Sunday, July 18, 2010

మొదటిసారిగా సైకిల్ పంక్చర్

ఇది నా ఇంటర్మీడియట్ చదువులో ఉన్నప్పుడు జరిగింది. ఈ సంఘటన చెప్పే ముందు కొంత వివరణ ఇస్తాను. ఈ మధ్య చాలామంది తల్లి తండ్రులు తమ పిల్లలకి బాగా స్వేచ్చనిస్తూ, అతి గారాబముగా పెంచుతూ, వారి శారీరక మానసిక ఎదుగుదలని ఆదిలోనే బుగ్గిపాలు చేస్తున్నారు. ఎంతసేపూ ఆ ర్యాంకుల గొడవే! వేరే యే విషయమూ తెలీకపోవటం విచారకరం. అన్ని విషయాల్లో చాలా జోక్యం చేసున్తున్నారు. దానివలన ఆ పిల్లలు తామేదో ఆకాశము నుండి ఊడి పడ్డవారముగా భావించుకుంటున్నారు. మనిషి అన్నాక అన్ని పనులూ అంతో ఇంతో చెయ్యాలని నా అభిప్రాయం. పెద్ద పెద్ద పనుల నుండి చిన్న చిన్న పనుల వరకూ కొద్దో, గొప్పో తెలిసుకునే ఉండాలి.

ఇంటర్లో నేను కాలేజీకి పోవటానికి ఒక సైకిల్ ఉండేడిది. ఒకరోజు ప్రొద్దున లేచి చూసేసరికి ముందు టైర్ పంక్చర్.. ఏమి చెయ్యాలో తెలీదు. ఆ రోజు ఏదో బంద్. అన్ని దుఖానాలూ బంద్. ఏమి చేద్దాం! పదకొండు గంటలకి క్రికెట్ ఆడటానికి రమ్మన్నారు ఫ్రెండ్స్. అదీ ఊరవతల. ఎలా వెళ్ళాలో తెలీదు. నేను లేకపోతే ఆట మొదలవదు. వెళ్దామంటే ఈ సైకిలేమో ఇలా. "నేనేమి సేతురా లింగా.." అని పాడుకోవాల్సిందే!..

ఇలా కాదనుకొని మొఖం కడిగి, టీ త్రాగి సైకిల్ రిపైర్ షాపుల వెంట తిరిగా.. అన్నీ బంద్!.. ఇక లాభం లేదని అనుకుంటుండగా సైకిల్ సామానులు అమ్మే దుఖానం ఒకటి కొద్దిగా ఓపెన్ ఉంటే అందులో కాస్త ట్యూబ్ రబ్బరూ, ఎరుపూ, పసుపు రంగుల్లో ఉండే డన్లప్ కంపనీ వారి రబ్బర్ సులీషణ్ (అందరూ దాన్ని అలాగే అంటారు. నిజానికి దాన్ని ఫిలిం సొల్యూషన్ అని పిలవాలి.) వాటిని ఇరవది ఐదు పైసలకి కొనుక్కొని (నిజమే! అప్పట్లో చాలా ధర అది.) ఇంటికి వచ్చాను.

అప్పుడు సమయం ఉదయం ఏడున్నర అయ్యింది. మెల్లగా నా పని మొదలెట్టాను. సైకిల్ షాపువాడు ఎలా పంక్చర్ చేస్తాడో ఒకసారి గుర్తు చేసుకున్నాను. అలా చెయ్యాలని మొదలెట్టాను.

రెండు స్క్రూ డ్రైవర్ల సహాయాముతో ముందు టైరు విప్పాను. అలాగే లోపలి ట్యూబూ విప్పాను. ఈ రెండూవిప్పేసరికి గంటన్నర పట్టింది. అప్పటికే తొమ్మిదిన్నర అయ్యింది. మొదటిసారిగా చేస్తే ఎన్ని చిక్కులో, ఎంత సమయం వృధానో! అయినా ఆరోజు ఖాళీనే కాబట్టి అలా చేస్తూనే పోయాను.

