Friday, March 24, 2017

Stone turning Mortar

మన చుట్టూ ఉన్న వస్తువులు ఎంతో ఆధునికతని సంతరించుకుంటున్నాయి. టెక్నాలజీ నమ్మశక్యం కాని రీతిలో ఎంతగానో అభివృద్ధి చెందుతూనే ఉంది. పాతవస్తువులు కూడా క్రొత్తగా ఆధునిక రూపుని పొందుతున్నాయి. బండగా ఉండే బండ వస్తువులు కూడా క్రొత్తగా, నాజూకుగా మారి, షోకేసుల్లో పెట్టుకునేలా తయారవుతున్నాయి. అలాంటిదే - అలా ఆధునికంగా మారిన ఒక వంటింటి పనిముట్టుని పరిచయం చేద్దామని ఈ పోస్ట్. 

మొన్న అలా మార్కెట్ గుండా వస్తుండగా సూదంటురాయిలా ఒక బండి నన్ను ఆకర్షించింది. చూసిన క్షణమే అదేమిటో, దాని తయారీ వెనక ఉన్న శ్రమ, ఇప్పటి పనితనం వెనుక ఉన్న విజ్ఞానం, తయారీ నేర్పు.. ఏమిటో అర్థమయ్యాయి. ధర అందుబాటులో గనుక ఉంటే ఒక కలెక్షన్ పీస్ లా దాచుకోవాలని వెంటనే అనుకున్నాను. ఆ బండి వద్దకు వెళ్లాను. చేతుల్లోకి తీసుకొని చూశాను. సన్నని రాతి పౌడర్ చేతులకు అంటుకొని చేతులు మురికి అవుతున్నా పట్టించుకోలేదు. నాకు అది అపురూపముగా తోచింది. ఆ వస్తువుని నేను ఏమాత్రం వాడకున్నా అంత బాగా తయారీ ఉన్న దాన్ని తప్పక తీసుకోవాలనుకున్నాను. 

సుత్తి, ఉలితో చెక్కిన రోలు సాధారణముగా అందరి ఇళ్ళల్లో ఉంటాయి. అవి కాస్త రఫ్ గా ఉంటాయి. వాటినే ఇప్పుడు నాజూకుగా చేస్తున్నారు. అదే ఇది. టేకు చెక్కలని సంగడి Turning పట్టించి చేసే పద్ధతిలోనే గ్రానైట్ రాయినీ డైమండ్ టూల్స్ సహాయాన గుండ్రముగా తిరిగే లేత్ మెషీన్ మీద తొలచి వీటిని తయారుచేస్తున్నారు. ఇవి తమిళనాడు లో తయారు అవుతాయని చెప్పాడు. రాతిని కూడా అలా సంగడి పట్టి, చెయ్యటం ఇదే తొలిసారిగా, ప్రత్యక్షముగా చూస్తున్నాను. యూట్యూబ్ లో Stone turning lathe అని టైపు చేసి వెదికితే చాలా వీడియోలు కనిపిస్తాయి. ఈ క్రింది ఫోటోల మీద డబల్ క్లిక్ చేసి, చూస్తే వాటి పనితనం, అందం కనిపిస్తాయి. 

ధర ఎంతనో అడిగా.. రెండువందల యాభై రూపాయలు చెప్పాడు. చివరకు నూటా యాభై Rs. 150 కి ఇచ్చాడు. నేను కాస్త పరిశీలనగా చూస్తుంటే - అది నల్లని గ్రానైట్ తో చేసినదనీ, నీటిలో కడిగితే, ఆ పైన ఉన్న పౌడర్ వెళ్ళిపోయి, నల్లని గ్రానైట్ కనిపిస్తుందని చెప్పాడు. కడిగీ చూపించాడు. నిజమే.. నల్లని గ్రానైట్ తో చేసినదే అది. ఇందులో ఇంకా చిన్నవీ, సన్నగా ఉన్నవీ ఉన్నాయి కూడా. కానీ సన్నగా ఉండి, వాడకములో పగిలి ఎక్కువ రోజులు రావేమో అని వద్దనుకున్నాను. 





No comments:

Related Posts with Thumbnails