Friday, April 23, 2010

ప్రేరణ - కృతజ్ఞతలు

నేను ఈ బ్లాగుని వ్యయ, ప్రయాసలకి ఓర్చి, అన్నీ మీకు తెలియచేయడం వెనుక గల అనేకానేక కారణాల్లో ఒక కారణం:

ఒకరు చేసిన ఒక చిన్ని మాట సహాయం వల్ల నా జీవితములో చాలా ఎత్తుకి ఎదిగాను. వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన బాధ్యత నామీద ఉంది. కాని అది ఎలా చెప్పుకోవాలో తెలీక ఆగిపోతున్నాను. మీలో ఎవరైనా తీరుస్తారని ఇదంతా చెప్పటం..

ఖాళీ సమయాల్లో ఏమి చేయ్యాల్లో తోచని నేను టీవీకి అతుక్కపోయేవాడిని. అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి.. నేను అలాగే టీవీకి అతుక్కపోసాగాను. సాయంత్రం ఎనిమిదికి మొదలెడితే రాత్రి ఒకటి, రెండూ అయ్యెడిది. ఇలా కాదని ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్లు ఉంటుందని ఇంట్లో పెట్టుకొని పని చేసుకునే మెషినరీ వర్క్ చెయ్యాలని నిర్ణయించుకున్నాను. దాని వల్ల ఓ.. అని డబ్బు సంపాదించాలని గాదు.. గాని నాకున్న కొన్ని అహాలు చల్లార్చుకోవాలని / తృప్తి కలగాలని చెయ్యటం. [ఇక్కడ పైన ఇచ్చిన ఇంట్రో కి డైరెక్ట్ గా వెళ్ళొచ్చు.. మిగతా విషయాల్లో మీకు చెప్పాల్సిన / అవసరం వచ్చే (?) కొన్ని సంగతులు ఉన్నాయని అనుకొని సూటిగా, సుత్తి లేకుండా చెప్పలేక పోతున్నాను.]

నాకున్న పని పద్దతులు అంటే: " పాడిందే పాడటం పాచిపళ్ళ దాసరి.." (ఇదొక సామెత) అన్నట్లు చేసినదే చేయటం, ఏదో మామూలుగా చేసి వదిలేయటం, ఏదో మమః అనిపించటం, ఉన్నవాటినే చెయ్యటం, క్రొత్తగా క్రియేటివి ని చూపించక పాతదే చేయటం.. నాకు నచ్చదు. కొద్దిగా పర్ఫెక్షనిస్ట్ ని కాబట్టి, కొద్దిగా ఎప్పటికప్పుడు క్రొత్తదనం ఉండాలని అనుకొని ఆ పనిని ఎంచుకున్నాను. ఆ పనిలో అలాంటి లక్షణం చాలా పుష్కలముగా ఉంది. అందుకే ఆ పని చెయ్యాలని ఎంచుకున్నాను.

అందరూ ఆలాంటి పని అంతా నేర్చుకున్నాక అలా కావలసిన ఎక్విప్మెంట్ కొంటారు. కాని నామీద నాకున్న ఆత్మవిశ్వాసం వల్ల ఏ..మీ రాకున్నా అంటే మెషినరీ ఎలా వాడాలో ఏ..మీ తెలీకుండానే ఖరీదు చేసాను. ఇదే కాదు నేను ఇప్పుడు వాడుతున్న కంప్యూటర్ కూడా అంతే! అదీ ఎలా వాడాలో తెలీకనే కొన్నాను. నేనేమీ పువ్వులేమీ పెట్టడం లేదు.. నిజం. ఈ మాట నా పాత టపాల్లో వ్రాసాను కూడా. అందరిలాగానే ఓ మంచి రోజు చూసి వసంత పంచమి రోజున ప్రారంభించాను. ఆ రోజు ఎలా ప్రారంభించాను అంటే - ముఖ్యమంత్రో , మంత్రో వచ్చి ఎలా ప్రారంభిస్తారో అలా అన్నమాట! కొద్దిరోజులకి మెల్లగా మొదలెట్టాను.. ఏమీరాదు.. ఏమి చెయ్యాలో తెలీదు. అయినా మొదలెట్టాను. తప్పదుగా.. ఇక టీవీ రెగ్యులర్ గా చూసేది అప్పుడప్పుడు కి మారింది. 
 
