Friday, August 24, 2012

అంకుల్! ఒక్కసారి మా డాడీకి..

మొన్న నేను ఒక కార్పోరేట్ స్కూల్ కి వెళ్లాను. అక్కడ ఒక అమ్మాయి ఏడుస్తూ నిలబడింది. నేను యధాలాపముగా ఆ అమ్మాయి కేసి చూశాను. ఆ అమ్మాయి నావైపు చూస్తూ, దీనముగా "అంకుల్! అంకుల్.. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా.. మా డాడీకి ఫోన్ చేసుకోవాలి. చాలా అర్జంట్. ప్లీజ్.. మీ కాళ్ళు పట్టుకుంటాను.." అని ఏడుస్తూ అడుగుతున్నది. సెక్యూరిటీ వాళ్ళని చూసి, దూరముగా నిలబడే లో గొంతుకతో మాట్లాడుతున్నది.

నాకు చాలా జాలి కలిగింది. " ఏమిటీ! ఇంతలా ఆ అమ్మాయి ఏడిస్తే - కనీసం పేరంట్స్ కి ఫోన్ చేసి, మాట్లాడించ వచ్చును కదా..ఈ స్కూల్ వాళ్ళు.. " అని అనుకున్నాను. అక్కడ ఉన్న స్కూల్ రిసెప్షన్ సిబ్బంది - స్కూల్ ఫోన్ ఉన్నా వాళ్ళు ఆ అమ్మాయిని ఫోన్ మాట్లాడించటానికి అనుమతించటం లేదు. సెక్యూరిటీ వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. "ఏమిటీ ఇలా..? ఎందుకలా..?" అని సెక్యూరిటీ వాళ్ళని అడిగాను.

"సార్!.. ఆ అమ్మాయి రోజూ అలాగే చేస్తుంది. ఏదో ఒకరోజు, అత్యవసరము అంటే ఏదో అనుకుందాం.. కాని, రోజూ ఏదో ఒక కారణం చెప్పి, అలా ఏడుస్తూ, వచ్చిన పేరంట్స్ వద్ద ఫోన్ తీసుకొని చేస్తుంటుంది. ఒకరోజు బుక్స్ లేవనో, పెన్స్ లేవనో, కడుపు నొప్పి అనో.. ఇలా ఏదో ఒక కారణం చెబుతుంది. ఇక్కడి వాళ్ళకి ఆ అమ్మాయి సంగతి తెలుసు.. ఆ పేరంట్స్ ఇక్కడే సిటీలో ఉంటారు.. దయచేసి మీరు మాత్రం ఫోన్ ఇవ్వకండి.." అన్నారు.

"ఓహ్!.. నిజమా!" అన్నట్లు ఇంకో సెక్యూరిటీ అతని కేసి చూశాను. అతనూ అదే సమాధానం చెప్పాడు. కాసింత దూరములో ఉన్న స్కూల్ సిబ్బంది వారూ అదే మాట చెప్పారు.

కానీ నా మనసు ఊరుకోబుద్ధి అవలేదు. ఏమి చెయ్యాలో తోచలేదు. ముందు చూస్తే - ఆ ఏడుస్తున్న అమ్మాయి. ప్రక్కన చూస్తే - వద్దంటున్న సెక్యూరిటీ, స్కూల్ సిబ్బంది. ఏదో ఒకటి చెయ్యాలనిపించింది. ఏమి చెయ్యాలా అని ఆలోచించాను. ఇద్దరికీ / ఇరువైపులా - ఈ పద్ధతి బాగుంది అనే ఐడియా కోసం ఆలోచించాను.

చప్పున స్పురించింది. వావ్! వాటే ఐడియా సర్జీ.. అని నన్ను నేనే అనుకున్నాను.

ఐడియా వర్క్ అవుతుందా? అని ఒకసారి ఆలోచించా.. బాగుంది అని అనుకున్నాక - ఆ సెక్యూరిటీ వారి వద్దకి వెళ్లాను.  వారితో " నేను ఆ అమ్మాయితో మాట్లాడవచ్చా?.. ఆ అమ్మాయి తో మాట్లాడి, వాళ్ళ నాన్న మొబైల్ నంబర్ తీసుకొని, నా మొబైల్ తో, వాళ్ళ నాన్నకి కాల్ చేసి, ఇలా మీ అమ్మాయి మీతో ఏదో మాట్లాడాలంట.. వెంటనే కాల్ చెయ్యమని చెప్పింది.. అని వాళ్ళ నాన్నకి చెబుతాను. ఆయన మీ స్కూల్ కి ఫోన్ చేస్తాడు.. ఇలా చేస్తే మీకు ఏమీ ఇబ్బంది లేదు కదా?.." అని అడిగాను.

