Wednesday, August 1, 2012

ఆలయ నిర్మాణం - చందా

మాదగ్గర ఒక గుడి కట్టాలని అనుకున్నారు. నిజానికి ఒక మూలగా గుడి కట్టి, మిగతా అంతా రెండు అంతస్థులుగా స్లాబ్ పోసేసి, ఉంచేస్తే అందులో సంవత్సరానికి ఒకసారి  జరిపే బోనాల జాతర జరుపుకోవచ్చును, అలాగే మిగతా రోజుల్లో చిన్న చిన్న శుభకార్యాలని జరుపుకోవచ్చును అని ఆలోచన. ఆ స్థలములో మా ఇంటివాటా సగం విరాళం.

చందాలు పోగేసి, ఆరు లక్షల ఖర్చుతో అలాని రెండు విధాలుగా వాడుకోవాలని అనుకున్న ఆ స్థలములో కేవలం గుడి మాత్రమే వచ్చేలా కట్టేశారు. కాని ఒక ముఖ్య విషయం మరిచారు. 

దాదాపు మూడు వందల గజాల స్థలములో, ఎపుడో ఒకసారి జరిగే ఉత్సవానికి గుడి కట్టే బదులు కొంత స్థలములో గుడిలా ఆర్భాటముగా కట్టి, మిగతా స్థలములో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకునేలా హాల్ కట్టిస్తే, ఇటు ఆ గుడికి ఆదాయమూ, ఉత్తిగా ఉండకుండా పబ్లిక్ ఆ స్థలములో కనిపించేలా ఉంటుందనీ, చిన్న, పేదవారికి వారి వారి కార్యక్రమాలని అందులో జరుపుకోవటానికి వీలుగా ఉంటుందనీ, ఆలయ పూజారికీ వెసులు బాటుగా ఉంటుందనీ అనుకున్నా, ఆచరణలో విఫలం అయ్యింది. ఈవిషయం గుర్తు చేసినా వారి మాట ఎవరూ వినలేదు. దూరాలోచన లేనివారి ఉన్నత పదవులని అలంకరిస్తే ఎలా ఉంటుందో చెప్పటానికి ఇదో చక్కని ఉదాహరణ. 

మొత్తం గుడి కట్టేశారు. పంతులునీ నెలకి రెండువేల జీతంకి మాట్లాడి, ఏర్పాటు చేశారు. ఇక్కడి దాకా సాజానువుగా సాగిన కార్యక్రమాలు ఇక కష్టముగా తోచాయి. మామూలుగా ప్రతి శనివారం రద్దీగా ఉండే హనుమాన్ ఆలయాలకి, మరో వారం దాకా అంతగా భక్తుల రాకపోకలు ఉండవు. ఇక కాళికా ఆలయాలకి ఇక కష్టమే!. సాధారణముగా ఈ కాళికా దేవాలయాలకి ఒకసారి పూజలు మొదలయ్యాక మధ్యలో ఆపరాదు. అమ్మవారికి రోజూ నైవైద్యం సమర్పణ తప్పదు. అలా చెయ్యని రోజున ఇక ఆ శక్తి ఆగ్రహానికి గురి అవుతారు అంటే అందరూ అస్సలు నమ్మలేదు. 

చేతిలో నిధుల లేమి వల్ల మెల్లమెల్లగా పూజా కార్యక్రమాలు ఆగిపోయాయి. గుడిపూజారికి జీతం ఇవ్వటానికీ, ధూప దేప నైవేద్యాలకీ డబ్బు లేకుండా అయ్యింది. మెల్లమెల్లగా ఆలయ కమిటీ వారికి కష్టాలు మొదలయ్యాయి. అయినా నిర్లక్ష్యం. ఒకసారి శక్తి  ప్రభావం అంటే తెలిసొచ్చింది. 

ఆలయ కమిటీ అధ్యక్షుడి ఎదిగిన ఇద్దరు అమ్మాయిలూ ఒకేసారి, ఒకే త్రాడుకి ఆత్మహత్య చేసుకున్నారు. .. .. ... ... ఇక ఆ సంఘటన తరవాత ఆ గుడి నిర్వహణ లోపం వల్ల ఎంత పొరబాటు చేశామో తెలిసొచ్చింది. ఇక ఇలా కాదనుకొని, ఏమి చెయ్యాలో చర్చలు మొదలెట్టారు. 