మొదలైతే పెట్టాను గాని.. అసలు ఏమైనా అర్థం అయితేనా! ఇలాంటివాటికి కోచింగ్ ఇచ్చేవారూ ఉన్నారు.. కాని ఏముందీ పని? అని నామీద నాకే (అతి) విశ్వాసం. అటూ ఇటూ చేసి పని మొదలెట్టాను.. మొట్టమొదటి పని ఘోరముగా విఫలం! ఆ రోజు ఇక నాతో కాదు అని భావనకి రావటం. ఆరోజు మొత్తానికి మూడ్ ఆఫ్ అయిపోవటం.. ఓహ్! తలచుకుంటే నేనేనా.. అని ఇప్పుడు అనిపిస్తుంది కాని అప్పట్లో అయితే అంతే! ఏదీ అర్థం కాదు.. సాయంత్రాలు బయట షికారులు బంద్. ఏదో సాధించేయ్యాలని, ఏదో కుళ్ళబోడిచెయ్యాలని కసి. కొన్ని నెలలు గడిచాయి. బంధుమిత్రులు ఎకసేక్కాలు.. "ఏదో చేస్తానని తెచ్చాడు. రోజూ అగర్బత్తీ ముట్టించటానికి, పూజ కోసం కొన్నాడు.." అని. వారి మాటలు విని ఎన్ని సార్లు మనసులో బాధపడ్డానో!

ఒకసారి బయటవారి పని చేసినప్పుడు చెత్త పని అంటూ వచ్చిన కామెంట్స్ కి కన్నీళ్లు తిరిగాయి. మా ఆవిడ - "ఎందుకంత రంధీ పెట్టుకుంటావు.. నీతో అవుతుంది నాకు తెలుసు.." అని ఓదార్పు చెప్పింది. పని రాక ఈ రంగములో ఓడిపోతానేమోనని అనుకున్న నాకు ఆ మాటలు నాలో పట్టుదలని రగిలించాయి. 
 
అప్పటికే మార్కెట్లో ఇద్దరు ఫుల్ కోచింగుతో, ఫుల్ టైం వర్క్ మొదలెట్టారు. నేనో పార్ట్ టైం అన్నమాట. వారు నాకన్నా చాలా అడ్వాన్సుగా ఉన్నారు. వారు గజ ఈతగాళ్ళయితే నేను ఇప్పుడిప్పుడు ట్యూబులూ కట్టుకొని ఈత నేర్చుకుంటున్న వాడినన్న మాట! నామీద నాకు ఎందుకో ఆత్మవిశ్వాసం.. ఏ రోజుకైనా సాధిస్తానని. అలా మొదలెట్టాను..

తొందర పడకుండా, నెమ్మదిగా అలోచించి, పెర్ఫెక్ట్ గా చెయ్యటమే లక్ష్యముగా పెట్టుకున్నాను. నాకు తెలుసు - ఈ ప్రపంచము అంతా సక్సెస్ మీదే ఆధారపడి ఉందని. ఎప్పుడైతే సక్సెస్ అయ్యామో అప్పుడే మనల్ని కీర్తి, కాంత, కనకం.. అన్నీ వరిస్తాయని. అలా మొదలెట్టాను. ఎంతగా ఇబ్బంది పడ్డా, ఏమైనా దానేమ్మటే పడ్డాను. సూర్య సన్ అఫ్ కృష్ణన్ లో చెప్పినట్లు "ఒకడు దేనికోసమైనా తెగిస్తే వాడికి అది  దొరుకుంది. అది నాకు ఆరోజు అర్థమయ్యింది డాడీ.. " అంటాడు హీరో.  



