Wednesday, January 30, 2013

Good Morning - 253


ఒకరిని దూషించే ముందు, మరొకరిని నిందించే ముందు, ఇంకొకరిని తప్పు పట్టే ముందు, వేరొకరిని అవమానించే ముందు, ఆ మనిషి స్థానమున - నిన్ను ఊహించుకో! అప్పుడు ఆ బాధేమిటో తెలుస్తుంది. 

అవును.. మనం ఒకరిని తిట్టడం, కోప్పడటం, వారి తప్పులు చెప్పటం, అవమానించడం, హేళన చెయ్యటం చాలా తేలిక. ఇలా చెయ్యటం కొందరికి దైనందిక జీవనచర్యలా  కూడా ఉంటుంది. వారికి తమ తప్పుల గురించి తెలీదు. వేరేవారిని ఏదైనా అనడం చేస్తారు. వారు అలా ఇతరులని అనే ముందు ఒకసారి ఆ స్థానమున తాను నిలబడి ఉన్నట్లు, ఎదుటివారు అంటే ఎలా ఉంటుందో చూసుకున్నాక - అప్పుడు ఆ మాటలు అనాలి. అప్పుడే మాటలకి ఉన్న శక్తి, ఆ మాటలు చేసే బాధ ఏమిటో తెలుస్తుంది. 

ఇప్పుడు మీకు రెండు ఉదాహరణలు చెబుతాను. ఒక అమ్మాయిని ఆమె స్నేహితురాలు ఎప్పుడూ ఒక మాట అనేది.. " మీ అమ్మ పోలికలు నీకు లేవని.." దానికి ఆ అమ్మాయి మొహం చిన్న బుచ్చుకోనేది, బదులు ఇచ్చేది కాదు.. ఒక్క మాట అనేది కాదు. ఏదో ఒకసారికి అన్నదే అనుకుందాం. కానీ మాటిమాటికీ అంటుంటే - ఈ అమ్మాయి అలా అన్న అమ్మాయితో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక మాట అంది.. "ఈమాట నాతో అన్నావు కానీ ఇంకెవరి వద్దా నీవు అనకు. అంటే బాగోదు. నీవు నా స్నేహితురాలివి కాబట్టి పోనీలే అనుకుంటున్నాను. కానీ అందరూ అలా మౌనముగా ఉండరు. ముఖ్యముగా నీ విషయములో.. ఇదేమాట నిన్నే అంటే ? నీవెంత బాగుంటావు.. మీ నాన్నలా. అదే మీ అమ్మ కి, మీ నాన్నకి ఏమైనా మ్యాచ్ అవుతుందా? అసలు ఎవరూ ఆవిడ మీ అమ్మ అని అంటే ఒప్పుకోరు.. మైండ్ ఇట్. " అంది. ఆ అమ్మాయి అమ్మ రూపం అస్సలు బాగోదు. ఇలా అనిపించుకున్నాక - ఆ అమ్మాయి ఇంకెప్పుడూ అలా అనలేదు. 

అలాగే కొందరు ఒకరితో - మా కుటుంబాన్ని ఉద్దేశ్యిస్తూ " అక్కడేముంది.." అని అన్నారు. (నేను మాత్రం దీన్ని ఆర్థికముగా అన్న రూపములో తీసుకున్నాను. ఆ ఒకరిది తప్పేం లేదు. తనకి మాతో ఒక చక్కని కుటుంబ బంధం ఉంది) ఏమీ ఉందొ, ఏమి లేదో వాళ్లకేం తెలుసు.. నాది నాకు తెలుసు. ఏది ఎంత ఉందో నాకు తెలుసు. ఫరవాలేదు అనే స్థితిలో ఉన్నా. కానీ ఇంత ఉందని అందరికీ చెప్పుకోలేం కదా. ఉన్న కాడికి ఏదో చిన్నగా ఉంది. మా అవసరాలకు సరిపోతుంది. పోగేసేయ్యాలని ఏమీ లేదు. కానీ ఇక్కడ మాత్రం నేను ఎదురు ఏమీ అనలేదు. విన్నాను. చాలా బాధ పడ్డాను. ఆ ఒకరితో "ఎప్పుడూ బాధపెట్టను.." మాట ఇచ్చాను. కాబట్టి ఏమీ అనలేక పోయాను. అలా అన్నవారి గుంపుకి తెలిసిన ఒకరితో చెప్పాను.. "మా వద్ద ఏమీ లేకపోవచ్చును.. కనీసం ఈరోజు అవసరాలు తీర్చుకోవటానికి కూడా ఇబ్బంది పడుతున్న స్టేజీలో నేనుండ వచ్చు. కానీ, ఎవరైనా వస్తే, ఒక మోస్తారు అతిధి మర్యాదలు చేసే స్థాయిలో ఉన్నా.. అదీ ఆ రోజుకి, ఆ పూటకి లేకపోతే, కనీసం ప్రక్కింటి నుండి గ్లాసెడు.. కాదు కాదు చెంచాడు మంచి నీళ్ళు అడిగి తీసుకొచ్చి, ఇచ్చే స్థాయి మాత్రం ఉంది.." అన్నాను. 

అందుకే ఏదైనా మాట అనే ముందు మనం ఆ స్థానము నుండి ఎదుటివారి / మాట పడేవారి స్థానమున ఉండి ఆలోచించండి. ఆ మాట అనాలో వద్దో మీకే తెలుస్తుంది. అప్పటివరకూ మీమీద ఉన్న గొప్ప అభిప్రాయం, అభిమానం ఆ ఒక్కమాటతో పోతుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. 

No comments:

Related Posts with Thumbnails