Saturday, May 6, 2017

తృప్తినిచ్చిన చిన్ని సహాయం.

పోయిన నెలలోని (ఏప్రిల్) ఒకరోజు మధ్యాహ్నం మా ఇంటివద్ద ఎవరో భార్యాభర్తలు తచ్చాడుతున్నట్లు అనిపిస్తే - బయటకు వెళ్ళి చూసా.. గుర్తుపట్టి పిలిచా.. ఏమిటీ? ఇక్కడ అని వాకబు చేశా.. వారు నా ఇంటి గురించే వెదుకుతున్నారు.

వారిద్దరూ రోజువారీ కూలీపని చేసుకొనే భార్యాభర్తల జంట. ఒకసారి లేబర్ అడ్డ మీద ఆయనతో లేబర్ పనికి పిలుచుకొని వచ్చి, పనిచేయించుకున్నాను... అలా గుర్తుపెట్టుకొని వచ్చాడు. తను నాక్కావలసిన పనిని చాలా బాగా చేసిచ్చాడు. అలా గుర్తున్నాడు తను. ఏమిటని అడిగా.

ఏమీ మాట్లాడకుండా - చేతిసంచీ లోనుంచి కాళ్ళ పట్టీలు తీసి, నాముందు పెట్టాడు. నాకు అర్థం కాలేదు.. ఎందుకిలా అని అనుకోబోతుండగా తానే చెప్పాడు.. వాళ్ళబ్బాయికి బాగా జ్వరం వచ్చిందనీ.. హాస్పిటల్ కి తీసుకెళ్ళితే అప్పటివరకూ రూ. 15,000 రూపాయలు దాకా ఖర్చయ్యాయనీ.. ఇంకా జ్వరంగానే ఉందట.. మరికొన్ని డబ్బుల కోసం అవసరం వచ్చి.. స్థానికముగా ఎవరూ తెలీకపోతే - నేను గుర్తుకవచ్చి వచ్చాడుట.

" ఎంత డబ్బు కావాలి? " అన్నాను.

" ఒక ఐదు వందలు " అన్నాడు. దాదాపు రూ. 4,500+ నికర విలువ చేసే పట్టీలని పెట్టుకొని కేవలం ఐదు వందలు (500) కోసమే వచ్చాడా? నాకూ ఆశ్చర్యముగానే ఉంది. నేనెప్పుడూ అలా వడ్డీలకు డబ్బులు ఇవ్వలేదు. ఇక వస్తువులని పెట్టుకొని ఇవ్వడం అనేది మరీ క్రొత్త అనుభవం. తానెవరో, ఏమి పేరో, ఎక్కడ ఉంటాడో కూడా నాకు తెలీదు.

నామటుకు మాత్రం కొద్దిగా తెలిసినవారైనా అడిగితే - ఒక వంద వరకూ తిరిగిరాని ఋణం గా భావించి ఇస్తుంటాను.. అలాంటిది ఇక్కడ ఐదు వందలు అంటే హ్మ్ కష్టమే..

నా మది భావాలు చదివినట్లున్నాడు.. " ఇది దగ్గర పెట్టుకొని ఐదు వందలు ఇస్తే చాలు.. ఎల్లుండి డబ్బులు తెచ్చి ఇచ్చి, పట్టీలని తీసుకెల్లుతాను " అన్నాడు. ఈసారి తన మాటల్లో ఆపుకుంటున్న దుఃఖం, పిల్లవాడిని బ్రతికించుకోవటానికి నాకున్న ఇదే ఆఖరి అవకాశం అన్న నిస్సహాయత కనిపించింది. ఆ మాటల్లో ఎంతో నిజాయితీ ఉందనిపించింది. వాళ్ళావిడని చూసా... తలపై మేలి ముసుగు వేసుకొని నాకు మొఖం కనిపించకుండా మౌనముగా రోదిస్తున్నట్లు ఉంది.

ఇక ఆలస్యం చెయ్యలేదు. వెంటనే ఐదు వందల రూపాయల నోటు ఇచ్చాను. తను నా చేతికి ఆ పట్టీలని ఇచ్చాడు. అలా చేస్తాడని నేను ఊహించలేదు. వారెవరో నాకు తెలీదు కాబట్టి నా జాగ్రత్త కోసం ఆ పట్టీలని తీసుకొన్నాను. వెళ్ళొస్తాను అంటూ వెళ్ళాడు.

మరుసటి రోజున మళ్ళీ వచ్చాడు. ఇంకో ఐదు వందల రూపాలు తక్కువ అవుతున్నాయని. ఈసారి కాస్త ధైర్యముగా వాటిని తీసి ఇస్తే, తీసుకొని తను వెళ్ళిపోయాడు. ఇలా రోజూ వస్తాడా? అలా అయితే ఏమైనా సరిక్రొత్త సమస్యలని తలకెక్కించుకుంటానా ? చూద్దాం.. వెయిట్ అండ్ సీ అనుకున్నా...

మరుసటి రోజు కాదు కానీ నాలుగో రోజున వచ్చాడు. వచ్చి నా చేతుల్లో రెండు వేల నోటు పెట్టాడు. అది తీసుకొని లోపల పెట్టేసి, తన పట్టీలు + మిగిలిన చిల్లర వేయి రూపాయలు ఇచ్చాను. హమ్మయ్యఅ డబ్బులు నాకు వచ్చాయని ఒక వైపు.. ఒకరి జీవితాన్ని కాపాడటం లో ఒక చిన్న సహాయం చేశానని మరోవైపు సంతోషం..

అలా ఉన్న నా ముందు వంద నోటు పెట్టి, వడ్డీ తీసుకోమని అన్నాడు..
నేను అడగలేదు.. తానే నిజాయితీగా చెప్పాడు.
నాకు ఆ డబ్బుని ముట్టాలనిపించలేదు. వద్దన్నాను.
తీసుకోమని గట్టిగా ప్రాధేయపడ్డాడు.
నేను లేకపోతే డబ్బులు అందక ఎలా ఉండేదో.. అందుకే వడ్డీ తీసుకోమని అన్నాడు. నాకు నచ్చలేదు. నాకిచ్చే ఆ వడ్డీ ఏదో మీ బాబుకి నా తరపున ఇవ్వు.. దేనికైనా పనికి వస్తాయని చెప్పా.. వడ్డీ ఎంతనో కూడా నేను ఇప్పటివరకూ లెక్క కట్టలేదు. నా చిన్న సహాయం వల్ల ఒకరి జీవితం నిలబడింది అన్న తృప్తి చాలు నాకు.




1 comment:

jyothi said...

manchi pani chesaaru.chaala santosham. keep it up

Related Posts with Thumbnails