Friday, August 29, 2014

మట్టితో చేసిన వినాయక ప్రతిమ

ఈసారి వినాయక చవితికి ఎలాంటి విఘ్నాధిపతి ప్రతిమని తీసుకరావాలన్న ఆలోచనలో నేనున్నాను.. ప్రతీసారీ ఇంటికి దగ్గరలోని వినాయకులని చేసే వారి వద్ద పూజాప్రతిమని తీసుకుంటాను. ఈసారికి ఎప్పటిలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనబడే సుద్దతో చేసిన వినాయకుడి ప్రతిమ బదులుగా మట్టితో చేసిన గణపతిని తీసుకుందామని ఆలోచన. టీవీలలో, పేపర్లలో... మట్టితో చేసిన వినాయకుడిని కొలిచి, పర్యావరణాన్ని కాపాడండి.. అన్న నినాదాలతో నేనూ ప్రేరణ పొందాను. ఈసారికి తప్పనిసరిగా మట్టితో చేసిన ప్రతిమని తీసుకోవాలనుకున్నాను.

మా ఏరియాలోని మార్కెట్లో తిరిగాను.. ఎక్కడా మట్టితో చేసిన ప్రతిమలు లేవు.. అన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలే కనిపించాయి. ఎవరి వద్దా మట్టితో చేసిన ప్రతిమలు లేవనే సమాధానం వచ్చింది. ఇంతకు ముందు ఒకసారి మట్టితో చేసినది కొన్నాను.. కానీ అది అప్పటికప్పుడు చేసి ఇచ్చింది కాబట్టి సరిగా తడి ఆరిపోక, అక్కడక్కడా దెబ్బతింది. ఆసారికి ఏదో మా వల్ల ఏదో తప్పు జరిగిపోయిందన్న భావంతో - ఏదో తెలీని వెలితిని అనుభవించాం. ఈసారికి అలా కాకుండా ఆరిపోయి, అందముగా ఉన్న వినాయకుడి ప్రతిమ కోసం ఎదురుచూస్తున్నాను.

అనుకోకుండా నిజాంపేట్ చౌరాస్తా వద్దకి వెళ్ళాల్సివచ్చింది. మెట్రో రైల్వే ట్రాక్ కి కాస్త ప్రక్కగా వెళ్లాను. అక్కడ నా పని చూసుకొని తిరిగి వస్తుండగా - ఒక్కసారి రోడ్డు వారగా ఒక బండి, దాని మీద మట్టితో చేసిన వినాయకుడి ప్రతిమలు. ఒక్కసారిగా హాశ్చర్యపడిపోయాను. ఏమిటా.. ఇలా వెదకాలి అనుకున్నంతలోనే అప్పుడే ఇలా దొరికేయ్యడం నిజముగా ఒక అద్భుతంలా తోచింది. దగ్గరకి వెళ్లి చూశాను.

బంకమట్టితో చేసిన నిఖార్సైన మట్టి ప్రతిమలు అవి. కాస్త దూరం నుండి చూస్తే, మట్టిరంగు పూసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలేమో అనుకొనేలా ఉన్నాయి. అచ్చు అవే విగ్రహాల అచ్చులలో, బంక మట్టిని సన్నని రొట్టెలా చేసి, ఆ తరవాత అచ్చులలో వత్తినట్లు - చాలా బాగా చేశారు. ముందు, వెనక భాగాలు వేరు వేరుగా చేసి, ఆ తరవాత ఒక్కటిగా జత చేశారు.

ఇవి చక్కగా ఆరిపోయి, గట్టిగా ఉన్నాయి. గట్టిదనములో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు ఏమీ తీసిపోవు. ఇంకా చెప్పాలంటే వాటికన్నా ఇవే గట్టిదనము ఉన్నట్లు అగుపించింది. వేరే దగ్గరికి తీసుకవెళితే, ప్రతిమ దెబ్బ తినదు కదా అని అడిగాను. గట్టిగానే ఉంటాయి సార్.. అంత సున్నితముగా ఉండవు.. ఇవి చక్కగా ఆరిపోయి, గట్టిగా ఉన్నాయి మీరే చూడండి.. అన్నాడు ఆ షాప్ అతను.

ధర అడిగితే - Rs. 250 చెప్పాడు. బేరం చేస్తే - Rs. 170 కి ఇచ్చాడు. అయినా సంతోషమే. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో చిన్నవే Rs. 150 కి దొరుకుతున్నపుడు ఈ 13 అంగుళాల ప్రతిమ ఆ రేటుకి రావటం మంచి ధరనే అనుకున్నాను. వెంటనే డబ్బులిచ్చేసి, పేపర్లో చుట్టేయించుకొని, ఇంటికి వచ్చేశాను. దారిలో ఆ ప్రతిమ ఉన్న బ్యాగ్ ని జాగ్రత్తగా మోశాను. ఇంటికి వచ్చాక ఆ ప్రతిమని బయటకి తీశాను. చాలా చక్కగా బాగుంది అన్నారు అంతా.. ఎక్కడా ఏమీ దెబ్బ తినలేదు.

ఇలాంటి మట్టితో చేసిన గణపతి ప్రతిమలు ప్రతిచోట్లా దొరికేలా, కొందరికి శిక్షణ ఇప్పిస్తే, వారి వల్ల కొందరికి ఉపాధి, మరికొందరికి భక్తి భావాన్నీ, సంస్కృతి సంప్రదాయాల్ని చక్కగా ఆచరించినట్లూ అవుతుంది. అలాగే పర్యావరణాన్ని కాపాడుటలో మనమూ ఒక చేయివారిమీ అవుతాము. సున్నపు ముద్దలు నిమజ్జనం చేసి, నీటిని కలుషితం కాకుండా చేసినట్లూ అవుతుంది.

సమయం లేక ఆ ప్రతిమకి ఏమీ రంగులూ, హంగులూ అద్దలేదు.. త్వరలో అద్ది, ఆ ఫోటోలూ, ఇంకొన్ని ఆసక్తికరమైన కబుర్లూ, మాఇంటి వినాయక పూజా విశేషాలూ.. మీకు వచ్చే పోస్ట్ లో చెబుతాను.

క్రిందన ఉన్న ఫొటోస్ రిజల్యూషన్ తగ్గించకుండా క్లారిటీ పెంచి, మరీ పోస్ట్ చేస్తున్నాను.

Clay Ganesh idol - with flash

Clay Ganesh idol - without flash

Clay Ganesh idol - without flash

Clay Ganesh idol - inner side

No comments:

Related Posts with Thumbnails