చాలామంది ఏదో సాధించాలని అనుకుంటారు తప్ప దానికి తగిన కృషి మాత్రం చెయ్యరు. కారణం : ఓటమి పాలవుతామేమోనన్న భయం.
అవును.. చాలామంది అలానే చాలా అంచనాలు వేసి, ఏదో సాధించాలని చక్కని ప్రణాళికలు వేస్తారు. కానీ వాస్తవరూపం లోకి మార్చాలనుకున్నప్పుడు ఏదో చెప్పలేని నూన్యత భావానికి గురి అయ్యి అలా చేస్తే, ఎక్కడ ఓటమి పాలవుతామేమో, అందరూ మనల్ని చూసి ఎక్కడ నవ్వుతారేమో అని ఊహించుకుంటూ ఉన్నచోటే ఉండిపోతాం. ఇలా చెయ్యటం వలన మన ఎదుగుదల అక్కడితోనే ఆగిపోతుంది. ఒక అడుగు ముందుకు వేసి, గట్టిగా ప్రయత్నం చేస్తే - ఎంతగానో సాధిస్తామని తెలిసి కూడా అలాగే స్థబ్దుగా ఉండిపోతాం. ఎవరైనా అలా చక్కని ప్రణాళికతో గట్టి ప్రయత్నం చేసి, ముందుకు వెళ్ళితే - ఈర్ష్యా ద్వేషాలతో వారిని వారి చాటుగా ఏదేదో అంటుంటాం. ఇదంతా మన చాతగానితనానికి నిదర్శనం అని మనకి మనమే బయట పెట్టుకుంటున్నట్లు.
ఇలా ఏదేదో చెయ్యాలనుకొని, ఆగిపోయేవాళ్ళు ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోవాలి.
మనకున్నది ఒకే ఒక జీవితం. ఏమి చేసినా, చెయ్యాలనిపించినా - అది ఈ జన్మలోనే చేసెయ్యాలి.
హా.. అవును. మన అందరికీ ఉన్నది ఒకే ఒక జన్మ. రోజుకి ఉన్నది అవే ఇరవై నాలుగు గంటలే. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని సాధించినవాడే గొప్పవాడు అవుతాడు. చరిత్రలో మిగిలిపోతాడు. అలా చెయ్యలేని వాడు - ఈర్ష్యలతో కుళ్ళిపోతూ - చివరికి ఈకలో పేకలా మిగిలిపోతాడు. ఏది చెయ్యాలనుకున్నా, చెప్పాలనుకున్నా, కలవాలనుకున్నా ఈ జన్మలోనే చెయ్యాలి. చివరికి ఎవరికైనా క్షమాపణలు చెప్పాలనుకున్నా, మన్నించాలనుకున్నా ఈ జన్మలోనే చెయ్యాలి. కారణం : మనకున్నది ఒకేఒక జన్మ.
ఇక - ఎవడో ఏదో నవ్వుకుంటాడు అని మనం మన ఎదుగుదలని ఆపేసుకుంటే - మనం చాతకానివాడిలా మిగిలిపోయినప్పుడు, మనల్ని చూసి మరింతగా నవ్వుకుంటాడు. ఇక్కడ నా స్వానుభవం చెప్పాలని అనుకుంటున్నాను.
నేను హాబీగా, కాలక్షేపం + ఆర్థికముగా బాగుంటుందని నైపుణ్యముతో కూడిన మెషినరీ పని నేర్చుకున్నాను. అందులోకి అడుగిడిన మొదటి సంవత్సరంలో - ఎందుకురా ఈ లంపటం పెట్టుకున్నాను అనిపించింది. నాకు పోటీగా అప్పటికే మరో ఇద్దరు ప్రారంభించారు. వారిద్దరూ చాలా పనివచ్చినవారు. నాకేమీ పనిలో అనుభవం కూడా లేదు. ఎవరో ఏదో అనుకుంటారు అనుకొని చాలా ఆలోచించాను. అపజయం పొందితే ఎవరెక్కడ నవ్వుతారేమో అని ఊహించుకొని, తెగ ఇదయిపోయాను. కానీ అక్కడ నా ఆసక్తి, ఆర్ధిక లాభం, తృప్తీ .. బాగా ప్రేరేపించాయి. అలా మొదలెట్టాను.. అలా అలా ఒక్కో మెట్టూ ఎక్కుతూ, వారిద్దరినీ దాటేసి, నాకు అంటూ పోటీ లేని స్థాయికి చేరుకున్నాను. నాకు పోటీగా మరికొందరు వచ్చినా లాభం లేకపోయింది. వారి వైపల్యాలు చూసి, మరికొందరు ఆ ప్రయత్నాలు చెయ్యక, ఆగిపోయారు. ఇప్పుడు నాకంటూ ఒక గొప్ప కీర్తి. ఆ పని చెయ్యటం వలన నాకు చాలా లాభాలు కలిగాయి. ఇంకా కలుగుతున్నాయి కూడా. మరిన్ని రంగాలలోకి వెళ్ళటానికి - ఆ పని నాకు చక్కని సోపానం అయ్యింది. ఇలా ఒక ముందడుగు నా జీవితాన్ని చాలానే మార్చేసింది. ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి.. అవన్నీ మరోసారి చెప్పుకుందాం.
No comments:
Post a Comment