్నారు. కొన్ని హోటళ్ళలో అడిగా.. మాదగ్గర పోనా దొరకదు అని చెప్పారు. దొరికే వరకూ మళ్ళీ ప్రయత్నాలు సాగించాలి.
naku irani chai thagalani eppatinuncho korika
అదేమంత పెద్ద పనా? మీకు దగ్గరలోని ఇరానీ హోటల్ కి వెళ్లి.. కడుపారా త్రాగేస్తే సరి.. ;)
Post a Comment