Wednesday, July 31, 2013

Good Morning - 409


నువ్వెలా ఉంటే బాగుంటుందో నీ చెవిలో జోరీగ లాగా నిరంతరం నిన్ను సాధించే మనిషి - నీలోనే ఒకరుంటారు. అతడికీ, నీకూ మధ్య తేడా తగ్గే కొలదీ, నీమీద నీకు ప్రేమా, నమ్మకమూ పెరుగుతాయి. 

అవును. మనలోని మనిషి - అది ఆత్మ కావచ్చు, అచ్చు మనలాంటి మనసున్న మరో అంతర మనిషి కావోచ్చును.. అది / వారు మనలోనే ఉంటారు. దాని అభిప్రాయాలు దానివి.. మన అభిప్రాయాలు మనవి. ఈ రెండింటి ఆలోచనల మధ్య ఎంతో తేడా ఉంటుంది. చేసినది మనకు సబబు ఉండే పని లోపలి మనిషికి తప్పులా కనిపించవచ్చు. పైకి నచ్చని పని లోపలి మనిషికి సంతోషకర పని అయి ఉండవచ్చును. అంటే ఈ రెండింటి ఆలోచనల్లో దూరం ఉంటుంది అన్నమాట. అప్పుడు మన మీద మనకి ప్రేమా, నమ్మకం ఉండవు. ఏదో ఉన్నామూ అంటే ఉన్నాం అన్నట్లు ఉంటాం. అదే ఈ రెండింటి మధ్య దూరం తగ్గే కొలదీ మన మీద మనకి ప్రేమా, నమ్మకమూ, గౌరవమూ, ఆత్మ విశ్వాసం.. పెరుగుతాయి. 

Tuesday, July 30, 2013

Good Morning - 408


స్నేహం అనేది శ్వాసించే రోజా వంటిది. దాని ప్రతి భాగమూ మకరందముతో నిండి ఉంటుంది. 


Monday, July 29, 2013

Good Morning - 407


పుస్తకాలనీ, ప్రార్థనలనీ, ప్రకృతినీ, పాటలనీ, తోటలనీ.. ప్రేమించేవాడు - వృధా పరిచయాల కోసం ప్రాకులాడడు. 

 అవును కదా.. వృధా పరిచయాల కోసం ప్రాకులాడి, ఆ పరిచయాలని పెంపొందించేందుకు కష్టపడేవాడు - పుస్తకాలలోని, ప్రార్థనలలోని ప్రకృతి లోని రమ్యతనీ, పాటల్లోని మధుర్యాన్నీ తోటలోని పూల సొబగులలోని అందం తెలిస్తే - అలా వృధా పరిచయాల దిశగా వెళ్ళడు. 


Sunday, July 28, 2013

Good Morning - 406


నిజమైన ప్రేమ అంటే ఒకరికోసం ఒకరు చనిపోయిన రోమియో జూలియట్ లదే కాదు.. ఒకరికోసం ఒకరు బ్రతికిన మన అమ్మమ్మ తాతయ్యదీ, నాన్నమ్మ తాతయ్యదీనూ.. 

Saturday, July 27, 2013

Good Morning - 405


నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎల్లప్పుడూ నీ మంచితనం గురించి మాట్లాడుకుంటారని ఎన్నడూ అనుకోకు.. అదే విధముగా నీ వైకల్యం గురించి కూడా వారు చర్చించరు. 

నిజమే!.. మన చుట్టూ ఉన్నవారు ఎప్పుడూ మన మంచితనం గురించే, మనం చేసే మంచిపనుల గురించే మాట్లాడుకుంటారని అనుకోకండి. మనలోని చీకటి కోణాల గురించి, మన నైతిక విలువలు, వ్యక్తిత్వం, చేసిన చెడుపనుల గురించీ కూడా మాట్లాడుకుంటారు. ఆ మాటకి వస్తే ఎక్కువగా ఇవే మాట్లాడుకుంటారు కూడా. అలాగే మన శారీరక, మానసిక వైకల్యం గురించీ కూడా మాట్లాడుకుంటారు. మీరు ఉన్నత వ్యక్తిత్వ గలవారు అయితే మీలోని వైకల్యాల గురించి ఊసే ఎత్తరు. 

Friday, July 26, 2013

Good Morning - 404


నీతో నీవు సమయం గడుపు. 
ఇతరుల ప్రేమకై ఆరాటం తగ్గుతుంది. 

