Monday, April 25, 2011

Social NW Sites - 28 - నా మాట.

కొద్ది రోజులుగా ఏమీ టపాలు పోస్ట్ చెయ్యనందులకు మన్నించండి. నా పుట్టిన రోజు వేడుకల్లో, అలాగే నా స్వంత బీజీ పనుల్లో మునిగిపోయి.. కాస్త మరచిపోయాను. క్రొత్తగా జీవితాన్ని మొదలెట్టాను.

సోషల్ సైట్ లో చెప్పాల్సిన జాగ్రత్తల విషయాలు దాదాపుగా అన్నీ చెప్పేశాను అని అనుకుంటున్నాను. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి కాని, అవి అన్నీ వాటిని నేర్పించటానికి మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. అవి మీకు ఆయా సైట్లలో ఆ సైటు వారే చెప్పేస్తారు. ఈ సీరీస్ వ్రాయటానికి గల ముఖ్య ఉద్దేశ్యం - ఈ సైట్లలో ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్పటమే!. అలా చెప్పటం కోసమే ఈ సీరీస్ వ్రాశాను. నిజానికి ఇది బాగా కష్టమైన విషయం. అందులో బాగా మునిగి లోతులు చూసి వ్రాయాలి. కాని నాకున్న సమయాభావం వల్ల ఎక్కువ లోతుల్లోకి వెళ్ళలేకపోయాను. ఇక నుండీ పశ్నలూ, జవాబుల రూపములో ఈ టపా పూర్తి చేస్తాను.

ఇలా సోషల్ సైట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్రాయాలని ఎందుకు అనుకున్నారు?

నా స్నేహితులూ, ముఖ్యముగా స్నేహితురాళ్ళూ ఈ సోషల్ సైట్లలో ఎదురుక్కున్న ఇబ్బందులు చెప్పేవారు. కొందరు అక్కౌంట్స్ డిలీట్ చేసుకున్నారు కూడా. వీటిల్లోకి వచ్చే అర్హత అందరికీ ఉంది. కాని ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో తెలీక చాలా సమస్యలు ఎదురుకున్నారు. (ఆఫ్కోర్స్ నేను కూడా). ఏ సోషల్ సైట్ అయినా ఆడ్ చేసుకోవటానికి వాటి రెవిన్యూ పెంచుకోవటానికి ఆసక్తి చూపిస్తాయి. ఈ మధ్యనే సెక్యూరిటీ టిప్స్ అంటూ బాగానే పెడుతున్నారు. కాని వీటిల్లో మునిగిపోయిన వారు అవన్నీ చూసుకోలేరు, పట్టించుకోరు కూడా.

నా స్నేహితులు ఇలా దెబ్బలు తిని నన్ను సలహాలు అడిగితే, నాకు తోచినవి చెప్పేవాడిని. ఆలోచించి నిర్ణయం తీసుకొని పాటించమనేవాడిని. అలా ప్రతివారూ నన్ను సలహాలు అడిగేవారు ఎక్కువ అయిపోయారు. రోజూ అలా కనీసం ఇద్దరు అయినా ఉండేవారు. ఎంతని చెబుతాం, ఎన్నెన్నిసార్లు చెబుతాను? విసుగొచ్చేది. అయినా ఓపికగా చెప్పేవాడిని. ఆన్ లైన్ కి వస్తే చాలు ఎవరో ఒకరు ఏదో ఒకటి అడగటం.. నా పని పెండింగ్ అవటం.. బోలడంత సమయం వృధా అయ్యేది. నా స్నేహితురాలు ఒకావిడ ఒకసారి - ఇవన్నీ చాట్స్ లలో ఒక్కొక్కరికి చెప్పే బదులు, అదే చాట్ లోని ఆ భావాన్ని ఎక్కడైనా పోస్ట్ చేస్తే అక్కడికే వెళ్లి చదువుకుంటాముగా, మీకూ డిస్టర్బ్ ఉండదుగా అన్నారు. మాకూ ఉపయోగముగా ఉండి, ఎన్నిసార్లైనా చూసుకుంటాము - అని ఒక ఐడియా ఇస్తే ఇదేదో బాగుంది అనుకోని ఇలా బ్లాగ్ రూపములో డెవలప్ చేసి పోస్ట్ చెయ్యటం అంతే!. ఇలాంటివి ఎక్కడైనా ఉన్నాయా (ఉంటే ఆ లింక్ ఇచ్చేసి చేతులు దులుపుకోవాలని) అని సర్చ్ చేసి చూస్తే కొన్ని ఉన్నాయి కాని, అవి సోషల్ సైట్స్ కోసం లేవు. ఆ పని నేనే ఎందుకు మొదలెట్టవద్దూ ఆనుకొని మొదలెట్టాను.

మిమ్మల్ని బాగా మార్చిన సంఘటన ఏది?

నాకు కొంత అనుభవం వచ్చేసరికి, ఎవరు ఎలా మోసపోతున్నారో కాస్త తెలిసిపోయేది. అయినా నేను ఏమీ చెయ్యలేని పరిస్థితి. కొన్ని జాగ్రత్తలు చెప్పినా వినిపించుకోరు. ఫలితం - ఎదురు దెబ్బలు తగలడమే! అయినా ఈరోజుల్లో జాగ్రత్తలు చెబితే ఎవరు వింటారు? ఆఫ్కోర్స్ మొదట్లో నేనూ అంతేగా!. నాకూ కొందరు హితబోధ చేస్తే వినిపించుకోలేదు. అప్పట్లో అక్కౌంట్ డిలీట్ చెయ్యాలనిపించే విధముగా ఎదురు దెబ్బలు. ఒకసారి నాకూ బలమైన దెబ్బ తగిలింది. స్నేహమంటే నమ్మకం మీద ఏర్పడే పునాది అని బలంగా విశ్వాసించే నాకు ఒకరు నాకు మొదటిసారిగా రుచి చూపించారు. అందులో మానసికముగా చాలా దెబ్బ తిన్నాను. చాలారోజులు దాన్ని నెగెటివ్ గా తీసుకొని బాధపడ్డాను. ఆ తరవాత పాజిటివ్ గా ఆలోచిస్తే, నాకూ చాలా మేలు చేసింది. ఆన్లైన్ లో ఎవరినీ గుడ్డిగా నమ్మి అన్నీ చెప్పుకోవద్దు, అలా చెప్పుకుంటే ఇలా అవుతుంది అని తెలుసుకున్నాను. నిజమే కదా!. ఆరోజు అలా కాకుంటే - ఈపాటికి ఎన్ని ఎదురు దెబ్బలు తాకేటివో. ఆ అబ్బాయి చిన్నవాడు అయినా నాకు ఎంతో మేలు చేశాడు. అతను ఎలా ఏమి అనుకోని చేశాడో కాని, ఒక రకముగా మేలే జరిగింది. అతనికి వేవేల కృతజ్ఞతలు. అందరితో ఎలా జాగ్రత్తగా ఉండాలో ఆ రోజే దేవుడు అనేవాడు ఆ రూపములో తెలియచేశాడు అని అనుకున్నాను. దానివలన ఆన్ లైన్లోనే కాదు - నిజ జీవితములో ఎలా ఉండాలో కూడా అర్థం అయ్యింది కూడా.

