ఎప్పుడూ నిరాశగా ఉండే వాళ్ళతో, అలా మాట్లాడే వాళ్ళతో కాకుండా - చురుకుగా ఉండేవాళ్ళు, లోకం పోకడ గురించి తెలిసిన వారితో స్నేహం చెయ్యండి.
అవును.. ఎపుడూ ఏదో కోల్పోయినట్లుగా, జీవితాన్ని నిరాసక్తముగా లాగిస్తున్న, ఏమిట్రా నాకీ బ్రతుకు.. నా జీవితమే వృధా అనుకొనే వాళ్ళు, ఎప్పుడూ నిరాశాపూరితముగా మాట్లాడుతూ ఎదుటివారి ఉత్సాహాన్ని కూడా తగ్గించేవారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలా జాగ్రత్తగా ఉండమని ఎందుకు చెబుతున్నానూ అంటే - ఈ నిరాశ అనేది ఒక అంటువ్యాధి లాంటిది. ఒకసారి ఇది మనకి అంటుకున్నది అయితే ఇక మనమూ అలాగే మారుతాం - అలాగే నిరాశగా మాట్లాడటం, ఏదో కోల్పోయినట్లుగా ఎప్పుడూ బాధగా ఉండి, ఈ ప్రపంచం నా బాధ తొలగించటం లేదు అని బాధపడటం మన దినచర్య అవుతుంది. ఇది మనల్ని వదలాలి అంటే చురుకుగా, ఉత్సాహముగా, ప్రేరణ ఇచ్చేవారి తోడ్పాటు తప్పనిసరిగా అవసరమవుతుంది.
మనిషి అరవై ఏళ్లు బ్రతుకుతాడు అని లెక్కలేసుకుంటే - మొదటి ఇరవై ఏళ్లు ఏమీ తెలీని వయస్సులో ఉంటాం. చివరి ఇరవై ఏళ్లు చెయ్యటానికి శక్తీ, శరీరం సహకరించదు. ఇక మధ్యన ఉన్నఇరవై ఏళ్లు - అసలైన సమయం. మనజీవితం, భవిష్యత్తు ఎలా ఉండాలో దానికి తగ్గట్లుగా శ్రమ చేసి, పాకులాడే వయస్సు. కానీ ఆ సమయాన్ని - ఇలాంటి నిరాశాపూరిత మాటలు వింటూ ఉంటే అసలైన కాలం వృధా అవుతుంది. ఇలా ఎందుకనిపిస్తుంది అంటే - ఆరేళ్ళు సహవాసం చేస్తే - వారు వీరు అవుతారు. వీరు వారవుతారు అనీ.. అంటే వారిలా అన్ని విషయాల్లో నిరాసక్తముగా ఉంటూ ఉంటాం. జీవిత చరమాంకంలో - మన జీవితాన ఏమి సాధించాం అన్న ఆలోచన వస్తే - ఖచ్చితముగా తీవ్ర విచారమే కలుగుతుంది. వచ్చి మళ్ళీ జీవితాన్ని పునర్మించుకుందామని అనుకున్నా రాలేని కాలం. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్పేది.
మరి ఇలాకాకుండా ఏమి చెయ్యాలి / ఇలాంటి నిరాశాపూరిత మనస్తత్వాల మనష్యుల సహవాసం నుండి బయటపడాలీ అనుకుంటే దానికి సులువైన, అద్భుతమైన పద్ధతి - చురుకుగా, జీవితాన ఎప్పుడూ సంతోషముగా ఉండేవాళ్ళు, లోకం గురించి బాగా తెలిసిన వారితో సహవాసం. నిజానికి ఇది కూడా నిరాశాలాగే అంటువ్యాధిలా ఉంటుంది. కానీ దీన్ని అంటించుకోవడానికి అంతగా ఇష్టపడం. వారి సహచర్యంలో మనం మన జీవితాన ఎన్నడూ చూడని క్రొత్త సంతోషాలకు, ప్రేరణలకూ ఆలవాలం అవుతుంది. మిగిలిన జీవితాన్ని క్రొత్తగా మొదలు పెట్టామా అన్నట్లు అగుపిస్తుంది. ఇన్నిరోజులూ ఇలాంటి జీవితాన్ని ఎందుకు, ఎలా మిస్ అయ్యామా అనిపిస్తుంది. అనవసరముగా అలాంటి నిరాశాపూరిత వ్యక్తుల సహవాసం చేసి, అమూల్యమైన సమయాన్ని ఎందుకు వృధా చేశామా అనిపిస్తుంది.
ఇక్కడ ఒక విషయాన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. జీవితాన ఎదురుపడే ప్రతి వ్యక్తీ మనకి స్నేహితుడు కాకపోవచ్చు, మనకి స్నేహితుడయిన వ్యక్తి ఒక మంచి మిత్రుడు కాకపోవచ్చు. అలాగే నిరాశాపూరితమైన వ్యక్తిని వదులుకొనే ముందు - తనలోని ప్రతిభాపాటవాల్ని తెలుసుకోండి. ఒక్కోసారి ప్రతిభావంతులు - తమ తమ రంగాల్లో ఏర్పడ్డ అనుకోని అపజయాల వల్ల కూడా అలా తయారవవచ్చు. అలాంటి సమయాల్లో మీరు నిరాశ నుండి బయటపడి, వారిని బయటకు లాగేయ్యండి. అలాచేసిన నాడు మిమ్మల్ని జీవితాంతం మీ పట్ల కృతజ్ఞతగా ఉంటారు.
No comments:
Post a Comment