Monday, February 21, 2011

Social NW Sites - 17 - ఫొటో కామెంట్స్.

ఫోటో కామెంట్స్ - అంటే మనం పెట్టే ఫొటోస్ కి వచ్చే కామెంట్స్ అన్నమాట!. మన మిత్రులు వ్రాసే ఈ కామెంట్స్ వల్ల కాస్త సంతోషముగా ఉంటాము. నిజం చెప్పాలంటే ఈ ఫోటో కామెంట్స్ మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంటాయి. అసలు ఈ ఫోటో కామెంట్స్ భలే కిక్కు ఇస్తుంటాయి కూడా.. అలాంటివి మరెన్నో రావాలని ఎదురు చూసేలా ఉంటాయి అంటే అతియోశక్తి కాదు. మీకు అలా మంచి కామెంట్స్ ఫ్రెండ్స్ ఉంటే మీరు మరీ మరీ అదృష్టవంతులు.

మీకు కామెంట్స్ వ్రాసే అభిరుచి మీకు లేకున్నా - అలాంటివి ఎప్పుడూ వ్రాయకున్నా, మీ స్నేహితులని సంతోష పెట్టే చిన్న పనిని చెయ్యటములో తప్పేమీ లేదు. మీరు ముందుగా చేస్తేనే కదా! మీకు ఎవరైనా వ్రాసేది. మీరు కయ్యాలని కవ్వించే, వివాదాస్పద కామెంట్స్ పెట్టకండి. ఎవరైనా అలా వ్రాసి ఉంటే వాటికి పొడిగింపుగా మీరు ఏమీ వ్రాయకండి. ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి ఇబ్బందిని ఒకటి ఇక్కడ మీకు చెబుతాను.

నేను ఒక అమ్మాయి తీసిన గుడ్డు ఫోటో కి ఒక కామెంట్ పెట్టాను. మా మధ్య ఉన్న చనువుతో అలా పెట్టాను. ఇంకో అబ్బాయి దానికి కంటిన్యూ కామెంట్ వ్రాశాడు. మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినట్లు.. అనే సామెత లాగ ఫీలయ్యిన ఆ అమ్మాయి అతన్ని క్లాస్ పీకక, నన్ను క్లాస్ పీకింది. నేను మొదట్లో కాస్త జోక్ చేస్తున్నదేమో అనుకున్నాను. కాని సీరియస్ అని చెప్పారు ఆ అమ్మాయి. నిజముగా ఇష్టం లేదా.. అని అడిగాను. ఆ అమ్మాయి కోపములో నాకు మీ స్క్రాప్స్, కామెంట్స్ ఏవీ నచ్చటం లేదు.. ఇక వ్రాయకండి.. అని అన్నారు (కోపములో). పక్కానా? ష్యూరా?.. అడిగాను.. నిజమే అన్నారు.. ఇక ఆ రాత్రి రాత్రే నేను వ్రాసిన వందకి పైగా ఉన్న కామెంట్స్, స్క్రాప్స్ అన్నీ తీసేశాను. ఆ తరవాత ఆ అమ్మాయికి ఏమీ స్క్రాప్స్ కూడా పెట్టడం లేదు. జస్ట్ బాగున్నారా? అని అనడం తప్పించి. ఈ మధ్యనే కావాలని కొన్ని ఫోటో కామెంట్స్ పెట్టాను. ఇక పెట్టడం మానుకోవాలి. ఇక్కడ నాది పొరబాటు లేదు అనడం లేదు. ఉంది. కామెంట్ పెట్టినదానికి మామూలుగా ఉన్న ఆమె అతని కామెంట్ వల్ల నన్ను అని, దూరం చేసుకోవటం బాధాకరం. అతడినే అనొచ్చుగా. మా మధ్య చనువు బాగా ఉంది అనుకున్నాను.. నిజానికి ఉంది కూడా. వేరొకరి జోక్యం వల్ల ఇలా ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. ఎవరికీ వారు మాది సరియైనది అనుకుంటూ - స్నేహాలని పాడుచేసుకుంటుంటారు.

ఈ క్రింది ఫోటో చూడండి. ఒక మిత్రుడు పెట్టుకున్నాడు ఈ ఫోటోని. ఈ ఫోటోలోని ఏనుగు ని చూడండి.

