Tuesday, April 30, 2013

Good morning - 339


సహాయం కోసం అడగటం బలహీనత కాదు.. బలం గా భావించాలి. 

జీవన యాత్రలో మనకి ఎదురయ్యే విపత్కర పరిస్థితుల సమయాల్లో గానీ, అనుకోని పరిస్థితుల్లో గానీ, క్రొత్త విషయాలప్పుడు గానీ, క్రొత్తగా తెలుసుకుంటున్నప్పుడు.. ఇతరులని సహాయం అడుగుతాం. అలా అడగటం నామోషీగా, ఇబ్బందికరంగా భావించకూడదు. తెలీని విషయాలని అడిగి తెలుసుకోవటములో తప్పేమీ కాదు. అలా చెయ్యటం ఎప్పుడైనా, ఎక్కడైనా అది సమ్మతమే. " సమయం ఎంత అయ్యింది?.. " అన్న చిన్న విషయం నుండి, " ప్లీజ్! ఇక్కడ చావు బ్రతుకుల్లో ఉన్నాను.. కాస్త సహాయం చెయ్యరూ.. మీరు చెయ్యలేకుంటే - నేను మరణించడం ఖాయం.." అన్న పరిస్థితుల్లో వరకూ ఇతరుల సహాయం తప్పదు. ఎందుకంటే - అన్నింటికన్నా ముఖ్య విషయం - మనిషి సంఘ జీవి. తోటి మానవుల ప్రభావం చాలా ఉంటుంది. ఇతరుల సహాయం తీసుకొనని వారి జీవితాల కన్నా - ఇతరుల సహాయం తీసుకున్న వారి జీవితాలే చాలా అభివృద్ధి చెంది ఉంటాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం. 

Monday, April 29, 2013

Good Morning - 338


జీవితం అప్పుడపుడు రెండోసారి బ్రతికే అవకాశం ఇస్తుంది. 

జీవితాన ఒక్కోసారి అన్నీ కోల్పోతాం.. ఆ సమయాన ఏదీ మనకి కలసిరాదు. నిరాశా నిస్పృహలు వెంటాడుతాయి. మనవాళ్ళు అనుకున్నవారు దూరం అవుతారు. మన కళ్ళకెదురుగా ఉన్న దారులన్నీ మూసుకపోయినట్లు ఆ సమయములో భావిస్తాం. అప్పుడే - ఈ జీవితం ఎందుకూ అనిపిస్తుంది. అవన్నీ జీవనములో భాగముగా తీసుకోము. ఎవరికీ లేని బాధలు మనల్ని చుట్టుముట్టాయని అనుకుంటాము. దాని ఫలితముగా - బలహీన క్షణములో ఆత్మహత్యలకి ప్రేరేపించుకుంటాం. ఆవన్నీ కాకుంటే - ఏదో అనుకోని ప్రమాదములోకి నెట్టివేయబడతాము. సరిగ్గా అప్పుడే - ఇంకా ఈ లోకములో మనకి చెయ్యాల్సిన పాత్ర మిగిలిపోయిందనో, నూకలు మిగిలున్నాయనో, అదృష్టం బాగుండో.. మనం బ్రతికే అవకాశం వస్తుంది. అప్పుడే అనుకోవాలి. మన ప్రయత్నం ఆ దేవుడికే నచ్చలేదు. బ్రతికి మనం సాధించాల్సింది చాలా----నే ఉంది.. అని నిర్ణయించుకోవాలి. 

Sunday, April 28, 2013

Good Morning - 337


సాధన + సాధన = విజయం. 

సాధన చేస్తే మనం అనుకున్నది సాధించగలం. రెట్టింపుగా సాధన చేస్తే విజయాన్ని పొందగలం. 

Saturday, April 27, 2013

Good Morning - 336


మన లక్ష్యాలు ఉన్నతమైనవి. కానీ వాటిని సాధించడానికి అనుసరించే మార్గాల్లోనే లోపముంది. 

Friday, April 26, 2013

Soul mate friend - 2

(ప్రాణ) స్నేహితుడు ఎలా ఉండాలీ అంటే : 

Soul mate friend 1  కి కొనసాగింపు..

స్నేహితుడు అనేవారు మీ వయస్సు వారో, మీ కాలనీ వారో అని కాదు.. స్నేహితుడుకీ, మనకీ మధ్య ఎటువంటి లింగ భేదాలు చూడవద్దు. అదొక పవిత్రమైన భావన. చేసేది ఆడస్నేహమా, మగవారి స్నేహమా అని కాదు. మీరు స్నేహానికి చూపే ఆసక్తి, చేసే పనులని, ఇచ్చే విలువని బట్టి స్నేహం అనేది నిలుస్తుంది.