మనల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు.. నన్ను ఎవరూ గుర్తించటం లేదు. నామీద ఎవరికీ శ్రద్ధ లేదు.. కనీసం నన్ను ఒక మనిషిగా గుర్తించటం లేదు.. అంటూ నిందాపూర్వక మాటలు అనుకుంటే - ఏమీ ఫలితం ఉండదు. అలా వారి యొక్క ఇంటెన్షన్, చూపు మనమీద లేనందుకు బాధపడి ఏమీ ప్రయోజనం ఉండదు. వారి నుండి మీరు పొందాలనుకున్న ప్రేమకోసం మీరు పడే ఆరాటానికి అర్థం ఉండదు. అలాంటి సమయం లో మీతో మీరు సమయం గడపడం నేర్చుకోండి. అంటే మీలోని లోపాల సవరణలు, శారీరక మానసిక ధృడత్వం, మీ శరీరానికి క్రొత్త హంగులు, మీ ఉల్లాస జీవనానికి క్రొత్త విద్యలూ, అభిరుచులూ నేర్చుకోండి. మిమ్మల్ని మీరు మేకోవర్ Make over - మిమ్మల్ని మీరు మార్చుకోవటం చెయ్యండి. అప్పుడు ఇతరుల ప్రేమకై వెంపర్లాడటం ఖచ్చితముగా తగ్గుతుంది. 


Thursday, July 25, 2013

Good Morning - 403


నీ ఆలోచనలు వంకరగా లేనంత కాలం - నీ వంకర పళ్ళ గురించి ఎవరూ పట్టించుకోరు. ధీమాగా బ్రతుకు. 

అంతే కదా..! మన ఆలోచనలు వక్రమార్గాన వెళ్ళనంతకాలం మనం యే తప్పూ చేసినట్లు కాదు. ఎప్పుడైతే మన ఆలోచనలు తప్పుడు దారిలో ప్రయాణిస్తాయో, అప్పుడే మనం నైతికముగా పతనం అవుతున్నవారిమి అవుతాం. ఆలోచనలు సరియైన దిశలో ఉన్నంత కాలం మన చుట్టూ ఉన్న మిత్రులూ, బంధుగణం, పరివారం, సమాజం.. గౌరవాన్ని ఇస్తుంటారు. ఎప్పుడైతే మన ఆలోచనలు తిన్నగా కాకుండా, అక్రమ మార్గములో వెళితే - అప్పుడు మన చుట్టూ ఉన్నవారు మనల్ని తప్పు పట్టడం మొదలెడుతారు. అందాక వారికి కనిపించని మనలో ఉన్న అవకరాలు, ప్రస్పుటముగా కనిపిస్తాయి. ప్రతీదీ తప్పులాగే ఉంటాయి. ఒకవేళ మన చుట్టూ ఉన్నవారు మనల్ని తప్పు బట్టడం మొదలెట్టారు అనుకోండి.. మీ ఆలోచనల్ని నిజాయితీగా ఒకసారి విశ్లేషించుకోండి. 

Wednesday, July 24, 2013

Good Morning - 402


నీ అవసరాన్ని తమ టాపిక్ గా మార్చుకొని ఆనందించే శాడిస్ట్ గ్రూపుల నుండి దూరముగా ఉండు. 

నిజమే కదా..! రోజువారీ ఎన్నో అవసరాలు మనకు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని పూర్తి చేయుటలో అశక్తత అగుపిస్తుంది. కొన్ని ఇతరుల సాయముతో పూర్తి చేస్తుంటాము. ఈ ఇతరుల సాయం కోసం మనం వెళితే, మన ముందు ఒకలా మాట్లాడి, మనం వెళ్ళగానే ఇంకోలా, మన అశక్తత గురించి చీపుగా, అసహ్యముగా, వెకిలిగా నవ్వుకుంటూ ఆనందించే సమూహాల నుండి దూరముగా ఉండండి. నిజానికి వారు మీకు చాలా మేలే చేశారు. ఎలా అంటే - ఆ సమూహములో ఇలాంటి మనస్తత్వాల మనుష్యులు ఉన్నారని వారే మనకి స్పష్టముగా మనకి తెలియచేశారన్న మాట. దానివల్ల మనకి అమూల్యమైన కాలం మిగిలి, క్రొత్త సమూహాల వద్దకి వెళ్ళటానికి, అలాగే ఒక చక్కని జీవిత పాఠం నేర్చుకునేలా వచ్చిన అవకాశం గా తీసుకోవాలి. 


Tuesday, July 23, 2013

పనీపాట లేదా?