ఎంత రియల్ గా ఉందో.. దానికి ట్యాగ్ లేదు.. ఇది రియల్ గా బాగుంది ఎక్కడా? అని అడిగాను. నేను వ్రాసిన కామెంట్ కి జవాబూ లేదు. ఇలా అడిగి కూడా చాలా రోజులయ్యింది కూడా.. ఇది వ్రాస్తున్నప్పుడూ కూడా చూశాను. ఇంకా రిప్లై రాయలేదు. ఆ తరవాత అతనికి ఫోటో షాప్ వర్క్ వచ్చని తెలుసుకున్నాను. అది అందులోనే చేశాడు కావచ్చు.. అందుకే రిప్లై ఇవ్వలేదేమో అని అనుకున్నాను.. లేదా మనం అక్కడికి వెళ్ళి అలా ఫోటో దిగేస్తాం, అలా ఆ క్రెడిట్ మనం కొట్టేస్తాం అని కాబోలు.. కాని ఆ ఏనుగు కాళ్ళ దగ్గర చూస్తే అది రియల్ ఫోటో అనేలా ఉంది.  ఇదంతా చెప్పటం ఎందుకూ అంటే -కామెంట్స్ లో ఇది ఎక్కడా? అని అడిగితే అది ఎక్కడో అని చెప్పాలి అని అంతే!. అలా వచ్చిన కామెంట్స్ కి రిప్లై ఇవ్వాలి అని చెబుతున్నాను. అంతే!. తెలీక అందరూ తప్పులు చేస్తారు.. (తాజాకలము : ఒక సందర్శకులు మహేష్ ముట్నూరు చెప్పారు - ఆ ఏనుగు బొమ్మ వైజాగ్ లోని పామ్ బీచ్ స్టార్ హోటల్ వద్ద అని. వారికి కృతజ్ఞతలు. )

కామెంట్స్ లో అవతలి వారిని గెలికేలా / వ్యంగ్యముగా వ్రాయటం అంత మంచిది కూడా కాదు.. మనం ఒకరిని గెలికామే అనుకోండి - అతను మనల్ని గెలికితే తట్టుకోవాలి మరియు పడాల్సి ఉంటుంది కూడా.. అలా అయితేనే వ్యంగ్యముగా కామెంట్స్ పెట్టొచ్చు. అవతలివారు టాలెంట్ ఉన్న పర్సన్ అయితే - వారు ఇచ్చే రిప్లైస్ కి తట్టుకోవటం కష్టం. ఇద్దరు ముగ్గురు ఇలా నన్ను కామెంట్స్ తో గెలికారు. నా రిప్లైస్ తో బాగానే బదులిచ్చాను. ఎందుకో అలా ఇవ్వటం నాకూ బాగా అనిపించలేదు. ఈ జనవరి ఒకటి నుండి అలాంటివి వాతల్లాగా ఉండే రిప్లైస్ కామెంట్స్ ఇవ్వటం బాగా తగ్గించేశాను. కామెంట్ కి కామెంట్ తోనూ, వ్యంగ్యానికి వ్యంగ్యముతోనూ, కామెడీకి, కామెడీగా రిప్లైస్ ఇవ్వటం రావాలి. అలా అయితే బాగుంటుంది. ఒకవేళ అర్థం కాకుంటే అక్కడే అడగాలి - మీరు అంటున్నది నాకు అర్థం కాలేదు అనీ!.