స్నేహితుడు తమ వయస్సు వాడై ఉండాలని రూలేమీ లేదు. స్నేహం అనేది వయస్సు వల్ల కాస్త చనువుగా పలరించుకుంటామేమో గానీ, వయస్సు అనే విషయం మీద స్నేహం కొనసాగదు. మీ హృదయం ఎంత విశాలముగా తెరచి ఉంచారు అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక పిల్లాడికీ, నాలుగిళ్ళ అవతల ఉన్న రిటైర్మెంట్ ముసలాయనకీ స్నేహం చక్కగా కుదరవచ్చును. వారి పలకరింపులు ఆప్యాయతతో, మమతానురాగాలతో ఉంటుంది. అంటే వయస్సు అడ్డమేమీ కాదు అన్నమాట.

స్నేహం అనేది ఉన్నవారు, లేనివారు అంటూ తారతమ్యాలని పట్టించుకోదు. ఆ స్నేహములో ఏ ఒక్కరైనా ఆర్థిక సంబంధాలను ఆశించి, స్నేహం మొదలెట్టారు అనుకోండి. రెండోవారు ఆ మొదటివారి ఉద్దేశ్యము తెలుసుకోకుండా స్నేహం చేసి, ఆ స్నేహమే గొప్పనైనది, కలకాలం నిలిచి ఉండేది అని భావిస్తే - అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు.

ప్పుడైతే స్నేహములో డబ్బు విషయం వచ్చిందే అనుకోండి. ఆ విషయాన్ని స్నేహంలోన అస్సలుకే తీసుక రావొద్దు. ఎప్పుడైతే అలా డబ్బు ప్రస్తావన వచ్చిందే అనుకోండి. ఇక ఆ స్నేహానికి బీటలు మొదలయ్యాయి అన్నమాటే..

స్నేహితుల వద్ద ఎన్నడూ డబ్బు చేబదులు / వస్తు చేబదులు అన్నమాటే రాకూడదు. ఒకవేళ అడగాల్సి వచ్చినా, మన చుట్టుప్రక్కల వారినందరినీ అడిగాక, వారు కాదన్నాకే - చివరి ప్రయత్నముగా వీరిని అడగాలి. వీరు సాయము చేస్తే - ఆ తరవాత మీకు డబ్బు వస్తే - మొదటగా అప్పు తీర్చాల్సింది వీరికే. ముందుగా వీరి నుండి రుణ విముక్తులు అవ్వండి. ఆ తరవాతే మిగతావారి అప్పు తీర్చండి. ఆ తీర్చేది చాలా త్వరగా, వారు మనల్ని అడగక ముందే తీర్చేయ్యాలి. ఇచ్చే వారి మొత్తం కూడా అణా పైసలతో సహా ఇవ్వండి. ఇక్కడొక చిన్న సూచన : వారికివ్వాల్సిన బాకీ తో బాటూ - కొసరుగా వారికి ఏదైనా ఇష్టమైనది ఇవ్వండి. అసలు కన్నా ఈ కొసరే మీ స్నేహ బాంధవ్యాన్ని బలోపేతం చేస్తుంది.

స్నేహితుల సామాజిక వర్గాలు, హోదాల్ని స్నేహములో ఎన్నడూ చూడకండి. అలా చూసిననాడు ఇక స్నేహం వీగిపోవటానికి బీటలు పడటం మొదలయ్యిందన్న మాట. కానీ నేడు అన్నీ ఇలా చూసి మొదలయ్యేవి ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే స్నేహం దాకా రాక ముందే వీగిపోతున్నాయి. అంటే పరిచయాల వద్దే ఆగిపోతున్నాయి. ఒకవేళ దాటి ముందుకు వచ్చినా - అందులో నటన తప్ప మరేమీ ఉండటం లేదు.

మీ స్నేహితుడు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలీ అనుకోవడం మూర్ఖత్వం. వారికీ పర్సనల్ లైఫ్ అంటూ అంటూ ఉంటుంది కదా.. కాసింత వెసులుబాటు ఉన్నప్పుడు, వెసులుబాటు చేసుకొని మరీ సహాయం చేసేలా ఉండాలి.

