తెలంగాణలో ప్రసిద్ధ పరమ శివుడి ఆలయం కాళేశ్వరం ( Kaleshwaram ) - కాళేశ్వర మరియు ముక్తేశ్వరం ( Muktheshwaram ) అని కూడా ప్రసిద్ధి. పవిత్ర గోదావరి నది ప్రక్కన ఉంది. ఆలయానికి కొద్ది దూరములో ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఒకే పానపట్టం మీద రెండు లింగాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఒక లింగాన్ని యమ ధర్మరాజు ప్రతిష్టించాడు అందుకే కాళేశ్వరుడు (కాలుడు = యమధర్మరాజు, ఈశ్వరుడు = శివుడు) అని స్థల పురాణం. ఇంకో లింగాన్ని ముక్తీశ్వరుడు అని పిలుస్తారు. అంటే ఆ లింగాన్ని కొలిస్తే / అభిషేకం చేస్తే ఈ జన్మతో ముక్తి లభించి, సర్వ పాపాలు తొలగిపోయి, పునర్జన్మ లేకుండా ఉంటుంది అని విశ్వాసం. ఇక్కడ శివ అభిషేకాలు ఎక్కువగా ఉంటాయి. ఆలయ ప్రాంగణాన్ని చాలా విశాలముగా అభివృద్ధి చేశారు. ఎప్పుడో ఇరవై రెండేళ్ళ క్రితం వెళ్ళిన నాకు అప్పటికీ, ఇప్పటికీ ఆలయ అభివృద్ధి స్పష్టముగా కనిపించింది.
ఇక్కడ ఉన్న గోదావరి నదిలో పిండ ప్రదానాలు మరియు ఆస్థిక నిమజ్జనాలకి కూడా ప్రసిద్ధి. ఉత్తర భారత దేశములో ఉన్న కాశీ ( వారణాసి ) వరకూ వెళ్ళలేని వాళ్ళు / స్థోమత లేనివారు ఇలా అనుకొంటారు -
అక్కడ ప్రవహిస్తున్న గంగ - ఇక్కడ ప్రవహిస్తున్న గోదావరి
గంగ జీవనది - ఈ గోదావరి కూడా జీవనది
రెండూ ఎల్లప్పుడూ ప్రవహిస్తుంటాయి.
అక్కడా పిండ ప్రదానాలకి / ఆస్థిక నిమజ్జనానికి ప్రసిద్ధి - ఇక్కడా అంతే.
అక్కడ పురాతన శివాలయం - ఇక్కడా ప్రాచీనమైన శివుని ఆలయం.
కాశీ మరియు కాళేశ్వరం రెండూ పురాణ ప్రసిద్ధి ఆలయాలు.
కాశీలోన లింగం స్వయం భూలింగం అయితే - ఇక్కడ యమధర్మరాజు చేసిన ప్రతిష్టలింగం.
కాశీలోన గంగానదిలో యమున, సరస్వతి నదులు కలుస్తాయి అందుకే త్రివేణీ సంగమ స్థలంగా ప్రసిద్ధి. ఈ కాళేశ్వరం వద్ద కూడా గోదావరి ప్రాణహిత నదులు కలుస్తాయి. సరస్వతి నది అంతర్వాహిని అని ఇక్కడ చెబుతారు కాబట్టి ఇలా భావించుకొని, ఇక్కడికి చాలామంది ఆయా కార్యక్రమాలకి వస్తుంటారు. ఇలాంటి కార్యక్రమాలకు సాధారణముగా ప్రవహిస్తున్న కాలువలు కన్నా దగ్గరలోని నదులకు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆ నదులలో కూడా ఇలా ఇంకో నది వచ్చి కలిసే సంగమ స్థలాలకి మరింత అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాంటి స్థలాలు గొప్పనైనవన్న భావన చాలామందిలో ఉంది. అందుకే కాశీకి అంతటి ప్రాధాన్యత ఇస్తుంటారు అనిపిస్తుంది.
