Friday, January 18, 2013

Good morning - 242


ఎంత బీజీగా ఉన్నా, పిల్లలతో కబుర్లు చెప్పాలి. 
వాళ్ళు చెప్పేది వినాలి. 

హా! అవునండీ.. పిల్లలు చెప్పే ముద్దు ముద్దు ఊసులు, ఎగతెగని విసుగు కబుర్లుగా అనుకుంటే - మీరు, మీ పిల్లలు, టోటల్ గా మీ కుటుంబం మొత్తమూ - చాలా కోల్పోతున్నారు అని చెప్పాల్సిందే. దానివల్ల మీ పిల్లలలో ఆత్మనూన్యత ఏర్పడటానికి దోహదం చేస్తున్నారు. వాళ్లకి వచ్చిన అనుమానాలు, ఏదో చెప్పాలనిపించే ఊసులు వినకపోతే - వారు మా మాటలు ఎవరూ వినలేరు అని చిన్నబుచ్చుకుంటారు. వాటిని వినేవాళ్ళు లేకపోయేసరికి ఈ ప్రపంచములో నేను అందరు ఉన్న ఒంటరి అన్నట్లు ఊహించేసుకుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. దీనివల్ల వారు తమ తమ ఊహాలోకములో ఉండిపోతూ, నలుగురిలో కలవలేకపోతుంటారు. దాన్ని చూసి పెద్దలు కాస్త కసురుకోగానే, మరింత ఆత్మనూన్యతకి గురి అయి, తమ లోకములోనే బిగుసుకపోతారు. దానివలన వారిలో శారీరకముగా ఎదుగుదల ఉంటుందే కానీ, మానసికముగా ఒంటరులం అనే భావనలో ఉండిపోతారు. దీనివలన మన పిల్లల ఎదుగుదలని మనమే అడ్డుకున్నవారిమి అవుతాము. అలా వారి ఎదుగుదలకి మనం అడ్డు రావటం భావ్యమా?

మీకున్న కాసింత సమయం - అది ఎన్ని గంటలు అన్నట్లు కేటాయించలేకున్నంత బీజీగా ఉన్నా కనీసం రోజుకి కొద్ది సెకనులైనా అయినా కానీ.. వారికి కేటాయించండి. అది ఎప్పుడైనా కానీ.. ఎక్కడైనా కానీ.. వారికోసం కాసింత తీరిక చేసుకోండి. 

మీలోని - నేను పెద్దవారిని అన్నఅహం ని కాసింత ప్రక్కన పెట్టండి. మనసుని రిఫ్రెష్ చేసుకొని, మొహాన చిరునవ్వు పులుముకొని, వీలుంటే మీ కళ్ళల్లో చిరునవ్వుని చూపిస్తూ మీ మొహాన స్నేహభావాన్ని చూపిస్తూ (ఆ రెండు భావనలు వేరు వేరు - ఒకటేమో కృతిమం, ఇంకోటి సహజమైనది ) మాట్లాడండి. వారి ముద్దు ముద్దు మాటలు ఓపికగా వినండి. మీరు వింటున్నట్లు, ఊ కొట్టండి. ఊ ఊ అనే కాదు, అవునా.. అలాగా.. అప్పుడేమయ్యింది.. ఓహో.. లాంటి మాటలు చిరునవ్వుతూ మాట్లాడండి. మీరు వింటున్నారు అన్న ధీమాతో నాలుగు మాటలు మాట్లాడేవాళ్ళు పది మాటలు చెబుతారు. దానివలన వారికి లాభం ఏమిటంటే - 
మాటలు సరిగ్గా ఉచ్చారణ 
వారి ఊహాలోకం ఏమిటో 
వారి భావనలు ఏమిటో, 
వారి ఆలోచనల పరిధి ఏమిటో 
మాటలు ఎలా మాట్లాడితే అవతలివారిని ఇంప్రెస్ చెయ్యొచ్చు 
తాను ఏమైనా తప్పులు చేస్తున్నానా? 
వారిలోని బెరుకుని క్రమక్రమంగా తొలగించుకోవటం 
భావవ్యక్తీకరణ ఎలా చెయ్యాలో 
వినటానికి, చెప్పుకోవటానికి - ఒక ఆత్మీయ నేస్తంని పొందటం 
ఇతరులతో చొరవ తీసుకొని మాట్లాడటం, 
క్రొత్త వ్యక్తుల ముందు కూడా సిగ్గు, బెరకు అంటూ లేకుండా మాట్లాడగలగటం
ఎదుటివారు చెబుతున్నది ఎలా అర్థం చేసుకోవాలో....

ఇలా చాలా లాభాలు పొందుతారు. వారు వాటితో నిజజీవితములో ప్రశంసనీయమైన జీవితాన్ని గడుపుతారు. మీరు సాధ్యమైనంత సమయాన్ని వారికి కేటాయించండి. అది సమయం లేకున్నా, మీరు ఆఫీస్ కి బయలుదేరేముందో, భోజనాల బల్ల వద్దనో, షూస్ వేసుకోనేటప్పుడో, టీ త్రాగుతున్నప్పుడో.. ఇలా ఎంత చిన్న సమయం ఉన్నా సరే! దాన్ని అలా సద్వినియోగం చేసుకోండి. వారితో మాట్లాడాక, దగ్గర తీసుకోవడం, ఒక ఆత్మీయ స్పర్శ ఇవ్వండి. అంటే  బుగ్గ మీద ఒక చిన్న ముద్దో, కౌగిలింతనో కావచ్చును. ఇది అన్నింటికన్నా వారిని ఆకట్టుకుంటుంది. 

ఈ విషయం చాలా చిన్నదే అయినా పిల్లల జీవితాలో గణనీయ మార్పుని, వారికి ఒక విశాల దృక్పథాన్ని కలుగ చేస్తుంది. ఇది కూడా తెలీనివారిమి మేము కాము అనుకుంటాం - కానీ ఆచరణలో పెట్టం. నిజాయితీగా మన అంతరాత్మని ప్రశ్నించుకుంటే - యే కొద్దిమంది తప్ప మిగతావారు అలా చేయమనే చెబుతారు. బాల్యం నుండి కౌమార ప్రాయం వరకు వారికి వచ్చే సందేహాలకి - ధైర్యం చెబుతూ సమాధానం చెప్పండి. దానివల్ల వారు వారి జీవితాలలో చాలా ఉన్నత సంస్కారాన్ని పొంది, ఒక చక్కని గుర్తింపు లభిస్తుంది. 

ఇలా నాకు తెలిసినా, మళ్ళీ ఒకసారి - నా మిత్రురాలు చెప్పారు. ఒకసారి నా బాధ్యత ఏమిటో తెలియచేశారు. తనకి కృతజ్ఞతలు. 

పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు - చక్కని అమ్మానాన్నలుగా , 
బాల్యములో - మంచి గురువుగా, 
కౌమార, యవ్వన దశలో చక్కని స్నేహితులుగా ఉండాలి. 
ఈ విషయం గురించి మరోసారి తెలుసుకుందాం. 

No comments:

Related Posts with Thumbnails