Monday, October 5, 2015

నా ఆన్లైన్ బిజినెస్ ఆలోచన

హ్మ్!.. రోజులన్నీ మామూలుగా గడిచిపోతున్నాయి. రోజువారీ కార్యక్రమాలు సాగిపోతూ..నే ఉన్నాయి. కానీ, ఏదో కొట్టొచ్చినట్లు వెలతి. ఏమిటా అదీ - అని ఎన్నేన్నోసార్లు నాలో నేను తొంగి చూసుకున్నాను.. ఏదో దొరికీ దొరకనట్లు, అస్పష్టముగా కనిపిస్తున్నది. అదేమిటీ? లిప్తకాలం అర్థమైనట్లు, ఆ తర్వాత ఇందాక ఏదో అగుపించిందే అని ఆలోచనలో పడటం.. ఏమై ఉంటుంది? ఇలా ఏళ్లకు ఏళ్లు గడుస్తూనే ఉన్నాయి. ఎవరితో అంతగా కలవలేక పోతున్నాను.. " జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది.." అన్నట్లుగా ఉంది. మూడు, నాలుగు ఏళ్లుగా ఈ మథనం. అలాని గడిచిన జీవితాన వెనక్కి చూస్తే - అప్పటికన్నా ఇప్పుడే చాలా నయం, బాగున్నాను అనిపిస్తుంది. చాలా విజయవంతమైన జీవితాన్ని, ఆనందాన్నీ పొందుతున్నాను నేను. అన్నీ ఉన్నాయి కానీ... అన్నట్లు ఏదో తెలీని లోటు.. నా చుట్టూ ఉన్నవారికి - ప్రేరణగా నా జీవితాన్ని మలిచాను. నా కష్టానికీ, శ్రమకీ, నైపుణ్యానికీ కాస్త గుర్తింపు రావటం మొదలెట్టింది. నా టాలెంట్ చుట్టుప్రక్కల వారిని ఆకట్టుకుంది. కానీ అది చాలదు.. చాలామందికన్నా నేను సక్సెస్ లో ఉన్నా, ఇంకా దాహం తీరటం లేదు.. ఏదో సాధించాలన్న ఆత్రం, ఆశయం, పట్టుదలా నాలో రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. నాలోని కళాకారుడికి దాహం తీరటం లేదు..

రోజు రోజుకీ సరిక్రొత్త ఆలోచనలు.. ఒకటి తరవాత ఒకటిగా ఎన్నెన్నో ఆలోచనలు. అన్నీ చెయ్యాలనిపిస్తుంది. అవన్నీ కొద్ది నైపుణ్యముతో కూడుకున్నవి అయినా - స్థాయి తక్కువగా ఉండటం వల్ల - ( స్థాయి అంటే ప్రజల దృష్టిలో సామాజిక స్థాయి అన్నమాట ) వాటిని స్వయంగా నేర్చుకున్నా - బయటకి ఎక్కడా ప్రయత్నించలేదు. ఆ పనులు నాకు వస్తాయని కూడా ఎవరికీ తెలీదు. వాటికి ఒక గుర్తింపు తీసుకురావాలన్నది నాకు ఆలోచన వచ్చింది.. ఏమి చేస్తే బాగుంటుంది ? అన్న మేధో మథనం (? :P) మొదలయ్యింది.

అపుడే ఆన్లైన్ బిజినెస్ గురించి విన్నాను.. విన్నాక - అది ఎలా ఉంటుందో కొన్ని పేరెన్నిక సైట్లనీ గమనించాను. వాటి పోస్టింగ్స్ నీ, వాటి వివరాల గురించీ, వాటిని ఎలా పంపిస్తారు - ట్రాన్స్ కషన్స్ Transactions ఎలానో ఒంటరిగా వివరాలు సేకరిస్తూ పోసాగాను. అలా పెద్ద సైట్లే కాకుండా చిన్న చిన్న సైట్లూ చూడటం మొదలెట్టాను.. అన్నీ దాదాపు ఒకేలా ఉన్నాయి. అమ్మే వస్తువులు, సైట్ లే అవుట్స్ మాత్రమే కాస్త విభిన్నం. అంతే!.. హ్మ్! ఇదేదో బాగుందే అని ప్రాథమికంగా నిర్దారణ లోకి వచ్చాను. ఇక మరింతగా తెలుసుకోవట మొదలెట్టాను.