అప్పటికి ఆ సినిమా రాకున్నా నా పని భాష ( దేహ భాష లాగేనే అనుకోండి) అలాగే ఉంది. రాత్రంతా కష్టపడటం.. రోజు రోజుకీ నాలో ఏదో క్రొత్తగా నేర్చుకోవాలి అనేలా లక్ష్యం ఏర్పడటం.. అందులో నా చిన్ని పాప తీరా నేను పని మీద ఉండగానే దగ్గరికి వచ్చి ముద్దు ముద్దుగా "డాడీ! పంకోవా?(పడుకోవా) రావా! పీజ్!(ప్లీజ్)"అనేది. అలా మాట్లాడాక ఏ కన్నతండ్రి మనసు నీరవ్వదు? తనని నా చాతీ మీద పడుకోబెట్టి నిద్రపుచ్చితేనే పడుకునేది. ఎక్కడ తనని వదిలి వెల్లుతానేమోనని నేను వేసుకున్న షర్టుని గట్టిగా పట్టుకోవటం.. ఓహ్! మరవలేను ఆ రాత్రులని.

తనని అన్యమస్కముగానే తను పడుకోగానే పక్కకు దించి, నా పనిని నేను మొదలెట్టడం. రాత్రంతా పని చేసి / నేర్చి తెల్లవారుజ్హామున పడుకోవటం.. ప్రొద్దున్నే శరీరం కట్టేలాగా పట్టేయటం.. ఆఖరికి టాయిలెట్ కి వెళ్ళినా నిలబడే పని కానివ్వాల్సిన అంత నొప్పులు. అయినా భరించాను.. అంతగా శ్రమించాను.. ఫలితముగా మార్కెట్లో బాగా గుర్తింపు. నాలా మిగిలిన ఇద్దరు పని చెయ్యలేక పోయారు. నాకు పోటీగా ఇంకో ముగ్గురు రంగములోకి దిగారు. చెప్పాగా పనితో మమేకము అయి, అంకిత భావముతో పని చేస్తే అది ఎలా సాధించలేము.? రోజు రోజుకీ నన్ను నేను అప్డేట్ చేసుకుంటూ ముందుకి వెళ్లాను.. ఆ క్రమములో చాలా ఎత్తుకి ఎదిగాను. ఎవరినీ పని ఇమ్మని అడగలేదు. ఇప్పటికి కూడా / ఇంతవరకూ ఎవరినీ అడగలేదు. నా పనితనమే నా శత్రువులనీ నా దగ్గరికి రప్పించింది.

నా పోటీదారులకి చేయరాని పనులని నేను అవుట్ సోర్స్ పద్దతిలో చేసివ్వటం స్థాయికి ఎదిగాను. అదీ ఒంటరిగా.. నాలాంటి మెషినరీ ఉన్న వారికి సలహాలు, ఎలా చెయ్యాలో నేర్పించే స్థాయికి ఎదిగాను.. సినిమా కథలాగా ఉందా.. కాని వాస్తవం ఇది.

మార్కెట్లో నా పనికి వంకపెట్టే స్థాయిలో లేకుండా చూసుకున్నాను. నాతో అన్ని పనులూ జరుగుతాయన్న నమ్మకాన్ని తీసుకొచ్చాను. ఇక అసలైన పని అందులో ఒకటుంది. అదే చాలా కష్టం.. ఇప్పటిదాకా చేసినవి ఒకెత్తు. వీటికి కన్నా ఎక్కువ కష్టం దీనిది. అందుకే మొదట్లో నా వల్ల కాదనుకున్నాను. ఆ సెక్షన్ వదిలేసాను.

ఆ తరవాత అదే బాగుంది. అది లేకుండా పని చేస్తే - నేను ఏదైతే అనుకున్నానో అదే - ఆ పనిలో మొనాటనీ వచ్చేస్తున్నది అనుకొని దాని కోసం మళ్ళీ పోరాటం సాగించాను. ఇంతకు ముందు చేసిన పనికి ఇది భిన్నం. ఇప్పుడంటే అలవాటయ్యింది గానీ అప్పట్లో మళ్ళీ విపరీతమైన శ్రమ. అక్కడ అంతా తెలివికీ, చేతి వ్రేళ్ళకే పని. మిగతా దేహం అంతా ఖాళీగా ఉంటుంది.