అలా జాగ్రత్తలు నేర్చుకోవటం మొదలెట్టాను. ఒక్కొక్కరితో ఒక్కో అనుభవం.. అలా అలా నేర్చుకున్న జాగ్రత్తలు ఇక్కడమీకు తెలియచేస్తున్నాను. నిజానికి ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకున్నాక, ఈ సైట్లలో నాకు ఆనందం తగ్గినా - చాలాకాలం పాటు అంటి పెట్టుకునే అద్భుత స్నేహ పరిమళం నాకు మిగిలిపోయింది. ఇంతటికీ కారణమైన ఆ స్నేహితుడికీ, నా మిత్రులందరికీ శతకోటి కృతజ్ఞతలు.

ఈ సోషల్ సైట్లలో స్నేహాలు మీకు అవసరమా.?

నిజం చెప్పాలీ అంటే అవసరం లేదు. నా పనుల బీజీ లో నేను  ఉంటాను. రిఫ్రెష్ కోసం ఇలా వచ్చాను. అలాగే కాస్త విరామం వచ్చింది కాబట్టి, వచ్చాను. అంతే! స్నేహానికి వయసుతో సంబంధం లేదు. ఏ వయసు వారికైనా అది అవసరమే అని నేను అనుకుంటాను. కాని నేను బ్రహ్మచారి, చిన్న వయసు అని ఏనాడూ చెప్పుకోలేదు. ఈ విషయములో ఏనాడూ మాయ చెయ్యలేదు. స్ట్రెస్ తొలగించుకోవటానికి ఇందులోకి వచ్చాను. అందుకే కొన్ని సైట్లలో చేరాను, కాని సమయం వృధా అనీ, అన్నీ తీసేసి, ఒకదానిలోనే ఉండిపోయాను. అన్నింట్లో చేరి నా సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి. నేను వచ్చిందే స్ట్రెస్ పోగొట్టుకోవటానికి. పెంచుకోవటానికి కాదుగా..

మరి పోయిందా స్ట్రెస్?

హా! భేషుగ్గా.. మొదట్లో బాగా ఆనందం వేసేది. అంతా పైలా పచ్చీసు లాగా ఉండేవాడిని. బాగా ఎంజాయ్ చేసేవాడిని. కాని వాటిల్లో ఆనందం ఎక్కువ గంటల సేపు ఉండేది కాదు. అయినా ఆనందం కోసం ఉండేవాడిని. ఆ ఆనందం ఇప్పుడు నాకే నచ్చలేదు. కాని ఎదురు దెబ్బలు తగిలాక, నిజమైన స్నేహం కోసం ప్రాకులాడాను. నేను అనుకున్నది - ఈ సైట్లలో ఉండేది రెండు సంవత్సరాలు కదా.. మొదటి సంవత్సరములో పైలా పచ్చీస్ లాగా గడిపాను. అప్పుడు పొందిన ఆనందం ఆరోజుటి వరకు మాత్రమే ఉండేది. ఇలా ఆడ్ అయ్యి వెళ్ళిపోయే వారే ఎక్కువ. మంచి, మంచి ప్రోఫైల్స్ నా నుండి దూరం గా వెళ్ళిపోయాయి. అలా కాదనుకొని కాస్త జాగ్రత్తగా మాట్లాడేసరికి, మంచి స్నేహితులూ దొరికారు. వెళ్ళిపోయేవారు తక్కువ. ఆడ్ రిక్వెస్ట్ లు ఎక్కువ. ఒక్కో అనుభవం వస్తున్న కొద్దీ, జాగ్రత్తగా ఉండటం నేర్చుకున్నాను. ఆనందం తక్కువ అయినా.. మంచి స్నేహితులు దొరికారు అనుకునే తృప్తి నాకు మిగిలింది. తగ్గించే ముందు మంచి స్నేహితులు దొరికారు అన్న భావన నాలో ఉంది. ఆ తృప్తి చాలు.

మరి విరామం మాట ..?

అక్కడికే వస్తున్నాను. ఈ సోషల్ సైట్స్ గురించి కాస్త ముందే అనుభవజ్ఞుల వద్ద సలహాలు తీసుకున్నాను. ఎంత ఆనందమో, అంత మోసాలూ ఉంటాయనీ!. అందుకే కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఈ స్నేహాలు అని అనుకున్నాను. అలా ఫిక్స్ అయి ఓపెన్ చేశాను. రెండు సంవత్సరాలు ఎలా గడిచాయో గానీ, ఇట్టే గడిచిపోయాయి. మొన్న ఆగస్ట్ 15 కే క్లోజ్ అనుకున్నాను. అక్కౌంట్ డెలీట్ కొట్టేయ్యాలని అనుకున్నాను. ఇద్దరికి చెప్పాను. వారు వద్దన్నారు. ఇలాగే వదిలెయ్యండి. మీతో ఏదైనా, ఎప్పుడైనా మాట్లాడుకోవటానికి, చెప్పటానికి ఇది ఫ్లాట్ ఫాం లా ఉంటుంది అంటే అలాగే ఉంచేశాను.

