Tuesday, June 14, 2011

అర్ధరూపాయి - అపరాధభావం

రెండు రూపాయలు - అపరాధ భావం లో నా అంతర్మధనం చదివారుగా.. అలాంటిదే మరొకటి కూడా చెప్పాలని అనిపిస్తున్నది. దాదాపుగా దీనిని పోలినట్లే ఉంటుంది. అదీ కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది. అయినా ఇది కూడా కాస్త చదివిపెట్టండి.

నేను కాలేజీ చదువుతున్న రోజులవి.. ఒక ఆదివారంన మిత్రులం అంతా వేసవి సాయంత్రాన అలా వాకింగ్ వెళదామని అనుకున్నాము.. నేను, ఇంకో మిత్రుడిని తీసుకొని వారితో జాయిన్ అవటానికి బండి మీద వచ్చాను. ఆ బండి కిక్ కొట్టడములో, నా చెప్పు కాస్త తెగింది. అది గమనించుకోలేదు. బండి అలా పార్క్ చేసుకొని, అలా వారితో జాయిన్ అయ్యే సమయములో పూర్తిగా చెప్పు తెగిపోయి, వారితో జాయిన్ కాకుండా ఆగిపోవాల్సిన పరిస్థితి. మిత్రులు వాకింగ్ కేన్సిల్ చేద్దామని అన్నారు. కాని నేను నా ఒక్కడి కోసం ఎందుకు కేన్సిల్ అనుకోని, బాగు చేయించుకొని వస్తాను అని అదే బండి మీద మోచి వారికోసం వెళ్లాను.

ఆరోజు ఆదివారం - అందునా సంధ్యాసమయం. వారం రోజుల బిజినెస్ హడావిడి నుండి కాస్త రిలీఫ్ కోసం అన్ని దుకాణాలు బంద్ అయిన సమయాన, ఎవరు ఉంటారు.. వెదకగా వెదకగా ఒక ఒక చిన్న చెప్పుల షాప్ కనిపించింది. అది ఒకప్పుడు రిపేర్ చేసే దుకాణమే.. కాని వారి వయోభారం వాళ్ళ పిల్లలకి చిన్నగా షాప్ పెట్టించారు. అందులో రిపేర్ చెయ్యరు అని తెలుసు.. కాని ఒకసారి అడిగి చూస్తే - పోలా! అనుకొని అడిగా - ఏమీ అనుకోవద్దు.. అంటూ నే వచ్చిన కారణం చెప్పాను.. అదీ నామోషీగా ఫీలయ్యి.

వారిలోని కోలమొహముతో, పీలగా, నుదుట రూపాయి కాసంత కుంకుమ నుదుటిబొట్టుతో ఉన్న ముసలావిడ నన్ను చూసి నవ్వింది.. ఆ నవ్వులో ఒక అభయం ఇస్తున్నట్లుగా అనిపించింది. అప్పుడు తను వేరేవారితో బిజినెస్ డీల్ లో ఉంది. దాన్ని వారి పిల్లలకి అప్పగించింది. నా చెప్పు చూసింది. దాన్ని స్క్రూ డ్రైవర్ లాంటి పరికరముతో సరిచేసింది. తీరా ఒక మొల కొట్టేద్దామని చూస్తే - ఆ డబ్బానే కనిపించలేదు. బాగా వెదికింది. ఆ తరవాత కూల్ గా చెప్పింది ఆవిడ - ఆ మేకుల డబ్బా ఇంటివద్దే ఆరోజు మరిచాననీ!

హబ్బా! ఈరోజు నాకు రోజు బాగాలేదు అని ఏడుపు మొహం పెట్టాను. నా బాధ గమనించిందో ఏమో.. ఉండు బిడ్డా అని మరోసారి తన డబ్బా అంతా వెదికింది. అందులోని ఉన్న సామాను అంతా బయట పెట్టి మరీ వెదికింది. నిజానికి ఆమె అంత వెదికే అవసరం ఏమీ లేదు. లేదని చెప్పేయవచ్చును కూడా. కాని ఆవిడకీ నన్ను ఖాళీగా త్రిప్పి పంపటం ఇష్టం లేదులా ఉంది. 

అన్ని డబ్బాలనీ ప్రక్కన పెట్టాక, ఆ డబ్బాలో మూలన ఒకేఒక మేకు కనిపించింది. మా అందరి మొహాల్లో సంతోషం. దాన్ని తీసి నా చెప్పు జాయింట్లో బొటనవ్రేలితో గుచ్చి, ఇనుప దిమ్మతో రెండు దెబ్బలు వేసింది. నా చెప్పు ఓకే అయ్యింది. రేపటివరకూ ఆగుతుంది. రేపు వచ్చేసి ఇంకో రెండు కొట్టించుకో అన్నదావిడ. ఆవిడ సామానులన్నీ సర్డుకుంటుండగా "ఎన్ని డబ్బులు?" అని అడిగాను. ఆవిడ అర్ధ రూపాయి అన్నారు. (అప్పట్లో ఆ అర్ధ రూపాయి అంటే చాలానే విలువ.)

