Thursday, August 5, 2010

కంప్యూటర్ ఫార్మాట్ - F2

నేను నా కంప్యూటర్ ఫార్మాట్ చెయ్యాల్సి వచ్చినప్పుడు దగ్గరలోని ఒక నెట్ సెంటర్ కి తీసుకెళ్ళి ఫార్మాట్ చేయించేవాడిని.. వైరస్ వల్లనో, వాడకం తెలీక వల్లనో  గాని మళ్ళీ కొద్దిరోజులకి ఫార్మాట్ చేయించేవాడిని. అలా క్రొత్తలో చాలా ఇబ్బందులకి గురి అయ్యాను. ఇది తెలిసిన మా బంధువుల అబ్బాయి - అదేంటి ఊరి ఊరికే అలా అవుతున్నది, ఒకసారి ఆ సీపీయు తీసుకొని రా.. దాన్ని అంతా బాగా చేద్దాం అన్నాడు. 

అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకిష్టం లేకున్నా సరే.. అదీ ఎలాగో చూద్దాం ఒకసారి అని నా సీపీయు అంతా మోసుకెళ్ళాను. మూడు గంటల ప్రయాణం. వెళ్లాను. ప్రాబ్లం చూసి మొత్తం ఫార్మాట్ చేద్దామని అన్నాడు. నేను వద్దన్నాను. ఎందుకంటే హార్డ్ డిస్క్ లో ఉన్న అన్ని ఫైల్స్ వేల్లిపోతాయని. కాపీ చేద్దామంటే DVD రైటర్ పనిచెయ్యటం లేదు. తప్పనిసరిగా ఒక DVD రైటర్ కొని. అందులో అమర్చాము. దాని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ కూడా చేశాము.

ముందుగా అందులో ఉన్న ఫైల్స్ అన్నీ DVD లలోకి బర్న్ చేశాను.. మొత్తం 14 DVD లు అయ్యాయి. అవన్నీ భద్రపరిచాక. . ఇక ఫార్మాట్ మొదలెట్టాము. ముందుగా ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ వేశాము.. సక్సెస్. తరవాత డ్రైవర్స్ CD వేస్తే ఇన్స్టాల్ అవటం లేదు.. ఎన్నిసార్లు ప్రయత్నించినా.. లాభంలేదు. నేనూ ఆ CD తోనే చేశాను అంతకు ముందు.. నాకూ రాలేదు. అలా ఎందుకు రాదూ.. వస్తుందే అని అతను అంటే - సరేనని వారింటివద్ద ఇలా ప్రయత్నాలు చెయ్యటం. అతనికీ రాలేదు.. రెండుసార్లు ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ వేసి చూసాము.. ఊహు!.. లాభం లేదు.. నాకు విసుగు వచ్చేస్తున్నది. అప్పటికే రాత్రి పన్నెండు అయ్యింది. పడుకొని మరుసటి రోజున మళ్ళీ ప్రయత్నాలు.. ఊహు.!.. మళ్ళీ అదే ఫలితం.

ఇలా కాదనుకొని వేరేవారి దగ్గరనుండి సాఫ్ట్వేర్ CD తెచ్చి మళ్ళీ ఇన్స్టాల్ చేశాము. తరవాత డ్రైవర్స్ CD వేస్తే అప్పుడు ఇన్స్టాల్ అయ్యింది. అతనికి ఆ విషయం తెలీకపోవటం వల్ల చాలా సమయం వృధా అయ్యింది.. అది పైరేటెడ్ లాగా ఉన్నట్టుంది. ఆ తరవాత అన్నీ మళ్ళీ ఇన్స్టాల్ చేశాము.. అప్డేట్స్, మళ్ళీ అనీ లోడింగ్.. అదంతా అయ్యేసరికి చాలా సమయం గడిచింది. అలాగే కొన్ని ప్రత్యేక సాఫ్త్వేర్లూ కొన్ని ఇన్స్టాల్ చేశాడు. అప్పటికే రాత్రి అవటం మూలాన మరునాడు ఉదయాన సంతోషముగా నా సీపీయు తీసుకొని వచ్చేశాను.

ఇంటికి వచ్చాక .... నా సీపీయు ని యధావిధిగా అమర్చి, సిస్టాన్ని ఆన్ చేస్తే రావటమే లేదు. వైర్లు అన్నీ సరిగా పెట్టానో లేదో అని నాలుగైదు సార్లు చెక్ చేశాను. అన్నీ సరిగా ఉన్నాయి. కేబుల్స్ మార్చాను. అయినా రాదే!. ఇలా కాదనుకొని మళ్ళీ అన్నీ సరిగా ఉన్నాయో.. టేస్ట్ చేశాను. రామ్ మళ్ళీ తీసి, శుభ్రం చేసి పెట్టాను.. ఊహు.. లాభం లేదు. అప్పటికి అలాగే వదిలేసాను.. కాసేపు నా కార్యక్రమాలని చూశాక.. మళ్ళీ ఒకసారి ప్రయత్నించాను. ఊహు..

