Tuesday, August 28, 2012

నూనె బాటిల్

మొన్న అనుకోకుండా ప్లాస్టిక్ సామానుల కొట్టుకి వెళ్లాను. అక్కడ ప్లాస్టిక్ కంటైనర్ కోసం వెళ్ళిన నాకు, ఒక వస్తువు చాలా ఆకర్షించింది. భలేగా ఉందే అనుకున్నాను.. చాలా ఉపయోగకర వస్తువు అని అనుకున్నాను. వాటిల్లో నాలుగు సైజులు ఉన్నాయి. కాస్త మీడియం సైజులోనిది కొని (45 రూపాయలు) తెచ్చేసుకున్నాను. ఇందులో 600 - 700 మీ.లీ. నూనె పడుతుంది.



వంటకి వాడే నూనె పాత్ర ఇది. మంచి గట్టి పారదర్శకమైన ప్లాస్టిక్ తో చేయబడి, లోన నూనె పోయుటకు వీలుగా ఉన్నది. దీనిలో నూనె పోస్తే నూనె ఎంతవరకు పోశామో చక్కగా కనిపిస్తుంది. అలాగే ఒకరోజులో ఎంత నూనె వాడామో తేలికగా తెలుసుకోవచ్చును. 

పైన ఒక స్టీల్ పైప్ ఉండి, దానికో మూత కూడా ఉంది. ఆ మూతని తెరచి, ఆ పైప్ గుండా నూనెని వంటల్లోకి వంపుకోవచ్చును. ఈ పైప్ కాసింత సన్నగా ఉండటం మూలాన, ఎంతగా నూనె వంపుకోవాలో అంతే నూనెని వంటల్లోకి తీసుకోవచ్చును. 

ఇంతకు ముందు ఒక నూనె క్యాన్ లోనుండి ఒక పెద్ద వంపు తిరిగిన గరిట సహాయాన నూనెని వంటల్లోకి తీసుకొనేవారు. అది అయిపోయాక, జిడ్డుగా అనిపిస్తే, ఆ పాత్రని సబ్బుతో తోమి కడిగేసుకునేవారు. ఇప్పుడు ఆ బాధ ఏమీ లేదు. కావలసిన గిన్నెలోకి నూనెని వంపుకున్నాక , ఆ స్టీల్ గొట్టం వద్ద చివరగా మిగిలిన నూనెని తుడుస్తే సరి. 

కూరలు చేసేటప్పుడు, తాలింపు చెయ్యటానికీ, దోశలు వేసేటప్పుడు అంచున నూనె వేయాలనుకున్నప్పుడు, దేవుని గూటిలోని దీపాల చెమ్మలలో నూనె పోయాలనుకున్నప్పుడు.. ఇది చక్కని అపూర్వమైన సాధనం. 

ఆ స్టీల్ పైప్ వెనకాల, అవతలి అంచున ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఫోటోలో ఒక చిన్న మచ్చలా కనిపిస్తున్నది. అది నూనె పాత్రలలోనికి తీసుకొనేటప్పుడు - ఎయిర్ లాక్ కాకుండా ఉండేందుకై ఏర్పరిచిన చిన్న రంధ్రం. ఈ బాటిల్ ని వంపేటప్పుడు ఈ రంధ్రం వరకూ నూనె రాకుండా జాగ్రత్త తీసుకుంటే సరి. లేకుంటే అందులోంచి నూనె కారి, ఆ బాటిల్.. తరవాత మీ వంటింటి గట్టు, ఆ తరవాత మీచేతులకి జిడ్డు.. చివరిగా మీకు శుభ్రపరిచే శ్రమ తప్పదు. ఈ జాగ్రత్త మరచిపోకండి. 

No comments:

Related Posts with Thumbnails