అప్పుడే నా స్నేహితురాలు ఇలా పోస్ట్స్ ఎక్కడైనా చెప్పమని అన్నారు. "నాలాంటి ఏమీ తెలీని వారికి ఉపయోగముగా ఉంటుందీ, మీ అనుభవాన్ని మీలోనే ఉంచుకొని వెళ్ళిపోతే ఎలా..? మాకూ కాస్త చెబితే మాకూ మేలు చేసినవారు అవుతారు కదా.. మీరు ఇతరుల నుండి నేర్చుకున్న విషయాలు అలాగే ఇతరులకి పంచేస్తే మీ మేలు ఎన్నడూ మరచిపోలేం కదా.." అని అంటే - అప్పటిదాకా ఆ ఆలోచన లేని వాడిని - ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టాను. అప్పుడు ఆరు నెలల టార్గెట్ పెట్టుకొన్నాను. అది నా పుట్టిన రోజు వరకూ అనీ. ఆ రోజు తరవాత ఆ సైట్ల లోకి ఇక చాలా చాలా తక్కువగా వెళ్ళాలీ ఆనుకొని గట్టిగా తీర్మానించేసుకున్నాను.

అప్పటినుండి అన్ని వివరాలు సేకరించటం మొదలెట్టాను. అలా చెయ్యాలి అంటే ముందుగా దాన్ని అనుభవించాలి. అలా అయితేనే క్లారిటీ వస్తుంది. అందులో ఉన్నప్పుడే కాస్త డిటైల్డ్ గా వ్రాయగలం. చాలా పనులు వదులుకొని మరీ ఈ పని చేశాను. సంక్రాంతి ముందు మొదటి పోస్ట్ వ్రాశాను... అలా సాగిన ప్రవాహం ఇప్పటివరకూ సాగింది. నా గడువు సమీపించేసింది. అందుకే ఈసారి నా పుట్టినరోజు బాగా చేసుకున్నాను. చాలామంది అభిమానులతో మాట్లాడాల్సి వచ్చింది. ఉదయాన 7:46 కి మొదలైన ప్రవాహం మధ్యాహ్నం రెండున్నర వరకూ సాగింది. సోషల్ సైట్స్ వారితో చివరిది అనుకున్నాను కాబట్టి అందరికీ ఓపికగా సమాధానాలు ఇచ్చాను. వారందరికీ కృతజ్ఞుడిని. అందుకే ఆ మధురానుభూతిని బాగా ఎంజాయ్ చేశాను. దాంట్లోంచి బయటకి వచ్చాక మళ్ళీ వ్రాయటం మొదలెట్టాను. నా బ్లాగ్ లో అందుకే వేగముగా పోస్టింగ్ చెయ్యటం మొదలెట్టాను. అయినా కష్టపడి అన్నీ ముగించాను. ఈ  పోస్ట్ తరవాత కృతజ్ఞతలు పోస్ట్ ఒకటి మాత్రమే మిగిలింది. అంతే!.

సోషల్ సైట్స్ గురించి చెప్పే అర్హత ఉందా?.

నిజానికి లేదేమో!. కాని అనుభవం ఉంది. అది మీతో పంచుకున్నాను. ఎదుటివారిని జాగ్రత్తగా ఉండమని చెప్పటానికి యే అర్హత అవసరం లేదేమో!. అనుభవం ఉంటే చాలేమో!. నాకున్న కాసింత అనుభవం - కాసింతదైనా చెప్పాలని అనుకున్నాను. పరీక్ష గురించి చదివినప్పుడే బాగా వ్రాస్తాముగా. అలా అప్పుడే బాగా స్టడీ చేసి చెప్పాను. ఇంకొద్ది రోజుల తరవాత వ్రాస్తే - ఇంతగా కూడా వ్రాయలేనేమో!.. ఇంకో నెల తరవాత వ్రాయమంటే అసలు వ్రాయలేనేమో! అందుకే అందులో ఉన్నప్పుడే వెంట వెంటనే వ్రాయాల్సి వచ్చింది. అందుకే అందులో ఎక్కువగా కనిపించాను.

ఇవన్నీ మీ అనుభవాలా?

హా! ఖచ్చితముగా.. నా అనుభవాలే!. కొన్ని నా స్నేహితులవీ ఉన్నాయి. ఒకరి అనుభవాలు ఇంకొకరికి పాఠం గా ఉంటుందని అనుకోని వ్రాశాను. అవి పరిశీలిస్తే ఇది మనదేమో అని అనిపించేలా ఉంటాయి కూడా. అలాని పొరపడే అవకాశం కూడా ఉంది. చాలావరకు అలాగే అనిపిస్తాయి కూడా. కొంతమంది వారివి అయినా వారివి కావు అనుకున్నారు. కొందరేమో - వారి మీద వ్రాసినా, తెలిసినా బాగా ఎంజాయ్ చేశారు. అందరికీ ఉపయోగమే కదా.. ఫరవాలేదు ఏమీ అనుకోను అని వెన్ను తట్టారు. నా ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నవారివే వ్రాశాను. కాని వారు చూసినా వారివి కావు అనేలా ఉండటానికి జాగ్రత్తలు తీసుకున్నాను. ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా మార్చమంటే / తీసేయ్యమంటే తీసేస్తాను / మారుస్తాను. ఉదాహరణలు చెప్పాలీ అంటే - ఊహించి చెప్పవచ్చు, కాని జరిగిన సంఘటనలే వ్రాస్తే బాగుంటుందని చెప్పాను.

కొద్దిరోజులే అనుకోని రావటం క్రొత్తగా ఉంది?

అవును.. క్రోద్దిరోజులే! ఎందుకంటే ఇది అందమైన ఊబి. దిగామా బయటకి రాలేం!. అలాగే అందులోనే ఉండిపోవాలని అనిపిస్తుంది. మంచి ఫ్రెండ్స్ దొరకకుంటే వెంటనే బయటకి రావచ్చును. దొరికారు అనుకుందాం - వారికోసం మాటి మాటికీ, లాగిన్ అవ్వాలని అనిపిస్తుంది. లైఫ్ లో ఆ చాప్టర్ ఎందుకు మిస్ అవ్వాలని అని ప్రయత్నించాను. లక్కీగా దొరికారు. నా పర్సనల్ లైఫ్ కూడా ఇబ్బంది పడొద్దు కదా.. కొంతమంది కోసం అప్పుడప్పుడు వస్తాను. వారికోసం అంటూ.

మీరు అనుకున్న స్నేహితులు దొరికారా.?