మనదగ్గర చర్చలు మొదలెడుతారు, కానీ అవి వెళ్లవలసిన దారిలో కాకుండా ప్రక్కత్రోవ పడుతుంటాయి ఎప్పుడూ. ఇక్కడ కూడా అలాగే జరిగంది. 

ఎన్నిరోజులయినా చర్చలు ఎడ తెగవు. అన్నీ మధ్యలోకి వచ్చి ఆగుతున్నాయి. కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. నన్నూ ఒక ఆలోచన చెప్పమన్నారు. నిజానికి ఇలాంటి బాధ్యతలు అంటే నాకు అంతగా ఇష్టం ఉండవు. అయినా నావైపు నుండి ఆలోచన మొదలెట్టాను. 

కొద్దిరోజుల్లో ఒక చక్కటి ఆలోచన వచ్చింది. అది అందరికీ అన్ని విధాలుగా లాభమే. ఎన్ని లెక్కలు వేసినా ఇదే సబబుగా తోచింది. ముందుగా ఆచరణలోన పెట్టేశాను ఒంటరిగా. కొద్ది నెలలు అలాగే చేశాను. చాలాబాగా అనిపించింది. ఒకరోజున ఆలయ కమిటీ వారికి ఈ ఆలోచనని చెప్పాను. 

మనదాంట్లో కాస్త ఆర్థికముగా కలిగి ఉండీ, దైవ భక్తి ఉన్నవారు కనీసం ముప్ఫై మంది అయినా తేలికగా దొరుకుతారు. వారు ప్రతినెల వందరూపాయలు ఇస్తే, వారి పేరు, కుటుంబ సభ్యుల గోత్రనామాల మీద వారు కోరిన నెలలోని ఒకరోజున వారి పేరు మీద ఏదైనా అర్చన చేసి, కాసింత ప్రసాదముగా ఇస్తే అందరికీ మంచిది అని చెప్పాను. 

ఇలా చేస్తే ఉండే లాభాలు అంతా ఇంతా కాదు.. చాలానే ఉన్నాయి. 

1. ఆ గుడిలో రోజూ ఏదో పూజ జరుగుతూ కాసింత సందడి సందడిగా ఉంటుంది. 

2. ఎవరో ఒకరి గోత్రం పేరు మీద అర్చన జరుగుతుంది కాబట్టి ఆ కుటుంబం వారికి శుభం జరుగుతుంది. 

3. వారికి వీలున్న ఒకరోజున అలా అర్చన చేయిస్తే, ఆరోజున వారు వీలు చేసుకొని వెళతారు. ఈ పూజ అరగంటలో అయిపోతుంది. నాది - నెలలో వచ్చే మొదటి శుక్రవారం రోజున మా కుటుంబం పేరు మీద అర్చన ఉంటుంది. 
   
4. పూజారికీ కాసింత పని ఉంటుంది. రోజూ గుడికి వస్తాడు. దేవాలయాన్ని శుచిగా ఉంచుతాడు.  

5. రోజూ పూజలు ఉంటాయి కాబట్టి దేవాలయానికి భక్తుల రాకపోకలు బాగుంటాయి. అలా ఆర్ధిక అభివృద్ధి జరుగుతుంది.  

6. పూజారీ ఖాళీగా ఉండకుండా ఏదో వ్యాపకం కలిపించినట్లవుతుంది. ఏదో ఊరికే జీతం తీసుకుంటున్నాను అన్న భావన తన మనసులోకి రాకుండా ఉంటుంది. 

7. రోజూ గుడిలో పూజలు జరగటం వల్ల చుట్టుప్రక్కలవారికీ అంతా మంచే జరుగుతుంది. 

8. సభ్యులు ఇచ్చేది వందరూపాయలు ఊరికే అలా దానముగా ఇస్తున్నాము అన్నట్లు కాకుండా ఉండేందుకై, వారి పేరు మీద అర్చన చేస్తున్నారు కాబట్టి ఆ అర్చన ఫలితం వారు పొందుతారు. 

.. ఇలా అన్నిరకాలుగా అందరికీ లాభం ఉంటుంది అని వివరించాను. ఈ ఐడియా బాగుందని చాఆమంది ఇలాగే పూజ మొదలెట్టారు. 

No comments:

Related Posts with Thumbnails