Thursday, June 30, 2011

గోరింటాకు డిజైనుల సేకరణ వెనక..

నా బ్లాగ్ లో మెహందీ డిజైనులు అప్లోడ్ చెయ్యటానికి గల కారణమూ చాలా చిన్నదే!.

మా ఆవిడకి తెలిసిన బ్యూటీ పార్లర్ ఆవిడ సమ్మర్ క్రాష్ కోర్స్ ఉచితముగా నేర్పిస్తే, నేర్చుకోవటానికి వెళ్ళింది. మా ప్రక్కవాటా లోని అమ్మాయి కూడా "నేను సైతం.." అన్నట్లు మరునాడే తనూ తనతో జాయిన్ అయ్యింది. ఇది ఆంధ్రుల ప్రత్యేక లక్షణం కదా - ప్రక్కవారు ఏది చేస్తే అది మనం చెయ్యాలి అనేది. ఆ అమ్మాయికి రాకున్నా, ఆసక్తి లేకున్నా కేవలం ఈ దుగ్ధతోనే ఆ క్లాసెస్ కి జాయిన్ అయ్యింది.

క్లాసుల్లో భాగముగా చివరిలో మెహందీ క్లాసెస్ కూడా ఉన్నాయి. యాజ్ యూజువల్ గా ఆ అమ్మాయి కన్నా మా ఆవిడనే బాగా మెహంది వేస్తుంది. (తనకన్నా నేను ఇంకా బాగా వేస్తాను, అది వేరే సంగతి అనుకోండి.) ఆ కోచింగ్ క్లాస్ కి వచ్చిన ఒక ముస్లిం అమ్మాయి, ఒక మెహందీ డిజైన్ బుక్ తెచ్చి, అందరికీ చూపింది. అందరూ ఆ డిజైనులు బాగున్నాయని ఆనుకొని, అవి జిరాక్స్ చేసుకొని ఇస్తాము అని అడిగారు. ఆ అమ్మాయి కూడా ఓకే అని ఇచ్చింది. రోజుకి ఒకరివద్ద ఆ బుక్ ఉండేలా, ఆ ఒక్కరోజులో బుక్ జిరాక్స్ చేసుకొనేలా అంగీకారం కుదిరింది.

అలా ఒక్కొక్కరి వద్ద ఉన్న ఆ పుస్తకం, రేపటితో ఇక క్లాసెస్ ముగుస్తాయి అన్నప్పుడు ఆ ప్రక్క అమ్మాయికి వచ్చింది. ఆ అమ్మాయికి వచ్చింది అన్నది ఎవరికీ తెలీదు. మా ఆవిడ తనని అడిగితే, ఇంకా తీసుకోలేదు అని అబద్దం ఆడింది. ఆరోజు రాత్రి ఆ అమ్మాయి కావలసిన డిజైనుల పేజీ నంబర్లు ఒక పేపర్ మీద వ్రాసింది. వారి తమ్మునితో జెరాక్స్ తీయటానికి పంపించింది. ఇది మా అవిడ అనుకోకుండా చూసింది. ప్రక్కనే ఉండి ఇంత మోసమా! ఇవ్వను అంటే అడిగేవాడిని కాదుగా.. ఆనుకొని ఆరోజు అంతా మూడ్ ఆఫ్.

మరునాడు ఆ ముస్లిం అమ్మాయి క్లాసెస్ ముగియటంతో, ఇక రాలేదు. ఆ బుక్ ఇవ్వలేదు. ఈ ప్రక్కన ఉన్న అమ్మాయిని అవి ఇస్తే రి-జిరాక్స్ చేసుకొని ఇస్తాను అని అడిగితే, అసలు నేను ఇంకా జిరాక్స్ చేసుకోలేదు అని బుకాయింపు. తనకే అంతా రావాలని దుగ్ధ. నాకీ విషయం మరునాడు తెలిసింది.

తను నా అర్థాంగి అన్నప్పుడు తన బాధ నా బాధనే కదా. అందుకే నేనూ తనని విజేతగా నిలపాలని అనుకున్నాను. సేకరణ మొదలెట్టాను. అలా చాలా సేకరించాను. దాదాపు నాలుగు వందలకి పైగా ఉండొచ్చును. కాలక్రమేనా వాడకములోని కాస్త నిర్లక్యం, ఆజాగ్రత్త, వారూ వీరూ అడుక్కొని తీసుకపోయినవీ, ఎత్తుకపోయినవీ.. పోగా కాసిన్ని మిగిలాయి. అప్పుడే డిజిటల్ సౌలభ్యం తెలిసింది. మళ్ళీ సేకరణ మొదలయ్యింది. కానీ అప్పటిలాగా వెదకటం లేదు. దారిలో తగిలితేనే సేకరించటం - అంతే!.

ఇవన్నీ నా కోసమే అన్నట్లు దాచుకోవటం నాకు ఇష్టం అనిపించలేదు. నాలాగ ఉన్నవారు ఎందరో ఆనుకొని, అందరికీ ఉపయోగపడేలా ఇక్కడ అప్లోడ్ చెయ్యటం. అందుకే అలా పోస్ట్ చెయ్యటం. ఇదీ ఆ మెహందీ సేకరణ ఫోటోస్ వెనక ఉన్న చిన్న కథ.

No comments:

Related Posts with Thumbnails