ఈ ఆన్లైన్ సైట్స్ అన్నవి రకరకాల వస్తువుల్నీ, సేవల్నీ అందిస్తున్నాయి. వాటి వాటి పరిమితుల మేరా అవి వ్యాపారాన్ని చేస్తున్నాయి. వ్యాపార అమ్మకాల సంస్థలని ముఖ్యముగా మూడు రకాలుగా విభజించ వచ్చును. అవి :
1. తాము ఆ వస్తువులని తయారుచేసి, అమ్మేవి. 
2. ఇతరులు చేసినవి అమ్మేవి. 
3. ఇతరులతో వస్తువులని చేయించి, అమ్మేవి. ( Entrepreneurship )

దాదాపుగా ఎక్కువ ఆన్లైన్ వ్యాపార సంస్థలు ఈ మూడింటిలో ఏదో ఒక వర్గానికి చెందినవి ఉన్నాయని నా అభిప్రాయం. నేను చేయబోయే ఆన్లైన్ వ్యాపార సంస్థ కూడా ఈమూడింటిలో ఏదో ఒక దానికి చెందినదై ఉంటుంది. ( చివరిగా ఈ మూడింటినీ కలిపి చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను ) హా! అవును. అదే విషయం చెప్పాలనే ఈ పోస్ట్.

అలాగే ఈ సంస్థలు విజయం కావాలంటే ఏమి చెయ్యాలో కూడా ఆలోచించాను. ఈ ఆన్లైన్ లో లేనివీ, నాకు అందుబాటులో ఉన్నవీ, నేను చేసేవీ, ఇతరులతో చేయించేవీ, వేరేవారి దగ్గర కొని, తిరిగి అమ్మేవీ.. ఇలా నాకు అందుబాటులోని సేవలు ఏమిటో ఆలోచించసాగాను. కొన్ని వస్తువులు మదికి తట్టాయి. కొరియర్ సంస్థలతో లింక్ అప్ Link-up కావాలి.. అదింకా పెండింగ్ లో ఉంది.

సైటు నిర్మాణం, నిర్వహణ అన్నది తరవాత చెయ్యాలని అనుకుంటున్నా.. ముందైతే ఉచిత సర్వీసుల్ని విరివిగా వాడుకోవాల్సిందే. అందుకు నా ఫేస్ బుక్ అకౌంట్ నీ, ఈ బ్లాగ్ నీ వాడుకోక తప్పేలా లేదు.. అది తరవాత సంగతి.

నేను పెట్టే / అమ్మే వస్తువుల గురించి ఆన్లైన్లో వెదికాను. హ్మ్. దాదాపుగా లేవు. కొన్ని ఉన్నా అంతంత మాత్రమే!.. వర్క్ బాగోలేదు. ఒక వస్తువు చూశా.. అ పోస్ట్ పెట్టి ఒకటిన్నర సంవత్సరం అవుతుంది. చాలా చిన్న సైజులో ఉన్నా ( దాదాపు అంగుళములో సగం ) బాగానే అమ్మకాలు ఉన్నాయి. వర్క్ అంత బాగా లేదు.. స్మూత్ గా లేదు.. లోకల్ గా అయితే తక్కువ ధరలోనే దొరుకుతుంది. ఎంతైనా ఆన్లైన్ క్రేజ్ ఉందిగా. దాని వల్ల వినియోగదారులూ బాగానే ఉన్నారు కూడా. ఆ వస్తువుకు దాదాపు 1800+ అమ్మకాలు ఉన్నాయి. ఆ వస్తువు రేటూ బాగా ఉంది కూడా. ఆ రేటులో కొరియర్ సేవల రేటు బాగా ఉంటుంది. ఎందుకంటే మనకి వినియోగ దారులు ప్రపంచ అంతటా నుండి ఉంటారు. వారి దాకా పంపాలంటే కొరియర్ చార్జీలు బాగానే ఉంటాయ్. దాన్ని తగ్గించలేము. కొన్ని తప్పవు. ఒక్కో వస్తువుకి వంద రూపాయలు లాభం వేసుకున్నా ఆ వస్తువుకి రూ. 1,80,000 ( 1800 x 100 ) లాభం వస్తుంది. చాలా బాగుంది కదూ.. ఇక నేనూ ఒక సైట్ పెట్టాలని ఫిక్స్ అయ్యా..

