Sunday, January 27, 2013

Good morning - 251


మనిషికి జనన మరణాల మధ్య దొరికే ఒకే ఒక్క అవకాశం జీవితం. పోరాటాలే తప్ప ఓటమి తెలియకూడదు. ప్రయత్నాలే తప్ప నిస్పృహలుండరాదు. ఆశాతత్వమే తప్ప నిరాశావాదం తలెత్తరాదు. అప్పుడు నీకు దక్కిన అవకాశం వందశాతం సద్వినియోగమే అవుతుంది. 

జీవితం అనేది పుట్టుక మరియు చావు మధ్య ఉండే చిన్ని కాలం. ఇది మనిషికి దొరికే ఒకే ఒక్క అవకాశం. ఎన్నో జన్మలు ఎత్తిన తరవాతే - మనిషిగా జన్మించేందుకు అవకాశం వస్తుంది అని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. అలాంటి మనిషి జన్మని సద్వినియోగం చేసుకుంటే - " మనీషి "  అవుతాడు. 

అలాంటి మన జీవితములో - ఎన్నెన్నో అడ్డంకులు, అవరోధాలు, ఇబ్బందులు.. అవి సర్వ సాధారణం. వాటితో  నిత్యమూ పోరాటం చెయ్యక తప్పదు. ఈ పోరాటములో విజయం తేలికగా లభించదు. మొదటగా ఓటమే వరిస్తుంది. అలాని బేలగా మారితే - ఇక విజయం సిద్ధించదు. ఎదురుగా అడ్డంకులు కొండలా ఉన్నా, దాన్ని దాటేందుకు ఎక్కడో ఒక చిన్న ఆధారం ఉంటుంది. దాన్ని వెతికి, తెలివిగా పట్టుకోండి. దాని సహాయాన రెట్టించిన ఉత్సాహముతో మళ్ళీ పోరాటం మొదలెట్టండి. మళ్ళీ ఓడినా - ఆ అవకాశం వల్ల విజయాన్ని గెలుచుకోవటానికి మరొక దారి కనుకున్నామనీ - పాత దారిలో వెళ్ళితే ఓటమే దొరుకుతుంది అని తెలుసుకోండి. ఏమీ చెయ్యకుండా వదిలేసే వాడికన్నా క్రొత్త దారిలో ప్రయత్నించేవాడే గొప్పవాడు. అలా ప్రయత్నిస్తూ ఉంటే - ఏదో ఒకనాటికి విజయం వరిస్తుంది. 

మీకు తెలుసనే అనుకుంటాను - థామస్ అల్వా ఎడిసన్ విద్యుత్ బల్బ్ కనిపెట్టే ముందు కనీసం వే-యి పద్ధతుల్లో ప్రయత్నించాడు. విజయం సాధించలేదు. ఓడిపోయాడు. ఆ తరవాత చేసిన 1,001 వ ప్రయత్నానికి విజయం సాధించాడు. ఆ తరవాత ఒక ఇంటర్వ్యూలో విలేఖరి అడిగిన " వేయిసార్లు ప్రయత్నించారు కదా.. ఏమని తెలుసుకున్నారు.. " అనే ప్రశ్నకి సమాధానంగా - " ఆ వేయి మార్గాలు విద్యుత్ బల్బ్ ని తయారుచేయుటకి పనికిరావు అని కనుగొన్నాను.." అన్నారు చిరునవ్వుతో. 

ఆయన తన రంగములో చేసిన పోరాటం వల్లనే - ఈరోజు రాత్రి పూట కూడా సులభముగా జీవనాన్ని కొనసాగిస్తున్నాము. అందుకే ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉండండి. విజయం సిద్ధించేవరకూ మీ పోరాటం ఆపకండి. ఏదో ఒకరోజు మిమ్మల్ని విజయం పలకరిస్తుంది. ఈ ప్రయత్నములో నిరాశలూ, నిస్పృహలు ఉండరాదు. ఆశావాద దృక్పథంతో రేపు దక్కే విజయం మీద ఆశ, లక్ష్యం ఉండాలి. అప్పుడు మీకు దక్కిన విజయం మీకు వంద శాతం మీకు అమితమైన తృప్తినీ, సంతోషాన్ని, విజయ గర్వాన్ని కలిగిస్తుంది. 

No comments:

Related Posts with Thumbnails