సోషల్ సైట్లలలో ఒక్కోసారి మనం పెట్టే స్టేటస్ మెస్సేజెస్ కి మనమే అన్నీ అయి చూసుకోవాల్సి ఉంటుంది. ఉన్న కొద్దిపాటి నిముషాలలోనే బలమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అలా అయితేనే కొన్ని విలువైన స్నేహాలు కాపాడుకున్న వారిమి అవుతాము. అలాగే భవిష్యత్తులో - ఒక మంచి నిర్ణయం వేగముగా తీసుకున్నాం అనుకొనేలా ఉండాలి.

ఇలాంటిదే నాకు జరిగిన ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఎవరు? ఏమిటీ? వారి పేర్లేమిటీ అనేది అప్రస్తుతాలు.

ఒకసారి నేను నా ప్రోఫైల్ లో ఒక స్టేటస్ మెస్సేజ్ పెట్టాను. నిజానికి స్టేటస్ మెస్సేజెస్ పెట్టడం నాకు ఇష్టముండదు. కారణం - అలా పోస్ట్ చేశాక వచ్చే కామెంట్స్ కి రిప్లై తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చుకుంటూ పోతుంటే - నాకున్న అమూల్య సమయం దెబ్బతింటుంది.. తిన్నది కూడా. ఇక నా కాన్సెంట్రేషన్ అంతా ఈ పోస్ట్ మీదే కేటాయించాల్సి వస్తుంది. ఫలితముగా నేను పొందేదానికన్నా, కోల్పోయేదే ఎక్కువ. ఇది మొదట్లోనే అనుభవం లోకి వచ్చేశాక - ఇక స్టేటస్ మెస్సేజెస్ పెట్టడం మానుకున్నాను. అందుకే ఎప్పుడో అరుదుగా పెట్టేస్తుంటాను.

ఒకసారి సరదా స్టేటస్ మెస్సేజ్ పెట్టాను.. అది పోస్ట్ చేశాక నేను వేరే పని చూసుకున్నా. అరగంట తరవాత చూస్తే ముగ్గరు కామెంట్స్ పెట్టారు. లైక్ చేసి, సైనౌట్ అయ్యాను. సాయంత్రం వచ్చి చూశా.. నాలుగో కామెంట్ గా ఇంకో ఫ్రెండ్ కామెంట్ పెట్టాడు - " పైన వ్రాసిన వారికి పనీ పాట లేదు.. " ఇంకా ఏదో అంటూ ఆ కామెంట్ పెట్టాడు. నిజానికి కామెంట్ వ్రాయాల్సి వస్తే - ఆ పోస్ట్ పెట్టిన వారిని ఉద్దేశ్యించి వ్రాయాలి కానీ, వారినీ వేరేవాళ్ళనీ గెలుక్కుంటూ వ్రాస్తే ఇలాగే ఉంటుంది. అసెంబ్లీ లో అధ్యక్షుడిని ఉద్దేశ్యించి, అధ్యక్షా.. అని అన్నింటినీ చెప్పటం లాగా ఉండాలి. ఆ మిత్రులు కూడా తనకి మిత్రులు కూడా కారు. అంత చనువూ లేదు వారి మధ్య.

నేను లాగిన్ కాగానే - నా రాక కోసం ఎదురుచూస్తున్న ఆ పెట్టిన మొదటి మూడు కామెంట్స్ లో ఒకతను ( మిగతా రెండూ స్నేహితురాళ్ళు పెట్టినవి ) చాట్ లోకి వచ్చేశాడు. " అన్నా..! ఆ కామెంట్స్ చూశావా? మీ రెస్పాన్స్ ఏమిటీ? మీ స్పందన కోసం ఆగాను. మీతో ఒకమాట చెప్పి, నేనే వాడికి సమాధానం చెప్పాలని అనుకుంటున్నా.. మీతో కాకుంటే నేనే వాడి కామెంట్స్ నా సమాధానాలతో ఎదురుక్కుంటాను.. " అన్నాడు.

నేను ఆలస్యం చేస్తే ఇది ముదిరి పెద్ద గొడవ అయ్యేలా ఉంది అనుకున్నాను.. ఆ స్టేటస్ మెస్సేజ్ పెట్టింది నేనే కాబట్టి ఏదో సర్దుబాటు చెయ్యాలి అనుకున్నా. " నేనే ప్రయత్నిస్తాను.. స్టేటస్ పెట్టింది నేను కదా.. నేనే ఆ సంగతి చూసుకుంటా. మధ్యలో మీరు కల్పించుకోకండి.." అతనితో అన్నాను. అతడు ఆవేశములో ఎలా మాట్లాడుతాడో తెలీదు. ఏదైనా తప్పుగా మాట్లాడితే - ఇద్దరికీ సర్దిచెప్పే ( తలనొప్పి ) బాధ్యత మళ్ళీ నాదే. అందుకని అలా చెప్పా.