హా! ఖచ్చితముగా. వారిలో కొద్ది కొద్ది లోపాలు ఉన్నాయి, కాని అన్నీ ఫర్ఫెక్షన్ ఉన్నవారు ఎవరున్నారు.? ఈవెన్ నేను కూడా  లేను. చక్రం సినిమాలో లో చెప్పినట్లు - పెద్ద తెల్లని కాగితములో నల్లని చుక్కని చూసి, అదే దాన్ని బాగా చూస్తే అదే పెద్దగా, మొదటగా కనిపిస్తుంది. మొదటి సంవత్సరం కన్నా రెండో సంవత్సరములోనే స్నేహ బంధాలు ఏర్పడ్డాయి. చివరిలో బాగా ఒక కుటుంబంలా స్నేహబంధాలు ఏర్పడ్డాయి. చెల్లెళ్ళూ, అక్కలూ, అన్నయ్యలూ, తమ్ముళ్ళూ, కోడళ్ళూ, అల్లుళ్ళూ, శిష్యులూ.. ఇలా అనేకానేక బంధాలు. తెంచుకొని బయటపడాలి అనుకున్నాను. కాని ఆ ప్రయత్నములో ఓడిపోయాను. అప్పుడప్పుడూ రావాలని డిసైడ్ అయ్యానూ. కాకపోతే అప్పటిలా ఎక్కువగా ఆన్లైన్ లో ఉండలేను.  

ఎప్పుడూ ఆన్లైన్ లో కనిపిస్తారా..?

అవును.. అదే పెద్ద పొరబాటు నాది. నాది అన్లిమిటెడ్ ప్యాకేజ్ కాబట్టి ఎంతవాడినా ఎక్స్ ట్రా ఖర్చు ఏమీ లేదని, అలా నెట్ ఓపెన్ చేసి నా పనులు ఎమ్మెస్ పెయింట్, సాంగ్స్ టాగింగ్, ఫొటోస్ ఎడిటింగ్, సిస్టం క్లియరింగ్, బ్లాగింగ్, కమ్యూనిటీలూ.. లాంటి పనులనూ నెట్ ఆన్ చేసుకొని చేసేసరికి అందరూ అలాని అనుకునేవారు. అందరికీ నాలుగైదు సైట్లూ, రెండు, మూడు ప్రోఫైల్స్ ఉన్నాయి. అందుకే వారు ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు. నాకేమో ఒకటే సైట్, ఒకటే ప్రొఫైల్. నేనేమో రెగ్యులర్ గా కనిపిస్తాను. హ హ్హ హ్హా. అలాని నామీద కామెంట్స్ ఎక్కువ. ఇన్విజిబుల్ లో ఉండి పని చేసుకోవటం నాకు నచ్చదు. కొందరేమో ఎప్పుడూ ఇన్విజిబుల్ లో ఉంది ఎవరు ఏమి చేస్తున్నారూ, అనే చూస్తుంటారు. వారు - వారికి మనం పెట్టే స్క్రాప్స్ చూసినా ఏమీ రిప్లై ఇవ్వరు. నిజానికి వీరివల్లే స్నేహం అంటేనే బోర్ వచ్చేస్తుంది. ఇక నుండీ తగ్గించాలి అనుకున్నాను కాబట్టి అప్పటిలా రాలేనేమో! నా ఫ్రెండ్ ఒకరికి ఎనిమిది అక్కౌంట్స్ ఉన్నాయట. కాని నిజం ఎంతో నాకు తెలీదు. కనుక ఆ టాపిక్ చెప్పలేను.

ఈ రెండు సంవత్సరాలలో గమనించింది.?

మొదటి సంవత్సరములో పైలాపచ్చీస్ లా ఉంటూ బాగా ఎంజాయ్ చేశానూ అని అనుకున్నాను. కాని ఆ ఆనందం ఎక్కువసేపు ఒక రోజు కన్నా ఎక్కువ కాలం ఉండేది కాదు. ఇలా కాదనుకొని, హుందాగా ఉంటూ రెండో సంవత్సరం ఉన్నాను. ఆనందం తక్కువే అయినా తృప్తి ఎక్కువగా ఉంది. అది చాలు.

ఈ ఆన్లైన్ స్నేహాల్లో మోసాలు ఎక్కువ కదా..?

అవును.. ఎక్కువే!. కాదనను. నిజ జీవితాల్లో కూడా అలాగే అయ్యి కదా. ఇక్కడ కనిపించమని ధీమా తో మోసాలు ఎక్కువే!.. మాటల్లో అంతర్యాలూ తెలుసుకొని స్నేహం చేస్తూ, జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అయినా మోసపోవటం అనేది మీది పొరబాటు. అలా వారి చేతుల్లో మోసపోయేలా మీరు వారికి అవకాశం ఇస్తే, వారు మిమ్మల్ని మోసం చెయ్యరా? అందుకే అన్నివిధాలా తెలివిగా ఉండండి అని ఇక్కడ మీకు చెప్పేది. అలా అవకాశం మీరు ఇచ్చాక, ఇక బాధ పడటం ఇక ఎందుకూ.. అనవసరం. ఆ కాన్సెప్ట్ తోనే ఇలా ఈ సీరిస్ వ్రాశాను.

మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అని అంటారు.? (ఇలాని చాలా మంది అంటారు.)

హ అహహా హ.. అదేమీ లేదు. వారంతట వారుగా ఆడ్ అయ్యి ఫాన్స్ అయితే ఏం చెయ్యగలం!. ఒక్కోసారి నాకే భయంగా ఉంటుంది. ఎలా నిలుపుకోగలనూ అనీ!. వారికి ఎవరైనా ఆడ్ రిక్వెస్ట్ పెడితే, వారికీ, వారికీ మధ్య మ్యూచువల్ గా నేను ఉంటే చాలు. ఆడ్ చేసుకుంటున్నారు. మీరు తెలుసుకొని చెయ్యండీ అంటే వినటం లేదు. మీకు స్నేహితులుగా ఉంటే నాకు ఉన్నట్లే అంటే నేనేం చేసేది. వారికోసం అన్నట్లు నేనూ ఆడ్ రిక్వెస్ట్ లు తక్కువగా ఒప్పుకుంటున్నాను. పోయిన నెలలో 32 ఆడ్ రిక్వెస్ట్ లు వస్తే అందులో ఒకటి మాత్రమే ఒప్పుకున్నాను.

