Friday, November 4, 2011

అలా ఒక సాయంత్రం..

నిన్న రాత్రి అలా షాపింగ్ అని బయటకి వెళ్లాను. షాపింగ్ అయ్యాక చేతిలో బ్యాగ్ లతో అలా నడిచి, మెయిన్ రోడ్ మీదకి వచ్చాను. కొద్దిదూరం వెళ్ళి బస్ ఎక్కాలి. ఎలా వెళ్ళాలా అని అనుకొని, ఆటో పిలిచాను. ఎక్కువ దూరం ఏమీ కాదు కూడా. ఆటో మినిమం ఫేర్ దాటి, ఇంకో రూపాయి అయ్యే అంత దూరం. 

ఆ ఆటోవాడు "నలభై.." అన్నాడు. 
"అంతగా ఎందుకూ?.." అన్నాను.. 
"రిటర్న్ ఎవరూ రారు సార్! ఖాళీగా రావాలి.." అన్నాడు వాడు. 
"మినిమం ఫేర్ తీసుకో.." అంటే కుదరదు అన్నాడు.. ఇంకో ఇద్దరు ఆటోవాలాలు కూడా అంతే! ఒకడు మాత్రం ముప్ఫై అన్నాడు - అదీ బాగా బేరం చేశాక. 

ఇక ఇలా కాదనుకొని, అంత దూరం నడిస్తే! అన్న ఆలోచన వచ్చింది. గుడ్ ఐడియా అనుకున్నాను. అది నన్ను మారుస్తుందేమో అనుకున్నాను. ఓకే. నడక మొదలెట్టాను. చలి మెల్లగా కమ్ముకుంటున్న ఆ రాత్రి దారి అంతా చల్లగా, ఏసీ పెట్టినట్లుగా ఉంది. షారుక్ ఖాన్ లా "చల్లచల్లనీ ఖూల్ ఖూల్.." అనుకుంటూ ఆదారిలో ఉన్న షాపుల కేసి చూస్తూ, అలా విండో షాపింగ్ చేస్తూ అలా, అలా దిక్కులు చూసుకుంటూ నడక సాగించాను. 

కొద్దిదూరం నడిచాక - దారిలో చాట్ భండార్ కనిపించింది. అందులోంచి వస్తున్న వాసనకి నోరూరిపోయింది. ఒక కట్లెట్ కి ఆర్డర్ ఇచ్చాను. అది వేడివేడిగా తినేశాను. కడుపు నిండిపోయింది. కొద్దిగా శక్తి వచ్చినట్లుగా అనిపించింది కూడా. ఆ తరవాత "ఎంత?.." అంటే "పన్నెండు రూపాయలు.." అన్నాడు.  బాగా రుచిగా ఉంది అది. నేను రెగ్యులర్ గా తినే చోట పద్దెనిమిది రూపాయలు. 

తరవాత మళ్ళీ నడక సాగించాను. దారిలో ఆపిల్ పళ్ళు అమ్మే ఆమె కనిపించింది. ఎంత అని అడిగాను. పదిహేను కి ఒకటి చెప్పింది. ఒకటి కొనుక్కొని, బాగా తుడుచుకొని, హాయిగా తినేశాను. చాలా బాగా ఫ్రెష్ గా ఉంది. సూపర్ మార్కెట్లో అయితే ముఫై రూపాయలు గానీ దొరకదు. అలా నడక మొదలెట్టి నేను చేరుకోవాల్సిన బస్టాండ్ వచ్చేశాను. ఆ తరవాత బస్ ఎక్కి ఇంటికి వచ్చేశాను. 

కొద్ది దూరం ఈ నడక (పాదయాత్ర) కార్యక్రమం వల్ల నాకు - కాసింత వ్యాయామం, నా శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవటానికి అవకాశముగా అనుకోవటం, ఆ చల్లని వాతావరణములో కాసింత వేడివేడిగా తినటం, అలాగే ఆరోగ్యానికి రోజూ ఒక ఆపిల్ అన్నట్లు ఒక ఆపిల్ తినటం, ప్రజల భిన్న వైవిధ్యాలు, అలవాట్లు దగ్గరగా చూశాను. ఇవన్నీ ఆ ఆటోలో వెళితే - పొందేవాడిని కానేమో!

4 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

బాగుంది. మంచి పని వల్ల ఎన్ని లాభాలో..చూడండీ.. మీ స్టైల్ లో బాగా చెప్పారు.

జ్యోతిర్మయి said...

మీ సాయంత్రం చాలా ఆహ్లాదంగా ఉంది రాజ్ గారూ..

Raj said...

# ధన్యవాదములు వనజ గారూ..ఇంకొన్ని లాబాలు కూడా పొందాను. అది వేరే టపాలో వ్రాస్తానండీ..

Raj said...

# ధన్యవాదములు జ్యోతిర్మయి గారూ.

Related Posts with Thumbnails