ఐదో కామెంట్ గా నా సమాధానం పెడుతూ " # ( అతడి పేరు) : మీరు అలా పనీ పాట అనడం ఏమీ భావ్యముగా లేదు. వారు మీకేమీ స్నేహితులూ కారు. అంతగా అనే చనువూ మీ మధ్య లేదు. మీకు ఏదైనా అనాల్సి వస్తే నన్ను ఉద్దేశ్యిస్తూ వ్రాయండి. లేదా ఊరుకోండి. మీ కామెంట్ ని మీరు వెనక్కి తీసుకోండి. లేకుంటే నేనే ఆ కామెంట్ రిమూవ్ చేసి, మిమ్మల్ని దూరం పెట్టేవరకూ చూడకండి.. " అని చెప్పా.

అప్పుడు ఆన్లైన్ లోనే ఉన్నట్లున్నాడు. వెంటనే సమాధానం ఇచ్చాడు. పెట్టిన కామెంట్ నీ తీసేశాడు. మన్నించమని కోరాడు. ఎప్పటిలా స్నేహం కొనసాగించాను.

నిజానికి అప్పటి స్థితిలో - ఇతని కామెంట్ అలాగే ఉంచేస్తే - ఆ ముగ్గురూ దూరమయ్యేవారే. ఇలాంటి గొడవలు ఎదురవుతుంటాయి. జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాల్సి ఉంటుంది. 

Sunday, July 21, 2013

Good Morning - 401


నీ మానసిక ఆరోగ్యం గురించి, శారీరక అవసరాల గురించి, ఇతరులతో చెప్పుకొని, వారి సానుభూతి గురించి ప్రయత్నించకు. 

Saturday, July 20, 2013

Good Morning - 400


చాలామంది గెలుపంటే - రేపటి కోసం ఈరోజు కష్టపడటం అనుకుంటారు. కానీ రేపటి మరింత ఆనందం కోసం ఈరోజు ఆనందముగా పనిచెయ్యటం అని అనుకోరు. 

Friday, July 19, 2013

Good Morning - 399


నీ జీవిత స్క్రీన్ ప్లే వ్రాయటానికి నీ చుట్టూ చాలామంది ఉంటారు. వారికి ఆ అవకాశం ఇవ్వకు. 

అవును.. నీవు ఇలా చెయ్యాలి, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా ప్రవర్తించాలి.. అంటూ  మన చుట్టూ చాలామందే ఉంటారు. అలా కొద్దివరకూ సబబే అయినా, అంతా వారు చెప్పినట్లుగా మీరు చేస్తే, ఇక మీ ఆలోచనా శక్తి మెల్లమెల్లగా నిద్రాణమయిపోతుంది. అప్పుడు మీ చుట్టూ ఉన్నవారే చెప్పినట్లు, వారు తీసుకున్న నిర్ణయాలని మీరు పాటిస్తూ, వారు ఎలా నడుచుకోవాలో చెబితే అలాగే నడుచుకోవటం మీరు చేస్తారు. అలా చెయ్యటం - మీకు చాలా ప్రమాదకరం.

వారు చెప్పినట్లుగా చేస్తే - మంచిదే అయితే మీకు లాభమే, నెమ్మనెమ్మదిగా వారి మీద ఆధారపడటం జరుగుతుంది. అదే నష్టపోతే - ఇక్కడ మీరు కోల్పోయేది మీ అమూల్య జీవితం, కాలం, ధనం.. అన్నీ. అలాగే ఆలోచించే శక్తీ, మీ జీవితాన్ని మీరే ఎలా నడుపుకోవాలో తెలీని అశక్తతకి లోనవుతారు. అది మరింత ప్రమాదకరం. 

Thursday, July 18, 2013

Good Morning - 398


నా కవితకు ప్రేరణ నీవు, 
నా బొమ్మకు ప్రాణం నీవు, 
నా ఆలోచనల అలవి నీవు, 
నా కంటి తీయటి కలవి నీవు. 
నా జీవితానికి ఆశావు నీవు..

Wednesday, July 17, 2013

Good Morning - 397


నిజమైన నీ స్నేహితుడు ప్రతిక్షణం నీతో మాట్లాడక పోవచ్చును. 
నిన్ను చూడక పోవచ్చును. 
నీకు దూరమై పోవచ్చును. 
కానీ ప్రతిక్షణం నీ గురించే ఆలోచిస్తాడు. 