మీ స్నేహితుల ప్రత్యేకతలు ఏమిటీ?.

నేను అవన్నీ చూడను. ఎంత స్నేహముగా ఉంటారో అనేది మాత్రమే చూస్తాను. ధనిక పేద, చదువు ఉన్నవారూ, లేనివారు, వయస్సూ అంటూ ఏమీ చూడను. పదో తరగతి చదువుతున్న అమ్మాయి నుండి, అమ్మమ్మ వరకూ అందరూ నా స్నేహితులే. అందరూ ఆన్లైన్ కి వచ్చేది కాసింత కాలక్షేపానికే!. ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత. కొన్ని సమస్యలు. స్నేహం అన్నప్పుడు అవన్నీ చూడాలిగా. ప్రతి ప్రోడక్ట్ లో ఏదో లోపం ఉంటుంది. ఈవెన్ నాలో కూడా ఉన్నాయి. వాటిని చూసీ చూడనట్లుగా వెళ్లిపోవాలి. మరీ ఎక్కువగా అనిపిస్తే దూరముగా ఉన్నది మేలు అని అనుకుంటాను. వారంతట వారుగా ఎన్నో చెప్పారు. కాని ఆ విషయాన్ని అక్కడే ఇంకేలా చేశాను. వారినీ ఏమీ అడగలేదు. అడగను కూడా. చెప్పింది వింటాను. అంతే! వారికి అలా చెప్పుకుంటే కాస్త హాయి ఉంటుందీ అంటే - అంతకన్నా ఇచ్చేది ఏముంది..

ఇవన్నీ మీ బ్లాగ్ రేటింగ్స్ పెంచుకోవటానికి చెబుతున్నారు కదా!. ?

హ హ్హా హహ.. అదేమీ లేదు. కొద్ది మంది అలాగే అనుకున్నారు కూడా. అలాని పెంచుకోవాలీ అంటే చాలా పద్దతులే ఉన్నాయి. కాని అవేవీ ఫాలో కాలేదు. అయ్యి ఉంటే ఈపాటికి ఇంకా హిట్స్ వచ్చేటివి ఏమో!. టాప్ బ్లాగర్ గా ఎదిగేవాడినేమో!. నా మిత్రులకి రోజూ లింక్స్ Send to all లో అందరికీ స్క్రాప్స్ పెడితే చాలు. కాని అలాంటివి ఏమీ పాటించలేదు. ఇలాంటివి బోలెడన్ని పద్ధతులు ఉన్నాయి. అవి చేస్తే ఎప్పుడో లక్ష హిట్స్ దాటిపోయేటివి. అయినా తెలుగు బ్లాగులకి ఏమీ ఆదాయం రాదు. ఇక హిట్స్ ఎన్ని వచ్చినా ఏమి లాభం. జస్ట్ నా అనుభవాన్ని ఇక్కడ మీకు నా విలువైన పాఠం గా చెప్పటం. అంతే!. ఇక్కడ రేటింగ్స్ పెరిగినా ఏమీ రాదు. అంతా ఉచిత సేవ అంతే!. ఏదో నాలా ఇబ్బంది పడవద్దు అనుకోని చెప్పటం అంతే!. నేను ఈ సైట్స్ కి వచ్చినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు ఎక్కడైనా కనిపిస్తే చాలా బాగా ఫాలో అయ్యేవాడిని. కాని అలా నాకు ఎక్కడా కనిపించక - ఈ ప్రయత్నానికి పూనుకున్నాను.

మీరు ఈ సైట్లలో చేరి ఏమైనా పొందారా?

హా! చాలా.. ఒకప్పుడు నేను అంతర్ముఖుడిని. ఇప్పుడు ఆ లోపాన్ని అధిగమించాను. ఎలా మాట్లాడాలీ, ఎలా ప్రవర్తించాలీ అనేది బాగా నేర్చుకున్నాను. క్రోత్తవారితో మాట్లాదాలీ అంటే చాలా బెరకుగా ఉండేవాడిని. నాకంటూ ఒక క్రొత్త ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నాలో కలుగచేసింది. చాలా రిలాక్స్ గా ఉంటున్నాను కూడా. ఆ విషయములో ఈ సైట్లకీ, నా మిత్రులకీ థాంక్స్ చెప్పుకోవాలి. మూడేళ్ళ క్రితం ఒక్క విషయమూ - అసలు కంప్యూటర్ అన్నదే తెలీని నేను.. ఈరోజు ఇంతగా ఉన్నానూ అంటే - నా మిత్రుల చలవ తోనే కదా. వారికి వేవేల కృతజ్ఞతలు. వారివల్ల, ఆ సైట్ల లోని మిత్రుల వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. నా జీవితం చాలా మారింది. ఇప్పుడు నా జీవితములో స్నేహం అనే విభాగం లోకి ఒకసారి తొంగి చూస్తే - చాలా గొప్పగా, సంతోషముగా అగుపిస్తున్నది. ఈ చివరలో ఉన్నట్లు మొదటి నుండీ - అంటే ఈ సోషల్ సైట్లలో చేరినప్పటి నుండీ ఉండి ఉంటే ఎంత బాగుండేది అని ఇప్పుడు అనిపిస్తున్నది.

ఆన్లైన్ స్నేహాలని గురించి చిన్నగా చెప్పండి.!

ఈ స్నేహాలలో చాలా వరకూ రిజెక్ట్ అయ్యే స్నేహాలే!. దాదాపు అన్నీ దాగుడు మూతలతో ఉండేవి. అంత నిజమైన స్నేహాలు అంతగా ఉండవు ఇక్కడ. ఎంత జాగ్గ్రత్తగా ఎంచుకున్నా, ఐరావతాలాంటి స్నేహాలు చాలా కనిపిస్తాయి. అవన్నీ స్నేహితుల సంఖ్యని పెంచుకోవటానికే గాని, వారు ఉన్నా లేకున్నా ఒకటే.. అలాంటివారికి దూరముగా ఉండండి. టాలెంట్ లేని వారిని ఇప్పుడు అంతర్జాతీయ కంపనీలు ఎలా దూరముగా ఉంచుతున్నాయో, నెల రోజుల్లో ఆ క్రొత్త స్నేహితునిలో టాలెంట్ కనిపించక పోతే దూరముగా ఉంచేయ్యటమే బెస్ట్. మీకు అనవసర చికాకులు తప్పిపోతాయి.

నెల నెలకీ మన లిస్టు లో ఉన్న మిత్రుల మీద రివ్యూలు చేసుకోవటం ఉత్తమం. మీ ఇద్దరి మధ్య బంధం - ఎక్కడో చూశాను, కాస్త పరిచయం, జస్ట్ ఇలా ఆడ్ అయ్యాడు, ఫరవాలేదు, ఇంకా అంతగా లోతుకి వెళ్ళలేదు, కొద్దిగా తెలుసు, వారి గురించి అంతగా తెలీదు.. బాగా పరిచయం, ఎక్కువగా మాటలు లేవు, బాగా స్నేహం, మంచి పరిచయస్తుడు, నాకు ఆత్మీయుడు... ఇలా ఇన్ని రకాలలో మీ ఇద్దరి మధ్య స్నేహం ఉందో నెలకొకసారి అయినా గమనించుకోండి. మంచి స్నేహాల మధ్య ఏదైనా గ్యాప్ వస్తే - సరిదిద్దుకోవచ్చు, లేదా వదిలేసుకోవచ్చును. మీరూ బాగుంటారు. మీ అమూల్యమైన సమయం కూడా వృధా కాదు.

Thursday, April 21, 2011

Social NW Sites - 27 - ప్రొఫైల్ లో వైరస్

చాలా రోజుల తరవాత పోస్ట్ చేస్తున్నందులకు ఏమీ అనుకోకండి. కాస్త విశ్రాంతి తీసుకొన్నాను. అలాగే నా పనులు ముగించాను. ఎందుకో తరువాత టపాలో చెబుతాను.

ఒక్కోసారి ప్రోఫైల్స్ కి వైరస్ వస్తుంది. ఇది రావటం కూడా మనకి తెలీకుండా జరుగుతుంది. కాస్త జాగ్రత్తగా ఉంటే ఇలాంటివి రాకుండా చూసుకోవచ్చును. నా ప్రొఫైల్ కి ఒక BOM SABODO (ఈ పదానికి అర్థం - Good morning to saturday) అనే బ్రెజిల్ దేశం నుండి వచ్చిన వైరస్ పట్టేసింది. దానివలన కాసింత నా ప్రొఫైల్ హ్యాంగ్ అవటం అనే ఇబ్బంది. కొద్దిరోజుల తరవాత అది పోయింది. కాని అన్ని వైరస్ లూ అలాగే ఉండవు. ఈ క్రింది ఫోటో చూడండి. ఇది నిన్ననే వచ్చిన వైరస్. కాని ఇది పాత వైరస్.



ఆ ప్రొఫైల్ అతనికి తెలీదు. ఇలా రావటం మామూలే!. ఇదే విషయం ఇదే సోషల్ సైట్లలో - ఒకతని ఆడ్ రిక్వెస్ట్ వస్తే అతని ప్రొఫైల్ ఇలా కత్రినా కైఫ్ తో... అని ఉంది.. రిజెక్ట్ చేశాను అని చెప్పానుగా. అప్పుడే చెప్పాలని అనుకున్నాను కాని అది వేరే విషయం గురించి మాట్లాడుకుంటూన్నాముగా. అందులో చెప్పే బదులు వేరుగా చెబుదామని ఆగాను. అలాంటి విషయం గురించి ఇక్కడ కాస్త వివరముగా చెబుతాను. కొన్ని జాగ్రత్తలూ చెబుతాను.

ఇలా ప్రొఫైల్ కి వైరస్ రావటం చాలావరకు మనం చేసే పొరపాట్లు వలన ఎక్కువగా వస్తుంటాయి. అక్కడ జాగ్రత్తలు తీసుకుంటుంటే చాలా వరకూ వాటిని తప్పించుకోవచ్చును.

1. ఈ సోషల్ సైట్లలోకి లాగ్ అయినప్పుడు కొన్ని అనుమానిత సైట్లలోకి వెళ్ళకండి. అనుమానిత సైట్లు అంటూ ప్రత్యేకముగా ఉండవు. కాస్త అనుభవముతో అవి తెలుసుకుంటుంటాము.

2. మీ స్నేహితుల ప్రొఫైల్ లలోకి వెళ్ళే ముందు ఒకసారి మీ పేజీ లోని, అప్డేట్స్ లలోకి వెళ్ళండి.
అక్కడ మీకు మీ స్నేహితుల ప్రొఫైల్ కి వైరస్ వస్తే అప్పుడే అక్కడే కనిపిస్తుంది. అప్పుడే జాగ్రత్త పడి ఆ ప్రొఫైల్ కి వెళ్ళకుండా ఆగిపోవచ్చును. నేను ఇలా చూసి జాగ్రత్త పడతాను.

3. అలా వైరస్ వచ్చిన ప్రొఫైల్ విజిట్ చేసినా మీ ప్రొఫైల్ కీ వైరస్ రావచ్చును. చాలా వరకూ అలా రాదు. కాని ఆ ప్రొఫైల్ ఇలా వైరస్ కనిపించాక, ఆ డాటా మీద క్లిక్ చేస్తే, మీ ప్రొఫైల్ కి కూడా రావచ్చును. కనుక ఇక్కడే జాగ్రత్తగా ఉండండి.

4. అలా సెక్స్.. అంటూ వచ్చిన లింక్ ల మీద ఆసక్తిగా క్లిక్ చెయ్యకండి. అలా వచ్చినవన్నీ ఇలాంటివే! చేపని పట్టడానికి వాడే ఎర లాంటివి ఇవి. మీరు చేపగా మారోద్దని ఇవన్నీ జాగ్రత్తలు చెప్పటం. నేను చెప్పిన సూచనలన్నీ పాటించాక మీరు అలా చెయ్యరని నాకు తెలుసు.

5. ఈ వైరస్ లు అనేవి ఎక్కువగా లింక్స్ ద్వారా, లేదా GIF (యానిమేటెడ్ స్క్రాప్స్), గుడ్ మార్నింగ్ విషేష్ కార్డ్స్ ద్వారా వస్తుంటాయి. మనకి వచ్చే అన్నీ ఇలాంటివి కాకపోవచ్చును. వేల దాంట్లో ఒకటి ఉండొచ్చును. మన టైం బాగోలేక పోతే పొరబాటున క్లిక్ చేసేస్తాము.