వాళ్ళు ఓకే అన్నారు. వెంటనే అమ్మాయి వద్దకి వెళ్లి, వాళ్ళ డాడీ మొబైల్ నంబర్ తీసుకున్నాను.

దూరముగా వెళ్లి కాల్ చేశాను. ఆయన ఫోన్ తీయగానే " మీ అమ్మాయి (ఫలానా గల పేరు)  రెసిడెన్షియల్ స్కూల్ కి వచ్చాను నేను. తను ఏదో మీతో మాట్లాడాలని ఉందంట.. ఏడుస్తున్నది. మీరు వెంటనే - స్కూల్ రిసెప్షన్ కి కాల్ చెయ్యండి.." అన్నాను. సరేనండీ. అని చెప్పేసి, ఆ రిసెప్షన్ కి కాల్ చేశారు.

ఆ అమ్మాయి వాళ్ళ డాడీతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడింది. ఇక తను హ్యాపీ.. ఒకచిన్న పని వల్ల అక్కడ అందరూ హ్యాపీనే!. ఎవరి రూల్స్ వారివి.. ఎవరి పని వారివి. ఎక్కడా భంగం రాలేదు. స్కూల్ సిబ్బందికీ ఇబ్బంది లేదు. వచ్చింది ఇన్ కమింగ్ కాల్ కాబట్టి. ప్రైవేటు సెక్యూరిటీ వాళ్ళు - వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. నా డ్యూటీ (?) నేను చేశాను. నేను చేసిన చిన్న సాయం - నాకూ బోలెడంత సంతృప్తిని ఇచ్చింది. ఆ అమ్మాయికీ పని జరిగింది. మొత్తానికి అందరూ ఫుల్ ఖుష్..

అక్కడ నాకు వచ్చిన పని ముగిసింది. ఇక నేనూ అక్కడి నుండి బయలుదేరాను.

వచ్చాక ఆలోచిస్తే - మరొక ఐడియా వచ్చింది. అది చాలా ఈజీ.

ఎలాగూ కార్పోరేట్ స్కూల్స్ కాబట్టి, రిసెప్షన్ లో ఇద్దరు ఎలాగూ ఉంటారు. ఒక STD PCO పెట్టేసి, సర్వీసింగ్ చార్జెస్ తీసుకుంటే సరి. రోజుకి కనీసం యాభై కాల్స్ అయినా ఈజీగా అవుతాయి. యాభై కి రెండురూపాయల సర్వీస్ చార్జ్ అనుకున్నా వంద రూపాయలు ఈజీగా వస్తాయి. పేరంట్స్ ఇద్దరి నంబర్స్ కి మాత్రమే కాల్స్ చేసేలా రెండు నంబర్స్ కి మాత్రమే కాల్స్ చేసేలా ఏర్పాటు చేస్తే - బాగుంటుంది. ఇలా పేరంట్స్ వద్ద నుండి లిఖిత పూర్వకముగా హామీ తీసుకోవాలి. అలా ఇచ్చిన వారికి మాత్రమే కాల్స్ చేసేలా చేస్తేనే బాగుంటుంది. ఈ కాల్ బిల్స్ నెలనెలకీ విద్యార్ధి వద్ద నుండి వసూలు చేస్తే సరి. 

2 comments:

anrd said...

మీరు చాలా మంచి పని చేసారు.

ఇంటిమీద బెంగ ఉన్న అలాంటి అమ్మాయిని హాస్టల్ లో చేర్పించటమే తప్పు.

పోనీ, ఆ అమ్మాయి తల్లితండ్రులు రోజూ ఒకసారన్నా అమ్మాయితో ఫోనులో మాట్లాడవచ్చు కదా ! ఏంటో అంతా చిత్రమైన మనుషులు ? చిత్రమైన బిజీ జీవితాలు ?.

Raj said...

కృతజ్ఞతలు..

Related Posts with Thumbnails