Sunday, June 3, 2012

గిఫ్ట్ కవర్స్ Gift Covers - 1

పెళ్ళికి రమ్మని ఆహ్వానం పలుకుతూ మనకి ఎన్నెన్నో ఆహ్వాన పత్రికలూ అందుతుంటాయి కదా.. అందులో మామూలువీ, బాగా ఖరీదైన పత్రికలూ వారి వారి తహతుకి బట్టి ఉంటాయి. వివాహ తేదీ తరవాత వాటిని వృధాగా పారేస్తాము. కొన్ని పెళ్లి పత్రికలు చాలా బాగుండి, దాచుకోవాలని అన్నట్లు ఉంటాయి. కానీ కొద్దిరోజుల కన్నా ఎక్కువ రోజులు అయ్యాక, వాటిని ఏ చెత్తబుట్టకో దాఖలు చేస్తాము. ఇలా చెయ్యటం అందరికీ సర్వసాధారణమే!

ఇలాంటి అందమైన పెళ్లి పత్రికలని పారేయ్యకుండా, ఈ వేసవి సెలవుల్లో, లేదా తీరిక వేళల్లో, కాసింత కష్టముతో, కొద్దిపాటి కత్తిరింపులు, మడతలతో అందముగా గిఫ్ట్ కవర్ Gift Cover ని చేసి, అందులో డబ్బులు పెట్టి, పెళ్ళిళ్ళలో, వేడుకల్లో ఇవ్వోచ్చును.

పెళ్ళిళ్ళలో చదివించటాలు తప్పనిసరి కదా.. అందరి ముందు మనం పెట్టే డబ్బులు తక్కువగా ఫీలయ్యి, నామోషీగా భావిస్తే, ఆ పరిస్థితిని తప్పించటానికి ఈ గిఫ్ట్ కవర్స్ ని వాడి, ఆ డబ్బులని ఆ అందమైన కవర్లలో ఉంచి, అందరి ముందూ ఇస్తే, కాసింత గర్వముగా ఉంటుంది. అలాగే ఆ ఇబ్బందిని సులభముగా తొలగించుకోవచ్చును.

అందరిముందూ మనం చేసిన గిఫ్ట్ కవర్ ని ప్రదర్శిస్తూ, ఆ వేడుకలో ఇస్తూ, ఫోటో దిగితే, ఆ ఆనందం, గర్వం, అందరిముందూ మనము ఏదో గొప్ప అన్నట్లు రిచ్ నెస్ వస్తుంది. ఈ సందర్భాన్ని చూసిన వారి మొహాల్లో కనిపించిన భావాలని మీరు గమనిస్తే, మీలో ఏదో గొప్ప విజయాన్ని సాధించాము అన్న భావన ఉదయిస్తుంది కూడా..

మామూలుగా మార్కెట్లో రూపాయకి, రెండు  రూపాయలకి ఒక గిఫ్ట్ కవర్ అమ్ముతారు. ఈ కవర్ని మొదట్లో బాగా కొని ఉంచేవాడిని. ఒకసారి ఆ కవర్లన్నీ అయిపోతే, ఆరోజు మార్కెట్లకి సెలవు దినం కావటముతో, ఎక్కడా గిఫ్ట్ కవర్స్ దొరకలేదు. అప్పటికప్పుడు ఐడియా వచ్చి, ఒక అందమైన వివాహ పత్రికని తీసుకొని, గిఫ్ట్ కవర్ లా చేసుకొని.. ఆ వేడుకలో ఇచ్చాను. నేను ఆ గిఫ్ట్ కవర్ లోపెట్టిన మొత్తం కేవలం వంద పదహారు రూపాయలైనా, ఏ ఐదు వందలు పెట్టానేమో అన్నట్లు రిచ్ నెస్ వచ్చింది. అప్పుడు అక్కడకి వచ్చిన వారి మోఖాల్లో భావాలన్నింటినీ గమనించాక, కాసింత గొప్పగా ఫీల్ అయ్యాను. అలా రెండు, మూడు వేడుకల్లో అలాగే ఇచ్చాను. బాగా గొప్పగా అనిపించింది.

ఈ విషయాన్ని మీతో పంచుకున్నాక, మీకూ అలా చేసి ఇవ్వాలనిపించటం సహజం. మీకు అలా ఎలా చెయ్యాలో ఇప్పుడు వివరిస్తాను. ఈ వివాహ సీజన్ లో నాకు వచ్చిన పత్రికలని వివాహ తేదీ అయ్యాక, అలా గిఫ్ట్ కవర్స్ లా చేశాను. మీరూ చూసి ఎలా ఉన్నాయో చెప్పండి, చేసి, ఆనందించండి.

ఇవి చెయ్యటం చాలా ఈజీ.. కావలసిన వస్తువులూ తక్కువే.

