నాకు పబ్లిక్ సర్వీస్ కమీషన్ వారి నుండి ఒక హాల్ టికెట్ వచ్చింది.. నేను గ్రూప్ 1 మెయిన్స్ కి ఎంట్రన్స్ కి సెలెక్ట్ అయ్యానని. అదీ పరీక్షా తేదీకి కేవలం పందొమ్మిది రోజుల ముందు. అప్పుడు నాకున్న పరిస్థితులు చాలా భయంకరమైనవి. నా హితులు అందరూ నీవు వ్రాయాలని బాగా కోరటముతో నేనూ ప్రిపేర్ అయ్యాను. నేను నిర్ణయించుకొని, స్టడీ పుస్తకాలు కొనేసరికి ఇంకో రెండు రోజులు కరిగిపోయాయి. అయినా సరే బాగా కష్టపడి చదివా.. సమయం తక్కువ అయిననూ దాదాపు ఎంత కష్టపడాలో అంతగా కష్టపడ్డాను. జనరల్ స్టడీస్ ఎంత పెద్ద సబ్జెక్ట్.. అయినా మాక్జిమం కవర్ చేశా..
పరీక్ష సమయం ఆసన్నమయ్యింది. మొత్తం నాలుగు పేపర్లు. రోజుకో పరీక్ష. ఎండాకాలము లో మధ్యాహ్నం పూట ఈ పరీక్ష. నాలుగు రోజుల్లో నాలుగు పేపర్లు, నాలుగు సెంటర్లలో పరీక్షలు. ఉన్నవి పదిహేడు రోజులు. అంటే ఒక్కో పేపర్ కి మిగిలినవి నాలుగు రోజులు అన్నమాట. ఏమి సరిపోతుంది. సిలబస్ ఏమో చాలా..
నాకు సాధ్యమైనంత వరకూ కష్టపడి చదివా. పరీక్ష రోజున ఎక్జాం సెంటర్ కి వెళ్లాను.
అక్కడ కొద్దిమంది నాకంటే ముందే చేరుకొని, లావాటి పుస్తకాలను ముందర వేసుకొని బాగా చదువుకుంటున్నారు. కొద్దిమందికి సోడా బుడ్డి కళ్ళద్దాలు, నెరిసిన జుట్టు, చింపిరి జుట్టు, మామూలు ఇంట్లో వాడే దుస్తులూ వేసుకొని సైంటిస్ట్ ల కన్నా తీక్షణముగా చదువుకుంటున్నారు. ఆడవారికైతే కళ్ళ క్రింద నలుపు వలయాలు. వారిని చూస్తుంటే నా గుండె లో దడ. ఏమి చేస్తాం. ఇక నేను మెయిన్స్ పాస్ అవుతానని నమ్మకం పోయింది. పరీక్ష సమయం అవుతున్న కొద్దీ వచ్చేవారిని చూస్తుంటే - ఒక్కొక్కరూ జెమ్స్ లాగా, యోధానుయోదుల్లా ఉన్నారు. ఏమి చేస్తాం. అంతదూరం వచ్చాక వ్రాయక తప్పదు.
పరీక్షలు మొదలయ్యాయి.. పేపర్ ఈజీగా ఉంది.. దాదాపు నేను చదివినవే వచ్చాయి. బాగానే స్కోర్ చేశా. నా అంచనా ప్రకారం మొదటి రెండు పేపర్లలో ఎనభై శాతం పైగా మార్కులు సంపాదించగలను అని అంచనాకి వచ్చాను. మిగతా రెండు పేపర్లలో ఒకదాంట్లో సరిగా ప్రిపరేషన్ కాక దెబ్బ తిన్నాను. అందులోనే పాస్ మార్కులు రావటం కష్టం. నాలుగో పేపర్లో సమస్యని విశ్లేషించి వ్రాయాలి. అప్పట్లో అంతగా నాకు పాటవం లేక ఏదో మమ: అనిపించాను. ఏదో ఎక్కడో జరిగితే గానీ ఇంటర్వ్యూ కి వెళ్ళను అన్న నమ్మకం కలిగింది.
నా పోటీదారులని చూశాను. అందరూ నేను బాగా వ్రాశాను, నేను బాగా వ్రాశాను అని ముచ్చటించుకున్న మాటలు విని మరింత నమ్మకం కోల్పోయాను. బయటకు వస్తూ గోడకి అతికిన పరీక్ష వ్రాసిన అభ్యర్థుల సంఖ్యని చూశా. నాలుగువందల నలభై - ఇందులో కనీసం నాలుగు వందల మంది వ్రాశారే అనుకున్నా.. అంత పోటీని ఆ సెంటర్ లో ఉంటే మిగతా సెంటర్ల పరిస్థితి? మిగతా పరీక్షలప్పుడు కూడా దాదాపు ఇంతేమంది అభ్యర్థులు. ఇక నాకు ఇంటర్వ్యూ చాన్స్ రాదనీ, మా సెంటర్ వారికే ఎవరో ఒకరికి వస్తుందని డిసైడ్ అయ్యాను. ఆ పరీక్ష వ్రాసే లిస్టు లోని వ్రాసే మొదటి అభ్యర్థి నంబర్ నాదే..
చివరకి పేపర్లో రిజల్ట్ వచ్చింది. మా సెంటర్లో ఎవరూ ఇంటర్వ్యూ కి సెలెక్ట్ కాలేదు. అప్పుడు అనుకున్నాను - పైకి అందరూ యోధానుయోదుల్లా కనపడినా లోపల అందరూ మనలాంటి వారే. వారికీ మన అంతగా తెలివితేటలు ఉన్నాయని అనుకోవాలి గానీ, వారిని అతిగా ఊహించుకోవద్దని - అనే జీవన పాఠం తెలుసుకున్నాను.
Sunday, October 31, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment