Friday, February 20, 2015

Good Morning - 576


అన్నయ్య, సోల్ మేట్, అక్కయ్య, బాస్, బాబాయ్, గైడ్, మెంటార్, గురు.. ఇలా మీకు నచ్చిన ఏ పేరైనా పెట్టుకోండి. మీకంటే విద్యాధికుడు అయిన శ్రేయోభిలాషి ఒకరిని ఎంచుకోండి. మీ ఆలోచనలు, భయాల్నీ ఆ వ్యక్తితో పంచుకోండి. మనసు విప్పి మాట్లాడండి. కేవలం పంచుకోవడం ద్వారానే చాలా ఒత్తిళ్లు దూరమవుతాయి. 

అవును.. అక్షరాలా నిజం.. ఎవరికీ వారు యమునా తీరే అన్నట్లు ఉన్న ఈరోజుల్లోని మానవ సంబంధాలలో ఒత్తిడి క్రమేపీ పెరుగుతున్నది. మన మొబైల్ ఫోన్ లో ఎన్నో కాంటాక్ట్ పర్సన్స్ ఒక్క రింగ్ దూరములో ఉన్ననూ , మన సామాజిక సైట్లలో వందలాది స్నేహితులున్నా.. మనసుకి గిరి గీసుకొని కూర్చుంటున్నాం. మన ఊసులు చెప్పుకోవడానికి, మన విషయాలనీ, విజయాలనీ, బాధల్నీ, మన ఆలోచనలనీ.. అన్నింటికన్నా మనలోపలి మనని - చాలా నమ్మకమైన వారితో, స్వేచ్చగా భావప్రకటన చేసుకోలేక పోతున్నాం. అందుకు గల కారణాలలో - మనకి చుట్టూరా ఉన్న వారిలో అలా మనసుని కలిపేసి, మనల్ని మనం ఆవిష్కరించుకోవాల్సిన వ్యక్తి మన దరిదాపుల్లో కనిపించక పోవటం వల్లనే. వారిలో మనం అనుకున్న లక్షణాలు వారిలో కనిపించక పోవటం వల్లనే అలా - "జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది.." అన్న స్థాయిలో మనం ఉంటాం. 

మనం చెప్పే ఊసులూ, విషయాలు, పంచుకొనే భావజాలం అంతా మనం వారి వద్ద స్వేచ్చగా, చిన్న పిల్లాడిలా చెప్పుకున్నా వాటన్నింటినీ తనలోనే దాచుకొని, మన ఆలోచనల్లో, నడతలో, చేసే పనుల్లో ఏమైనా తప్పులు ఉంటే నిజాయితీగా, నిర్భయముగా సరిదిద్దగలిగే - విద్యాధికులైన వ్యక్తి సహచర్యం లభిస్తే - అంతకన్నా కావల్సిందేముంది.. వారితో గడపడం ఎంతో హాయిగా ఉంటుంది. అదే సమయాన వారి పట్ల మనలో ఉన్న విలువ వల్ల గౌరవంగా చూసుకుంటాం. ఒక్కోసారి వారి కంటికి - శరీరం బాగా ఎదిగిన చంటి పిల్లాడిలా - కనిపిస్తాం. నిజానికి అలా కనిపిస్తేనే - మనం వారితో పూర్తిగా మమేకమవుతున్నాం అనటానికి అదో కొండ గుర్తు. మన జీవితమంతా వారి చేతుల్లో పెట్టేస్తాం.. వారు ఏది చెబితే అదే రైట్ అంటాం. వారు చెప్పినవి తూ.చ. తప్పకుండా పాటిస్తాం. వారికి ఇది కావాలంటే వెంటనే ఏదైనా సరే చేస్తాం.. వారు తిట్టినా, కోప్పడ్డా అంతా మన మంచికే అని భావిస్తాం. 

ఇలాంటి ఈ బంధానికి మనం ఏమి పేరు పెట్టుకున్నా సరే.. అన్నయ్య, అక్కయ్య, వదిన, గురూ, బాస్, మామా, మెంటార్, హీరో, సోల్ మేట్... ఆఖరికి - లడ్డు, బంగారం, రాక్షసి, దయ్యం... అని పేరు పెట్టుకున్నా సరే.. ( మనం వారికిచ్చే గౌరవం వల్ల వారి ముందు అలా అనలేం.. ) ఆ బంధం కాలక్రమేణా బలీయముగా మారుతుంది. అంతా బాగుంది అనుకున్న తరుణంలో  ఒక్కసారిగా - కొన్ని పరిస్థితుల వల్ల బ్రేకప్ అవుతుంది. ( ఇలాంటివి చాలా చూశాను ) అలా విడిపోయినా - వారిద్దరూ ఒకరి ఊహల్లో మరొకరుగా - ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తుకువస్తూ ఉంటుంటారు కూడా. ఆ బంధాన్ని జీవితం కడవరకూ అలాగే మనసులో కొనసాగిస్తారు కూడా. 

నావరకు చెప్పాలంటే - నాకంటూ ఒక స్నేహితుడు ఉండేవారు. తన సహచర్యంలో నేను బాగా స్నేహాన్ని పొందాను.. కొన్ని పరిస్థితుల్లో దూరమయ్యాను. ఊహంటూ వచ్చాక నాకంటూ ఉన్న గోల్డెన్ డేస్ అంటే అవే..  వారి మాటలూ / చేసిన బాసలూ నిజం చెయ్యాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాను.. అందుకు రోజురోజుకీ ప్రగతి కనిపిస్తున్నది. ఏదో ఒకరోజు తనకు ఇచ్చిన బాసలనీ, తను ఆకాంక్షించిన మార్పులనీ నెరవేర్చే ప్రయత్నాలలో ఉన్నాను. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే - ఒక మంచి ఆత్మీయ మిత్రుడిని ఎన్నుకోండి. వారితో మనసా వాచా కలసిపోండి. మీ గుండెలోతుల్లో నుండి - మిమ్మల్ని మీరు బయటకు తెండి. మీ ఆలోచనలని పంచుకోండి. ఎక్కడా అసహజముగా ఉండకండి. అవతలివారు మిమ్మల్ని మరింత అభివృద్ధిలోకి తేవాలని ప్రయత్నిస్తే - మార్పు చూపండి.. ఈ జీవితం ఎంత క్రొత్తగా ఉంటుందో - మీరే నమ్మలేకపోతారు కూడా. ప్రతీరోజు ఉత్సాహం ఉరకేస్తుంది. ఇప్పుడు నేను అలాగే ఉన్నా. ఇక ముందు నా స్నేహితుడు అనుకున్న - సక్సెస్ పర్సన్ లా ఉండాలనుకుంటున్నా. 

ఇదంతా కేవలం - అలా ఒకరిని ఎన్నుకొని వారికి విధేయులమై ఉంటే సరిపోదు.. అవతలివారు మనల్ని సరియైన దిశలో, అభివృద్ధిలోకి రావాలంటే ఏమి చేస్తే బాగుంటుందో  తెలిసిన వ్యక్తై ఉండాలి. అలాంటివారు మీ జీవితాన తారసపడితే - నిస్సందేహముగా - మీరు అదృష్టవంతులు. No comments:

Related Posts with Thumbnails