దినపత్రికల్లో ముఖ్యముగా ఈనాడు వసుంధర లో - కొందరి ఆన్లైన్ బిజినెస్ చేసేవారిని పరిచయం చేస్తూ, వారి అనుభవాలనూ, ఇబ్బందులూ, వాటిని ఎలా ఎదురుకున్నారో అన్నీ వివరముగా చెప్పారు / చెబుతున్నారు కూడా. అవి బాగా ప్రేరణని ఇచ్చాయి. వాటన్నింటిలో కామన్ గా ఉన్నా విషయం ఏమిటంటే - మొదట్లో చాలా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఒక్కో ఇబ్బందినీ ఎంత తక్కువ కాలములో, ఎంత సమర్థవంతముగా ఎదురుకున్నావో అనే దానిపైన ఆ సైట్ జీవితకాలం ఆధారపడి ఉంటుంది. అలాగే మొదటి వినియోగదారులూ, వారి కామెంట్స్, రేటింగ్స్ ఆ సైట్స్ కి చాలా ముఖ్యం. అక్కడ సక్సెస్ అయితే - ఇక అంతా నల్లేరు నడకనే.. ఇక అన్నింటి సక్సెస్ ఇంటర్వూ లలో ఉన్న మరో కామన్ పాయింట్ ఏమిటంటే - ఫేస్ బుక్ లో పేజీ. అదీ అమ్మకాలల్లో ప్రధాన సమాచారానికీ, వినియోగదారులకు అందుబాటులో ఉంటూ, మన వస్తువులని ఈ ప్రపంచములో అందరికీ తెలియ చేస్తుంది. పైగా ఈ పేజీ నిర్వహణ చాలా సులభమే. ఉచితముగా నిర్వహించుకోగలిగే ఈ పేజీ అనేది - ప్రపంచ వ్యాప్తముగా ఉన్న ఫేస్ బుక్ వినియోగదారులను మనకు చేరువ చేస్తుంది. ఈ ముఖ్య విషయాన్ని తెలియచేసిన ఈనాడు వారికీ, అందులో ఇంటర్యూలు ఇచ్చిన ఆన్లైన్ వ్యాపార విక్రేతలకూ కృతజ్ఞతలు. నేనూ ఒక పేజీ ఓపెన్ చెయ్యాలి అనుకున్నాను.

ఫేస్ బుక్ లో పేజీలంటే నాకు క్రోత్తేమీ కాదు.. వాటి నిర్వహణలో చాలా అనుభవమే ఉంది. నా నిర్వహణలో కొన్ని పేజీలు ఉన్నాయి. వెంటనే ఒక పేజీ తెరవవచ్చు. కానీ.. ఈ ఆన్లైన్ బిజినెస్ పేజీలు ఎలా ఉంటాయో తెలీదు.. అవి ఎలా ఉంటాయో చూశాకనే పేజీ తెరవాలని అనుకున్నాను. రోజులో నాకంటూ మిగిలే కొద్దిపాటి సమయంలో - వీలున్నప్పుడల్లా పేజీలని గమనించడం మొదలెట్టాను.. అలా చాలానే ఉన్నాయి పేజీలు. వీటిని వెదకాలంటే చాలా ఓపిక, సమయం.. అవసరం. ఇలా అయితే పని కాదని వాటి మూలాల నుండి వెదకడం మొదలెట్టాను. మూలాలు అంటే - ఒక్కో పేజీని తెరవాలంటే వాటిని తెరిచేటప్పుడే ఒక ప్రత్యేకమైన వర్గాల Specifications క్రిందకు చేర్చాలి. మళ్ళీ అందులో విభాగాలు ఉంటాయి. అలా వాటిని సెర్చ్ బాక్స్ లో టైపు చేసి, వెదికా.. చాలానే పేజీలు చూశా.. అప్పుడే నన్ను ఆశ్చర్యం, మిక్కిలి ఆనందంలో ముంచేసిన విషయమూ జరిగింది. అదిప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

