Thursday, October 3, 2013

Good Morning - 469


ఓటమి నా వెనకాలే ఉందనీ, అదను చూసి, నన్ను కబళించడానికి వేచి చూస్తుందనీ తెలుసు. ఇవ్వాళ కాకపోతే, రేపైనా ఆ ఓటమి ఒడిలో నిదురించక తప్పదనీ తెలుసు. 

మనం ఎన్నెన్ని విజయాలు సాధించినా, దాని ప్రక్కనే ఓటమి కూడా ఉంటుంది. మనం విజయంలో ఉన్నప్పుడు, అది కాస్త మొహం చాటేస్తుంది. కానీ - ఎప్పుడూ విజయమే వరించదు. ఎన్నెన్ని విజయాలు వరుసగా పొందినా, " తరవాత ఓటమే చూడు, నిన్ను పట్టేసుకుంటా.. " అన్నట్లు ఓటమి కాచుక కూర్చుంటుంది. ఇలా ప్రతిరంగమున, ప్రతి ఒక్కరికీ జరిగే సర్వ సాధారణ అనుభవమే. ఒకరి ఓటమిని చూసి, మనం విర్రవీగటం అంత సంస్కారం కాదు. రేపూ మనకీ ఓటమి వస్తుంది. అప్పుడు మనం అవమానించిన వారు మనల్ని అవమానించటానికి వెనకాడరు. 

Wednesday, October 2, 2013

Good Morning - 468


నువ్వు వెతుక్కుంటూ వెళ్ళే ప్రేమ కన్నా నీ నీడ వెంటే ఉండే ప్రేమ ఎంతో మేలు. ముందు దాన్ని గుర్తించు. 

దీన్నే మరొక రకముగా కూడా చెప్పోచ్చును. మనం ఇష్టపడ్డవారి వెంటబడి, వారి ప్రేమని పొందటంలో  వెంపర్లాడటం కన్నా, మనల్ని అభిమానించేవారు చూపే ప్రేమ ఎన్నో రెట్లు మేలు. 

ఉదాహరణగా చెప్పాలీ అంటే మనం అభిమానించేవారి శుభకార్యాలకి వెళ్ళామే అనుకోండి. అక్కడ వారి కష్టాల్లో, పనుల్లో సాయం అందించడానికి ముందుకు చొరవగా వెళ్తాం. మన శ్రమ వారి దృష్టిలో పడటానికి ఎన్నెన్నో పనులు చిన్న గుర్తింపు కోసం చేస్తాం. వారి గుర్తింపు వస్తే - సంతోషం. రాకుంటే వారి బీజీలో వారున్నారు అని సర్దిపుచ్చేసుకుంటాం. అక్కడ మనకి అంత VIP ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండకపోవచ్చును. 

అదే మనల్ని అభిమానించే వారి ఇంటికి ఇలాంటి ఫంక్షన్ కే వెళ్ళామే అనుకోండి. అక్కడ మనతో ఒక్క పని కూడా చేయించరు. ఒకవేళ మనం చెయ్యాలని చూసినా, వస్తువులు లాగేసుకొని, " అయ్యో! మీరు అతిధులు. మీరు పని చెయ్యటమా..? అక్కడ ఊరికే కూర్చోండి.. " అంటూ హాయిగా కూర్చోండబెడతారు. కానీ మనల్ని ఒక్క సాయమూ చేయ్యనివ్వరు. మొత్తానికి మనల్ని, VVIP వారిలా చూసుకుంటారు. ఇలాంటివారి దగ్గరే మనకి నిజమైన ప్రేమ దొరుకుతుంది. వారినే ఎక్కువగా పట్టించుకోవాలి. కానీ వాస్తవ జీవితాన ఇలాంటి వారిని ప్రక్కన పెట్టేస్తాం. మనకి అందనివారి మెప్పుకోసం, వారి నుండి వచ్చే గుర్తింపు కోసం, చిన్న పొగడ్త కోసం.. వారి కనుసన్నల్లో ఉండటానికి తెగ తాపత్రయపడుతాం. కానీ, అలా చెయ్యటం ఎన్నడూ మంచిది కాదు. 

Tuesday, October 1, 2013

Good Morning - 467


అప్పటిదాకా మనము అంటే ప్రాణంగా, ఎంతో ప్రేమగా - మనమే లోకంగా భావించే మనషులలో మనమీద ప్రేమ తగ్గిపోతే - వాళ్ళు మారిపోయారు - అని నిందిస్తూ ఉంటాం. కానీ, వాళ్ళు అలా మారటానికి కారణం మనమే అని మాత్రం ఆలోచించము. ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.. తప్పు ఎవ్వరిది..? అనీ, ఒకరిని అనటం చాలా తేలిక కదా..!! 

నిజమే కదా.. మనం అంటే ఇష్టపడేవారిని, మనమీద అభిమానం చూపేవారిని, మనమే వారి లోకం అంటూ ఆత్మీయతని, అనురాగాన్ని చూపించే వ్యక్తులు - మన మీద చూపే ప్రేమ / కన్సర్న్ తగ్గిపోతే - వారు మారిపోయారు అని నిందించటం తగదు. మామూలు వ్యక్తులు లేదా అవసరార్థం మనకి చేరువ అయ్యేవారి సంగతి వేరు. వారు ఏదో ఆశించి దగ్గర అవుతారు, వారు ఆశించింది దక్కినప్పుడో, దక్కనప్పుడో దూరం జరుగుతారు. అలాంటివారి గురించి ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనమంటే ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని, అనురాగాన్ని, ఆత్మీయతనీ అందించే తల్లితండ్రులే గానీ, స్నేహితులే గానీ, బంధువులే గానీ, ఇరుగు పొరుగే కానీ.. అంతకు ముందు మన మీద చూపిన ప్రేమ పిసరంత తగ్గితే - అది గమనించుకొని, బాధ పడుతాము. ఫలితముగా వారు మారిపోయారు అని నిందిస్తాం. కానీ ఎందుకు అలా చేస్తున్నారు / మారిపోయారు అనే దిశగా ఆలోచన చెయ్యం. వారినే నేరుగా అడగలేకపోతాం. కారణం అభిజ్యాతం ( ఈగో ). 

ఒక్కసారి దాన్ని బ్రేక్ చేసి, ముందుకు అడుగు వేస్తే, మళ్ళీ వారు ఎప్పటిలా మనమీద అభిమానాన్ని చూపించేలా చెయ్యవచ్చును. కానీ, నేను ఇంతవరకూ ఒకసారి కాదనుకున్న వారిని వెనక్కి తిరిగి అడగదలచుకోలేదు / మాట్లాడదలచుకోలేదు అనుకుంటే - ఏదో తెలీని వెలతి మన జీవితాల్లో కనిపిస్తూ ఉంటుంది. అంతా డబ్బే అయిన ఈ రోజుల్లో స్వచ్చందముగా మన మీద ప్రేమ / ఆత్మీయతని చూపించేవారిని దూరం చేసుకోవడం అంత తెలివైన పని కాదు. అలా చేసుకుంటే - జీవితాన చాలానే మిస్ అవుతాం. 

Related Posts with Thumbnails