అభిప్రాయ భేదం వేరు - గొడవ వేరు.
అవతలి వారి అభిప్రాయం కానీ, ప్రవర్తన కానీ,
పని కానీ నచ్చకపోతే,
గొడవపడకుండా తన భావాన్ని చెప్పగలగటం ఒక గొప్ప కళ.
అవును.. ఈ లోకములో ఏదైనా ఒక విషయం మీద ఎవరికీ వారిని తమ అభిప్రాయం చెప్పమన్నప్పుడు - ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు. అందరూ ఒకేలా స్పందించాలన్న రూలేమీ లేదు.. ఎవరి అభిప్రాయం వారిది. ఆ అభిప్రాయం నచ్చకపోతే చిన్నగా నవ్వేసి ఊరుకోండి.. లేదా మౌనముగా ఉండిపోండి.. లేదా సున్నితముగా ఎందుకు నచ్చలేదో చెప్పండి ( అలా చెప్పటం అన్నది తిరిగి వారు ఆ విషయం మీద చర్చకి తెర ఎత్తేలా చెయ్యకూడదు ) సినిమాలు, రాజకీయాల విషయాలు జోలికి అస్సలు వెళ్ళకండి. వేరే యే విషయాల మీద అయినా మాట్లాడండి. ఆ రెండు విషయాల్లో అభిప్రాయాల భేదాలు తప్పనిసరిగా వస్తాయి. ఎదుటివారి ముందు తాము తక్కువ కావొద్దని, తామే నెగ్గాలని లేనిపోని వాదనలతో ప్రయత్నిస్తారు. అప్పుడే గొడవ మొదలవుతుంది. ఇటు సమయం, అటు అంతదాకా ఆ ఆ స్నేహ బంధాల మీద వెచ్చించిన సమయం, డబ్బూ, చేసిన మేళ్లూ.. అన్నీ గోవిందా - గోవిందా.. ( ఇలా అయ్యే నా ఇద్దరి మిత్రుల వాగ్వాదం పదిహేనేళ్ళ ఎడబాటుకి గురి చేసింది. అది ఇంకా ఇప్పటికీ అలాగే దూరముగానే కొనసాగుతున్నది కూడా.. )
అభిప్రాయాన్ని అభిప్రాయం గానే తీసుకోండి. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండాలన్న రూలేమీ లేదు కూడా. వారి అభిప్రాయం వారిది అని ఊరుకోండి. దాన్ని విభేదించినప్పుడే గొడవగా మారుతుంది. అలా మారాక ఎవరి ఈగో వారిది ఉంటుంది. ఫలితముగా ఎవరితో అంతగా సఖ్యతగా ఉండలేనంతగా మారిపోతారు. ఉన్న జీవితమే అరవై ఏళ్లుగా భావిస్తే - అందులో మొదటి ఇరవై ఏమీ తెలీకుండానే వెళ్ళిపోతాయి. చివరి ఇరవై ఏమీ చెయ్యలేని స్థితిలో ఉంటాం.. మధ్యలోని బంగారం లాంటి కాలాన్ని కాసేపు నోరు మూసుకుంటే వెళ్ళిపోయే ఇబ్బందికర అభిప్రాయ భేద కాలాన్ని - చేజేతులారా పాడుచేసుకొని జీవితకాలం బాధపడేలా చేసుకోవడం అంత సమంజసమైన పని అనిపించుకోదు. అప్పుడప్పుడు లేదా రోజూ ఎదురయ్యే వారితో అలా చేసుకోవటం అన్నది మరీ మూర్ఖత్వం నా దృష్టిలో. అవును.. వారు అలా చేసుకుంటే పక్కా పిచ్చోళ్ళే అని నేను అనుకుంటాను. కానీ ఆ సమయాన అర్థం కాదు.. జీవితం కొనసాగి, ఒక దశకి వచ్చినప్పుడు అన్నీ అర్థమవుతాయి. అంతదాకా మనం చేసిన పని గొప్ప హీరో వర్షిప్ గానే భావిస్తాం.. తెలిశాక గానీ అప్పుడు ఆరోజు అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది అని అనుకోం.. అందుకే దయచేసి - ఏ అభిప్రాయ భేదాన్నీ గొడవ వరకు తీసుక రాకండి. వచ్చేట్లు అనిపిస్తే - ఏదో ఒక వంక పెట్టుకొని, అక్కడినుండి దూరముగా జరిగిపోండి.
ఏదైనా నచ్చకపోతే సున్నితముగా చెప్పండి. అది ఎలా ఉండాలీ అంటే - అది చెప్పాక మీ ఇద్దరిమధ్య బందం మరింతగా బాగుంటుంది అనుకుంటేనే.. లేకుంటే అస్సలే వద్దు. ఆ ఆర్టు ( కళ ) మీలో ఉంటే చెయ్యండి. లేకుంటే మీకు సంబంధించిన విషయం కాదని ఊరుకోండి.
చివరిగా ఒక మాట : మనుష్యులూ మనుష్యులూ మనసు విప్పి మాట్లాడుకోలేని ఈరోజుల్లో - అభిప్రాయ భేదాల వల్ల బంధాలు దూరం చేసుకోవడం అంత మంచిది కాదు.. ఎంతమందితో మనం " సరిగా " ఉంటే - జీవితాన అంత సక్సెస్ ఫుల్ మనిషిగా అవుతాం.. ఇది మాత్రం నమ్మలేని నిజం..
No comments:
Post a Comment