కావలసిన వస్తువులు : 

మంచి పదునున్న కత్తెర. బట్టల కత్తెర కాకుండా, మీడియం సైజులోని బ్రాండెడ్ కత్తెర అయితే మంచిది. తేలికగా ఉండి, వాడటానికి అనుకూలముగా ఉంటుంది. 30-50 రూపాయాల్లో దొరుకుతుంది.

ఒక పన్నెండు అంగుళాల స్టీల్ స్కేలు. కొలతలకీ, దాన్ని వాడి కట్టర్ తో కత్తిరించటానికి అవసరం. పది రూపాయల్లో దొరుకుతుంది.

ఒక పదునైన పేపర్ కట్టర్. ఇది స్టేషనరీ షాపుల్లో దొరుకుతుంది. వాడగా వాడగా మొండిగా అవుతే, 300 నంబర్ వెట్ అండ్ డ్రై పేపర్ మీద అడ్డముగా వ్రాస్తే, మళ్ళీ మొదటిలాగా పదునుగా మారుతుంది. 15 - 30 రూపాయల్లో దొరుకుతుంది.

కట్టర్ వాడటానికి అనువైన మెత్తని అట్టముక్క / వారపత్రిక . దీని మీద ఆ పత్రికలని పెట్టి, కట్టర్ తో కత్తిరిస్తే, కట్టర్ పాడవదు.

ఫర్నీచర్ కి వాడే జిగురు. అంటే ఫెవికాల్ వంటిది. ఫెవికాల్ అయితే ఖరీదు అనుకుంటే, మామూలుది కూడా వాడోచ్చును. సగం ధరలో వస్తుంది. కవర్ వాడే పేపర్ మందముగా ఉంటుంది కాబట్టి, తప్పక ఇదే కావాలి. మామూలు పేపర్ కి వాడే జిగురు వాడితే అంత బాగా ఫలితాలు రావు. ఇది మామూలుది అయితే యాభై రూపాయల్లో వస్తుంది.

చంకీలు / టిక్లీలు. ఆడవారు పెట్టుకునే టిక్లీ ప్యాకెట్లలో స్టీలు రంగులో మెరిసేవి ఐదు రూపాయల్లో - రెండువందలకి పైగా ఉన్న టిక్లీల షీట్ వస్తుంది.

గిఫ్ట్ కవర్స్ కి వాడే రిబ్బన్. ఇది రెండు, మూడు రూపాయలు ఉంటుంది. లోపల డబ్బులు పెట్టాక, ట్యాగ్ కట్టినట్లుగా ఉండి, వారికి ఇస్తున్నప్పుడు, ఆ కవర్ ని మరింత అందముగా కనిపించేలా చేస్తుంది.

జిగ్ జాగ్ కత్తెర. ఇది యాభై రూపాయల్లో వస్తుంది. దొరకటం కాసింత కష్టం. పేరున్న టేలర్ మెటీరియల్ దుకాణాల్లో దొరుకుతుంది.

ఇప్పడు చేసిన కవర్స్ ని చూద్దాం. ఇవన్నీ పెళ్ళిపత్రిక ఆకారం బట్టి, వృధా పోగా ఒక్కోసైజులో వస్తుంటాయి. ఒక్కోటీ దేనికి దానికి ప్రత్యేకం అన్నట్లుగా ఉంటాయి. కావున మీకు అదో గుర్తింపు వస్తుంది కూడా. వామ్మో.. మొదటి క్లాస్ చాలా పెద్దగా అయిపొయింది.. ఈ థియరీ ఇంతటితో ముగిద్దాం.. ఇప్పుడు కొన్ని గిఫ్ట్ కవర్స్ ని చూద్దాం. మిగతా మిగిలిన పోస్ట్ లలో చెప్పుకుందాం. సరేనా.. ?4 comments:

వనజవనమాలి said...

ఐడియా చాలా బాగుంది. నేను ఎన్వలప్ వైట్ కవర్స్ మాత్రం అలా ఉపయోగించేదాన్ని. ఇక పై ఇప్పుడు మీరు చెప్పినట్లు చేయడానికి ప్రయత్నిస్తాను.
థాంక్ యు.ఎన్ని మంచి ఐడియాలో !!

Raj said...

ధన్యవాదములండీ వనజ గారూ..

Lakshmi Raghava said...

నాకు చిన్నప్పటినుండి కార్డ్స్ చెయ్యడం అలవాటు కానీ నలభై ఏళ్ళక్రితం ఇన్ని సొగసులు చేయడానికి వుండేవి కావు .మా మన్వరల్లకి ఇదీ చూపుతా. బాగున్నాయి చాలా . అభినందనలు
లక్ష్మీ రాఘవ

Raj said...

మీ అభినందనలకు కృతజ్ఞుడిని. నచ్చినందులకు సంతోషముగా ఉంది. ఈ గిఫ్ట్ కవర్స్ సీరీస్ లో ఎలా ఇంకా బాగా చెయ్యాలో పోస్ట్స్ వస్తాయి.. అవికూడా మీకు మరింత ఉపయోగకరం.

Related Posts with Thumbnails