దైనా సహాయం అడగటం, అదీ తన శక్తికి తగినట్లుగా ఉండాలి. తనతో కాని పనిని అప్పగించటం అంత మంచిది కాదు. అలా చేసి, ఆ పని కానప్పుడు మనసులో ఏర్పడేనిరాశ వల్ల అవతలివారి మీద అయిష్టత మొదలవుతుంది. ఇక ఆ స్నేహం దెబ్బ తినటం మొదలవుతుంది. అందుకే స్నేహితుల నుండి సహాయం ఆశించవద్దు.

స్నేహితుల వద్ద నుండి యే సహాయం ఆశించవద్దు. మనకు తెలిసినవారి వద్ద నుండి, బయటవారి నుండి గానీ - ఆ పని కాకపోతే, చివరి ప్రయత్నముగా స్నేహితుల వద్దకి వెళ్ళాలి. ప్రతిదానికీ స్నేహితుల మీద ఆధారపడితే పైకి చెప్పరు గానీ, మీ మీద అయిష్టత పెంచుకుంటారు. అలా నెమ్మనెమ్మదిగా దూరం అవుతారు.

- మరిన్ని మరో సారి చెప్పుకుందాం..

Thursday, April 25, 2013

Good Morning - 335


మరచిపోవటానికి ప్రేమ జ్ఞాపకం కాదు జీవితం..

Wednesday, April 24, 2013

బైక్ సైడ్ స్టాండ్ సమస్య

నా బైక్ ని సైడ్ స్టాండ్ వేసినప్పుడల్లా వంగటం మొదలెట్టింది. అంటే బాగా యాంగిల్ లో ఒక వైపు వంగినట్లు కనిపించేది. చదునుగా ఉన్న స్థలములోనే చూస్తేనే అలా బాగా వంగినట్లు కనిపించేది. ఇక కొద్ది వాలు ఉన్న స్థలములో సైడ్ స్టాండ్ వేసి, పార్క్ చేస్తే ఇక మరీ వంగినట్లు, మరోవైపునుండి ఎవరైనా కొద్దిగా నెడితే - ఆ బైక్ పడిపోయేలా తయారయ్యింది. వెళ్ళిన ప్రతిచోటా సరిగ్గా చదును ఉన్న స్థలాలని ఎక్కడ వెదకను? రాను రాను ఆ సమస్య మరీ ఎక్కువ కాసాగింది.

సైడ్ స్టాండ్ అంటే ఇదుగో ఇదే - ఇది నా బండిది కాదు.. గూగుల్ ఇమేజెస్ నుండి సేకరించాను.


ఇక లాభం లేదని మొన్న వీలు చేసుకొని మెకానిక్ దగ్గరికి నా బైక్ ని తీసుకెళ్ళాను. నా బైక్ సైడ్ స్టాండ్ కి ఉన్న సమస్య ఏమిటో చెప్పాను. అది అంతే అంట. ఆ సైడ్ స్టాండ్ యొక్క నేలని తాకే భాగానికి - ఎంత ఎత్తు కావాలంటే అంత ఎత్తు ఒక ఇనుప ముక్కని  వెల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పాడు. అది బయట వెల్డింగ్ షాపులలో చేయించాలి అన్నాడు.

దానికి నేను అన్నాను - ఆ స్టాండ్ ని విప్పేసి, లోపల అరిగిన చోట ఒక ప్లేట్ వాచర్ వేసి బిగిస్తే - ఆ స్టాండ్ కి ఉన్న ప్లే ( కొద్దిగా అటూ ఇటూ ఊగటం / వదులుగా ఉండటం) పోతుంది కదా అన్నాను. అలా చేయటం వలన తక్కువ ఖర్చులో పని అయిపోతుందని నా ఆలోచన. కానీ ఆ మెకానిక్ అలా కుదరదు అన్నాడు. సెకండ్ ఒపీనీయన్ అన్నట్లు ఇంకో మెకానిక్ వద్ద చూపాను. అదే సమాధానం. ఇక ఆఖరుగా ముచ్చటగా మూడో మెకానిక్ ని సంప్రదిస్తే - అక్కడా అంతే! వెల్డింగ్ తప్పదు అంట. నేను చెప్పినట్లు చెయ్యటం కుదరదు అన్నారు.