అలా ఒక పేజీ ఓపెన్ చేసినప్పుడు - అందులోని ఒక పోస్ట్ కి ఒకరు తన కామెంట్ చాలా బాగా చేశారు. చాలా అద్భుతముగా ఉంది. అలా వ్రాయాలి కామెంట్స్ అనుకున్నాను. ఎవరా వ్రాసింది అంటూ వారి ప్రొఫైల్ ని ఓపెన్ చేశాను. వారి పోస్ట్స్, టైం లైన్, అప్లోడ్ చేసిన ఫొటోస్, వారి ఫ్రెండ్స్, లైక్స్... ఇలా అన్నీ చూస్తూ పోయాను. చివరిగా తను ఇతర పేజీల మీద వ్రాసిన రివ్యూస్ Reviews కూడా చూశాను. అందులో ఒకటి సాంపుల్ గా Sample చూద్దాం.. ఎలా రివ్యూ వ్రాశారో అనీ. ఆ రివ్యూ ని చదివా.. బాగా ఆసక్తిగా అనిపించింది. వెంటనే ఆ ప్రొఫైల్ నుండి ఆ పేజీలోకి వెళ్లాను.

ఆ పేజీని క్రొత్తగా జేవేల్లెరి స్టోర్ Jewellery Store విభాగం క్రింద ఏర్పాటు చేశారు. ఆ పేజీ లైక్స్ మూడువందల కన్నా తక్కువే ఉన్నాయప్పుడు. తక్కువ ఖర్చుతో, మగువల అందాలను మరింతగా ద్విగుణీకృతం చెయ్యటానికి, వారి కోసం అనీ చేసిన ఫ్యాషన్ జేవెల్లరీ అది. ఆ పేజీ మీద అంతగా రివ్యూ వ్రాసే పాయింట్ ఏముందా? అనుకుంటూ ఆ పేజీ జల్లెడ పట్టాను. ఆ పేజీ ఓపెన్ అయినప్పటి నుండీ అన్ని పోస్ట్స్ చూసుకుంటూ వచ్చాను. వ్యూయర్స్ కామెంట్స్ కూడా చదువుకుంటూ వచ్చాను. ఎప్పటికప్పుడు వాటికి ఆ పేజీ స్వంతదారుడు ( అడ్మిన్ Admin ) జవాబులు ఇస్తూ వెళుతున్నాడు.. అలా కొన్ని కామెంట్స్ చూశాక, ఈ కామెంట్స్ శైలి ఎక్కడో చూశానే అనిపించింది. మరింత ఆసక్తిగా ఆ కామెంట్స్ ని వెదికి చూశాను. ఎస్.. అవును.. నాకు బాగా సుపరిచితమైన శైలి అది. కొన్ని సంవత్సరాల అనుభవమైన శైలి అది. ఆ కామెంట్స్ వ్రాసిన వారి ప్రొఫైల్స్ చూశాక నా అనుమానం దాదాపుగా నిజమయింది. అలాగే వెదుక్కుంటూ వెళ్ళా. ఒక దగ్గర ఆ పేజీ అడ్మిన్ ఎవరో, ఆ వస్తువులను ఎవరు ఎలా చేసి అలా అమ్మకానికి పెట్టిందీ తెలిసింది. వారు ఎవరో కాదు.. నా మాజీ స్నేహితుడే.. నేను దూరం చేసుకున్నానే అని చెప్పా కదా.. ఆ స్నేహితుడే. చాలా సంతోషముగా ఫీలయ్యాను. ఏదో కోల్పోయినది మళ్ళీ పొందాను అన్నభావన..