మనం ఒక్కోసారి మనకి మనం గొప్పగా ఊహించేసుకుంటాము. ఒక్కోసారి మనకు మనం చేసే తప్పులు ఏమిటో ఎదుటివారు చెప్పేదాకా అర్థం కావు కూడా!. నిజానికి నాకూ తెలీదు. చెప్పాక నేనూ నా పద్ధతి మార్చుకున్నాను. మనం అన్నింట్లో పెద్ద నైపుణ్యం కలవారం, అన్నీ తెలుసు అనుకుంటాము కాని ఎదుటి వారు చెప్పేదాకా కొన్ని తెలీకపోవచ్చును. కొన్ని విషయాలు  వేరేవారు చెబితేనే గాని తెలుసుకోలేం. అలా చెప్పినప్పుడు ఆవేశపడక అందులోని సత్యం ఎంతో నిజాయితీ గా చూసుకోవాలి. నా కంటే చిన్నవాడు చెప్పాడని ఫీలవలేదు. నిజమే చెప్పాడు కదా అని అనుకున్నాను. అతనిని కోపగించుకొని, అతన్ని రిమూవ్ చెయ్యటం వంటి పనులు అసలు చెయ్యలేదు. నేను అతని ఫొటోస్ కి కామెంట్స్ చేశాను. "ఇలా మీరు కామెంట్స్ వ్రాస్తున్నారు కదా.. నాకేమీ ఇబ్బంది లేదండీ. కాని మీరూ మీ ఫొటోస్ పెడితే కామెంట్స్ వ్రాసే అర్హత మీకు ఉందని అనుకుంటాను. అలా చెయ్యటం సంస్కారం అనుకుంటాను.." అని. నిజమే కదా.. అప్పటి నుండీ నేనూ మొదలెట్టాను. చాలామంది వారివి పెట్టరు కాని ఎదుటివారిని అనడం మాత్రం చేస్తుంటారు. అలాంటివారు ఇది తెలిశాక మారాలి. మనం అవతలివారి ఫొటోస్ కి కామెంట్స్ పెట్టడం కాదు. వారికీ అలాంటి అవకాశం ఇవ్వగలగాలి. అప్పుడే సరియైన స్నేహాన్ని మనం ఇస్తున్నట్లు లెక్క. నిజమే కదూ.. మనకి తెలీని విషయాలు ఎవరు చెప్పినా వినాలి. బాగుంటే ఆచరించాలి. దానివల్ల మనకే బాగుంటుంది. లాభం కూడానూ..

కొన్ని  సూచనలు :

1. రాజకీయాలు, సినీ తారలు, వ్యక్తులూ, రీసెంట్ జెనరల్ టాపిక్స్ సంబందించిన ఫొటోస్ కి కామెంట్స్ పెట్టకపోవటమే చాలా మంచి పని.

2. అవతలి వారికీ, మనకీ మధ్య ఉన్న స్నేహం ఎలా ఉందో చూసుకొని ఆ రేంజ్ ని దాటి కామెంట్స్ పెట్టడం అంతగా బాగోదు.

3. అవతలి వారు కాస్త సరదా వ్యక్తులే అయితే పర్వాలేదు కాని లేకుంటే హుందా కామెంట్స్ చెయ్యటమే మంచిది.

4. వేరేవారు వ్రాసిన కామెంట్స్ ని విమర్శించడమో, దానికి కొనసాగింపు వాఖ్యలు అంత మంచి పద్దతికాదు. వారిద్దరి మధ్య అవగాహన యే మేరకు ఉందో మనకు తెలీదు. మధ్యలోకి వెళ్ళితే - మనం వారికి వారిద్దరికీ దూరం కావచ్చును. లేదా వారిద్దరూ విడిపోవచ్చును. అలా విడదీసిన పాపం మనకి తగలొచ్చు.

5. మొదట్లో మనము కాస్త అనుభవం వచ్చేసేవరకూ - కామెంట్స్ సరిగా పెట్టడం రాకపోవచ్చును. ఎదురు దెబ్బలు తగులుతాయి. అంత మాత్రాన మానుకోవటం సరికాదు. ఎక్కడ పొరబాట్లు చేశామో తెలుసుకొని, సరిదిద్దుకోవటం ఉత్తములు చేసే పద్ధతి.

6. మనకి కామెంట్స్ ఎలా చెయ్యాలో తెలీనప్పుడు, ఇతరులవి ఫోటో కామెంట్స్ చూడటం వల్ల ఎలా పెట్టాలో తెలుస్తుంటాయి. అలా అనుకొని అలాగే పెట్టడడం కూడా సరికాదు.

7. ఫోటో చూడగానే మన ఊహకి వచ్చినది వెంటనే వ్రాయటం పద్ధతి కాదు. కొద్దిగా ఆలోచించాలి. అవతలివారు ఎలా ఫీలవుతారూ అనీ.

8. మనం వ్రాసేది తెలుగు లో అయినా, రోమన్ తెలుగులో అయినా, లేక ఇంగ్లీష్ కానీ, మరే భాషలో వ్రాసినా అక్షర దోషాలు లేకుండా వ్రాయగలగాలి. అప్పుడే మన భావాన్ని సరిగ్గా చెప్పగలుగుతాము. అలా వ్రాస్తేనే చూడటానికి, చదవటానికి చాలా బాగుంటుంది.