6. బాగా తెలిసినవారు, నమ్మకస్థులు అన్న వారి వద్ద నుండి వచ్చిన లింక్స్ మాత్రమే ఓపెన్ చెయ్యండి. వేరేవారినుండి వచ్చిన లింక్స్ పొరబాటున కూడా వెంటనే ఓపెన్ చెయ్యకండి. కాసేపు మీ మిగతా పని చేసుకోండి. కనీసం ఒకరోజు గడువు ఇచ్చి ఓపెన్ చేసి చూడండి. అప్పటిలోగా ఆ వైరస్ కి ధీటుగా యాంటీ వైరస్ అందుబాటులోకి వస్తుంది. 

7. ఒకవేళ మీకు అత్యవసర విషయం అని అనుకుందాం. ఆ లింక్ ని కాపీ చేసి, గూగుల్, ఫైర్ ఫాక్స్ అడ్రెస్ బార్ లోనో పేస్ట్ చేసి ఓపెన్ చెయ్యండి. ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ (IE) కూడా బాగానే ఉంటుంది కానీ, చాలా మంది దీనిలో డిఫాల్ట్ వర్షన్ అయిన IE 5, IE 6 నే ఇంకా వాడుతున్నారు. లేటెస్ట్ అయిన IE 8, IE 9 వాడేవారు చాలా తక్కువ. ఇలా అప్గ్రేడ్ వర్షన్ వాడేవారు ఇందులోనే ఓపెన్ చేసుకోవచ్చును. ఈ IE లో సెక్యూరిటీ సెట్టింగ్స్ మామూలుగా - డిఫాల్ట్ గా ఉంటాయి. వాటిని మనం మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవాలి. అందరికీ అవి ఎక్కడ ఉన్నాయో తెలీవుగా. అందుకే గూగుల్ క్రోం ని వాడమనేది. ఆ క్రోం లో వెంటనే ఆ సైట్ ఓపెన్ చెయ్యకుండా, మీకో హెచ్చరిక కనిపిస్తుంది. అప్పుడు మీరు జాగ్రత్త పడవచ్చును. అది ఎలా ఉంటుందో త్వరలో మీకు ఫోటోలో తెలియజేస్తాను. (ఇప్పుడు అలా వెదకాలి అంటే వెంటనే దొరకవుగా)

8. ఎక్కువగా పోర్న్ కి సంబంధించిన బొమ్మల వల్ల ఇలా సిస్టం లలోకి వస్తుంటాయి. ఫైర్ వాల్, యాంటీ వైరస్ అప్డేట్స్ బాగున్నవారు కి ప్రమాదం చాలా చాలా తక్కువ.

9. నిన్న రాత్రి నా మిత్రుని దాంట్లో స్క్రాప్ చేద్దామని వెళ్ళితే - అతని పేజీ ఓపెన్ కాలేదు. అతనికి ఒక మాట చెప్పాను - నీ స్క్రాప్స్ లలో వైరస్ ఉందని. అతను తీసేశాడు వాటిని. మరునాడు ఇలా ఈ విషయమై నేను టాపిక్ వ్రాస్తానని ఊహించలేదు గనుక, వాటి వివరాలు తీసుకోలేక పోయాను.

10. రెగ్యులర్ గా వచ్చే మిత్రులకి మీ ఫోన్ నంబర్ తెలియజేస్తే - వారు వెంటనే మీకు తెలియచేస్తారు. నా స్నేహితురాలు ఒకావిడ ఇలా రెండు సార్లు వైరస్ ల బారిన పడి, వారి అబౌట్ మీ మారిపోయింది. రెండు సార్లూ నేనే కాల్ చేసి చెప్పాను - ఇలా మీది మారిపోయిందనీ!. తను వెంటనే మార్చేశారు.

11. ఇలా వైరస్ వచ్చిన ప్రొఫైల్ ని సరిదిద్దేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోండి. ముందుగా లాగిన్ అవ్వండి. అనుమానిత స్క్రాప్స్ ఏమైనా ఉంటే వాటిని తీసెయ్యండి. ఆ తరవాత అబౌట్ మీ మార్చేయ్యండి. ఆ తరవాత సైన్ అవుట్ అయ్యి, మళ్ళీ లాగిన్ అయ్యి Can't access your account? వద్ద నొక్కి మీ పాస్ వర్డ్ మార్చేయ్యండి.

12. మీ స్వంత సిస్టం ఉంది మీరొక్కరే వాడుతారు, వేరేవారు వాడినా ఫరవాలేదు అన్నప్పుడు ఆటో ఫిల్ అనే ఆప్షన్ వాడుకోండి. దీనివలన మాటి మాటికీ మీ మెయిల్ ID నీ, పాస్ వర్డ్ నీ టైపు చెయ్యాల్సిన అవసరం ఉండదు. ఇలా చెయ్యటం వలన మీరు ఏదైనా వైరస్ అంటుకున్న సైట్లో ఉన్నప్పుడు, వేరే చోట మీరు లాగిన్ అవ్వాల్సి ఉన్నప్పుడు కీ లాగర్స్ వల్ల మీ పాస్ వర్డ్ అవతలి వారికి చేరే అవకాశాలు చాల తక్కువ.

13. వేరే సైట్ల లోకి లాగిన్ అవ్వాల్సి ఉన్నప్పుడు మీ మెయిల్ ID, పాస్ వర్డ్ అడుగుతారు. అక్కడ వేరే పాస్ వర్డ్ వాడండి. అలా చేస్తే మీ ప్రొఫైల్ భద్రముగా ఉంటుంది కూడా.

14. (కొన్ని) సైట్లు రెడీమేడ్ గా అందించే విషేష్ కార్డ్స్ వద్దకి మాటి మాటికీ వెళ్ళకండి. వాటిని మీ స్నేహితుల వాటిల్లో పోస్ట్ చెయ్యకండి. అలా కూడా వైరస్ లు రావచ్చును. వాటిని ఎక్కువగా మీ స్క్రాప్ బుక్ లో ఉంచకండీ!. బాగున్నవి ఉంచేసుకొని, మిగతావి తీసేయ్యండి.

