Thursday, July 8, 2010

ఒక బ్యాంక్ మేనేజర్ విజయం వెనక..

నాకు తెలిసిన ఒక బ్యాంకు మిత్రుడు మా ఇంటికి దగ్గరలో ఉండేవాడు. చాలా చిన్ని, అందమైన కుటుంబం. అతనూ అతడి భార్య, ఇద్దరు పిల్లలు. చాలా సరదాగా, సంతోషముగా జీవనము గడిపేవాడు. అతనితో పరిచయం కేవలం ఒక సంవత్సరమే.. ఆ సంవత్సరములోనే ఎన్నో మధురానుభూతులు.

ప్రతివారివద్ద నుండి మనం ఎన్నో నేర్చుకునేవి ఉంటాయి. చాలా వరకు అలా చూసి నేర్చుకోము. నాకైతే ఇతడిలో ఒక సుగుణం చాలా నచ్చింది. ఎంతగా అంటే - దీని గురించి ఆలోచిస్తూ.. అలాగే నేనూ ఫాలో అయిపోయాను. ఒకప్పుడు నేను ఒంటరిగా పొందే కొన్ని అలవాట్లు (సినిమాలు, హోటల్, సైట్సీయింగ్.. లాంటివి) ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలసి పంచుకుంటున్నాను. అందులో ఏదో నాకు ఆనందం కనిపిస్తున్నది. అదేమిటో మీకు చెప్పనే లేదు కదూ..

అతను తన ఆఫీసులో ఏదైనా చిన్న పార్టీ జరిగినా, ఎవరైనా పార్టీ ఇచ్చినా.. తాను మాత్రం ఆ పార్టీలో పాల్గొని కమ్మగా, కడుపు నిండా తిని బ్రేవ్ మని అనేవాడు కాదు. ఆ పార్టీ కి ఫుడ్ సమకూర్చే కేటరింగ్ వారికి ఇంకిద్దరికి సరిపడా పార్టీ ఐటమ్స్ ఆర్డరు ఇచ్చి, వాటిని వారు తేగానే, బాంక్ లోని అటెండరు కి కొంత టిప్ ఇచ్చి, ఇంటికి పంపించేవాడు. అంటే తాను అక్కడ తినే ఆ పార్టీ ఫుడ్ తన ఇంట్లో వారితో కూడా (తన డబ్బులతో కొని, పంపి..) వారితో షేర్ చేసుకునేవాడు అన్నమాట. తాను ఏది బయట తింటున్నాడో అదీ తనవారు కూడా తినాలి అనే అతని ఉద్దేశ్యం.

మొదట్లో ఇది విన్నప్పుడు ఇదేదో సుత్తిగా, ఫూలిష్ గా అగుపించింది. ఇదేమి వింత మనస్తత్వం అని. ఆ తరవాత కొద్ది కొద్దిగా అర్థం కాసాగింది. నిజానికి ఇప్పుడు నా మనసులో అతను ఒక గొప్ప హీరో. అతను ఇలా చేసినందుకు అనుకుంటా.. అలాని కూడా కాకపోవచ్చు.. అతను పట్టుదలగా బ్యాంక్ పరీక్షలు వ్రాసి అందులో అతను మేనేజర్ పోస్ట్ సంపాదించాడు. అందులో అతని కష్టమే కాక, వారి కుటుంబ తోడ్పాటూ (అతనికి ఇబ్బంది చేయకుండా, అల్లరి చేయకుండా, కనీసం టీవీ చూడకుండా, వేసవి సెలవులన్నింటినీ ఎక్కడికీ వెళ్ళకుండా - దూరం చేసుకొని అతని ప్రిపరేషన్ లో సాయం చేస్తూ..) ఉంది. కనుకనే తేలికగా పాసయ్యాడు. ఇప్పుడు గొప్ప స్థాయికి చేరుకున్నాడు. ఇలాంటి ఫామిలీ  ఉండటం అతని అదృష్టం అయితే, అలాంటి వ్యక్తి వారికి దొరకటం వారి గొప్ప విషయం.

నిజముగా నేను దగ్గర నుండి చూసిన - విజయవంతమైన మనిషి జీవితం అతనిది.

1 comment:

Anonymous said...

Yes You are right. He is really great and he is a winner.

Related Posts with Thumbnails