9. మనం వ్రాసే కామెంట్ భావజాలం సరళముగా, హుందాగా ఉండాలి. చీపుగా, అసహ్యముగా ఉండొద్దు. అవతలివారు ఎంత అసహ్యముగా వ్రాసినా, హుందాగానే వ్రాయాలి. అలాంటివాటికి అలా వ్రాస్తేనే ఆ కామెంట్స్ చదివినవారి / చూసినవారి దృష్టిలో ఉన్నతముగా ఉంటారు. అలా కాక మీరూ అవతలి వారిలా అసహ్యకరమైన భాషని వాడితే, మీ బ్రాండింగ్ వాల్యూ తగ్గిపోవచ్చును.

10. మరీ అభ్యంతరముగా ఉంటే అలా వ్రాసినవారికి చాట్ లోనో, ప్రైవేట్ గానో ఒక మాట చెప్పండి. వారే తీసేస్తారు. ఈ మాత్రం దానికి మీరు మధనపడటం వృధా.

11. ఎవరి ఫొటోస్ వారివి ఇష్టం. వారు ఎలాంటి ఫొటోస్ పెట్టుకొనీ. అవి వారి యొక్క నైజాన్ని తెలియచేస్తుంటాయి. అంత అభ్యంతరముగా ఉంటే చాట్ లో చెప్పండి. లేదా మెయిల్ లో, లేదా ప్రైవేట్ గా స్క్రాప్ పెట్టండి.

12. మంచి ఫొటోస్ కలెక్షన్ పెడితే వీక్షకులూ బాగా ఉంటారు. కామెంట్స్ కూడా బాగుంటాయి.

13. సెక్సీ ఫొటోస్ ని, ఆడవారిని అసహ్య భంగిమల్లో ఉండే ఫొటోస్ పెట్టుకోవటం అంత మంచిది కాదు. ఒకవేళ పెట్టదలచుకుంటే మీకు మాత్రమే కనిపించేలా పెట్టుకోవటం మంచి పద్ధతి. అందరికీ అవి నచ్చవు. ఉన్న మిత్రులూ దూరం కావచ్చును. ఇలా ఒక అబ్బాయి మూడు నాలుగు ఫొటోస్ పెట్టాడు. నేనూ, ఇంకో నా స్నేహితురాలు అతనికి ఆడ్ అయినప్పుడు అవి లేవు. క్రొత్తగా అప్లోడ్ చేశాడు. అవి నచ్చక  మేమిద్దరమూ అతనికి దూరముగా వెళ్ళిపోవాల్సివచ్చింది. దానికి అతను పెద్దగా గొడవ చేశాడు. మధ్యలో ఇంకొకరి వత్తాసు. ఆ వయసులో అలాంటివే పెట్టుకుంటారు కదా అని. పెట్టుకోవచ్చును.. కాదనం. అవేవో పర్సనల్ గా పెట్టుకుంటే ఇంకా బాగుండేది కదా..

14. వాఖ్యలు మరీ విపరీతముగా చెయ్యకండి. వివాదాల జోలికి అసలు వెళ్ళకండి.

15. ఫొటోస్ కి ట్యాగ్స్ తప్పకుండా వ్రాయండి. అలా వ్రాస్తేనే ఆ ఫోటో లోని అర్థం ఎదుటివారికి సులభముగా అర్థం అవుతుంది.

16. కామెంట్ ని ఎలా వ్రాయాలంటే - ఒక చిన్న కిటుకు చెబుతాను. ఒక ఫోటోని చూడగానే మదిలో కలిగిన భావాన్ని, కామెంట్ రూపములోకి మార్చండి. అలా దాన్ని వెంటనే వ్రాయకుండా - అది వ్రాస్తే ఎదుటివారు ఎలా రిసీవ్ చేసుకుంటాడో, అది చూసి అతని మిత్రులు ఎలా అర్థం చేసుకుంటారో ఒకసారి ఊహించండి. ఇది చాలా నిజాయితీగా చెయ్యండి. అలా చేస్తే ఆ కామెంట్ పెట్టాలో, వద్దో తెలుస్తుంది. అలాంటి కామెంట్ అక్కడ వేరేవారు పెడితే, మీరు ఇంకో కామెంట్ పెట్టడానికి ప్రయత్నించండి. అలా ఎవరూ పెట్టకుంటే అది అక్కడ టైప్ చేశాక మళ్ళీ ఒకసారి అవతలి వ్యక్తీ, అతని మిత్రులూ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆలోచించండి. అలా చూసేవారికీ బాగా అనిపించాలి. అప్పుడు బాగా అనిపిస్తే పోస్ట్ చెయ్యండి.

