Thursday, August 30, 2012

అనారోగ్యం వారికి పడక ఆసరా

మీ ఇంట్లో వృద్ధులు కానీ, అనారోగ్యముతో బాధపడుతున్నవారు గానీ ఉంటే, వారికి ఒక చక్కని పడక ఎలా ఉండాలో ఇప్పుడు మీకు తెలియచేస్తాను.

వారు అనారోగ్యముతో ఉన్నప్పుడు వారికి తిన్నగా ఉండే పడక అంత సౌకర్యముగా అనిపించదు. మందులు మ్రింగాలన్నా, టీవీ చూడాలన్నా, లాప్ టాప్ వాడాలన్నా, ఏవైనా పళ్ళ రసాలు, నీళ్ళూ త్రాగాలన్నా, ఆహారం తీసుకోవాలనుకున్నా, పరామర్శించటానికి ఎవరైనా వస్తే వారిని చూస్తూ మాట్లాడటానికి.. కాస్తంత ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పుడు ఆ ఇబ్బందులు ఎలా తొలగించుకోవాలో చెబుతున్నాను.

ఇది నేను స్వయానా ఇలాంటి బాధ తాత్కాలికముగా ఒకసారి అనుభవించాను. అప్పుడే ఈ ఆలోచన వచ్చింది. ఆచరణలో పెట్టేశాను. చాలారోజులు పట్టే ఆ నొప్పులు కొద్ది రోజుల్లో తగ్గించుకున్నాను. చాలా బాగా పని జరిగింది. ఎవరైనా వయోవృద్ధులు అనారోగ్యముగా ఉన్నవారికి ఇలా చేసి ఇవ్వండి. చాలా ఉపయోగకరముగా ఉంటుంది. ఇంకోరకముగా చెప్పాలీ అంటే - పెద్దవారికి, జబ్బు పడ్డవారికీ నావైపు నుండి ఇచ్చే ఒక చిరు కానుక ఆనుకోవాలి.

ఇదిగో.. ఇలా. తయారీ విధానం: 

* ముందుగా 18 mm ప్లై వుడ్ తో, మధ్యలో మడవటానికి వీలుగా - హింజీస్ సహాయాన ఒక షీట్ పెద్దవారు పరుండే మంచం సైజులో చేయించాలి. 

* ఒక షీట్ కొని, రెండున్నర అడుగుల దూరములో అడ్డముగా కోసి, హింజీస్ (మడత బందు) సహాయాన కలపాలి. 


* ఇది చెయ్యటానికి అరగంట కన్నా ఎక్కువ సమయం పట్టదు. 

* అంత స్కిల్ / నైపుణ్యం పనివారు కూడా ఏమీ అవసరం లేదు. 

* రెండు ముక్కలుగా ఆ షాప్ వాడు కోసిస్తే, రంధ్రాలు చేసి, స్క్రూల సహాయాన, హింజీస్ ని ఒక స్క్రూ డ్రైవర్ ని వాడి, మీరూ తయారు చెయ్యగలరు. 

* అంతా పర్వావరణ అనుకూలమైనది. 

వాడకం : 

* మంచము మీద ఉన్న కాయర్ (మాట్రేస్) ని తీసేసి గానీ, లేదా కాయర్ మీదే గానీ ఇది పెట్టేసుకొని, దాని మీద దుప్పటి వేసుకొని, హాయిగా వాడుకోవచ్చును. 
* హింజీస్ వంటికి నొక్కుకోకుండా ఉండేందుకై లావాటి దుప్పటి గానీ, అంగుళం మందాన ఉన్న కుషన్ వాడితే సరి.

* తల వైపు ఎంత ఎత్తు ఉండాలో, అంత ఎత్తు రావటానికి ఆ భాగములో దిండ్లు గానీ, బట్టలు గానీ పెడితే సరిపోతుంది.

* ఇది అవసరం లేనప్పుడు ఎక్కడ పెట్టాలో, ఇంత జాగా కావాలా అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఈ సమస్యకి సమాధానం కూడా చాలా సింపుల్. మనం పడుకునే మంచం మీద మాట్రేస్ క్రింద పెట్టేసి, పైన మాట్రేస్ వేసుకొని దాచేయ్యవచ్చును. సో, ఈజీగా ఉంది కదూ.. మొత్తానికి మంచం మీదే ఉంటుంది. అవసరం అనుకున్నప్పుడు పైకి వస్తుంది. అవసరం లేనప్పుడు లోపల ఉండిపోతుంది.

* మొత్తానికే ఇది అవసరం లేనప్పుడు ఆ ప్లై వుడ్ తో ఏదైనా డబ్బా, టేబుల్ కానీ, ఫర్నీచర్ గానీ చేయించుకోవచ్చును.

ఉపయోగాలు : 

* వృద్ధులకి అనుకూలముగా ఉంటుంది. 

* పర్యావరణ అనుకూలమైనది. 

* అవసరమైనప్పుడు హాయిగా వాడుకోవచ్చును. 

* తోడు మనిషి అవసరం ఎక్కువగా అవసరం ఉండదు. మంచం మీద ఉన్నవారు కాసింత వెసులుబాటుగా తమ పనులని తాముగా చేసుకుంటారు. 

* ముందున్న టీవీని కంటికి శ్రమ లేకుండా చూడగలుగుతారు. 

* ఆహారాన్ని తేలికగా తీసుకుంటారు. ఇలా కొంత యాంగిల్లో దేహాన్ని లేపుతారు కాబట్టి, ఆ భంగిమలో ఆహారాన్ని తేలికగా మింగ గలరు.

* నీళ్ళు, పళ్ళ రసాలు తేలికగా త్రాగగలుగుతారు.

* మందు గోలీలు సులభముగా వారంతట వారు వేసుకోగలుగుతారు.

* పరామర్శించటానికి వచ్చినవారితో - వారిని ఇబ్బంది లేకుండా చూస్తూ, వారితో సంభాషించ గలుగుతారు.

* వారంతట వారుగా మంచం దిగటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

* దమ్ము, ఆయాసం, ఆస్తమా, బ్రాంకోటిస్ Bronchitis లాంటి ఊపిరితిత్తుల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారికి ఇది మరెంతో ఉపయోగకరం. శ్వాస తేలికగా తీసుకోగలుగుతారు.

* కంటికి శ్రమ లేకుండా అన్నింటినీ తేలికగా చూడగలుతారు.

వెన్నముకకి మంచి సపోర్ట్ ని ఇస్తుంది.

ఇది వాడినపుడు మాట్లాడటానికి ఈజీగా ఉంటుంది. అలా బెండ్ చేసుకొని, ఖాళీ సమయాల్లో కూడా విశ్రాంతి తీసుకోవచ్చును.

* ఇది అవసరం లేనప్పుడు - తిన్నగా చేసేసి, దాని మీద పరుపు వేసుకొని, హాయిగా పడుకోవటమే.

ఇంకా దీనికి ఇంకా కొన్ని హంగులు ఏర్పరచవచ్చును. కానీ చాలా పెద్దగా అవుతుంది. ఇంకా తక్కువ ఖర్చులోనే మరింత సౌకర్యముగా మార్చుకోనవచ్చును. ఆ విషయాలు తరవాత మాట్లాడుకుందాం. 

No comments:

Related Posts with Thumbnails