Tuesday, July 16, 2013

Good Morning - 396


గుండెల్లో దాగుండేది గుర్తుండిపోయే ప్రేమ. 
నా కళ్ళల్లో దాగుంది కనుమరుగవ్వని ప్రేమ..
మనసులో దాగుండేది మధురమైన ప్రేమ.
నా మనసులో దాగుండి నిజమైన ప్రేమ..!

Monday, July 15, 2013

Good Morning - 395


ప్రపంచమంతా బాంధవ్యాల పుట్ట. ఒక మనిషికి, ఇంకో మనిషితో ఎప్పుడు ముడిపడే ఉంటుంది.

Sunday, July 14, 2013

Good Morning - 394


ఖర్మని ఆచరించు, నీ బాధ్యతని నిర్వర్తించు. 

Saturday, July 13, 2013

Good Morning - 393


ఆశ కన్నా ఆశయం ముఖ్యమైనది. 


Friday, July 12, 2013

Good Morning - 392


కాలంతో బాటుగా ప్రేమ మారదు. 
ఒకవేళ అలా మారితే అది ప్రేమ కాదు.. 

Thursday, July 11, 2013

Good Morning - 391


నోటి మాట కన్నా - చేతి సాయం గొప్పది. 

Wednesday, July 10, 2013

Good Morning - 390

పువ్వు పుట్టింది తుమ్మెద కోసం, 
ఆకాశం పుట్టింది వెన్నెల కోసం, 
ఈ భూమి పుట్టింది ఆ సంద్రం కోసం, 
నేను పుట్టింది నీ స్నేహం కోసం.. 

Tuesday, July 9, 2013

Good Morning - 389


కొన్ని బంధాలు ఎక్కువకాలం ఉండాలని అనుకున్నా, ఉండలేవు. 

Monday, July 8, 2013

Good Morning - 388


అవని కన్నా అమ్మ గొప్పది. 

Sunday, July 7, 2013

Good Morning - 387


నిన్ను సంతోషపెట్టే వాళ్ళంతా మంచోళ్ళు కారు..
అలాగే నిన్ను బాధపెట్టే వాళ్లంతా చెడ్డవాళ్ళు కారు. 

Saturday, July 6, 2013

ఫేస్ బుక్ అకౌంట్ ఉంది.. లేదు లేదు..

మొన్న నా మిత్రుని అమ్మాయి ఫంక్షన్ కి వెళ్ళాను. ఆ ఫంక్షన్ కి అనుకోని కారణాల వల్ల కాస్త లేటుగా వెళ్లాల్సి వచ్చింది.. అప్పటికే ఆ కార్యక్రమం ముగిసింది. అప్పటికే భోజనం చేసేసి, కాస్త రిలాక్స్డ్ గా నా మరికొందరు మిత్రులు కూర్చున్నారు. వారిని చూడగానే - వెంటనే విష్ చేసి, బండి ఓ ప్రక్కగా పార్క్ చేసి, వారిని కలిశాను.

ఆత్మీయ కరచనాలు, పలకరింపులు అయ్యాక, మాటలు నడిచాయి. చాలారోజుల తరవాత కలసిన స్నేహ బృందం. మొత్తం నలుగురు. నేను ఐదో వ్యక్తిని. మాది హైస్కూల్ చదివినప్పటి అనుబంధం. అది ఇంటర్మీడియట్ వరకు సాగింది. ఆ తరవాత విడిపోయాం అంటే - అప్పుడప్పుడు కలిసేవాళ్ళం. గత పది పదిహేనేళ్ళుగా మాత్రం కలవటం మరీ అరుదయ్యింది. ఎవరి జీవితాన వారు బీజీ అవటం మూలాన అలా జరిగింది. (అలాని అనుకున్నాను)

మేమందరమూ ఒకే స్కూల్ లో చదవలేదు. వేరు వేరు స్కూల్స్ లలో చదివినా, మమ్మల్ని ఒక్కటిగా, స్నేహితులుగా దగ్గరకు చేసినది - క్రికెట్. 