17. అలా కామెంట్ ని పోస్ట్ చెయ్యటమే కాదు.. కొద్దిసేపటి తరవాత లేదా మూడు నాలుగు రోజుల వరకూ ఆ ఫోటో కామెంట్ వైపు చూడండి. ఎవరేమైనా దానికి వ్రాశారో కంటిన్యూగా వ్రాశారో, లేక ఏదైనా రిప్లై వచ్చిందా చూడండి.

18. కామెంట్స్ పెట్టినవారికి కృతజ్ఞతలు చెప్పటం మరచిపోకండి. మన దైనందిక జీవనములో ఎవరైనా కలిస్తే చిన్న విషయాలైన  - నమస్తే, మళ్ళీ కలుద్దాం, బై అని ఎలా చెప్పుకుంటామో అలాగే ఇక్కడ చెప్పటం ధర్మం అని నాకు అనిపిస్తుంది. దీనివలన రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి చెప్పిన వారికి కృతజ్ఞతలు తెలియచెయ్యటం, రెండోది వారి కామెంట్ ని మనం చూసాము అని తెలియజేయటానికి. ఇలా కృతజ్ఞతలు చెప్పటం మన ఆంధ్రుల్లో చాలా తక్కువ. చెబితే సొమ్మేం పోతుందో అని అనుకుంటారు.

19. ఒక కామెంట్ పెట్టడానికి సిద్దం అయ్యి, చూస్తే అప్పటికే అక్కడ ఇతరులు కామెంట్ పెట్టారు అనుకుందాం. మీరు పెట్టే కామెంట్ - వాటికి భిన్నముగా ఉంటే అసలు పెట్టకండి. అసలు ఆ ఫోటోనే చూడలేదని అనుకోండి. ఒకవేళ మీరు అలా పెట్టారు అనుకుందాం. అది మీ భావ వ్యక్తీకరణ గా ఎవరూ అనుకోరు. మన అభిప్రాయం మనం చెప్పుకోవటానికి మనకి ఈ ప్రజాస్వామిక దేశములో హక్కు ఉన్నా, వాస్తవానికి అది ఇక్కడ పని చెయ్యదు. వారందరూ మీమీద దాడి చెయ్యటం ఖాయం. అంతగా చెప్పాలీ అనుకుంటే ప్రైవేట్ గా స్క్రాప్ లో వ్రాసి పంపండి. వినటానికి వింతగా అనిపించినా ఇది నిజం.

20. అందుకే - ముందే చెప్పాను. రాజకీయాలు, సినీతారలు, వ్యక్తులూ, రీసెంట్ జెనరల్ టాపిక్స్.. ఫొటోస్, ఒకరి అభిప్రాయాల మీద అసలు కామెంట్స్ జోలికి వెళ్ళకండి. వెళ్ళారో - అక్కడ మీ భావ వ్యక్తీకరణని వేరుగా (విమర్శగా) అనుకోని, గొడవలు జరిగి, మీ స్నేహాలు దూరం కావచ్చును. అందుకే చాలావరకు స్నేహాలు ఇక్కడే దెబ్బ తింటాయి. నిజజీవితములో నా స్నేహితులు ఇద్దరూ - ఒకరు - రెవెన్యూలో సీనియర్ అసిస్టంట్ - కాంగ్రేస్, ఇంకొకరు - హైకోర్టు అడ్వకేట్ - తెలుగుదేశం అభిమానులు. ఒకరోజు - బాగా గుర్తుంది. ఒక ఆదివారం రోజున చాలా రోజులకి కలిశారు అని వాకింగ్ వెళ్ళినప్పుడు పాలిటిక్స్ మీద చర్చలు జరిగాయి. అది రాను రానూ ఎవరు గొప్ప అన్నదాని మీద చర్చ జరిగింది. అప్పటివరకూ బాగున్నవారు - ఎవరి పార్టీ వారిదే గొప్ప అనుకున్నారు. ఈ చర్చతో ఇద్దరి మొఖాలు మాడిపోయాయి. కొద్దిరోజుల వరకూ ఒకరి  పొడ వేరొకరికి గిట్టలేదు. దాదాపు ఇరవై ఏళ్ళ స్నేహం దెబ్బతింది. ఎక్కడైతే నమ్మకం పోతుందో అక్కడ స్నేహం నిలవదు. ఆరోజు ఇద్దరికీ పోయినట్లుంది. ఎదుటివారిలో తప్పులు భూతద్దం లో చూడటం మొదలెట్టారు.. ఇప్పటికీ ఇద్దరు సరిగా మాట్లాడుకోరు. ఆ పార్టీలు మాత్రం వాటి పని అవి చేసుకుంటూనే ఉన్నాయి. మధ్యలో వీరే దూరం అయ్యారు. స్నేహంలో ఎదుటివారి అభిప్రాయాలని గౌరవించాలి. అలా గౌరవించనినాడు ఆ స్నేహం నిలబడదు. టైం పాస్ స్నేహముగా మారుతుంది.

