Friday, August 21, 2015

టిక్.. టిక్.. టిక్..


  ఇదేమిటో తెలుసా? 
దీని తాలూకు జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా ? 

నేను చిన్నప్పుడు దీన్ని తొలిసారిగా చూసాను. ఒక స్నేహితునితో ఆటల్లో ఉన్నప్పుడు - తను తన రెండు చేతుల్నీ వెనక పెట్టుకొని, టిక్ టిక్ మంటూ శబ్దం చేసేసరికి - ఆ చుట్టూ ఉన్న మిగతా పిల్లలూ, నేనూ ఒహటే ఇదయ్యాం.. ఈ శబ్దం ఎక్కడి నుండీ అనీ..ఆ శబ్దం ఆగిపోయింది. కాసేపటి తరవాత మళ్ళీ మొదలు. ఆ పిల్లాడు ఈసారి నిక్కరు జేబులో దీన్ని పెట్టుకొని టిక్ టిక్మనిపించసాగాడు. ఈసారి శబ్దాన్ని చాలాసేపు వాయించేసరికి - చేతి కదలిక వల్ల కదులుతున్న నిక్కరు వల్ల అందులోనించే అని గమనించి, వాడి జేబులోంచి, బయటకు తీయించాం. అప్పుడే నేను తొలిసారిగా చూసాను. 

చాలా చిన్నదిగా, అరచేతిలో చిన్నగా ఇమిడిపోయే విధంగా ఉండే ఈ ఇనుప వస్తువు మమ్మల్ని చాలా ఆకర్షించింది. అందరమూ తలా కాసేపు వాయించాం. ఆ తరవాత అవి ఎక్కడ అమ్ముతున్నారో తెలుసుకొని, డబ్బులు తీసుకొని అక్కడికి పరుగులు తీశాం. అప్పట్లో అది పది పైసలకు ఒకటి. వీటిని ఒక్కోచోట ఒక్కో పేరుతో పిలుస్తారు అనుకుంటా.. ఒకచోట " కప్ప " అని పిలుస్తారు ట. 

పుట్ పాత్ మీద, రోడ్డు వారగా ఒక ముసలతను పాత ఇనుప వస్తువులను, కొద్దిపాటి విక్రయ సామాను, రిపేరు చేసే సామానుని ఒక త్రుప్పు పట్టిన ట్రంక్ డబ్బాలో తెచ్చుకొని, జీవనోపాధి గడిపేవాడు. మాసిన, చినిగిన బట్టలతో, నెరసిన తలతో, చిన్నని తెల్లని గడ్డంతో తను ఉండేవాడు. ఆయన ఎక్కువగా గొడుగులనీ, టార్చి లైట్లనీ బాగుచేసేవాడు. చిన్న చిన్న తాళం కప్పలూ, స్టీలు సామాను అమ్ముకొనేవాడు. అతని వద్దనే ఈ టిక్ టిక్ మనే సాధనమూ దొరికేది. తను వీటిని చేసేవాడు కాదు.. ఎక్కడి నుండో కొనుక్కవచ్చి, అక్కడ అమ్మేవాడు. ఏదైనా ఒకటి సరిగ్గా శబ్దం చెయ్యలేక పోతే - దాన్ని విప్పి, సరిచేసి ఇచ్చేవాడు. 

చిన్న ఇనుప రేకుని మధ్యలో చెంచా లా వంచి, ఒకవైపు నుండి ఆ మధ్యలోనికి వచ్చేలా ఒక స్టీలు రేకు ముక్కని జత చేసేవారు. నిజానికి ఇది చాలా సింపుల్, అమోఘమైన పరికరమిది. ఆ రేకు ముక్కని బొటనవ్రేలుతో అదిమితే ఆ టిక్ టిక్ శబ్దం ఎలా ఉత్పత్తి అవుతుందో - నాకు ఇప్పటికీ అదో పెద్ద మిస్టరీయే మరి. 

అక్కడ అప్పుడు వాటిని కొన్నాం.. విరివిగా వాడాం.. ఆ తరవాత ఆ మోజు పోయింది. మళ్ళీ కొద్ది రోజులకి - ఏదైనా ఆటల్లో గెలిచినప్పుడు చప్పట్లకి బదులుగా దాన్ని వాడేవాళ్ళం. అదో మురిపెం మాది. అప్పట్లో ఆటలకి వెళ్ళేటప్పుడు జేబుల్లో వేసుకొని వెళ్ళే తప్పనిసరి ఆటవస్తువు అది. 

No comments:

Related Posts with Thumbnails