ట్యూబు పంక్చర్ చూడాలంటే అందులో గాలి నింపాలి. ఎలానింపాలి?. నా దగ్గర గాలి నింపే పంపు కూడా లేదు. మా నాన్నగారి వద్ద పనిచేసే కుర్రాడు ఒకడు వచ్చి ఆ ట్యూబ్ వాల్వ్ విప్పి, అందులోకి నోటితో గాలిని నింపి, ఆ ట్యూబు అడుగు భాగముతో వాల్వ్ భాగాన నొక్కి వాల్వ్ బిగించాడు. ఇలా కూడా సైకిల్ ట్యూబ్ లోకి  నోటితో గాలిని నింపి, పంక్చర్ చెక్ చెయ్యొచ్చు అని ఆరోజు తెలుసుకున్నాను. అంతలోనే ఇది మా నాన్న గారు చూసారు. ఆ పని కుర్రాడని పిలిచారు. ఏదో పని చెప్పి నా నుండి దూరముగా ఉంచారు. నన్ను మాత్రం ఏమీ అనలేదు. నన్ను "ఆ అడ్డమైన పని ఎందుకు చేస్తున్నావు.. అది చేసుకొనే బ్రతుకుతావా.." లాంటి తిట్లు ఏమాత్రం తిట్టకుండా దూరము నుండి నన్ను గమనిస్తూ ఉండిపోయారు. (అలా ఎందుకు చేశారో ఆ తరవాత అర్థం చేసుకున్నాను. అది చివరలో చెబుతాను.)

హమ్మయ్య! ట్యూబులో గాలి కొద్దిగా ఉంది. పంక్చర్ ఎక్కడ అయ్యిందో ఇక చూడాలి అనుకొని ఒక బకెట్ నీటిని తెచ్చి, అందులో ట్యూబుని చెక్ చేశాను. ఒక దగ్గర చిన్న చిన్న బుడగలు రావటం మొదలెట్టాయి. ఓహొ! ఇక్కడేనా రంధ్రం పడింది అనుకొని అక్కడ గుర్తుగా ఒక అగ్గిపుల్లని గుచ్చి, (పంక్చర్ వారు అలాగే గుచ్చుతారు) ఆ ట్యూబులోని గాలిని విప్పేశాను. రోగాన్ని కనిపెట్టాను.. ఇక వైద్యం మాత్రమే మిగిలింది. ఇదే అసలు కథ జరిగింది.

ముందుగా ట్యూబు లో గుచ్చిన పుల్లను తీసేసాను. అక్కడ ఇప్పుడు గరకు పేపరుతో రుద్దాలి. బాగానే ఉంది.. మరి ఇప్పుడు ఆ గరకు పేపరు ఏదీ? అది మరిచాను. మళ్ళీ ఆ షాప్ కి వెళ్లాను. షాప్ బంద్. ఏమి చెయ్యాలి. అన్నీ ఉంది ఆ ఒక్క కారణం వద్ద చేయబోయే పని ఆపేయబుద్ది కాలేదు. ఏం చేద్దాం.?

అంతలో నా బుర్రకి (? నిజానికి బుర్రనేనా? అందులో ఏమైనా ఉందా?) ఒక ఆలోచన తట్టింది. ఇంటి బయట క్రొత్తగా కట్టిన గోడ ఉంది. పైగా దానికి స్పాంజ్ ఫినిష్ చేశారు. ఉప్పు కాగితముగా ఉంటుంది. ఇంకేం ఆ సైకిల్ ని ఆ గోడ వద్ద వరకూ లాక్కొచ్చాను. ఆ పంక్చర్ అయిన భాగాన్ని ఆ గోడకి రుద్దాను. సూపర్ గా పని చేసుంది. కాసింత రబ్బరు ముక్క కత్తిరించాను. దాన్నీ అలాగే ఆ గోడకేసి రుద్దాను. ఇప్పుడు అతకడానికి అంతా సిద్ధం.