21. ఇన్నేళ్ళ (ఇరవై ఏళ్ళ) కాలాన్ని పెట్టుబడి పెట్టి - ప్రాణ స్నేహితులమని చెప్పుకొనే స్థాయి నుండి ఒకే ఒక చిన్న అభిప్రాయభేదం వల్ల దూరం చేసుకోవటం బాగుంటుందా.. వీరింటికీ వారింటికీ మధ్య జస్ట్ ఒక పది ఇండ్లు మాత్రమే అడ్డం. ఆరోజు నుండీ ఇలా చిన్నచిన్న అభిప్రాయభేదాల వల్ల స్నేహాలు దూరం చేసుకోవటం నాకు ఇష్టంలేదు. అందుకే అలా వివాదాస్పద విషయాలమీద కామెంట్స్ అసలు పెట్టను. ఆరోజు చూసిన ప్రత్యక్ష అనుభవం వల్ల అలా నిర్ణయం తీసుకున్నాను. మీరూ అలా చెయ్యరని - ఇక్కడ మీకూ చెప్పటం.

22. ఒకవేళ నేను వ్రాశాక - నా ప్రమేయం లేకున్నా - ఏదైనా గొడవ జరిగితే మాత్రం వెంటనే వారికి సారీ చెప్పేసి, ఆ కామెంట్ తీసేసి, ఇక కామెంట్స్ ఏమీ పోస్ట్ చెయ్యను.

23. నేను ఏమీ తప్పు చెయ్యని దానికి సారీ చెప్పడం ఎందుకూ అని మీకు అనిపించవచ్చును. పొరబాట్లు అందరూ చేస్తారు. చేయని వారంటూ లేరు. చేసినవారు చెప్పకున్నా, వారికి ఈగో సమస్య అడ్డం వచ్చి సారీ చెప్పక పోవచ్చును. కాని ప్రవైట్ స్క్రాప్ లో కాస్త సర్ది చెప్పితే - పొరబాటేమీ లేదు. నేను మాత్రం నా వైపునుండి స్నేహాన్ని నిలుపుకోవటానికి ఆఖరియత్నముగా చేస్తాను - అలా ఇరవై ఏళ్ళ స్నేహంలా దూరం కావద్దని. అంతే!. కాని నేనేదో తప్పు చేశాను అని కాదు. నాది తప్పయితే ఆ కామెంట్ వెంటనే తీసేసి స్క్రాప్స్ లో చెప్పేస్తాను. . పొరబాటు జరిగిందండి అనీ.

24. అందుకే ఫోటో కామెంట్స్ అనే కాదు, అన్ని కామెంట్స్ మీద కాస్త జాగ్రత్తగా ఉండమన్నది. పొరబాటు అనే మూలం మన నుండే మొదలు కాకుండా చూసుకోవటం అన్నివిధాలా శ్రేయస్కరం. మనం చేసిన కామెంట్ వల్ల ఇంతగా జరిగిందే అని బాధపడకుండా ఉండాలి అంటే పొరబాటు యొక్క మూలం - మనవద్ద నుండి మొదలు కావద్దు అనేది ముఖ్యం.