మేమంతా ఒక జట్టుగా ఆడేవాళ్ళం. సాయంత్రం కాగానే ఆడేవాళ్ళం. ఇక ఆదివారాల్లో అయితే వేరే జట్లతో మ్యాచులు. ఈ ఒక్క క్రికెట్ యే కాకుండా ఫుట్ బాల్ కూడా ఆడేవాళ్ళం. ఈ క్రికెట్ టీం లో నాది ప్రముఖ స్థానం. నేనుంటేనే మ్యాచ్ అన్నంతగా ఆడేవాడిని. హాఫ్, లెగ్ స్పిన్, ఫాస్ట్ బౌలింగ్, బ్యాటింగ్, కీపింగ్ తో ఒక వెలుగు వెలిగాను. ఇంతగా టాలెంట్ ఉన్నా మా జట్టు మరియు నా ప్రతిభ లోకల్ వరకే పరిమితం అయ్యింది. అప్పట్లో జట్లు తక్కువే అనుకోండి. 

అప్పటి ఆ ఆటల ముచ్చట్లు, మిగిలిన ఆటగాళ్ల ఆట గురించి, మాట్లాడాం. చాలారోజులకి కలిశారు కదాని చిన్ననాటి స్నేహాల్లో ఉండే చనువుతో కాసింత (కుళ్ళు) జోకులూ, ఏరా సంభోధనలూ, అప్పుడు పిలుచుకున్న నిక్ నేమ్స్, కాసింత మరీ చనువుగా మాట్లాడుకున్నాం. చాలా చాలా కాలం తరవాత కలిశారు. చెప్పుకోవడానికి బోలెడన్ని మాటలు ఉన్నాయి మా మధ్య అనిపించింది. అలా సాగిపోతున్న మా మాటలకి నేనే అడ్డుకట్ట వేస్తూ " ముందుగా ఫంక్షన్ కి పిలిచిన మిత్రున్నీ, వారి కుటుంబాన్ని పలకరించి వస్తాను.. ఇప్పటికే ఆలస్యం అయ్యింది.." అని అన్నాను.. సరే అన్నారు. 

ఇప్పుడే వస్తానూ.. అంటూ ఆ మిత్రుల వద్ద తాత్కాలికముగా సెలవు తీసుకొని, నా కుటుంబముతో ఆహ్వానించిన మితృడి వద్దకి వెళ్ళాను. మరీ లేటుగా వెళ్ళాం అనుకుంటూ - నామిత్రున్ని కలిశాను. కాసింత ఆలస్యం అయ్యిందని కారణం చెప్పాను. ఫరవాలేదని తను అన్నాడు.

వారి అమ్మాయిని కలిశాం. ఆ ఫార్మాలిటీస్ అన్నీ అయ్యాక, భోజనానికి ఉపక్రమించాం. అవి అయ్యాక, మిత్రులని కలుద్దామని చూశాను. ఒకరు తప్ప మిగిలినవారు లేరు. అప్పటికే ఫంక్షన్ కి వచ్చిన దాదాపు ముప్ఫై మంది తప్ప అందరూ వెళ్ళిపోయారు. సన్నగా వర్షం పడుతున్నది అప్పుడు. హాస్చర్యం. ఏమిటీ ! ఇలా ? అనీ. వాళ్ళుంటే - మా ఫామిలీ ని పరిచయం చేద్దామని అనుకున్నాను.

మిగిలిన ఒక మిత్రుడికి పరిచయం చేసి, కాసేపు కబుర్లు అయ్యాక, అడిగాను - " వారేరీ రా!.." అనీ.. " ఇంకో ఫంక్షన్ ఉందని కార్ లో వెళ్ళిపోయారు.." అన్నాడు.

" మరి కనీసం కర్టెసీ కోసమైనా నాతో వెళుతున్నా అని చెప్పి వెళ్ళొచ్చు కదా.. నేను ఇప్పుడే వస్తాను ఆల్రెడీ ముందే చెప్పేసి, వెళ్లాను కదా.. రెండు నిమిషాల్లో చెప్పేసి, వెళ్ళిపోతే ఏమయ్యేది రా? అన్నాను. " అయినా వారు ఎలాగూ కార్ లో వెళ్ళుతున్నారు కదా! పైగా వర్షం కూడా మొదలయ్యింది కదా..! బస్ అంటే ఏదో అర్థం చేసుకోవచ్చును కదా! కానీ కాసేపు ఉండి, వెళ్ళొచ్చు కదా.. ఎలాగూ స్వంత కార్ నే కదా!.. ఇలా వచ్చేసి, ఒకమాట చెప్పేసి వెళితే బాగుండేది కదా.. నాకూ అదే దారిలో పని ఉంది. అందాక వారికి లిఫ్ట్ ఇచ్చినట్లు ఉంటుందీ అలాగే, కాసింత మాట్లాడుకున్నాం అన్నట్లుగా కూడా ఉండేది కదా..  చాలా సంవత్సరాల తరవాత కలిసి కూడా ఏమీ మాట్లాడకుండా ఇలా వెళ్ళిపోతే నేనేమని అనుకోవాలి. వాళ్ళు మారిపోయారు - హోదా, డబ్బు, అంతస్థు, ఆస్తులు.. ఇవి చూసే మాట్లాడే పరిస్థితికి మారినట్లున్నారు. వారు అలా మారితే ఏం చేస్తాం. మనమూ దూరమవటం తప్ప.. అయినా ఫ్రెండ్షిప్ లో అవేవీ అవసరం రావు కదా.. స్నేహం ముఖ్యం కదా.. " అన్నాను.

