అవసరం ఉన్నప్పుడే పలకరిస్తారని ఎవరి గురించీ బాధపడకు..
వాళ్ళు చీకటిలో ఉన్నప్పుడే వెలుగులా నీవు గుర్తోస్తావని సంతోషించు..
నిజమే కదా.. బంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్న నానుడిని నిజం చేస్తున్న ఈ రోజుల్లో - మనం ఏమాత్రం కష్టాల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, ఆర్థికంగా దెబ్బతిన్నా - మనవైపు తొంగి చూడటానికి ఎవరూ ఇష్టపడరు. కనీసం వారిని కలవటానికి వెళ్ళినా ఇంట్లో లోపల ఉన్నా లేరని చెప్పిస్తారు. ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యరు. ఇలా ప్రతివారికీ అనుభవమే. అప్పుడు మన మనసుకి ఎంతగానో బాధవేసినా, ఆ అనుభవాలు వారియొక్క నైజాన్ని, వారిని ఎంతగా నమ్మాలో తెలుసుకోవటానికి ఒక పాఠంలా ఉపయోగపడుతుందనే తెలుసుకోవాలి. ఇలా అనుభవాలు మన జీవితంలో ఎంత తక్కువ కాలంలో ఎదురైతే అంత మంచిది. మిగిలిన ఎక్కువ కాలాన్ని మరింత అందముగా, ఆకర్షణీయముగా గడపటానికి ఆస్కారం ఉంటుంది.
మన అవసరాలకు వారు ఉపయోగపడక పోయారు కానీ, ఇప్పుడు అవసరం అయినప్పుడు ఎంత తీయగా మాట్లాడుతూ వచ్చారు అని అనుకున్నా అది బయటకి ప్రదర్శించడం అనవసరం. అలాచేసినప్పుడు వారు మనల్ని మరింతగా ఇబ్బందులకు గురిచేసే అవకాశాన్ని వారికి మీరే స్వయంగా ఇచ్చినట్లు అవుతుంది. ఫలితముగా మీకొక శత్రువుని తయారు చేసుకున్నట్లు అవుతారు. ఇందులో న్యాయా అన్యాయాల మాట ఎలా ఉన్నా - అప్పుడు వారోచ్చిన పని ఏమిటో తెలుసుకొని, అది మీవల్ల అవుతుందో లేదో ఆలోచించుకొని, అతి తక్కువ ఖర్చు, సమయంలో అయ్యేలా చూసి చెయ్యండి. ఆ సహాయం పొందాక వారు మీ అనుకూలురుగా మారితే మీకు మరీ మంచిది. వాళ్ళు చీకటిలో ఉండి, సాయం చెయ్యటానికి ఎవరూ లేనప్పుడు, మీరు మాత్రమే గుర్తుకొచ్చారు అని సంతోషించండి. కానీ - సాయం పొందిన తరవాత కూడా ఒకవేళ ఎప్పటిలానే వారి నైజాన్ని చూపిస్తే -
నిశ్చయంగా వారిక మీకు అవసరం లేదు..
వారిని ఇక నమ్మాల్సిన అవసరం లేదు..
వారిని మీ మిత్రులుగానీ, శ్రేయోభిలాషుల్లా కూడా గుర్తుపెట్టుకోవలసిన అవసరం లేదు.
వారిని ఉనికిని కూడా మరచిపోవటానికి ప్రయత్నించండి.
ఇలా చెబుతున్నాను అని మీకు వేరేలా అనిపించినా - ఈరోజుల్లో మాత్రం అదే శ్రేయస్కరం.
No comments:
Post a Comment