( మాజీ ) మిత్రమా..బాగున్నారా ? మీరు బాగున్నారనే అనుకుంటాము.
హ్మ్! కాలమెంత వేగముగా వెళ్ళిపోతున్నది !!
నాలుగు సంవత్సరాల క్రిందట ఈరోజునే మీకు దూరమయ్యాం.
అప్పుడే ఇన్ని సంవత్సరాలయ్యిందా అనిపిస్తున్నది కదూ.. మాకైతే అలాగే ఉంది కూడా.
ఈరోజు మనసా, వాచా ఒక్కసారి మిమ్మల్ని గుర్తు చేసుకోవాలనిపించింది. కారణాలు బోలెడు..
ఈ సృష్టిలో చాలా బలమైనది స్నేహబంధం అంటే ఏమో అనుకున్నాను. నాకైతే అంత నమ్మకమేమీ లేదు కూడా. నా జీవితం నేర్పిన అనుభవాలు అలాంటివి.
మీరు పరిచయమయ్యాక - నమ్మాల్సివచ్చింది. ఎంతగా అంటే నన్ను నేను పూర్తిగా మారేలా.
అందాకా మెటీరియలస్టిక్ గా ఉన్న నాకు నిజమైన స్నేహమంటే ఏమిటో రుచి చూశాను.
మొదట్లో నమ్మలేదు.. ఈ కలికాలములో నిజమైన స్నేహాలు ఇంకా ఉన్నాయని ఎన్నడూ అనుకోలేదు.. కానీ నావరకు వచ్చేసరికి - మీతో చేసిన స్నేహం వల్ల నమ్మాల్సి వచ్చింది. నెమనెమ్మదిగా స్నేహభావాన్ని పెంచుకుంటూ పోయాను. కలసినన్ని రోజులూ స్వచ్చమైన స్నేహాన్ని అందుకుందామని / అందించాలనీ అనుకున్నాను...
చాలా శ్రద్ధగా స్నేహించాను.. ఆరోజులు నాకు మరపురాని అనుభూతులనిచ్చాయి.
కొన్ని బలమైన పరిస్థితుల వల్ల మీనుండి దూరంగా ఉండాలనుకున్నాం..
మీరేమిటో, మీ మనసేమిటో తెలిసిన మాకు - అలా స్నేహాన్ని ముక్కలు చెయ్యాలనిపించాకున్నా చెయ్యక తప్పింది కాదు.
మా జీవితాలకు దొరికిన ఏకైక స్నేహ బంధాన్ని దూరం చేసుకోవాల్సి వచ్చింది.
అందుకు గల కారణాలని ఆ విడిపోయే రోజున మీకు చెప్పాలని వచ్చాను. నిజానికి ఇలా ఎందుకు దూరముగా ఉండాలనుకుంటున్నామో ఈ లోకాన ఎవరూ వారి స్నేహితులకి చెప్పి దూరమై ఉండకపోవచ్చును. కానీ చెబితే బాగుంటుందని నేను అనుకున్నాను... ఎందుకంటే ఎందుకిలా మధ్యలో స్నేహాన్ని త్రెంచేసుకుంటున్నారో కారణాలు మీకు తెలియాలని.. ఆ విషయాలని మీకు చెప్పాలని వచ్చాను.. చిన్నపిల్లాడి మనస్తత్వం అని ఎవరేమనుకున్నా ఫరవాలేదు.. కాలగమనంలో ఇదే నిజమని వారు తెలుసుకుంటారు... మీరేమో మాట్లాడక మొహం త్రిప్పేసుకున్నారు. పలకరించినా ... జవాబు లేదు.
అలా చేస్తారని మేము ఊహించిందే కాబట్టి... మీవెంట వచ్చిన ఫ్రెండ్ తో చెప్పేసి, వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాం.
కారణం : మీరు బాధపడితే మేం చూడలేకపోయి.. మీకు దూరముగా వెళ్ళలేము కాబట్టి. కొన్ని ఆత్మీయతలు, అనుబంధాలు అలానే ఉంటాయి. కొన్ని బంధాలను దూరం చేసుకోవాలనుకున్నప్పుడు - మనసుని రాయిలా చేసుకోక తప్పదు.