నా జేబులన్నీ వెదికాను.. ఊహు.. నాతో వచ్చిన అతని వద్దా వెదికాడు.. చిత్రం.! ఇద్దరి వద్దా ఒక్క రూపాయి కూడా లేదు. అంత కష్టపడి, బాగా వెదికి మరీ మేకు కొట్టిస్తే - అడిగిన అర్థ రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితియా మాది. ఛీ ఎదవ బ్రతుకు అనుకున్నాను. రేపు తెచ్చి ఇస్తాను అన్నాను. ఆవిడా ఏమీ అనుకోలేదు.. చిరునవ్వుతో సరే బాబూ అంది.

తెల్లారి ఇస్తాను అనుకున్నానా?.. బీజీ ఉండి తన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. అలా రెండురోజులయ్యాక హా! ఏమిస్తాం లే! ఈ అర్ధ రూపాయీ ఇవ్వక తప్పదా.. హా! ఎగ్గోట్టేద్దాం లే.. మనమేం కొంపలు ముంచటం లేదుగా అన్న ఆలోచనా మొదలయ్యింది.

నాలుగోరోజునుండీ అంతర్మధనం మొదలయ్యింది. అంత కష్టపడి ఆవిడా మేకు కొట్టిస్తేనేగా, ఆరోజుటి వాకింగ్ లో నేను బాగా ఎంజాయ్ చేసింది. తను ఆరోజు నా వల్ల కాదు అనుకుంటే - ఆరోజు నేను పొందిన ఆనందపు తాలూకు అనుభూతి అంతా నేను పొందేవాడిని కాదుగా... పదిమందికి పైగా ఉన్న మిత్రులతో వాకింగ్ చేస్తూ, ఎన్నో విషయాలు మాట్లాడుకున్న, తెలుసుకున్న జ్ఞానం అంతా తన దయ వల్లనే కదా! అంటూ ఇలా ఎన్నెన్నో ఆలోచనలు. ఎగ్గోడదాము అన్న ఆలోచన నుండి ఎప్పుడు తిరిగి ఇచ్చేద్దాము అన్న ఆలోచన మొదలయ్యింది. ఆరోజు రాత్రి నిద్ర కూడా సరిగా పట్టలేదు. ఎప్పుడూ ఆ నవ్వుతో మాట్లాడిన ఆమె మాటలే వెంటాడేవి. నవ్వుతూ, క్షమించి మనిషిని చిత్రవధ చెయ్యొచ్చును అని ఆరోజే తెలుసుకున్నాను.

తెల్లవారిన లేవగానే ఒకసారి వారి వద్దకి ఆత్రుతతో వెళ్ళివచ్చాను. అప్పటికి ఆ వృద్ధులు రాలేదు. స్నానం, టిఫినీ అంతా కానిచ్చేసి, పదింటికి వెళ్లాను. భార్యాభర్తలు ఇద్దరూ ఉన్నారు. వారిముందు బండి ఆపి దిగాను. ఆవిడా నన్ను చూసి నవ్వింది. గుర్తుపట్టారు ఆవిడ. అదే నవ్వు. కాని వేవేల అర్థాలున్నాయి అనిపించింది నాకా క్షణంలో. అప్పటివరకూ ధైర్యముగా ఉన్న నేను ఆ నవ్వు చూసి జావ కారిపోయాను.

తల వ్రేలాడేసుకొని, తన దగ్గరికి వెళ్లి "మొన్న ఆదివారం నాడు సాయంత్రం తెగిన చెప్పు కుట్టినందుకు.. ఆ బాకీ పైసలు.." అంటూ అర్ధ రూపాయి నాణెం చేతిలో పెట్టాను. హమ్మయ్య.. గుండెల మీద అప్పటివరకూ ఉన్న టన్నుల బరువు ఏదో దిగినట్లనిపించింది. స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది.

కాని ఆవిడకి ఇదంతా గమ్మత్తుగా తోచిందేమో! లేదా నా అవస్థలు అన్నీ తెలిసిందేమో! చీర చెంగు నోటికి అడ్డం పెట్టుకొని అదే నవ్వు.. అది వెక్కిరింతో, లేక నా మీద జాలో, లేదా ఏమిటీ మనిషీ అనో!.. ఇక నేను వెనక్కి తిరిగి చూడలేక తిన్నగా బండి ఎక్కేసి, స్టార్ట్ చేసి, ఒక్క క్షణం లో మాయమయ్యాను.

వృద్ధాప్యములో ఉన్న వారిని ఎందుకో మోసం చేయ్యబుద్దికాక, ఇంత అవస్థ పడ్డాను.. ఇదంతా చదివి బాగా నవ్వుగా ఉంది కదూ..

4 comments:

it is sasi world let us share said...

నిజమె ఇట్లాంటి చిన్న సంగతులె మనలొ హ్రుదయాన్ని
మేలుకొలుపుథాయి.

Raj said...

అవును కదా..

Sameera said...

chaalaa bagundandi, navvukunnanu chaala. ilantide nenukooda rasaanu na sameera blog lo. adi talachukunna naaku navvu aagadu. veelaite chadavandi.

Raj said...

మీ బ్లాగ్ చూశాను.. బాగుంది. అలాగే మీ ప్రశ్నకి ఒక సమాధానం కూడా వ్రాశాను.. చూడండి.

Related Posts with Thumbnails