ఇలా కాదనుకొని అతడికి ఫోన్ చేశాను.. అతను ఫోన్ తీయటమే లేదు.. బాత్రూం కి వెళ్ళాడేమో అని అనుకొని, మళ్ళీ కాసేపయ్యాక కాల్ చేశాను. లేపాడు కట్ చేశాడు. పొరపాటున కట్ అయ్యిందేమోనని మళ్ళీ ఫోన్ చేశా.. మళ్ళీ కట్. అంటే అక్కడే ఉన్నారన్నమాట!. మళ్ళీ చేశా.. మళ్ళీ కట్. నాకూ పంతం పెరిగింది.. చూద్దాం. ఎంతవరకు అలా చేస్తారేమోనని. అలా చేస్తూ పోయాను. ఒకవేళ ఫోన్ లేపితే ఏమి మాట్లాడాలో కూడా డిసైడ్ అయ్యాను.

అలా చేస్తూనే పోయాను. కట్ కట్ కట్... నాకూ పంతం పెరిగిపోయింది. ఏదో ఒకటి తేల్చుకోనిది వదిలేయ్యబుద్ది కాలేదు. చివరికి వాళ్ళావిడ ఫోన్ ఎత్తింది. "తను ఇప్పుడు మాట్లాడట.. మూడ్ బాగోలేదట.. తరవాత ఫోన్  చేస్తాడట " అన్నారు. సరే అన్నాను.  నేను  మళ్ళీ  ఫోన్  చెయ్యలేదు. (తనూ చెయ్యలేదు) ఏమిటో ..అదేమాట  తనే ఫోన్  లేపి  చెప్పొచ్చుగా . ఇంకా గౌరవముగా ఉండేదిగా. నాకున్న చిన్నపాటి తెలివితో మళ్ళీ నా సిస్టాన్ని ట్రై చేశాను.. లాభం లేదు.. బయట డబ్బులు పెట్టి బాగు చేయించాలని  అనుకున్నాను.
ఇక నా వల్ల కాదనుకొని మా ఊళ్లోనే ఉండే ఒక సాఫ్ట్వేర్ అతని దగ్గరకి వెళ్లాను. బాగా పేరున్నోడు అని అంటే వెళ్ళా.
"నీ ప్రాబ్లెం ఏమిటీ?.." అని అడిగితే - చెప్పాను.. "సిస్టం ఆన్ అవటం లేదని".
"మొత్తం ఫార్మాట్ చెయ్యాలి.. వైరస్ వల్ల అలా అయ్యింది" అన్నాడు.
"మీరు ఒరిజినల్ ఆపరేటింగ్ సాఫ్టవేర్ CD పెట్టి ఫార్మాట్ చేస్తారా.. "
"అవును" అన్నాడు.
"ఎంత తీసుకుంటారు" అని అడిగాను - "ఒక్క C డ్రైవ్ మాత్రమే అలా చెయ్యాలి, అప్డేట్స్ అవీ కావాలి" అని చెప్పా.
"ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ పెట్టేవారిని నిన్నోక్కడినే చూస్తున్నాను - ఈ ఊరిలో.." అని ఆన్నాడు.
అప్డేట్స్ ఎవరూ పెట్టుకోరట. అంటే మనోడిది పైరేటెడ్ ఆపరేటింగ్ CD అన్నమాట!.
"ఎంత తీసుకుంటారు.." అన్నాను.
"ఐదు వందల రూపాయలు." అని చెప్పాడు.
"ఆ మాత్రం దానికే అంతనా.. ఏమీ తగ్గించారా" అని అడిగా..
"ఊహు.. నావల్ల కాదు.. నాకు పని ఉంది." (ఏం నాకు మాత్రం పని లేదా!)

ఏమిటబ్బా! అంత ఇలాజరుగుతుంది అనుకున్నా. ఇక లాభం లేదని వేరేవారికోసం వెదికా. అప్పుడే గట్టిగా నిర్ణయించేసుకున్నాను. ఇక అన్నీ నేనే నేర్చేసుకోవాలని. ఎవరి దయా దాక్షిణ్యాలు కోసం చూడొద్దని. అలా వెదికితే ఒక స్టూడెంట్ దొరికాడు. అతడికి  నా ప్రాబ్లెం చెప్పాను చేసిపెడతాను అన్నాడు. ఎంత అన్నాను.. ఒకవందా యాభై రూపాయలు అని చెప్పాడు. ఆ రాత్రికే నా కంప్యూటర్ ఫార్మాట్ చేసిచ్చాడు. మరుసటి రోజున ఉదయం తీసుకున్నాను. అలాగే శుభ్రముగా యే ఇబ్బంది లేకుండా వాడుకుంటున్నాను. ఆ తరవాత నా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ వెళుతున్నాను. ఇప్పుడు కాస్త పరవాలేదు. సిస్టం గురించి బాగానే తెలుసుకుంటున్నాను..