మొదలెట్టాను అన్నమాటే గాని ఏమీ అర్థమయ్యేది కాదు. ఎలాగో అలాగో కష్టపడి కొద్దిగా నేర్చాను. ఈ పనుల్లో మూడు స్థాయిలు. అవేమిటంటే! - టర్నర్ గ్రూప్ సంస్థ అధిపతి టెడ్ టర్నర్ చెప్పిన కొటేషను (తెలుగులొకి మార్చాను)అది.  
  • అడ్డు తొలగు
  • అనుసరించు
  • అధిగమించు
ఇలా వీటిల్లో మొదటిది అడ్డు తొలగు అనేది. ఇంత దూరం వచ్చాక వదిలేయ్యలేను. చేస్తే మొదట్లోనే వదిలేసేది ఉండేను. ఇక రెండోది. అనుసరించు అనేది. ఇన్ని రోజులూ అలాగే నెట్టుకోచ్చాను. అలా చేసేసరికి ఏదైనా క్రొత్తగా వస్తే నీళ్ళు నమలాల్సిన పరిస్థితి. ముందుకు తప్ప వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. ముందుకే సాగాలనుకున్నాను. కానీ వాస్తవం భయంకరముగా ఉంది. ఏమీ అర్థం కావటం లేదు.. ఏమి చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఎప్పుడు చెయ్యాలి?.. ఏమీ తోచనిపరిస్థితి. [ఇక్కడినుండీ ముందు చెప్పిన ఇంట్రో కొనసాగింపు]
 
ఒకసారి ఒకపనిపై ఎదుర్చూస్తున్న నాకు కాస్త సమయం చిక్కటముతో, ఈనాడు దినపత్రిక చూస్తున్నాను. అందులో - వసుంధర పేజిలో ఒక ఇంటర్వ్యూ! ఎవరిదా అని చూసాను. ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గారి సతీమణి పద్మజా రెడ్డి గారిది. ఆవిడ గారు ఒక సంస్థని నడుపుతున్నారు. అందులోని సాధకబాధల గురించి ఇంటర్వ్యూ చేసారు. ఎందుకులే చదవటం అనుకున్నాను - కాని ఎదురుచూపుల్లో ఉన్న నేను కాలక్షేపం కోసం చదివాను.

అందులో ఒకసారి వాళ్ళ కంపనీ ప్రాబ్లం గురించి చెబుతూ "..మొదట్లో చాలా ప్రాబ్లంస్ ని ఎదురుకున్నాము..కాని అనుభవం లేక పోవటముతో ఎలా ఆ ప్రొబ్లెంస్ ని ఎదురుకోవాలో తెలీదు. అందుకే నష్టాల్లోకి కూరుకపోయాము. ఎలా దీన్ని ఫేస్ చెయ్యాలో అని ఆలోచిస్తే  అప్పుడు  తెలిసింది.. అసలు వర్కర్లకి బేసిక్ నాలెడ్జ్ లేదు.. అలా ఇక్కడి వాతావరణానికి క్రొత్తదైన ఈ పనిని ఎలా చెయ్యాలో తెలీక నష్టాల్లోకి వెళ్ళాము. ఆతర్వాత వారికి మళ్ళీ బేసిక్ నుండి పని నేర్పించటముతో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది.."