నాకు తెలిసి ఉత్తర భారత దేశంలోని ఈ నది ఎప్పుడో అంతర్థానమైంది.. ఇక్కడ అంతర్వాహిని అంటే - తెలిసిన వారికి ఒప్పుకోబుద్ధి అవదు.. కానీ స్థల విశ్వాసాలని నమ్మాలి. అదే తృప్తి. ఆ తృప్తి అంటూ ఉంటేనే వెళ్ళిన పర్యటన సఫలం అయినట్లు అనిపిస్తుంది. లేకుంటే వెళ్లామా ! వచ్చామా !! అన్నట్లు అగుపిస్తుంది.
పిండప్రదానాలకి అవసరమైన పూజా సామాగ్రి 80 - 100 రూపాయల్లో వస్తాయి. పిండప్రదాన పంతులుకి పూజ చేసేందుకై 516 రూపాయలు తీసుకుంటాడు. ఇది అక్కడ ఫిక్స్ రేటు. పది రూపాయలు కూడా తగ్గించరు. మామూలుగా అయితే పది, పన్నెండు రోజులప్పుడు చేసిన పూజ సరిపోతుంది. మనసులో ఏమూలనో అది సరిపోలేదు, ఇదే చివరిసారి ఆస్థికలకు పూజ అని భావించిన వారు ఇక్కడ మళ్ళీ పూజ ( పది, పదిహేను నిముషాల పాటు ఉంటుంది ) చేసుకుంటారు.. ఇది ఎవరి ఇష్టాలకు వారికి సంబంధించినది. గంగానది వద్ద జరిగినట్లుగా ఇక్కడ ఆస్థికలకు పూజ ఉండకపోవచ్చు.
తరవాత మూములుగా గోదావరినదిలో ఆస్థికలని కలుపుతారు. లేదా ప్రాణహిత గోదావరి నదీ సంగమ స్థలంలో కలుపుతారు. అలా సంగమ స్థలంలో కలపాలీ అంటే ఏదైనా నాటు పడవ గానీ, మోటార్ బోటుని తీసుకొని వెళ్ళాలి. ఇందులకు మామూలు రోజుల్లో బోటు వారు 500 రూపాయలు తీసుకుంటారు. నదీ సంగమ స్థలంలో మోటారు బోటుని ఆపుతారు. అప్పుడు వెనక్కి చూడకుండా ఆస్థికల పాత్రని వెనక్కి తిరిగి, భుజం మీదుగా ఆ సంగమ ప్రదేశంలో వేస్తారు. సంగమ స్థలంలో కలిపాక - అవతలి ఒడ్డున ఆపితే, అక్కడ లోతు తక్కువ స్థలం చూసుకొని, పదకొండు మునకలు మునుగుతారు. స్నానాదులు అయ్యాక తిరిగి అదే పడవలో ఇవతలి ఒడ్డున చేరుస్తారు.
గోదావరి నదిలో స్నానాదులు చేసేటప్పుడు లోతు స్థలాలకి వెళ్ళకూడదు. ఎందుకంటే - అక్కడక్కడా లోతైన గుంటలు ఉంటాయి. మనం స్నానం చేస్తున్న ప్రదేశం బాగానే ఉంది అనుకొని కాస్త దూరం ( కొద్ది అడుగుల దూరం) వెళ్ళితే - గల్లంతు అయిపోవటం మామూలే. ఎందుకంటే - నీళ్ళలో ఉన్న రాతి గుట్టలు, ( ఫోటోలలో చూడవచ్చును ) ఇసుక తోడిన గుంటలూ, ప్రవాహానికి కోసుకపోయిన ఇసుక మేటల వల్ల అలా జరుగుతుంటాయి. చాలామంది అత్యుత్సాహం చూపి, హెచ్చరికలు బేఖాతరు చేసి, గల్లంతు అయినవారు చాలామందే ఉన్నారుట. అందుకే స్నానాల ఘాట్ వద్ద ఒక బోర్డ్ కూడా పెట్టారు.