ఇప్పుడు ఇక్కడ: నూటాయాభై తీసుకొని మాటమీదనిలబడి వెంటనే ఒరిజినల్ CD తో ఫార్మాట్ చేసిచ్చిన పిల్లాడు నాకు బాగా నచ్చాడు. అప్డేట్స్ అయ్యాయి కూడా.. ఆ ఐదు వందల రూపాయల ఇంజనీరు (ఇలా అంటే బాగోదేమో!) కన్నా ఇతడు నయం.

ఇక మా బంధువు విషయానికి వస్తే - అంతా చేసి, వారింట్లో రెండురోజుల ఆథిత్యం ఇచ్చి, అన్నీ చేసిచ్చి, అది ఆన్ కాకపోయేసరికి ఫోన్ చేస్తే - లేపక, మాట్లాడక మనసుకి దూరమయ్యాడు. ఆ తరవాత సాంకేతిక సలహాల కోసం అడగటం అతన్ని అడగటం మానేశాను. ఏమి ప్రాబ్లం వచ్చినా ఎదురుకోవటానికి అన్నీ నేర్చుకుంటున్నా.. మధ్యలో ఏదైనా సమస్య వస్తే నా సోషల్ నెట్వర్కింగ్ సైట్ల లోని మిత్రులని చాట్ లో అడుగుతున్నాను. వారూ ఓపికగా తెలుసుకొని, నాకు చెబుతున్నారు. వారందరికీ చాలా కృతజ్ఞతలు అని ఇక్కడే చెబుతున్నాను. సోషల్ వర్కింగ్ సైట్ల వల్ల నాకు అదో లాభం. అలా వారిని నాకు కలిపిన ఆ సైట్ల వారికీ నా కృతజ్ఞతలు.

ఇకపోతే - నా బంధువు ఫార్మాట్ చేశాక సిస్టం ఆన్ కాలేదని చెప్పాగా... ఆ తరవాత ఎదురుపడితే - (ఫోన్లో కాదు).. అడిగాడు.. "సిస్టమ్ బాగా పని చేస్తున్నదా" అని.
"ఆ చేస్తున్నదిగా.." అన్నాను.
"నేను వేసిన సాఫ్ట్వేర్ ఒకటి చూశారా.." అని అడిగితే
"ఏమో తెలీదు.. మళ్ళీ ఫార్మాట్ చేయించాను.. అది లేదని" చెప్పాను.
"ఏమైంది మళ్ళీ!.." అని అడిగితే
"మీరు చేశాక సిస్టం తీసుకొని ఇంటికి వచ్చాక - ఆన్ చేస్తే ఆన్ కాలేదు. కనుక ఫార్మాట్ చేయించాను.." అని చెప్పా.
"అయ్యో! ఫోన్ చేసి ఆడగవచ్చుగా.. చెప్పేవాడినిగా.." అని అన్నాడు.
"ఆ రోజు చేస్తేనేగా ఫోన్ తీయలేదు.. కట్ చేస్తూ పోయారు.." అని అన్నాను.
" అలాగా!.. ఏముంది.. జస్ట్ F2 బటన్ నొక్కితే ఆన్ అయ్యేదిగా.. అలా మార్చానుగా.." అన్నాడు.
"నాకు తెలీదు అలాని. నేనేమైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదుగా" అన్నాను.
"మీకు తెలుసు అనుకొన్నాను.." అన్నాడు.
ఇక నేను ఏమీ మాట్లాడలేదు.

ఏమని అంటాము. నాకంత పరిజ్ఞానం లేదని తనకి తెలుసు. అలా సెట్టింగ్ మార్చి ఇవ్వటం భావ్యమా.. పోనీ మార్చాడే అనుకుందాం!.. కనీసం అది తీసుకొని వాళ్ళింటి నుండి వెళ్ళినప్పుడు అయినా, ఫోన్ చేసి ఈ చిన్నమాట - F2 నొక్కమని చెబితే ఏమి పోయేది?. ఆఖరికి నేను చేసినప్పుడన్నా చెప్పినా - నాదే ఫోన్ బిల్లాయే!.. అంతా చేసి చివరలో విలువ కోల్పోయాడు. ఒకే ఒక చిన్నమాట చెప్పక - అవతలి వారిని ఇబ్బంది పెట్టాడు. ఎందుకో కారణం కూడా ఇంతవరకూ తెలీదు. ఒకవేళ నేనేమైనా తప్పు చేసుంటే చెప్పాలిగా.. అదేమీ లేదు అని వేరేవారి ద్వారా తెలుసుకున్నాను. ఇక సాంకేతిక సమస్యల కోసం అతడిని అడగటం ఇప్పుడు పూర్తిగా మానేసాను.. అందుకే చెబుతున్నాను.. ఒకసారి గమనించండి.. ఆ విషయములో వారికి తగిన దూరాన్ని పాటించండి. మీకు చాలా మంచిది. ఒకరకముగా మీకే మేలే అవుతుంది. ఎలాగో "అంతా మన మంచికే" అనే టపాలో వ్రాస్తాను.

No comments:

Related Posts with Thumbnails