ఈ మామిడి ముక్కలు, ఉప్పూ కారం ను చూస్తే చాలు.. నోరూరిపోతున్నది కదూ.. ఆ వగరు + తీపి ఉన్న మామిడి ముక్కలు కోసుకొని నోట్లో వేసుకున్న మరుక్షణాన నాలికకి రుచి తగలగానే - ఏదో తెలీని పులకరింత, ఆనందం. నా చిన్నప్పుడు మా స్కూల్ వద్ద ఎన్నో మామిడి చెట్లు ఉండేడివి. చలికాలాన చలికి ఆ మామిడి చెట్ల మొదలులో, ఉషోదయ ఎండలో మా తరగతి మొత్తం పాఠాలు వినేవాళ్ళం. వేసవి మొదలు అవుతున్న తరుణములో ముందే ఆ చెట్లకి మామిడి పూత విరగ కాసేడిది. దాన్ని చూసి, " ఇక కాయలు కాచే సమయం మొదలయ్యిందన్నమాట.." అని అనుకునే వాళ్ళం.
మామిడి కాయలు కాచాక, ఇక మా ఆటా, పాటా అంతా ఆ చెట్ల వద్దే. కనీసం అక్కడ ఇరవై చెట్లు అయినా ఉండేవి. తినగలిగే సైజులోకి కాయలు కాయగానే, ఇక మా దూకుడు మొదలయ్యేది. ఆ చెట్లు ఎక్కగలిగే నైపుణ్యం నాకు లేదు. నా మిత్రులలో కొందరు ఎంచక్కా ఆ చెట్లని ఎక్కి, కాళ్ళతో ఊపి, కాయలు క్రింద పడేలా చేసేవాళ్ళు. వాటిని ఏరుకొని, అందరమూ సమభాగాలుగా చేసుకొని తినేవాళ్ళం. కొందరు ఆలస్యముగా వస్తే వాళ్ళ కోసం మళ్ళీ చెట్లు ఎక్కి కాయలు తెంపే వాళ్ళు.
కొద్దిరోజులు అలా గడిచాక, ఇక పుస్తకాలల్లో బ్లేడ్లూ, చిన్న సైజు మొండి కత్తి పట్టుకోచ్చేవాళ్ళు. వాటితో ముక్కలు చేసి పంచుకోనేవాళ్ళం. ఇంకొందరు కాగితాల్లో ఉప్పు పొట్లం లా కట్టుకొని పట్టుకోచ్చేవాళ్ళు. మొదట్లో నేను మామిడి ముక్కలని అలాగే తినేవాడిని. స్నేహితులు ఇలా ఉప్పు అడ్డుకొని తింటే బాగుంటుంది అని చెప్పటంతో ఆ రుచి చూశాను. వావ్! చాలా బాగా అనిపించింది. అదీ కొద్దిరోజులే..
ఆతరవాత ఉప్పూ, కారం పొడి కలిపి పొట్లం కట్టుకొని వచ్చేవాళ్ళు. మొదట్లో - అలా ఆ కాంబినేషన్ బాగుండదు అనుకున్నా కానీ, ఒక్కసారి తిను.. వదల్లేవ్ అని ఆ రుచీ అలవాటు చేశారు. నిజముగా అద్భుతం. ఇక అలాగే రుచి మరిగాను. వదల్లేవ్ అని అన్నది వరమా? శాపమా?? అని ఇప్పటికీ తెలీదు కానీ - ఇప్పటికీ ముక్కలు అలాగే తినాలనిపిస్తుంది. తింటాను కూడా.
వేసవిలో వచ్చే పరీక్షల దాకా, ఇవే మా టిఫినీ. ఎవరైనా సేపరేటుగా ఉప్పు మాత్రమే పట్టుకొస్తే - ఆ ఉప్పుని వేరేవాళ్ళు తెచ్చిన కారం లోకి కలిపెసేవాళ్ళం. అందరిదీ ఒక్కటే అని, ఏమాత్రం తారతమ్యాలు చూపేవాళ్ళం కాదు. పరీక్షలు కాగానే సహచరుల కోసం ఎదురుచూస్తూ, మరికొన్ని కాయలు తెంపేవాళ్ళం. చివరి పరీక్షనాడు అయితే - కాయల మీద దృష్టి లేకుండా వీడుకోలు మీదే దృష్టి పెట్టి, స్కూల్ నుండి ఇళ్ళ వరకూ అందరమూ గుంపుగా నడిచి వచ్చేవాళ్ళం.
4 comments:
ila edipinchatam meeku bhaavyamaa? chustoone..notlo neelu voorutunnaayi..
Nijame kanee ye matram sruti minchi tinna motions bedada
భావ్యం కాదు మధు గారూ! కానీ ఎం చేస్తాం చెప్పండి. ఇంకా కొద్ది రోజులు ఓపిక పట్టండి. కాయలు వస్తాయి. :)
అతి సర్వత్రా వర్జయేత్ - అని పూర్వికులు ఊరికే అనలేదు కదా..
Post a Comment