మీ ఫ్రెండ్ కి చెప్పింది - మీ స్నేహితుల వర్షన్ అది. మీకు చెప్పాలనుకున్న కారణాలు - మీతో మాట్లాడనివ్వని కారణాన మాలోనే దాచేసుకోవాల్సి వచ్చింది. నిజానికి ఇదే చెప్పాలని అనుకున్నాము.. కానీ పరిస్థితులు కుదరక పోయి, ఇప్పటికీ అలాగే మాలోనే ఉండిపోయాయి. ఇప్పుడు ఇక్కడ చెప్పాలని కూడా లేదు. కానీ ఇదే ఈ సీరీస్ లో చివరి పోస్ట్ కాబట్టి కొన్ని చెప్పాలనుకుంటున్నా.. ఇబ్బంది పెడుతున్నందులకు క్షమించండి. ఈ సంవత్సరమే చివరిది - ఈ జ్ఞాపకాలు. ( పాత పోస్ట్స్ We miss you friend.., I miss you friend.. )అందుకే ఇలా. వచ్చేసంవత్సరం నుండీ ఇవేమీ ఉండవు.
The biggest mistake I have made in my life is letting people stay in my life far longer than they deserved to. అని మీరు అన్నప్పుడు - వెంటనే అడిగా.. మేమైతే కాదుగా అనీ. ఉంటే చెప్పండి.. తక్షణం దూరమై పోతానన్నాను. " అలా అడిగి ఎందుకు ఇబ్బంది పెడతారు.." అన్నారు గానీ - కా దు అని ఒక్కమాట అని ఉంటే వేరేలా ఉండేది. అప్పటికే మామీద కొనసాగిన వ్యతిరేకతలు మీ మీద ప్రభావం చూపాయని అనిపించి, ఆరోజు నుండీ దూరం జరిగాం. వేరేవారిని ఉద్దేశ్యించి అన్నారు కాబోలు అనుకొని మీమాంసతో కొనసాగాం.
ఈలోకాన ఉన్న ప్రతి ఒక్కరికీ - ఒక శత్రువు అంటూ ఒకరుంటారు. ( మీకునూ అలా ఉన్నారు.. వారు మీమీద చెప్పినా మేము నమ్మలేదు.. )వారు చేసే చెడు, చెప్పే మాటలు అంతా ఇంతా కాదు.. అవన్నీ నిజాలై ఉండక పోవచ్చు. వారు చెప్పినవే నిజమని తలిస్తే - చివరికి ఏ బంధమైనా ముక్కలు కావలసిందే.. ఆ శ్రీరామచంద్రుడూ ఇలాంటి బాధితుడే. ఆ మాటలలో నిజం పాళ్ళు ఎంతనో తెలుసుకొనే అవకాశం, సమయం ఎవరికీ ఉండదు.. ఉన్నా పట్టించుకోం. నమ్మకం కోల్పోయినప్పుడు - మనమంతట మనం దూరం జరగటమే మేలు. అందుకే మేము దూరం జరగాలని నిర్ణయించుకున్నాం.
ఇంకా కొన్ని ఉన్నాయి. కానీ అవి ఇక్కడ చెప్పలేను.. ఎప్పటికీ ఎక్కడా చెప్పలేం. మా పరిస్థితుల్లో - మీకు దూరం జరగటమే మీకు చాలా మంచిదన్న భావం వల్ల మీ స్నేహాన్ని వదులుకున్నాం. అందుకే - మీరు సంతోషముగా ఉంటే చాలు.. మాకు ఇంకేం అక్కరలేదు అనుకున్నాం. మీలో మామీద అసహ్య భావన వచ్చినా అది మీ తప్పు కాదు. పరిస్థితులు అలాంటివి. కాలం కలసి రాకుంటే ఇలాగే అవుతుంది.
ఇదంతా ఒకవైపు.. మరొక వైపు - మీతో స్నేహం వల్ల మేము పొందినది అంతా ఇంత కాదు. చా - లా - నే ఉన్నాయి. అవెప్పుడూ మరచిపోం..
