Wednesday, February 18, 2015

జీవితం అంటే -

నేనీమధ్య ఒక చిన్న కథ చదివా.. చివరివరకూ ఏమిటా అన్నది అర్థం కాలేదు.. తరవాత బాగా నచ్చేసింది. ఈ కథని ఎవరు వ్రాశారో ( రచయిత / రచయిత్రి ) గానీ నాకు చాలా బాగా నచ్చేసింది. అచ్చు తప్పులు సరిచేసి, కాస్త కథని కొద్ది వివరముగా మళ్ళీ వ్రాసుకున్నాను ఇలా. 

జీవితం అంటే -
*****************
ఒకరోజు ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరకి వచ్చింది " నాన్నా..! నేను ఈ కష్టాలు పడలేను. నాకు జీవితం అంటేనే విసుగేస్తోంది. నాకే ఇన్ని కష్టాలు రావాలా..? " అంటూ తన బాధలను చెప్పుకుంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.

తండ్రి మౌనంగా విన్నాడు. ఏమీ మాట్లాడలేదు. చిన్నగా నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచాడు. గ్యాస్ పొయ్యి మీదున్న - మూడు బర్నర్ల మీద మూడు గిన్నెలు పెట్టాడు. వాటిల్లో నీళ్ళు పోసి ఒకదానిలో బంగాళా దుంపలు ( ఆలుగడ్డలు), మరొకదానిలో కోడిగుడ్లు, ఇంకో గిన్నెలో కాఫీగింజలు వేశాడు.

తండ్రి తనతో అలా నిర్లక్ష్యముగా ఉండి, ఏమీ మాట్లాడకుండా చేస్తున్న పని మీద కోపం వస్తున్నా - అలాగే చూడసాగింది ఆ అమ్మాయి.

అలా 20 నిముషాలు మరిగించాక - స్టవ్ ని కట్టేసి, ఆ గిన్నెలను దింపి, వాటిని కూతురు ముందు పెట్టి ఏమి జరిగిందో పరిశీలింఛి చెప్పమన్నాడు.

నాన్న ' అలా ఎందుకు చేసాడా పని..' అని అయోమయముగా ఉన్న ఆ కూతురు వాటిని పరిశీలించాక అంది " ఏముందీ..! దుంపలు మెత్తబడ్డాయి. కోడిగుడ్డు గట్టిపడింది. కాఫీ డికాషన్ వచ్చింది.. అయినా ఇదంతా ఎందుకు అడుగుతున్నావు నాన్నా?.. "

అప్పుడు ఆ తండ్రి చిన్నగా నవ్వి,
" ఆ మూడింటికీ ఒకే రకమైన ప్రతికూలత ఎదురయ్యింది. అంటే ఒకేలా ఒకే రకమైన గిన్నెల్లో, అదే గ్యాస్ వేడినీ, వేడినీటినీ చవిచూశాయి. కానీ, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్పందించాయి అని గమనించావా? మామూలుగా గట్టిగా ఉండే దుంపలు ఇప్పుడు మెత్తబడ్డాయి. చితికిపోయే గుడ్డు గట్టిపడింది. గట్టిగా ఉండే కాఫీ గింజలు మెత్తపడి, వాటిలోని రసాన్ని ఊరించి, నీటిరంగునే మార్చింది.. అవునా..!!

ఇప్పుడు చెప్పు..
వీటిల్లో - నీవు ఎలా ఉండాలి అనుకుంటున్నావు?
మెత్తబడిపోతావా..? ( ఇప్పుడు నీవున్న స్థితి అదే.. )
గట్టిపడిపోతావా..?
పరిస్థితులను మారుస్తావా...?
ఇక్కడ నీదే ఎంపిక, దానిమీదే ఇందాక నీవడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది.." అన్నాడు.

ఆ అమ్మాయి మొఖంలో ఏదో తెలీని వెలుగు. కన్నీళ్లు ఆగిపోయాయి. బాధలేదు. దానిబదులుగా ఆ కళ్ళల్లో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది.. " నాన్నా! యూ ఆర్ మై రియల్ హీరో.. మెంటార్.. ఎవర్ అండ్ ఫరెవర్.." కృతజ్ఞతాభావంతో అంది. 


2 comments:

sriraga said...

avunandee idi.. coffeebeen, potato, egg ane english inspirational story ku telugu anuvadam.. good moral story...

Raj said...

థాంక్యూ

Related Posts with Thumbnails