అది కాజువల్ గా చదివి ఊరుకున్న నాకు తరవాత అందులో - ఇప్పుడు నేను ఎదురుకుంటున్న సమస్యకి పరిష్కారము ఉందనిపించింది. నేనూ బేసిక్ నుండి పని నేర్చుకుంటే? అనిపించింది. ఎన్ని లెక్కలు వేసుకొని చూస్తే అదే సరియైనది అనిపించింది. చూద్దాం! ఇలా చేస్తే పోలా అనుకొని (అపనమ్మకముతోనే) మొదలెట్టాను - బేసిక్స్ మొదలెట్టాను. చిత్రం! కొద్దిరోజుల్లోనే నా సమస్యకి పరిష్కారం దొరికి తీరింది. ఏదైతే కష్టం అనుకున్నానో అదే ఇప్పుడు తేలిక అయ్యింది. చాలా ఈజీగా బేసిక్స్ నేర్చుకున్నాను. సగం కూడా నేర్చుకోలేదు - కాని ఇప్పుడు అందులో కూడా చాలా సక్సెస్ అయ్యాను. నేను ఉంటున్న ఏరియాలో నేనే నంబర్ వన్ ని. నాతో కాని పని అంటూ ఎదీలేకుండా పోయింది.

అలా బాగా సక్సెస్ అయ్యాను. అయినా కళ్ళు నెత్తిమీదకి ఎక్కించుకోలేదు. నాకు పోటీగా ఆ ఐదుగురే కాక ఇంకో ఇద్దరు కూడా వచ్చారు. ఊహు.. వారితో కాలేదు. వారి సమస్య ఏమిటంటే - నాలా బేసిక్స్ లేకపోవటమే! కాని అది వారికి తెలీదు. అది తెలిసి వారూ బేసిక్స్ నేర్చుకుంటే నా పని అంతే! ముమ్మాటికి నిజం అది.

ఇంత కష్టపడ్డందులకి మీకు ఏమొచ్చింది అని మీరు అనొచ్చు. చెప్పాలని లేదు కానీ, అయినా చెబుతున్నాను. రోజూ మూడు గంటలు కష్టపడ్డందులకి - పని రోజుల మొదట్లో ఒక ప్రైవేట్ కార్మికుడి జీతం, మధ్యలో ఇద్దరి స్కూల్ టీచర్ల నెలజీతం, ఆ తరవాత ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం.. ఇలా వచ్చింది. (ఇంకం టాక్స్ కూడా కట్టానులెండి. ) ఇంకా వచ్చేదేమోగాని.. చాలా మంది అసూయతో పని మానేశారు.. అయినా డోన్ట్ కేర్. వేరే పని మొదలేడుదామని అనుకుంటున్నా.. అదీ బేసిక్స్ నుండే మొదలెట్టాలి. ఇందులో కూడా ఇంటరెస్ట్ ఉండే దిగుతున్నాను. అదీ పార్ట్ టైమే!

ఇన్నిరోజులుగా ఆవిడ చెప్పిన చిన్ని సమాధానం వల్ల ప్రేరణ పొంది, ఇంతగా అభివృద్ధిలోకి వచ్చాను. కాని ఆవిడకి ప్రతిగా నేను ఏమీ చేయలేకపోయాను. తనకి నేను బాగా ఋణపడిపోయాను. కనుక ఇలాగైనా నేను ఇలా నా బ్లాగు ద్వారా ఆవిడకి, ఈనాడు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.  ఆవిడ స్పీకర్ గారి భార్య కాబట్టి ఆవిడ (చుట్టూ ఉన్న భద్రతావలయాన్ని దాటుకొని ) వద్దకి వెళ్ళలేను. అందుకే ఇక్కడే చెబుతున్నాను.

ఆవిడ చేసిన చేసిన చిన్ని సాయానికి కృతజ్ఞతలు చెప్పుకోవటం నా ధర్మం. మీలో ఎవరికైనా ఆవిడ మెయిల్ ID తెలిస్తే చెప్పండి. నేను ఇదంతా ఆవిడకి చెప్పి కృతజ్ఞతలు తెలియ చేసుకుంటాను. మీకు ఇది సిల్లీ గా అనిపించినా, నవ్వుకున్నా నేను పట్టించుకోను. నా బ్లాగడం నాది. నా తృప్తి నాది.

2 comments:

vanajavanamali said...

Intresting post..Raj gaaru. chaalaa saarlu choosaanu. such Inspiring.. thankyou.

Raj said...

ధన్యవాదములు..

Related Posts with Thumbnails