పోనీ - వారు చెప్పినట్లు వెల్డింగ్ చేయిద్దామని అనుకున్నా - దానివల్ల నా బండి " లుక్ " పోతుంది. ఏదో రిపేర్ బండిలా అసహ్యముగా కనిపిస్తుంది. అదే నా బాధ. అందుకే అంతగా ప్రయత్నాలు. కానీ నా మనసుకి మాత్రం ఏదో ఎక్కడో చిన్నగా లోపం ఉంది. దాన్ని దొరకపుచ్చుకుంటే ఈ సమస్య ఖచ్చితముగా తొలగిపోతుంది  అని అనిపిస్తుంది. అది చాలా రోజులుగా వెంటాడింది. ఎంతగా ఆలోచించినా సమస్యకి సమాధానం దొరకలేదు. కారణం అస్సలు ఆ స్టాండ్ అంటే ఏమిటో, దాని మెకానిజం ఏమిటో తెలీదు. చూడటానికి చాలా మామూలుగా స్టాండ్ మెకానిజం ఉన్నా కొద్దిగా క్లిష్టమైన సాంకేతికత. అస్సలు కారణం ఏమిటో తెలీదు. ముగ్గురు మెకానిక్ లూ ఒకే సమాధానం చెప్పటం వలన నిజముగానే వీలు కాదేమో అనుకున్నాను.

పోయిన ఆదివారాన కాసింత సమయం చిక్కితే, బండి శుభ్రం చేస్తున్నప్పుడు - ఈ సైడ్ స్టాండ్ సంగతి గుర్తుకవచ్చి, బాగుచేసుకోవాలనిపించింది. నాతో అయ్యేపనిలా అనిపించింది. అలాని నా మనసాక్షి చెప్పింది. ఒకసారి ఆ స్టాండ్ రిపేర్ చేస్తున్నప్పుడు కేవలం చూశాను. అది గుర్తుకు తెచ్చేసుకున్నాను.

ముందుగా స్ప్రింగ్ ని కటింగ్ ప్లేయర్ ని వాడి,  బైండింగ్ వైర్ సహాయాన ని ఊడదీశాను. ఆ తరవాత బోల్ట్ ని సెట్ పానా సహాయాన విప్పేశాను. ఇప్పుడు కిరసనాయిల్ + పాత పళ్ళ బ్రష్షు + పాత బట్ట సహాయముతో వాటికి ఉన్న జిడ్డు, ఆయిల్, దుమ్ము, ధూళి.. తీసేశాను. ఇప్పుడు క్రొత్తదానిలా కనిపించింది.


ఆ తరవాత వాటన్నింటినీ పరిశీలనగా చూశాను. అప్పుడు సమస్య ఏమిటో అర్థం అయ్యింది. దాదాపు అంగుళంన్నర సైజులో ఉండే బోల్ట్ వద్ద ప్రాబ్లెం. ఆ బోల్ట్ మధ్యలో స్టాండ్ పట్టీ తాకేచోట బాగా అరిగిపోయింది. అరిగింది మహా అంటే 2 - 3 mm ఉండొచ్చును కానీ అది ఎంత ఇబ్బంది పెట్టిందో చూశారు కదా.. అది మారిస్తే సమస్య పోతుంది అనుకున్నాను. ఆరోజు ఆదివారం కనుక షాప్స్ అన్నీ బంద్. 


ఇక మరుసటిరోజున ఉదయాన షాప్స్ తెరిచాక - అలాంటి బోల్ట్ ఒకటి కొనేసి, ఆ సైడ్ స్టాండ్ కి అమర్చాను. ఆ తరవాత స్ప్రింగ్ పెట్టేశాను. అంతే! క్రొత్త స్టాండ్ పనితీరు ఏ విధముగా ఉంటుందో - అచ్చు అదే విధముగా ఇదీ ఉంది. క్రొత్త స్టాండ్ యాంగిల్ లోనే స్టాండ్ ఉంటున్నది. ప్లే అంటూ ఏమీ లేదు. కేవలం ఎనిమిది రూపాయల్లో సమస్య తీరింది. నా బైక్ లుక్ కీ ఏమాత్రం తేడా రాలేదు కదా.. ఇంకా క్రొత్త లుక్ వచ్చేసింది.  ముగ్గురు మెకానిక్ ల వల్ల కానిది నా వల్ల అయ్యింది. మీ బండికీ ఇలాంటి సైడ్ స్టాండ్ సమస్య ఎదురయితే - ఇలాగే చెయ్యండి.  

Tuesday, April 23, 2013

Good Morning - 334


పగిలిన అద్దం అతికించడం సులభమేమో కానీ, భగ్న ప్రేమ హృదయాలని ఓదార్చటం మాత్రం చాలా కష్టం. 

Monday, April 22, 2013

Good Morning - 333


మితిమీరిన తర్కం అహాన్ని పెంచుతుంది. 

