Friday, November 20, 2009
మొఖం కడగటం
చిన్నప్పుడు పొద్దున్నే మొఖం (face) కడిగేవాళ్ళం.. (ఇప్పుడు మానివేసామన్నది కాదు ) మేమూ అలాగే కడుగుతాం అంటారా? ఆ.. వస్తున్నా అదే విషయం చెప్పటానికి.. ఇప్పుడు "యేరా బ్రష్ వేసావా.." అని అడుతున్నారు కాని, పాత తరం వాళ్ళని చూడండి. మనం బ్రష్ వేస్తాము గాని, వాళ్లు మొఖం కడుగుతారు. మొఖం కడగటం అంటే పెద్దగా ఏదో ఊహించుకోకండి.. పెద్ద ఖర్చూ ఏమీ లేదు.. కొద్దిగా సమయం ఎక్కువ కేటాయిస్తే సరి.. అంతే!.
మామూలుగా ప్రొద్దున మనం బ్రష్ తీసుకొని, దానిపైన కొద్దిగా పేస్టు పెట్టుకొని, బాగా పళ్ళని రుద్ది.. కడిగేస్తాముగా.. అలాగే కాని ఇంకొంచం శ్రమ, సమయం అవసరం ఇందులో. ముందుగా మొఖం ని గోరువెచ్చని, చల్లని నీటితో మొఖం కడిగి, ఆ తరవాత దంత ధావనం - పళ్ళు తోమటం మొదలవుతుంది.. ఆ తరవాత నోరు కడిగేసి శుభ్రముగా చూపుడు వేలితో పళ్ళని మసాజ్ (మర్దన) చేస్తారు. ఇక్కడ పళ్ళనే కాకుండా పంటిని ఆనుకునే చర్మం - అదేనండీ చిగుర్లనీ బాగా రుద్దుతారు. పై వైపునే కాకుండా లోపల వైపున కూడా మసాజ్ జరుగుతుంది.. దీనివలన లాభం ఏమిటంటే మన దంతాలకి, చిగుర్లకీ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దానివలన దంతాలు ఇంకా ఆరోగ్యముగా ఉంటాయి. ఇలా చేయటానికి పట్టే కాలము మహా అంటే 15 సెకన్ల నుండి నిముషము వరకు. మీకు తెలుసా! మనం వాడే టూత్ పేస్టులో ఏమీ రక్షణ పదార్ధం ఉండదు, ఏమీ పనిచెయ్యదు. ఒకవేళ ఉన్నా, ఈ మర్దన అంత మేలు జరగదని పంటి డాక్టర్లూ నిర్ధారించారు. మనకు ఆహారాన్ని జీర్ణము చేసి, మనకు శక్తిని కలుగ జేసే ఈ దంతాలకి ఆపాటి సేవ, సమయం కేటాయించలేమా? మనం ఒక దగ్గర నుండి ఇంత లాభం పొందుతున్నప్పుడు, ప్రతిగా మనమేమీ ఇవ్వలేమా.. (ఈ వాక్యం గురించి త్వరలో రాస్తాను.. అది మీ జీవితాన్ని మారుస్తుందేమో!)..
అలా నోటిని కడిగాక, నాలుకనీ కడుగుతారు. ఆ నాలుక మీద ఉన్న తెల్లని పాచిని తీసేస్తారు.. ఆ తరవాత గొంతులో వేళ్ళు పెట్టి ఆడిస్తారు. గొంతులో ఉన్న ఏవైనా కఫం, తట్టుకున్న పదార్థాలు, కడుపులో జీర్ణం కాని ఆహారం.. అంతా బయటకి వచ్చేస్తాయి.. దానివల్ల శరీర క్రియలకి అవి అడ్డం తొలుగుతాయి కాబట్టి లోపలి శరీర భాగాలు రెట్టించిన శక్తితో పనిచేస్తాయి..
ఆ తరవాత ముక్కుని శుభ్రం చేస్తారు. ఒక వేలితో ఒక ముక్కు రంధ్రాన్ని నొక్కిపెట్టి, గాలిని బయటకి వదలటముతో, శ్వాసకి అడ్డం వచ్చే పదార్థాలు బయటకి వచ్చేస్తాయి. తరవాత చల్లని నీటితో కళ్ళనీ, అందులోని మలినాలనీ తొలగిస్తారు.. చివరిగా మొఖం మళ్ళీ కడిగి, అలాగే మెడనీ రుద్ది, కడిగేస్తారు.. ఇదీ మొఖం కడగటమంటే! ఇప్పటికీ పాతతరం వాళ్ళు ఇలా చేయటం ఇంకా మనం చూస్తూనే ఉంటాము.. ఈ బిజీ లైఫ్ ల వల్ల మనకి మనమే ద్రోహం చేసుకుంటున్నాము. పొద్దున్నే ఎవడో వెంబడి పడుతున్నట్లు గబా గబా ముఖం తోమేసి "మమ" అనిపించేస్తున్నాము..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment