ఈమధ్య మా బంధువుల వారి ఇంట్లో పెళ్లి జరిగితే.. నేనూ వెళ్లాను. పెళ్ళయ్యాక మరుసటి రోజున రిసెప్షన్ రోజున - ఆరోజు ఉదయాన సత్యనారాయణ స్వామి వ్రతం జరిపారు. పెళ్లి అయ్యాక అన్ని కార్యక్రమాలు ముగించుకొని, వరుడి ఇంటికి బయలుదేరాం.. ఆరోజు అబ్బాయి ఊరిలో బారాత్ చేశారు. డీజే తో నానా హంగామాతో ఆరోజు రాత్రి మూడింటి వరకూ వీధుల్లో డ్యాన్సులు చేస్తూ వరుడింటికి వచ్చాం.. తెల్లారి చాలా ఆలస్యముగా నిద్ర లేచాం అందరమూ.. ముందే నిద్రలేచిన కొద్దిమంది సత్యనారాయణ స్వామి వ్రతానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. మా గ్యాంగ్ ఏమో ఆ వ్రతానికి కావలసిన సత్యనారాయణ స్వామి వారి పీటకి అలంకరణ చేస్తున్నారు.
నాకూ చెయ్యాలనిపించింది. ఎప్పుడూ అలా అలంకరణల్లో పాల్గొనలేదు. ఒకసారి చెయ్యాలనిపించింది. ఆకోరికా నేరవేర్చుకోవాలనిపించింది. ఇప్పుడే వస్తాను అని చెప్పేసి, వెంటనే స్నానం చేసొచ్చి, అలంకరణలో కూర్చొన్నాను. అప్పటికే దాదాపుగా అంతా అలంకరణ చేసేశారు. నాకెందుకో అంత బాగా నచ్చలేదు. ఇంకా బాగా అలంకరణ చేస్తే బాగుండేదేమో అనిపించింది. కానీ అప్పటివరకూ చేసిన అలంకరణ కాదని - మళ్ళీ క్రొత్తగా చేసి, అప్పటివరకూ చేసిన వారి అలంకరణ బాగోలేదని అన్నట్లు చేసి, మనసులని బాధపెట్టలేను. పోనీ ఇంకేమైనా జత చేద్దాం అంటే ఊరు క్రొత్త. నాకు కావలసిన వస్తువులు ఎక్కడ, ఎలా, ఎంతకు దొరుకుతాయో తెలీదు. సమయమూ లేదు. క్రొద్దిగా ఇంకా ముందు లేచి పాల్గొంటే బాగుండేది అనిపించింది. ఈసారి నాకా అదృష్టం లేదనిపించింది.
సరే అని ఊరుకుంటున్న సమయాన నా దృష్టి ఆ పీట మధ్య భాగాన అలంకరించే కలశం మీద దృష్టి పడింది. " దీన్నేమి చేస్తారు? ఎక్కడ పెడతారు?? ఎలా అలంకరించాలని అనుకున్నారు??? ఎవరు అలంకరిస్తారూ????..." లాంటి అక్కడివారిని ప్రశ్నలు వేశాను.
" స్వామి వారి ఫోటో ముందున వస్తుంది, ఆ రాగి చెంబు మీద పీచు తీసిన కొబ్బరి కాయని పెట్టేస్తారు, ఇంకా ఎవరూ అలంకరిస్తామని అనలేదు.." అన్నారు.
" ఒకే! నేను అలంకరించాలని ఉంది. ఈ ఒక్కటైనా నాకు వదిలెయ్యండి.." అని అడిగి నేను ఇలా అలంకరణ చెయ్యబోతున్నాను అని కాస్త వివరముగా చెప్పాను. మీకు నచ్చితే - ఆ పని మొదలెడుతాను అని చెప్పా. అలాని ఎందుకు చెప్పాను అంటే - అలా నేను ఎక్కడా చూడలేదు. అలా చేస్త బాగుంటుందని నా ఊహ అంతే. స్వామివారి ముందట ఇలా చెయ్యవచ్చా అన్నదీ నాకు అంతగా తెలీదు.. చేస్తే ప్రశంసలు రాకున్నా సరే - విమర్శలు రాకుంటే సరి అని మనోగతం. వారు, పెద్దవారు సరే అన్నారు.
చెంబు మూతకు సరిపడా కొబ్బరి కాయని తెప్పించాను. కొద్దిగా జుట్టు పీకేసి, సరిగ్గా అమరేలా చేశాను. దాన్ని చక్కగా కడిగించి, శుద్ధి చేయించాను. అలాగే ఎరుపురంగులో ఉన్న జాకెట్ బట్టని తెప్పించాను. ఆ జాకెట్ బట్టని మడత పెట్టి, టోపీ ఆకారములోకి మార్చాను. దాన్ని ఆ కొబ్బరికాయకి తోడిగేలా చేశాను.
ఇప్పుడు ఆ ఎరుపురంగు బట్టమీద ఒక అగ్గిపుల్ల సహాయన - పంచపాళీ లోన ఉండే అష్ట కాశీ గంధంలో ముంచి, అమ్మవారి రూపు వెయ్యటం మొదలెట్టాను. మొదట నేను చేస్తున్నది ఎవరికీ అర్థం కాలేదు.. నెమనెమ్మదిగా ఆకారం రూపు దిద్దుకుంటున్న కొద్దీ అందరికీ అర్థం అయ్యింది. మొత్తం గీశాక - రాగి చెంబులో నీటిని నింపి, దానిపైన ఈ అమ్మవారి రూపు ఉన్న కొబ్బరికాయని అమర్చిపెట్టాను. సత్యనారాయణ స్వామివారి ఫోటో ముందు అమర్చాను. అప్పటికే ఆ స్థలాన చాలామంది వచ్చేసి ఉండటముతో బయటకి వచ్చేశాను.
పూజ అయ్యాక - చాలామంది అలా ఎవరు చేశారు అంటూ ఆరా తీసి, బాగా చేశారు అంటూ మెచ్చుకున్నారు. హమ్మయ్య అనుకున్నాను. ప్రసాదం పంచి పెట్టే బాధ్యత తీసుకొని, వచ్చిన వారందరికీ పంచాను. పనిలోపనిగా నా అలంకరణ తాలూకు ఫోటో ఒకటి తీసుకున్నాను. అదిప్పుడు మీకు చూపిస్తున్నాను. నేను చేసిన - గంధముతో చేసిన అమ్మవారి రూపాన్ని మరొక ఫోటోలో విడిగా చూపిస్తున్నాను.
|
Satyanarayana swamy vratham |
|
Kalasham |