చాలా చాలా హోటల్స్ లలో గమనించాను. అదేమిటో గాని, అన్నీ బాగుంటాయి.. కొన్ని చిన్న చిన్న విషయాల్లో పొరబాట్లు చేస్తుంటారు. మొన్న తిరుమలకి వెళ్లాల్సివచ్చినప్పుడు, దారిలో అక్కడక్కడా ఆగినప్పుడు చాలా హోటల్స్ లలో గమనించాను. అన్నీ బాగుంటాయి.. కాస్త రుచికరముగానే ఉంటాయి. కాని.. ఇడ్లీ లోని చట్నీకి పోపు ఎందుకు పెట్టరో నాకు అర్థం కాదు.
నిజానికి ఈ చట్నీకి పెట్టే పోపుకి ఏమంత ఖర్చూ కాదు. కాసింత నూనె, కొద్దిగా ఆవాలూ, మిరప విత్తులూ, కొద్దిగా కరివేపాకు.. అంతే! నూనె మరిగాక అవి వేసి చిటపటలయ్యాక చట్నీలో కలిపేస్తే సరి. అమోఘమైనరుచి వస్తుంది. ఇదేమంత పెద్ద ఖర్చూ, శ్రమతో చెయ్యాల్సిన పనీ కాదు. అయినా హోటల్స్ లలో ఎందుకు పాటించరో నాకు అర్థం కాదు..
పల్లీల పప్పు అంతగా వేసి చట్నీ చేసే బదులు, టమాటాలు రేటు కాస్త తక్కువగా ఉన్నప్పుడు, వాటితో పచ్చడి చేస్తే, కారంకి కారం, రుచికి రుచీ, బాగుంటుంది. హోటళ్ళలో చేసే ఆ తెల్లని సున్నం ముద్ద (నాకైతే అలాగే అనిపిస్తుంది.) చట్నీ అసలు తినబుద్ది వేయదు. అందులో పల్లీల పప్పు చాలా తక్కువగా వేసి చేస్తారేమోనని, అందుకే అలా చప్ప, చప్పగా ఉండి.. నాలికకు రుచి తగలదు. పల్లీల ధర ఎక్కువగా ఉందనిపిస్తే, హాయిగా టమాటలతో పచ్చడి చేసి పెడితే ఎంత బాగుండునో అని అనుకుంటాను.
ఇక అల్లం చట్నీ అయితే - అది ఒక ఎర్రని రంగు పదార్థములానే ఉంటుంది. ముక్కు వద్ద కాదు, ముక్కు లోపల పెట్టి చూసినా ఇసుమంత అల్లం వాసనే ఉండదు. ఈ పదార్థాన్ని హోటళ్ళలో సరిగ్గా చూడక ఎంతో కాలం అయ్యింది. ఏదో ఉన్నది లాగించేసేయ్యటం అవుతున్నది.. అంతే కదూ!..
అన్నింటికన్నా నాకు నచ్చేది ఒక సాంబారు మాత్రమే!.. అందులో మునక్కాడలు వేసి, ప్రేష్హుగా ఇంత కొతిమీర, కూసింత కరివేపాకూ దట్టించి వేడి,వేడిగా తీసుకొస్తే.. నా సామిరంగా.. ప్రక్కన ఎవరూ లేకుంటే అలాగే సాంబారు గిన్నె ఎత్తి గటగటా త్రాగేయ్యాలనిపిస్తుంది.. అంత మంచి సాంబారు దొరికేచోటు రద్దీ లేకుండా ఎలా వుంటుందీ!..
2 comments:
edo click chestunte ee blog kanipinchindi. correct gaa 1 year back raasaaru. chatnee vishayam lo saambaar vishyam lo mee feelings brahmaaaaaaaaandam. imagin chesukunte............
మీకు ధన్యవాదములు.. మీకు వీలున్నప్పుడల్లా నా బ్లాగ్ ని సందర్శించండి..
Post a Comment