ప్రొద్దునే టిఫినీ తప్పనిసరి.. నేను ఆన్లైన్ బాగా తగ్గించేశా.. ఎవరితో అంతగా మాట్లాడటం లేదు.. క్రొత్తగా మరికొన్ని వ్యాపకాలు పెట్టుకున్నాను. తద్వారా నన్ను నేను ఎప్పుడూ క్రొత్తగా, బీజీగా ఉండేలా మార్చుకుంటున్నాను. అందులో విజయాలు సాదిస్తున్నాను. మీకిచ్చిన మాట ప్రకారంగానే - మా కుటుంబ సభ్యులలో ఆనందపాళ్ళు మరింతగా పెంచాను. వారిలో ఆత్మ విశ్వాసం, ధైర్యం, లోకజ్ఞానం పెంపొందించాను.. (నేను లేకున్నా) - ఒంటరిగా ధైర్యముగా బ్రతికేలా, క్లిష్ట పరిస్థితుల్లో ఎలా నెగ్గుకురావాలో మోటివేట్ చేస్తున్నాను. వారితో గడపటం మరింతగా పెంచాను. మా అమ్మాయికి ఒక తండ్రిగా కాకుండా - ఒక స్నేహితునిగా మారాను. తను అన్నీ నాతో షేర్ చేసుకొని, చెప్పుకొనేలా దగ్గరయ్యాను. జీవితాన ఎదురయ్యే చిక్కుముడులని ఎలా స్వయంగా తొలగించుకోవాలో నేర్పాను. ఒక్కోసారి అది ప్రవర్తించే తీరు చూస్తే మీరే గుర్తుకు వస్తారు. ఇప్పుడు తన గురించేమీ బెంగ లేకుండా ఉన్నాను. ఇక బాబు సంగతి - సేమ్ డిటో నే.. ఇదంతా మీ చలవే.. కనకనే కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఈ పోస్ట్.
మరొక విషయం చెప్పాలని కూడా ఈ పోస్ట్ పెడుతున్నాను. మీరంటే ఏమూలో అపనమ్మకం ఉన్న మీ అక్క - అలాంటిది మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు - అక్కా అని పిలిచినందుకో గానీ - మీరు బాగుండాలని - అంతా బాగుంటే బోనం ఎత్తుకుంటాను అని మ్రొక్కుకుంది. ఇది తనంతట తానుగా తీసుకున్న నిర్ణయం. ఎన్నడూ ఎవరికోసం కూడా అలా చెయ్యని తను మీకోసం అంత శ్రద్ధ తీసుకోవడం మమ్మల్ని హాశ్చర్యంలో ముంచింది. మీకు అంతా బాగున్నాక - వేరొకరి ఇంట్లో బోనాల ఉత్సవం జరిగినప్పుడు - ఇలా మొక్కు తీర్చుకుంది. మీరు సంతోషముగా ఉండాలనే మా తాపత్రయం. ఇది చెప్పి మీకు దగ్గరవ్వాలని కాదు.. ఒకరి తపనని మీకు తెలియచెయ్యటం అంతే. తానెప్పుడూ తన గొప్పదనం చెప్పుకోదు.. నేను చెప్పకపోతే అది కాలగర్భంలో కలసిపోతుంది.
మీనుండి ప్రేరణ పొంది - నేర్చుకున్న విషయాలు ఎన్నో.. అందులో ముఖ్యమైనవి :
1. మనకెన్ని ఇబ్బందులున్నా - మన వద్దకి వచ్చేవారిని సంతోషముగా ఉంచి, ఆనందముతో పంపటం.
2. స్నేహితులంటే ఎవరో, వారితో ఎలా మసలుకోవాలి.
3. నాకు స్వచ్చమైన స్నేహం దొరకడం లేదు అని అనే బదులు - ముందు మనమే స్వచ్ఛముగా స్నేహిద్దాం - ఆ అవకాశాన్ని జారవిడుచుకున్నవాడు - వాడి ఖర్మకి వదిలెయ్యాలి. ( ఇప్పుడు నేనూ అలానే.. :P )
4. స్నేహితులని ఎప్పుడూ సంతోష పెట్టాలి. వారి మోహంలో కనిపించే ఆనందం వల్ల మనలో చెప్పలేని సంతోషం కలిగిస్తుంది.
5. వారి వద్ద మనం చిన్న పిల్లల్లా, ఏమీ భేషజాలు లేకుండా, నేనింత, నా హోదా ఇది అన్నట్లు కాకుండా ఉండటం..
6. స్నేహితులకి ఇచ్చిన మాట మరవక, ఎన్ని కష్టాలు వచ్చినా, దాన్ని నెరవేర్చాలి.
7. నమ్మిన స్నేహితులతో కడదాకా స్నేహాన్ని కొనసాగించాలనుకోవటం.. ఆ స్నేహపు భావనని మరింతగా పెంచటానికి చిన్నిచిన్ని బహుమతుల్ని అందించడం..
8. మనలో ఎంత బాధలున్నా పంటి క్రింద దాచేసి, కళ్ళలో, పెదాలపై చిరునవ్వుని మన స్నేహితుల ముందు ప్రదర్శించటం.. తద్వారా వారిని ఆనందముగా ఉంచటం..
9. నా బాధని నేనే మొయ్యాలి. వేరొకరికి పంచకూడదు. మనలో ఎన్ని బాధలున్నా అవతలివారికి, ముఖ్యముగా స్నేహితులకి - ఆనందముగా ఉన్నట్లు కనిపించాలి..