గోదావరి నీరుని బాటిళ్ళలో నింపుకొని ఇంటికి తీసుకొని రావటం ఇక్కడ పరిపాటి. ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని, అక్కడికి ( కాళేశ్వరం వరకూ ) రాలేని ఇంటిల్లిపాదీ ఇంటివద్దే స్నానాలు చెయ్యటం - తద్వారా తాము ఆ గంగ ( గోదావరి ) నీటితో స్నానం చేశామనే తృప్తి భక్తులకు ఉంటుంది. కొంతమంది ఆ సంగమ స్థలం వద్ద నీటిని తీర్థంలా కూడా సేవిస్తుంటారు. అందుకే ఇక్కడికి వచ్చినవారు సాధ్యమైనన్ని బాటిళ్ళలో పవిత్ర గోదావరి నీటిని ఇంటికి తీసుకవెళతారు.
కాళేశ్వరానికి దారి ఫోన్ GPS ద్వారా తెలుసుకుంటూ వెళ్లాను. రూట్ మ్యాప్ మీకోసం. కారులో బయలుదేరాం కాబట్టి కొద్దిగా మాత్రమే ఆలసట అనిపించింది. ఇందులో మీకు హైదరాబాద్ నుండి దారి మరియు మధ్యలో వచ్చే ప్రదేశాలు, దూరం, గమ్యం చేరటానికి పట్టే కాలం.. ఉన్నాయి.
ఈమధ్య అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గోదావరి అందాలు నా మొబైల్ కెమరాతో తీశాను. అవి ఇప్పుడు మీకోసం.
ఇదే కాళేశ్వరం వద్ద నున్న గోదావరి పరివాహక ప్రాంతం. హెచ్చరిక బోర్డ్ కూడా ఉంది. ఫోటోలో సగం కనిపిస్తున్నది. స్నానాలకు, ఇతర కార్యక్రమాల కోసం మెట్లు కూడా కట్టారు.
ఇవి గోదావరి నదిలో ఉన్న రాళ్ళ గుట్టలు. నీరు తక్కువగా ఉన్నందున ( ఈసంవత్సరం తగినంత వర్షపాతం లేదు కనుక ) ఇలా నదిలో నీరు తగ్గి, ఇలా రాళ్ళు బయట పడ్డాయి.
ఇవీ రాళ్ళ గుట్టలే.. ఒడ్డు నుండి నదీ లోపలికి వెళుతున్నప్పుడు కనిపిస్తాయి. ఎగుడు దిగుడుగా ఉంది, నీరున్నప్పుడు కాళ్ళు జారి నీటిలోన పడిపోతాం.. కనుక జాగ్రత్త. అలాగే ఇక్కడ మనుష్యులు వేసిన చెత్తనీ చూడవచ్చును. ఇక్కడ కూడా
స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం నిర్వహిస్తే బాగుండును.
ఇదే పవిత్ర గోదావరి నది.
మోటార్ బోటు నుండి గోదావరి నదీ అందాలు.
మత్స్యకారుల తాత్కాలిక ఆవాసాలు.
తీరానికి దూరముగా..
మోటార్ బోటులో గోదావరి - ప్రాణహిత - సరస్వతి నదుల సంగమ స్థలానికి బయలుదేరినప్పుడు -
అలా తీరము నుండి దూరముగా జరుగుతూ, నదీ మధ్యలోకి రావటం..
ఈ క్రింది ఫోటోనే - గోదావరి - ప్రాణహిత - సరస్వతి నదుల సంగమ స్థలం. మహారాష్ట్ర నుండి ప్రాణహిత వచ్చి, ఇక్కడే గోదావరి నదిలో కలుస్తుంది.
గోదావరి ఇసుక తిన్నెల అందాలు.
అక్కడ ఎవరో చేసిన - సైకత శివలింగం.. ఎవరోగానీ చాలా బాగా చేశారు.