Sunday, April 21, 2013

Good Morning - 332


ప్రేరేపణను ఎప్పుడు అణచుకోకు. అన్ని విషయాలను నిర్ధారించుకో. ఏది మంచి అయితే దాన్ని త్వరగా అందుకో.. 

Saturday, April 20, 2013

Good Morning - 331


ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది. 

Friday, April 19, 2013

Good Morning - 330


మన లోపాలను మనం తెలుసుకోవడం అన్నింటికన్నా పెద్ద చదువు. 

Thursday, April 18, 2013

Good Morning - 329


మనలో - అహంకారం వంటి ఎన్నో స్వతంత్ర శక్తులున్నాయి. అది సైతాన్ కి ప్రతినిధి, మనిషికి ప్రధాన శత్రువు. 

అవును కదా.. అహంకారం, వదరుబోతుతనం, మదం, మాత్సర్యం, కోపం, వెటకారం, తాపం, అహంభావం.. వంటి ఎన్నెన్నో శక్తులు మనలో ఉన్నాయి. అవన్నీ చెడుకి ప్రతినిధులు.  అవన్నీ మనిషికి ప్రధాన శత్రువులే. వాటిని మన మీద ప్రభావం చూపించేలా వాటికి అధికారం ఇస్తే - అవి మనల్ని నిలువునా ముంచేస్తాయి. వాటివలన మన దగ్గర ఏదో ఉన్నదాన్ని - అది పొందేదాకా మనల్ని ప్రాకులాడేవాళ్ళు తప్ప మనకంటూ ఎవరూ మిగలరు. ఫలితముగా మనం ఒంటరిగా మిగిలిపోతాం. కావున తస్మాత్ జాగ్రత్త. 


Wednesday, April 17, 2013

Birthday - 2013

నిన్ననే నా పుట్టినరోజు బాగా జరుపుకున్నాను. ఆ విశేషాలు ఈరోజు మీకోసం.

నిజానికి పుట్టినరోజులు జరుపుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇష్టం ఉండదు కూడా.. మనమేమి సాధించామని ఇదంతా.. అని అనిపిస్తుంది. కానీ మనవాళ్ళ సంతోషం కోసం మాత్రం తప్పదు కదా.. వద్దన్నా మరీ పట్టుబట్టి శ్రీమతి చేస్తే, తప్పదు కదా! ఆత్మీయుల సమక్షములో బుద్దిగా అలా కూర్చొని, కేకు కోసి ఒక ముక్క తినిపించి, తినిపించుకోవడం అంతా సంతోషముగా ఉంటుంది.

ఒకరోజు ముందు వరకూ - నాకు ఈసారి పుట్టినరోజు జరుపుకోవడానికి ఇష్టం లేదు. ఇష్టమైన వారు కొద్దిమంది దూరమయ్యారు. వారి జ్ఞాపకాల వల్ల మరియు వారి విషెస్ ఉండవు అన్న కారణం వల్ల అలాని నిర్ణయం తీసుకున్నాను కానీ, నేనున్నాను అంటూ నాలోని నిర్లిప్తతని దూరం చెయ్యటానికి మా ఆవిడ పూనుకుంది. ముందురోజే తన డబ్బులని ఖర్చు చేసి, ఉన్నంతలో అన్నీ సిద్ధం చేసింది. తనకోసం అయినా మూడ్ మార్చుకొని, జరుపుకోవటానికి డిసైడ్ అయ్యాను. ముందు రోజు నాకొక డ్రెస్, జాగింగ్ షూస్, రెండు కాడ్ బరీ చాక్లెట్స్ బాక్స్ ని నా పుట్టినరోజుకి చిరుకానుకగా ఇచ్చింది. ఇవన్నీ అవసరమా? అంటే " నీలో  సంతోషం కోసం.." అని ముందరి కాళ్ళకు బంధం.. ఎదుటివారిలో సంతోషం కోసం తను చేసే ప్రయత్నానికి తలొగ్గక తప్పలేదు. తనకి ధన్యవాదములు.

ఆరోజు రాత్రే సరిగ్గా పన్నెండు గంటలకి నా పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఏదో తెలీని పులకింత. మదిలో ఏదో తెలీని ఉత్సాహం. ఇక అప్పుడే ఫోన్ కాల్స్, మెస్సేజెస్ మొదలయ్యాయి. అవన్నీ అయ్యేసరికి అర్థరాత్రి ఒంటిగంట అయ్యింది.