ఇలా మాట్లాడిన మితృడిదీ అదే వరుస. ఒకసారి కనిపిస్తే - నా అకౌంట్ కి ఆడ్ రిక్వెస్ట్ పెట్టు.. అని ప్రొఫైల్ అడ్రెస్ ఇచ్చాను. టైపింగ్ లో ప్రాబ్లెం రాకూడదని టైపు చేసిచ్చా. అయినా ఇంతవరకూ రిక్వెస్ట్ లేదు.

ఈసారి కనిపిస్తే - అడిగా. లేదు రా అకౌంట్ కావాలంటే ఇప్పటికిప్పుడు నీకోసం అకౌంట్ ని పావుగంటలో క్రియేట్ చేసి ఇస్తాను.. అన్నాడు. " సరే మరి లేకుంటే పోనీలేరా!.. చాలారోజులకి కలిశాం. ఒక ఫోటో దిగుదాం.." అని మొబైల్ కెమరా ఓపెన్ చేశా. ఒక ఫోటో దిగాను. దేనికీ అన్నాడు.. నా ఫేస్ బుక్ లో నా మితృలకి పెట్టేసుకుంటాను.. అని చెప్పా. తనూ తన కెమరాతో ఫోటో తీసుకున్నాడు.

" నీకెందుకురా.." అని యధాలాపముగా అడిగా.

నా ఫేస్ బుక్ అకౌంట్ లోన పెట్టుకుంటా అన్నాడు. షాక్ అయ్యా.. ఇందాకనేమో అకౌంట్ యే లేదు అన్నవాడు - ఐదు నిముషాలు కాకముందే ఇలా అనడం హాశ్చర్యానికి గురి అయ్యాను. నామీద నాకే తెలీని జాలి కలిగింది. అతను నా చిన్నప్పటి అంటే " అ ఆ ఇ ఈ.. " ల నుండీ నా క్లాస్మేట్. కాసేపట్లో సర్దుకున్నాను. మామూలుగానే ఉండి, ఫెస్బూక్ గురించి కొన్ని విషయాలు ( తనకి ఆన్లైన్ ఎంత పరిచయం ఉందొ తెలుసుకోవాలని ) మాట్లాడాను..

" ఒక మిత్రుని భవనం xxxxxxx అనే క్లాస్మేట్ వాడి ప్రొఫైల్ కనిపించటం లేదు. అది దొరకబట్టాలి.. వాడిది ఒక్కటి దొరికితే అందరిదీ దొరికేసినట్లే.." అన్నాడు. మరి నాదీ ? అడగాలనిపించింది. కనిపించినా కనిపించనట్లే ఊరుకున్నావు అని మనసులో అనుకున్నాను. అతడి అకౌంట్ ఎలా దొరబట్టాలో నాకు తెలిసిన పద్ధతులు చెప్పాను. ఆ పద్ధతులు అతనికి తెలీవు అంట.

ఒకస్థాయికి వచ్చాక మిత్రులని ఎలా మరచిపోతారో చూడండి. దగ్గరికి రానీవ్వరు. గోరింటాకులా వాడుకోవాలని చూస్తారు అనుకున్నాను. నేను మాత్రం పాజిటివ్ గా తీసుకున్నాను. ఇంకా నమ్మేసి, అలా గుడ్డిగా స్నేహం కొనసాగించే బదులు, తనే యే మూడ్ లోనో ఉండి, అలా మాట్లాడి, నా కళ్ళు తెరిపించేశాడు అనుకొని సంతోషించాను. దేవుడు నాకు మేలే చేశాడు.