10. ఎవరినీ ఏదీ అడగకూడదు.. చెబితే వినాలి. అన్నీ అడిగి తెలుసుకున్నాక - స్నేహం చెయ్యాలని చూస్తే అది స్నేహం కాదు..
11. మన నవ్వులో స్వచ్ఛత ఉండాలి. ప్లాస్టిక్ నవ్వులా కనిపించకూడదు..
ఇలా చాలానే ఉన్నాయి. నాకు నచ్చినవీ, గమనించినవీ, ప్రేరణ పొంది నేనూ పాటిస్తున్నవి అవి.
ప్రతి ఒక్కరిదీ ఒక్కో స్టైల్ ఉంటుంది. కొన్ని గొప్ప లక్షణాలు ఉంటాయి.. మరికొన్ని చెత్త లక్షణాలూ ఉంటాయి. గొప్ప లక్షణాలని ఆస్వాదిస్తూ, చెత్త లక్షణాలని తొలగించి, తీర్చిదిద్దుతూ వెలుతుండటమే అసలైన స్నేహితుని లక్షణం. అవన్నీ మీలో ఉన్నాయి ( మైనస్ పాయింట్లూ ఉన్నాయి.. అవి అప్రస్తుతం. ) అందుకే మేము మీ బ్లాక్ లిస్టులో ఉన్నా మీరంటే అభిమానం..
జీవితాన కనీసం ఒక్కరైనా నాకు Soulmate సోల్ మేట్ ఫ్రెండ్ ఉండాలనుకున్నాను. ఎందరెందరినో వెదికా.. దొరకరేమో అనుకున్నాను. ఆ ప్రయత్నాలు చివరి దశలో ఉన్నప్పుడు మీరు పరిచయమయ్యారు. మీరు మమ్మల్ని కలిసేవరకూ ఏ అంచనాలూ పెట్టుకోలేదు.. ఒక్కో చుక్కా ఒక్కో చుక్కా కలిసి నిండినట్లు.. క్రమేపీ స్నేహబంధం పెరిగింది. నా జీవితాన అత్యంత అద్భుత క్షణాలని పొందాను... ఈ జన్మాన తీరదేమో అనుకున్న నాకు - కేవలం మీవల్ల తీరింది. కేవలం అందులకు ఎంతగానో ఋణపడి పోయాను. అందుకు ప్రతిగా మీకు ఎంతగానో చెయ్యాలనుకున్నా.. ఆతిధ్యం ఇవ్వాలనుకున్నాం.. స్వంతమనిషిలా భావించాం.. అండగా ఉండాలనుకున్నాం.. కానీ కుదరకపోయింది. స్నేహపు చివరి రోజుల్లో - కనీసం మీరు మరచిపోలేని విధముగా - ఇంకా గొప్పగా ఆతిధ్యం ఇవ్వాలనుకున్నాం.. అన్నీ సమకూర్చుకున్నాం.. కానీ సమయం కలసిరాలేదు.. అలా అవటం చాలా బాధగా ఉండిపోయింది.
విడదీసేవాళ్ళకి ఏమి తెలుసు.. వారికి అంటూ బంధాల విలువ తెలిస్తే కదా.. అసత్యప్రచార ప్రభావం ఎంతగా ఉంటాయో అనీ.. వారికీ - జరిగితే తెలుస్తుంది. కానీ వారు బాగుండాలనే కోరుకుందాం..
ఎంత చెప్పినా తక్కువే. కాలానికి కన్నుకుట్టిందేమో.. తప్పని పరిస్థితుల్లో... తప్పలేదు. మీకు అంతా బాగుండే పరిస్థితులు వచ్చాయని తెలిసాక - ఇక పూర్తిగా దూరమయ్యాం.. మీరు సంతోషముగా ఉంటే చాలు. మాకదే పది కోట్లు..
ఎంత చెప్పినా ఇంకా చెప్పాలనిపిస్తుంది.. ఎప్పుడో ఎక్కడో ముగించేసేయ్యక తప్పదు.. ఈ క్రింది ఈ కార్డ్ - ఇంగ్లీష్ లోని భావం మీ దగ్గర నుండి కొట్టేసి, ఇలా వ్రాసుకున్నాను. ఇది ఎవరికీ సంబంధించినదో వారికి చెబుతున్నాను..
మీరు ఎప్పుడైనా చూస్తారనే ఆశతో ఇక్కడ పోస్ట్ చేశాను.. చూడకపోతే - నా అంత దురదృష్టవంతుడు మరొకడు ఉండడు.. చూస్తే -
( నేను చెప్పను.. )