ప్రొద్దున్నే క్రొత్త షూస్ వేసుకొని, జాగింగ్ కి వెళ్ళాం. అక్కడ ఉన్న వారందరికీ, వాకింగ్ చేస్తున్నవారికీ,  ఆడుకుంటున్న ఫుట్ బాల్ టీం వారికీ  ( దాదాపు 60+ మంది ) ఆ కాడ్ బరీ Cadbury చాకొలేట్స్ బార్స్ ఇచ్చాను. దేనికీ అడిగారు. పుట్టినరోజు సందర్భం అని చెప్పా.. ప్రతిగా వారు విష్ చేసి, షేక్ హ్యాండ్ ఇచ్చారు. కొద్దిమంది హాయిగా తీసుకున్నారు.. కానీ ఏమీ అనలేదు. ప్చ్! పోనీలెండి. వారిదేమీ తప్పులేదు. అలా ప్రతిగా చెప్పాలి అన్న విషయం వారికి లేదేమో. వారందరికీ - ఇలా తీసుకోవటం సరిక్రొత్త అనుభవం అంట. ఈ కాన్సెప్ట్ బాగుంది. ఇక మా పుట్టినరోజునాడు ఇలా చేసుకుంటాం.. అని ఒకరిద్దరు అన్నారు.

ఆ తరవాత మా చుట్టుప్రక్కల వారికీ ఇచ్చాను. ఆతరవాత దైవ దర్శనం కోసం గుడికీ, ఆతరవాత దైనందిక కార్యక్రమాలూ.. హ్మ్. మధ్యలో నాకోసం చేసిన పాయసం, చికెన్ బిర్యానీ ఆరగింపులూ.. భుక్తాయాసముతో కునికిపాట్లూ.. మొత్తానికి మళ్ళీ రాత్రి ఒంటిగంట వరకూ చాలా బీజీ. మచ్చిన మెయిల్స్, SMS, మెస్సేజెస్ కి కృతజ్ఞతలు చెబుతూ ప్రతిజవాబు ఇచ్చాను. నా జీవితాన ఆనందకరముగా, మరపురాని అనుభూతిని ఇచ్చిన రెండో  పుట్టినరోజు ఇది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే - నిర్లిప్తత నుండి సంతోషకరమైన మధురానుభూతుల వరకూ నా ప్రయాణం సాగింది. అందరికీ ధన్యవాదములు. ప్రత్యేకముగా మా శ్రీమతికి.







Good Morning - 328



Monday, April 15, 2013

Good Morning - 327


మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చు.. కానీ - ఏ పనీ చెయ్యకుండా ఆనందాన్ని పొందలేము. 

Sunday, April 14, 2013

Good Morning - 326


ఎప్పుడు మనం వెళ్లి సహాయం చేయాలనుకోవాలి.. వాళ్ళు వచ్చి అడగాలనుకుంటే అది సహాయం కాదు. 

Saturday, April 13, 2013

Good Morning - 325


అన్నింటినీ అర్థం చేసుకోవడమే జీవితం.

Thursday, April 11, 2013

Good Morning - 324


తన సమర్థత పై నమ్మకం, విశ్వాసం ఉన్న వ్యక్తికి ఓటమి లేదు. విజయమెప్పుడు వెన్నంటే ఉంటుంది. 

Wednesday, April 10, 2013

Good Morning - 323


ఎంత గొప్ప లక్ష్యమైనా నిజాయితీ, స్వచ్ఛత లేకుండా సాకారమైతే అపరాధ భావానికి గురిచేస్తుంది. 

Good Morning - 322


నువ్వు దేనినైతే " నేను " అనుకుంటున్నావో ముందు దాని సంగతి పూర్తిగా తెలుసుకో.. 

Tuesday, April 9, 2013

Good Morning - 321


జీవితానికి ఏకాంతం చాలా ఉపయోగపడుతుంది. అయితే ఒంటరిగా జీవించకూడదు. 

Monday, April 8, 2013

Good Morning - 320


జీవితం ఓ పజిల్ లాంటిది. 
ఈరోజు నువ్వు ఏదైనా పోగొట్టుకుంటే, ఏదో ఒకరోజు దాన్ని మళ్ళీ వెతికి పట్టుకోగలవు. 

అవును కదా.. మన జీవితాన అనుకొని పరిస్థితుల్లో కొన్ని పోగొట్టుకుంటాం. అవి తిరిగి పొందలేము అని అనుకుంటాం. మన జీవితాన ముందుకు వచ్చాక, ఏదో ఒకరోజున దాన్ని అదేరూపములో గానీ, వేరే ఒక రూపములో గానీ తిరిగి పొందుతాం. 

