Wednesday, June 8, 2011

రెండు రూపాయలు - అపరాధ భావం

ఈరోజు నుండీ నా మదిపొరల్లో, దాగుండిపోయిన అందమైన, తమాషా విషయాలని "జ్ఞాపకాలు" అనే లేబుల్ క్రింద కూడా మీకు అందిస్తున్నాను. వాటినీ ఆదరించి, మీ అమూల్యమైన వాఖ్యలని పోస్ట్ చెయ్యండి.

ఈరోజు నా వాహనం తీద్దామని చూస్తే - ముందు చక్రములో గాలి కాస్త తక్కువగా అనిపించింది. సరే అని నా పనులన్నీ చేసుకున్నాక, అటువైపు వెళ్ళాల్సివచ్చినప్పుడు వెళ్లాను. "బాబూ! కాస్త హవా మారో!.." అని హిందేలుగు (ఇదేదో బూతు అని అనుకోకండీ.. హిందీ + తెలుగు ని కలిపా.. అంతే!) ఆ అబ్బాయి ముస్లిం. నన్ను చూసి, గాలి కొట్టే పైపు తీసుకొని వచ్చి, చక్రాల్లో గాలి చెక్ చేస్తూ గాలిని నింపసాగాడు.

అంతలోగా అతడికి ఇవ్వాలని జేబులో చిల్లర తీశాను. మూడంటే మూడు రూపాయలు ఉన్నాయి. అతనికి నాలుగు రూపాయలు ఇవ్వాలి. ఒక రూపాయి తక్కువగా ఉంది. "మేరేపాస్ తీన్ రూపాయా హై.. ఏక్ రూపాయా కమ్ హై.. బాద్ మే దేతాహూ.." (నాదగ్గర మూడురూపాయలు మాత్రమే ఉన్నాయి. నీకిచ్చే నాలుగు రూపాయల్లో ఒక రూపాయి తక్కువగా ఉంది.. తరవాత ఇస్తానూ - అని తెలుగీకరణ) అన్నాను. నా జేబులో అన్నీ పెద్ద నోట్లే ఉన్నాయి అప్పుడు. అవి తప్ప చిల్లర ఏమీ లేదు.

"ఫరవా నై సాబ్.. కోయీ ఫరక్ నై.. ఆప్ ఇదర్ ఫిర్ ఆనేకే టైం పే దేదో.." (ఫరవాలేదు సార్. ఏమీ ఇబ్బంది లేదు. మళ్ళీ ఇటువైపు వచ్చినప్పుడు ఇవ్వండి) అన్నాడు. సరే అన్నాను. టైర్లలో గాలి ఎంత ఉందో చెక్ చేసి, గాలి నింపటం పూర్తి అయ్యింది. నా డబ్బులు తీసుకుంటూ, నా వివరాలు అడిగాడు. ఆ అడగటంలో ఏదో నాగురించి తెలుసుకోవాలనీ, నన్ను ఒక చిన్నసైజు సెలెబ్రిటీలా చూశాడు. ఎందుకా అవన్నీ అనుకున్నాను. ఓపెన్ గా నా ప్రొఫైల్ చెప్పేశాను. అలా ఎందుకు అడిగాడబ్బా! అని ఆలోచించుకుంటూ బండి ఎక్కాను. అప్పుడు గుర్తుకువచ్చింది.