25. ఎంత జాగ్రత్తగా ఆలోచించి వ్రాసినా ఒక్కొక్కసారి రివర్స్ అవుతాయి. అలాంటప్పుడు మనం ఎలా ఆ కామెంట్స్ తీసేస్తున్నామో, అలాగే మన ఫొటోస్ కి వచ్చిన ఇబ్బందికర కామెంట్స్ ని మనమే తీసేసేయ్యాలి. మరీ ఇబ్బందికరముగా ఉంటే ప్రైవేట్ లో కాస్త వారితో మాట్లాడితేసరి. ఇలా నేను పెట్టిన మూడు - నాలుగు ఫొటోస్ కి చేశాను. వారితో సంబంధాలు అప్పటికంటే ఇప్పుడు మరీ బాగున్నాయి.

26. అబ్బో! ఇన్ని గొడవలు ఉన్నాయా.. నేనిక కామెంట్స్ వ్రాయను అని డిసైడ్ అవకండీ!. జస్ట్ ఈ జాగ్రత్తలు తీసుకోమని చెబుతున్నాను. ఒకసారి మనమెక్కిన ఆటోకి ఆక్సిడెంట్ అయ్యిందని ఇక ఆటో ఎక్కకుండా ఉంటామా.? కాస్త జాగ్రత్త తీసుకొని మళ్ళీ ఆటోలు ఎక్కుతునే ఉంటాము కదా.. ఇక్కడా అంతే!.

27. కామెంట్  వ్రాసేటప్పుడు ముందుగా ఒక చుక్క నొక్కి (.) తర్వాత ఎంటర్ బటన్ నొక్కి ఆతర్వాత కామెంట్ వ్రాయండి. పబ్లిష్ అయ్యాక అప్పుడు మీ కామెంట్ మరీ అందముగా కనిపిస్తుంది.

28. ఎన్ని వివాదాలు ఏర్పడ్డా వెంటనే ఆ ఇద్దరే మాట్లాడుకుంటే - కొద్దిపాటి సమయములోనే సమస్యలు దూరం అవుతాయి. యధావిధిగా ముందటి స్నేహాన్నే కొనసాగించవచ్చును. ఇంకా నిర్లక్ష్యం చేసినా, మూడో వ్యక్తి మధ్యలోకి వచ్చినా ఇక ఆ స్నేహం మునపటిలా కంటిన్యూ కాకపోవచ్చును. లేదా అక్కడే ఆగిపోవచ్చును. అప్పుడు ఆ స్నేహాన్ని నిలుపుకోకపోవటం వారిద్దరిదీ తప్పే అవుతుంది. 

updated on :
1st : 22- February - 2011 Morning.

3 comments:

vanajavanamali said...

Raj garoo.. chaalaa viluvaina vishayaalu thelusukuntunnam. thankyou very much.. nenu.. oka blog ki.. follower ga.. maaraanu.. adhi suddenga.. porabaatugaa jarigipoyindhi.nenu withdraw yelaa chesukovalo theliyadam ledhu..cheppamdi..plz!!!!!!!!!!!!

Raj said...

ఓకే.. తప్పకుండా చెబుతాను. పై టపా ముగింపు దశలో ఉంది. అది కాగానే మీకు కావలసిన సమాచారాన్ని, ఫొటోస్ తో, ఎలా సులభముగా మార్చొచ్చో ఒక టపా రూపములో పెడతాను. అంతవరకూ ఎదురుచూడగలరు. ఇక్కడ చెబితే మీకు అర్థం కాకపోవచ్చని, టపా రూపములో పెట్టాల్సి వస్తున్నది. నిజానికి ఈ సోషల్ సైట్స్ సీరీస్ అయ్యేవరకూ ఇంకో టపా జోలికి వెల్లోద్దని అనుకున్నాను. కాని మీ అత్యవసర పరిస్థితి కోసం వెళ్లక తప్పటం లేదు. రెండు రోజులు ఆగండి.

vanajavanamali said...

thank you very much raj gaaru. social site"s series complete.. avaneeyndi.. naatho paatu..vandhala mandhiki.. upayukthamaina,viluvaina vishayaalu.. cheputhunnaaru. naaku urjent yemi kaadhu.. I am waiting for your valuaeble lessons..with pleasure. keep it up..

Related Posts with Thumbnails