Good Morning - 319


మన వ్యక్తిత్వమే మన ప్రత్యేకత. 

Saturday, April 6, 2013

Good Morning - 318


ఉన్నవాటితో ఏం చెయ్యాలో తెలియదు కానీ.. లేని వాటికోసం ఎప్పుడూ ఆరాటం ఆగదు. 

అవును కదూ.. మన దగ్గర ఎన్నో ఉంటాయి. వాటితోనే సరిగా పనులు నిర్వర్తించం. కానీ వేరే వాటి కోసం ప్రాకులాడుతాం. ఈ విషయం చాలా విషయాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే - మొబైల్ ఫోన్. అందులోని ఫీచర్స్ ఏవేమిటో, ఎందుకున్నాయో, వాటిని ఎలా వాడుకోవచ్చో తెలుసుకోం గానీ మార్కెట్ లోకి మరొకటి క్రొత్తది రాగానే దానికోసం ప్రాకులాడుతాం. 


Friday, April 5, 2013

Good Morning - 317


కోపములో మాటలు తూలి ఇతరులని దూరం చేసుకునే దానికన్నా - క్షమించి దగ్గర చేసుకుంటే మీ శత్రువులు తగ్గుతారు. మీరు హాయిగా ఉంటారు. 

ఆవేశాలు, కోపాలు అవి మనిషికి సహజం. కొందరికైతే " పుట్టుక నుండీ నా తీరే అంత.."  అని అంటుంటారు. అది నిజమే కావచ్చును. కానీ దానివల్ల ఈ ప్రపంచములో మనం ఏకాకులమైపోతుంటాము. కోపం రావటం, ఆ కోపములో ఎదుటివారిని ఏదేదో అనడం, ఆవతలివారు ఏదో చెప్పబోతుంటే లేదా మన మాటలు పడుతూ ఉంటే ఇంకా రెచ్చిపోయి ఏదేదో అనడం చేస్తాం. అలా అన్నాక అవతలివారి దృష్టిలో మన విలువ, మన మీద వారు చూపే కర్టెసీ కాసింత తగ్గుతుంది. ఇది నమ్మలేని నిజం. అలా తగ్గడం అనేది మనం అనే మాటలను బట్టి, పరిస్థితులని బట్టి ఉంటుంది. ఇలా విలువ తగ్గడం అనేది ఒక్కసారిగా జరగవచ్చును లేదా నెమ్మనెమ్మదిగా జరగవచ్చు. ఏది ఏమైనా జరగాల్సిన నష్టం మనకే. 

ఆ కోపములో మాటలు అనడం అంటే ఏదోలా సరిపెట్టుకోవచ్చును.. ఇంకొందరు చేయి చేసుకొనే వరకూ వెళతారు. ఇది అప్పుడు జరిగిన తప్పు తీరును, దాని ప్రభావం బట్టి ఉంటుంది. కానీ ఎప్పుడో ఒకసారి అలా కాకుండా మాటిమాటికీ చేయి చేసుకునే ఉంటుంటారు. వీరిపట్ల దూరం అయ్యేవారు చాలానే మంది. ఇలాంటి వారి వద్ద ఉండి అలా పడేవాళ్ళు - కేవలం వారి వారి అవసరాల కోసమే. వారి పరిస్థితులు బాగయ్యేవరకే. ఆ తరవాత దిక్కూ చూడరు. 

అంతగా మనకి హాని చేసే ఆ కోపములో మన ఆత్మీయులనీ, అభిమానులనీ, మన మిత్రులనీ నానా మాటలు అంటాం. అవి వారిని ఎంతగా బాధిస్తాయో ఆ సమయంలో గుర్తించం. వారు ఏదో చెప్పబోతున్నా - లేదా మొత్తం వినకుండానే ఏదేదో అనేస్తూ ఉంటాం. అలాని అనేసి మనవాళ్ళు అనుకునే వాళ్ళని దూరం చేసుకుంటాం. అలా దూరం అయినవారు చాలాసార్లు శత్రువులుగా  తయారవుతారు. ఫలితముగా మన జీవితంలో ఎదుగుదల కాసింత నెమ్మది అవుతుంది. అలా వారు మారిన నాడు మన జీవితాలకు  మనమే ఒక అడ్డంకిని ఏర్పరుచుకున్నవారిమి అవుతాము. అది ఎంత అడ్డంకి అనేది ఆ అవతలివారి మీదే ఆధారపడి ఉంటుంది. మనచేతుల్లో ఏమీ ఉండదు. కాకపోతే ఆ తరవాత కాస్త తగ్గి, వారిని మళ్ళీ మన దగ్గరకి చేసుకునేలా ప్రయత్నించాలి.  