మూడు నాలుగు నెలల క్రిందట ఇలాగే ఒకసారి గాలి కొట్టించుకోవటానికి వెళ్లాను. ఆ అబ్బాయి వద్దకి వెళ్ళటం అదే తొలిసారి. ఎప్పుడూ వేరేవారి వద్దకి వెళుతుంటాను. ఈసారి కావాలని మార్చాను. దర్జాగా వెళ్లి ముందు చక్రములో గాలి కొట్టించాను. అతనికి డబ్బులు ఇవ్వటానికి జేబుల్లో చేయి పెడితే - ఒక్క రూపాయీ లేదు. ఎందుకా అని ఆలోచిస్తే - జస్ట్ అంతకు ముందే పాంట్ మార్చాను అనీ. హయ్యో! అనుకొని, ఆ అబ్బాయితో "సారీ! ఏమీ అనుకోవద్దు.. పాంట్ వేరేది వేసుకుని వచ్చాను. జేబుల్లో ఒక్కరూపాయి కూడా లేదు.. ఇటువైపు మళ్ళీ వచ్చినప్పుడు - మరచిపోకుండా మీకిచ్చే రెండు రూపాయలు తప్పకుండా ఇస్తాను.." అన్నాను. నా మాటల్లో నిజాయితీ చూసాడో, లేక మొదటిసారి కదా అని అనుకున్నాడేమో గానీ "సరే" అన్నాడు. కాని మనసులో తిట్టుకునే ఉంటాడు. నేను బాగా గిల్టీగా ఫీలయ్యాను. నిజాయితీగా కష్టముతో పనిచేసి, అతను చేసిన సేవకి తగిన ప్రతిఫలం ఎగ్గోట్టుతున్నాను అనే ఫీలింగ్ నాలో కలిగింది.

ఆవిషయం నన్నుచాలాసార్లు వెంటాడింది. ఆ రెండు రూపాయలు పెద్ద లెక్కలోకి రావు కానీ, హోటల్లో ఇచ్చే టిప్పుల కన్నా చాలా తక్కువ డబ్బుల మొత్తం అది. నా బండి కేసి చూసినప్పుడల్లా అదే భావం.

దాదాపు వారం రోజుల తరవాత అటుగా వెళ్లాను. కరెంట్ లేదు. చిమ్మని చీకటి. అతన్ని పిలిచాను. గాలి కొట్టడానికా అన్నట్లు ప్రెజర్ మీటర్, ఎయిర్ పైపూ పట్టుకొని వచ్చాడు. "నఖో భయ్యా.." (వద్దు సోదరా..) అని చెప్పి - నేను అతనికి ఇవ్వాల్సిన రెండు రూపాయల నాణేన్ని, అతని చేతిలో పెట్టి, ఆ రెండు రూపాయల వెనక అతని సేవ, నేను మరచిన విషయం చెప్పాను. "..ఇటువైపు రావటం వీలుకాక ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఇచ్చాను.." అని ముగించాను. ఆ మాత్రం దానికి అతను బాగా కదిలిపోయినట్లున్నాడు. ఈకాలములో కూడా ఇంత నిజాయితీ మనష్యులు ఉన్నారా అనుకున్నట్లున్నాడు.

రోడ్డు మీద వచ్చే మిగతా వాహనాల వెలుతురులో నన్ను చూస్తూ, నా గురించి అడిగాడు. గిల్టీ ఫీలింగ్ తో ఉన్న నేను నా వివరాలు ఏమీ సరిగా చెప్పలేదు. చాలావారాల తరవాత ఈరోజు వెళ్లాను. నన్ను బాగా గుర్తు పెట్టుకున్నాడులా ఉన్నాడు. రూపాయి తక్కువ ఉన్నా ఏమీ అనకుండా.. ఫరవాలేదు అన్నాడు. ఈరోజు నేనూ నిజాయితీగా ఉండాలనిపించి, నాగురించి చెప్పాను.

చూడటానికి సిల్లీగా, చాలా చిన్న విషయమైనా, (నిజాయితీ సేవకి తగిన డబ్బు ఇవ్వలేకపోయాను అనే) గిల్టీ ఫీలింగ్ కి (అతని ఋణం తీర్చాను అన్న) సంతృప్తికీ మధ్యన ఉన్న అంతరాన్ని చక్కగా చవిచూశాను. ఆ రెండింటి అనుభూతులు ఎలా ఉంటాయో ఈ విషయం వల్ల చక్కగా నేర్చుకున్నాను.

2 comments:

vanajavanamali said...

chinnadhaa..peddhadaa ani kaadhu.. nijaayithee..annadhi nijaayithiye .. kadhaa..? good. Bagundhi..Raj..gaaroo.. Thappaka vraayandi. Mee post lu.. chalaa baaguntaayi. thgguthayemo.. anna digulu undedhi. Thank you.

Raj said...

మీ విలువైన అభిప్రాయానికి ధన్యవాదములు. ఇక వీలు చూసుకొని వ్రాస్తుంటాను..

Related Posts with Thumbnails