మా ప్రక్క ప్లాట్ లో ఉండే ఒక నూతన వధూవరుల జంట నేడు ఆ ఫ్లాట్ ని ఖాళీ చేసి వెళ్లారు. అబ్బాయేమో ప్రభుత్వ స్కూల్ టీచర్, అమ్మాయి గృహిణి. క్రొత్తగా పెళ్ళయ్యింది. మొదటిసారిగా కాపురానికి ఇక్కడికే వచ్చారు. బదిలీ మూలాన ఇక్కడి నుండి అమ్మాయి పుట్టింటి పట్టణానికి మారారు.
మాతో వారికి అనుబంధం చాలా తక్కువే. అంటీ అంటనట్లు ఉండటమే!. వాళ్ళ లోకం వారిదే. వెళ్ళే రోజు ముందు వారి అమ్మా, నాన్నలని రమ్మన్నారు. కానీ ఇరువైపుల వారికి జ్వరాలే! వీలు కాలేదు. వారి వెంట ఉన్న సామాను కూడా పెద్దగా ఏమీ లేదు. మామూలు "ఆపే" డిజిల్ ఆటో లో పట్టేట్లు అంతే!. (అలాగే వెళ్లారు కూడా)
ఇంకో మూడు రోజుల్లో వెళతాము అన్నప్పుడు, తన చిన్ననాటి మిత్రుడి ని సతీసమేతముగా రూం కి ఆహ్వానించాడు ఆ టీచర్. బాల్యము నుండీ మిత్రుడు అయిన ఆ మిత్రుడు తన భార్యతో విచ్చేశాడు. మొదటి స్కూల్ కి వెళ్లారు. పల్లె వాతావరములోని స్కూల్ నీ, అక్కడి పిల్లలతో జాలీగా గడిపారు. అక్కడే మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని పిల్లలతో కానిచ్చేశారు. అలా ఆరోజు అంతా అక్కడే కానిచ్చేశారు.
మరుసటి రోజున దగ్గరలోని గుళ్ళకీ, విహార స్థలాలలోకి హాయిగా, హాయిగా వెళ్లొచ్చారు. మూడో రోజున ఎంచక్కా భోజనం చేసుకొని, సామానులు మూటగట్టి, ఆటో మాట్లాడి, అందులో ఒక జంటతో పంపిచేశారు. ఒక జంట బైక్ మీద వారిని అనుసరించారు.
చూడటానికి మామూలు కథలా ఉన్ననూ - ఇక్కడ నాకు నచ్చిన అంశం - స్నేహం. చిన్నప్పటి స్నేహితునితో ఏ అమరికలు లేకుండా అలాగే స్నేహాన్ని కొనసాగిస్తూ, ఇద్దరూ టీచర్స్ అయ్యేవరకూ ఒకే దగ్గర ఉంటూ, ఆ తరవాత ఒకరికి వివాహం అయిన తరువాత, ఇలాగే మన స్నేహబంధం కొనసాగాలి అనుకొని,.... ఇంకొకరికి వివాహం అయ్యాక, అలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ఉండి, జీవన ప్రయాణములో ఒక మజిలీ నుండి ఇంకో మజిలీకి వెళ్ళే తరుణములో, నచ్చినవారి సహచర్యములో ఆ సమయాన్ని ఆనందమయం చేసుకొని, ఆ మధురానుభూతుల్ని వీడియోల రూపములో భద్రపరచుకొని పదిలముగా తీసుకెళ్లటం నాకెంతో బాగా నచ్చేసింది.
No comments:
Post a Comment