తనకి అంత టాలెంట్ ఉందని నాకూ తెలీదు.. చాలా బాగా చేశాడు. డిజైన్స్ చాలా బాగున్నాయి. ఒక్కొక్కటీ ఒక్కో వెరైటీగా చేశాడు. చాలా పేజీలో ఉన్నట్లు ఒకటే చేసి చాలా కలర్స్ లలో పెట్టలేదు. ఎన్నెన్నో వైవిధ్యాలు. ఇప్పుడే ఆర్డర్ ఇవ్వాలనిపించేంతగా బాగున్నాయి. తన పట్టుదల నాకు నాకు తెలుసు. ఆ రంగంలో తన అభిరుచీ తెలుసు. కనుకనే బాగా రిచ్ గా ఆ డిజైన్స్ వచ్చాయి. తన శ్రమ వాటిల్లో బాగా కనిపిస్తుంది. తనకి ఇలా చేయవస్తుందని నాకు ఊహామాత్రమైన తెలీదు. ఏమిటీ ? నా మాజీ స్నేహితుడని ఇంతగా అభినందిస్తూ వ్రాస్తున్నాను అనుకుంటున్నారా?.. అదేమీ లేదు.. నిజంగానే చెబుతున్నా.. తనేమిటో నాకు బాగా తెలుసు.. తన జీవితాన ఇదో గొప్ప మలుపు కూడా.. నేను దూరమున్నా / దూరమైనా - తన కోసం ఈమాత్రమైనా పుషప్ Push-up ఇవ్వాలి కదా.. (మాజీ) స్నేహితునిగా నా కనీస ధర్మం అది. దూరముగా ఉన్నా స్నేహితుడి శ్రేయస్సుని కోరుకోవాలి.

అలాని తన పేజీలో లోపాలు అన్నవి లేవని కాదు.. చిన్నవే అవి. సెక్షన్స్ వారిగా (అంటే ప్రత్యేక ఆల్బమ్స్ వారిగా) వాటిలోకి మారిస్తే మరింతగా అందముగా ఉండేది. " అభినందనలే పబ్లిక్ గా చెప్పాలి. విమర్శలు అన్నవి అంతరంగికముగా / ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలి.. అలా అయితేనే స్నేహం చాలా బాగుంటుంది.. " అన్న విషయం తెలుసు.

అందుకే పర్సనల్ మెస్సేజ్ పెట్టి, అభినందనలు చెప్పాను. చెప్పొద్దూ అనుకుంటూనే బిలేటేడ్ విషెస్ చెప్పా.. మూడోరోజుకి - THANK YOU అన్న చిన్న మెసేజ్..  నాకు తెలుసు.. అన్నిరోజుల సమయం అవుతుందనీ. తన గురించి బాగా తెలుసు కాబట్టి. చాలా ఆనందం వేసింది. ఆ మాట చిన్నదే కావొచ్చు. అతడు నాతో మాట్లాడాడు అన్న ఫీలింగ్ చాలా సంతోషాన్ని కలుగజేసింది. అది చాలు..

ఇక నా పేజీ త్వరలోనే మొదలెట్టాలి. కాసింత సమయాన్ని వెచ్చించాలి. ఆన్లైన్ బిజినెస్ రుచి కూడా చవి చూడాలి. ఎందరో అద్భుత విజయాలను సాధిస్తున్నారు.. నేను ఆ మాత్రం సాధించాలేనా? చూడాలి.. కాలమే తెలుస్తుంది. పేజీ తెరిచాక మళ్ళీ ఇక్కడే అప్డేట్ చేస్తాను.. 


4 comments:

Anonymous said...

Very nice.. Go ahead.

Raj said...

Thank you andee..

Unknown said...

Me Abiprayam kosam yeduruchustunnamu
by
gnmrao34 @gmail.com

Raj said...

త్వరలోనే మొదలెడుతున్నాను.. కొన్ని పనులు పూర్తవ్వాలి. అందుకే ఆలస్యం. మొదలెట్టాక తప్పక టపా పెడుతాను.

Related Posts with Thumbnails