ఫంక్షన్ నుండి ఇంటికి వచ్చాక అతడి ప్రొఫైల్ వెదికాను. దొరకలేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కుదరలేదు. చప్పున గుర్తుకు వచ్చింది. అతడి ఫోన్ నెంబర్ నా సెల్ ఫోన్ లో ఫీడ్ చేసి ఇమ్మని ఫోన్ ఇచ్చినప్పుడు, తన నెంబర్ ఫీడ్ చేసి ఇచ్చాడు. అప్పుడు యే పేరు వ్రాశాడో అనుకుంటూ - ఆ ఫీడ్ చేసిన పేరు టైపు చేసి, సెర్చ్ చేస్తే దొరికింది. మొత్తం ప్రొఫైల్ - తన స్నేహితులకి మాత్రమే కనిపించేలా సెట్టింగ్స్ పెట్టుకున్నాడు. అది తన ఇష్టమే అనుకోండి. తనకి చెప్పాలని ఇష్టం లేనప్పుడు మనం ఎందుకు దగ్గరవ్వాలని ప్రయత్నించడం..?

తరవాత కాసేపు బాధపడి - నా రొటీన్ లైఫ్ లోకి మారిపోయాను.


నిజమే కదూ.. 

Friday, July 5, 2013

Good Morning - 386


గతాన్ని మరచిపోకు..
అలాని గతం లోనే ఉండిపోకు.. 

Thursday, July 4, 2013

Good Morning - 385


అవని కన్నాఅమ్మ గొప్పది. 

Wednesday, July 3, 2013

Good Morning - 384


తల ఎత్తి జీవించు - నిన్ను నీవు ప్రేమించు. 

Tuesday, July 2, 2013

ఏకశిలా సందర్శన

వరంగల్  కోటలో ఉన్న ఏకశిలా పర్వతానికి ( Ekashila ) వెళ్లాను. చాలా పెద్దదైన కొండ అది. ఒకే ఒక శిల అంత పెద్దగా ఉండటం నేను అదే తొలిసారిగా చూశాను. పైకే అంతగా ఉండి అంటే - ఇంకా భూమిలో కూరుకపోయింది ఎంతగా ఉందొ తెలీదు. పైగా ఆ శిల దాదాపుగా సగం కోడి గ్రుడ్డు ఆకారములో కనిపిస్తుంది. 

వరంగల్ కోటలో ఉన్న పార్క్ లోనికి వెళ్ళాలి. అందులో ఉన్న చెరువు ప్రక్కన ఈ ఏకశిల పర్వతం ఉంటుంది. పైకి వెళ్ళటానికి మెట్లు సరిగ్గా ఉండవు. ఆ కొండని తొలచి, మెట్లు ఏర్పరిచారు. చుట్టూ చూడలేదు. కానీ మెట్లు ఉండి ఉంటాయి. మేము పైకి ఎక్కిన వైపు నుండి మెట్లు సరిగ్గా ఉండవు. సంబంధిత అధికారులు కాసింత శ్రద్ధ తీసుకోవాలి ఈ విషయం లో. ఏదో ఉన్నాయా అంటే ఉన్నాయి అన్నట్లుగా మెట్లు మీద సగం పాదం పట్టేటంతగా ఉంది. ఒక మంచి పని చేశారు అంటే ప్రక్కన ఇనుప పైపులతో బారికేడ్ ఏర్పాటు చేశారు. అందులకు సంతోషించాల్సిందే.. వాటి సహాయాన ఆ గుట్ట మీదకి వెళ్లాను. 



దూరముగా ఉన్న పార్క్ నుండి చూస్తే - ఇలా కనిపిస్తుంది. 


ఆ కొండపైకి వెళ్ళటానికి ఏర్పాటు చేసిన మెట్లు. ఇనుప బారికేడ్స్. 


కొండపైన ఉండే ప్రహరా చేసే భవనం దీనిపైకి లోపల ఉన్న మెట్ల మీదుగా వెళ్ళొచ్చును. 


రాత్రిపూట వేలుగుకోసం ఏర్పాటు చేసిన మెర్క్యూరీ లైట్స్..


వాచింగ్ టవర్. 


ఆ కొండ మీద ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్స్
ఉద్యానవనం గుండా ఆ కొండ మీదకి వెళ్లేందుకు దారి. 


ఆ కొండ మీద ఏర్పాటు చేసిన బారికేడ్స్. 


ఆ కొండ మీద నుండి కనబడే పార్క్ లోని చెరువు. 


ఆ కొండ మీద నుండి కనబడే పార్క్ లోని చెరువు. 


Monday, July 1, 2013

Good Morning - 383


లోపం ఎక్కడ ఉందో తెలుసుకో, నీవు జాగ్రత్తగా మసలుకో..

Related Posts with Thumbnails