ఇది మరింతగా అర్థం అవటానికి ఇక్కడ ఒక చక్కని ఉదాహరణ ఇస్తాను. 

ఒక మిత్రుడు నాకు ఈ ఆన్లైన్ ప్రపంచములోకి అడుగుపెట్టిన మొదట్లో పరిచయం. రోజూ రెండుసార్లు మాట్లాడుకోకపోతే - ఆరోజే గడిచినట్లు ఉండేది కాదు అంటే నమ్మండి. తన ఊరు, వివరాలు.. ఇవేవీ తెలీవు అయినా స్నేహముగా ఉండేవాడిని. ఇద్దరి అభిరుచులూ బాగా కలిసాయి కాబట్టి త్వరగానే స్నేహితులమయ్యాం. ఎంతగా అంటే జాన్ జిగిరీ దోస్త్ లాగా.. అలా సాగుతున్న సమయాన ఇంకొకరికీ నాకు జరిగిన గొడవల్లో  - తలదూర్చాడు. నా తప్పు ఏమీ లేకున్నా, నన్ను అప్రదిష్ట పాలు చేసేలా సాగిన ఆ గొడవల్లో ఇంకొకరి వైపు వాదన విన్నాక, నా వైపు వాదన ఏమిటో  అస్సలు తెలుసుకోకుండా ఏదేదో అన్నాడు. ఇలా ఒకసారే కాదు.. అలా రోజుల తరబడి సాగింది. ఇంకో మ్యూచువల్ మిత్రుడు చెబితే నమ్మలేదు.. అతడి పాస్వర్డ్ సహాయన అతని పేజీకి వచ్చి, చూశాను. నిజమే!. ఆధారాల కోసం వాటిని  స్క్రీన్ షాట్స్ గా తీసుకున్నాను. నెమ్మదిగా అతనికి దూరం అయ్యాను. తను నన్ను కలవాలీ అంటే  - ఇక నా అకౌంట్ ద్వారా తప్ప మరే మార్గం లేదు. అదీ బ్లాక్ కూడా చేశాను. ఇక జీవితాన కలవలేను. ఆమధ్య ఎవరితోనో అన్నాడుట - నాతో మళ్ళీ మాటలు కొనసాగించాలని ఉందీ అని. కానీ ఆ పుణ్యకాలం ఎప్పుడో దాటిపోయింది అని అతనికి తెలీదు. ప్చ్! ఇలాంటి ఉదాహరణలు ఇంకా చాలానే ఉన్నాయి. మరోసారి వాటిని చెప్పుకుందాం. 


Thursday, April 4, 2013

Good Morning - 316


నీ గురించి నువ్వు లోపల అనుకున్నంతగా బయటకి చెప్పుకోకు. 

Wednesday, April 3, 2013

Good Morning - 315


జీవితం అంటే నిన్ను నువ్వు వెతుక్కోవటం కాదు. నిన్ను నువ్వు సృష్టించుకోవటం. 

Monday, April 1, 2013

Good Morning - 314


( ఇది ఎప్పుడో వ్రాసుకున్న ఈ కార్డ్. మొన్న ఫోల్దర్స్ క్లీనింగ్ లో దొరికింది.. ఒక చోట భద్రముగా ఉంటుందని  ఇక్కడ పోస్ట్ చేసుకుంటున్నా..) 

నిజమే కదా ! మన దైనందిక జీవితములో టెన్షన్ - వత్తిడి అనేది సాధారణం అయిపొయింది.. ఎక్కడ చూసినా, ఎవరిని అడిగినా అదే మాట. టెన్షన్ టెన్షన్.. టెన్షన్. నిజానికి  ఆ వత్తిడి మనల్ని నిర్వీర్యుణ్ణి చేసే దానికన్నా ముందే మనం దాన్ని - మనకి ఆమడ దూరములో  పెట్టేయ్యాలి. అలాగే మనం చేరుకోవాలన్న లక్ష్యం మనకి దూరం కాక ముందే ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి / అందుకోవాలి. అన్నింటికన్నా ముఖ్య లక్షణం : మన బ్రతుకు ఎలా బ్రతకాలనుకున్నామో  - మనం చావకముందే అలా జీవితాన్ని ఎలా అనుభవించాలని కోరుకున్నామో అలాగే బ్రతికేయ్యండి.  

Related Posts with Thumbnails