ఇప్పుడు ఆ పాచ్ కీ, అలాగే పంక్చర్ చేసే ప్రాంతానికి ఆ రబ్బర్ సొల్యూషన్ పూసి అతికాను. కొద్దిగా గాలి నింపి,నీటిలో చెక్ చేశాను. ఊహు! లాభం లేదు. గాలి లీక్. మళ్ళీ అ పాచ్ ఊడదీసి మళ్లీ గోడకి రుద్ది, సొల్యూషన్ పూసి మళ్ళీ అతికాను.. ఊహు! లాభం లేదు.. మళ్ళీ లీక్. ఇలా చాలా చాలా సార్లు చేశాను. ఊహు. అప్పటికి పదకొండున్నర అయ్యింది.

మధ్యలో మా నాన్న వద్ద ఉండే కుర్రవాడు చాలాసార్లు చెప్పాలని ట్రై చేశాడు కాని.. మా నాన్నగారు అతడిని గమనిస్తూ, నా వద్దకి రానీయకుండా చేశారు. ఎన్నిసార్లు జాగ్రత్తగా అతికినా ఒకదగ్గర లీక్. ఏమి చెయ్యాలో తెలీదు. అలాగే చేస్తూ ఉండగా మధ్యాహ్నం పన్నెండున్నరకి సొల్యూషన్ ట్యూబూ అయిపోయింది. కాని నా సైకిల్ పంక్చర్ పూర్తి కాలేదు.

ఇక లాభం లేదని అప్పుడు ఒక షాప్ ఓపెన్ చేస్తే, వాడి వద్దకి వెళ్లి పంక్చర్ అయ్యింది చెప్పాను. అతను చేశాడు. ఈ పాచ్ ఎవరు అతికారు అని అడిగితే "ఇంతకు ముందే బస్టాండ్ వద్ద చేయించాను. ఎవరో పిల్లాడు ఉన్నాడు. నాకు ఎలా చెయ్యాలో తెలీదు అంటే చేస్తుంటే అదే వస్తుంది. అర్జెంట్ అని అతడితో చేయించాను.అతడు ఈ బంద్ గొడవలో సరిగా అతకకపోవచ్చు. అలా కవరింగ్ ఇచ్చాను. వాడి అడ్రెస్ ఏమిటో అని ఆరాలు తీస్తే - ఏదేదో చెప్పాను. ఇతడు ఎలా అతుకుతాడో జాగ్రత్తగా చూసాను.

ఇతడు చేసిన దానికీ, నేను చేసిన దానికీ తేడా ఏమీ లేదు కాకపోతే సొల్యూషన్ పూసాక బాగా ఆరనివ్వాలి. ఆరిపోయాకే అతకాలి అప్పుడే బాగా అతుక్కుంటు౦ది. ఈ చిన్న విషయం తెలీక చాలాసార్లు కష్టపడ్డాను. లాభం లేక పోయింది. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ కనిపెట్టేముందు వేయి సార్లకి పైగా ఫెయిల్ అయ్యాడట అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను.

ఇక అసలు విషయం - మా నాన్నగారు అలా ఎందుకు ఉండిపోయారో తను నాకు చెప్పలేదు గాని, వేరేవారితో అన్నారుట! వాడంతట వాడుగా నేర్చుకోనీ!..
నిజమే! ఆ రోజు తను అలా అలవాటు చేసారు కాబట్టే!.. ఇప్పుడు నాకు తెలీదని వదిలేయటం లేదు. అన్నీ నా అంతట నేను తెలుసుకుంటూనే ఉన్నాను. అలా ఎంతో సాధించాను. ఆరోజు నా ఏదైనా నేర్చుకోవాలన్న తపన మీద నీళ్ళు కుమ్మరిస్తే ఈ రోజు కి కూడా ఏమీ తెలీనివాడినై ఉండిపోయేవాడిని.
Related Posts with Thumbnails