15. వైరస్ లు వస్తే - ఈ సోషల్ సైట్లలో పోవడం కష్టం. ఎందుకు అంటే చాలా కారణాలు. వైరస్ అని తెలీక చాలా మంది ఓపెన్ చేస్తారు. వారికి అంటుకుంటుంది. వారూ తెలీక ఇతరులకి పంపిస్తారు. ఆ సైట్ వారు దీనికి రెమేడీ కనిపెట్టి అందరి ప్రోఫైల్స్ క్లీన్ చేసేసరికి కొంత సమయం పడుతుంది. అప్పటివరకూ దాని బారిన పడతాము.

16. ఈ వైరస్ ల వల్ల మన ఫొటోస్ గానీ, డాటా గానీ వేరేవారికి అంటే ఆ వైరస్ పెట్టినవారికి చేరుతుంటాయి.  

17. వైరస్ ఉన్నప్పుడు సెక్యూరిటీ పాస్ వర్డ్ అసలు మార్చే ప్రయత్నం చెయ్యకండి. దానివలన మీ అక్కౌంట్ మీ చేతుల్లోంచి వేల్లిపోవచ్చును. తస్మాత్ జాగ్రత్త.

Thursday, April 14, 2011

Social NW Sites - 26 - ఇగ్నోర్ (బ్లాక్) లిస్టు లో పెట్టడం ఎలా?

కొన్ని టపాలలో బ్లాక్ లిస్టు, బ్లాక్ చేశానూ అని అన్నానుగా. ఇప్పుడు అది ఎలాగో మీకు చెబుతాను. ఇది చాలా సింపుల్. ఈ అవకాశము - ఆర్కుట్ లో పాత వెర్షన్ లో లభించదు.. క్రొత్త వెర్షన్ లో మాత్రమే లభిస్తుంది. (మిగతా సోషల్ సైట్లలో ఇది వస్తుందో లేదో, ఉన్నదో లేదో నాకు తెలీదు. తెలియలేనప్పుడు చెప్పలేను.) వాడటం కూడా చాలా ఈజీ.

మీకు ఎవరైనా నచ్చని వారు ఆడ్ రిక్వెస్ట్ పెడితే -  
  • మీకు పదే పదే ఆడ్ రిక్వెస్ట్ పెట్టి, మిమ్మల్ని బాగా విసిగిస్తుంటే -
  • మీరిద్దరూ మాట్లాడుకోలేని సందర్భము వస్తే - వారిని డెలీట్ చేసి మళ్ళీ ఆడ్ చేసుకునే ఇష్టం లేకుంటే -
  • ఎవరిదైనా ప్రొఫైల్ మీకు ఇబ్బందిగా అనిపించి, వారు మీకు ఎక్కడ ఆడ్ రిక్వెస్ట్ పెడుతారేమో, ఓకే చెయ్యక ఇబ్బంది పడాలి అని మీరు అనుకుంటే -
  • వారి ప్రోఫైల్స్ లలో ఏమీ లేకున్నా, నచ్చక రిజెక్ట్ చేస్తే, మళ్ళీ ఇక వీరు అవసరం లేదు అని అనుకుంటే -
ఇటువంటి కారణాల వల్ల దీనిని వాడుకోవచ్చు. ఈ విషయం చాలా మందికి తెలీదు. ఇది వచ్చీ సంవత్సర కాలం కూడా కాకపోవచ్చును. నాకూ క్రొద్ది నెలల క్రిందటే తెలుసు. సోషల్ సైట్లలో ఆడవారికి ఇది అద్భుత అవకాశం అని అనుకోవాలి. వారికి వచ్చే పదే పదే ఆడ్ రిక్వెస్ట్ లు నుండి తప్పించుకోవటానికి ఇది వాడుకోవచ్చును. 

ఇప్పుడు అది ఎలా ఉపయోగించాలో చూద్దాం.

ముందుగా ఎవరైతే మనం ఇక వద్దు అనుకోని బ్లాక్ చెయ్యాలీ అనుకుంటున్నామో వారి ప్రొఫైల్ ఓపెన్ చెయ్యాలి. క్రింది ఫోటోలో ఎర్రని వృత్తములో కనిపిస్తున్నట్లుగా, IGNORE వద్ద క్లిక్ చెయ్యండి.

అప్పుడు ఈ క్రింది ఫోటోలో మాదిరిగా ప్రొఫైల్ ఫోటో మీద ignored అనే ఎర్రని పట్టీ వస్తే వారిని బ్లాక్ చేసినట్లే. ఇక వారు మనకి ఆడ్ రిక్వెస్ట్ పెట్టలేరు. చాలామందికి ఈ విషయం తెలీక పాస్ వార్డ్ తెలిస్తే గాని, ఆడ్ రిక్వెస్ట్ పెట్టేలా ప్రొఫైల్ సెట్టింగ్స్ మారుస్తుంటారు. అలా చేస్తే మీకు నిజమైన స్నేహితుడు మీకు ఆడ్ రిక్వెస్ట్ పెట్టలేక పోవచ్చును. దానివల్ల మీకో ఒక మంచి స్నేహితులు మీకు పరిచయం కాకుండా మిస్ అయిపోవచ్చును. అందుకే అలాంటి సెట్టింగ్స్ ఉన్నవారు ఇక ఓపెన్ చేసి, నూతన మిత్రుల ఆహ్వానాల కోసం ఎదురుచూడవచ్చును. మొదట్లో చెప్పుకున్న కారణాల లాగా ఏదైనా ఇబ్బంది కలిగితే ఇలా చేస్తే సరి.. అంతే! సరిపోతుంది.


ఒకవేళ - మీరు అలా ఇగ్నోర్ చేశాక ఏ కారణం చేతనో మీరు, వారి మీద దయతలచి, వారితో స్నేహం చెయ్యాలంటే - ముందుగా వారి ప్రొఫైల్ కి వెళ్లి, క్రింది ఫోటోలో ఎర్రని వృత్తములో చూపినట్లుగా unignore ని నొక్కండి. చాలు. సరిపోతుంది. అప్పుడు ఆ ఫోటో మీది ఆ ఎర్రని రిబ్బన్ పోతుంది. అంటే ఆడ్ రిక్వెస్ట్ పెట్టుకునేలా వస్తుంది. ఇంతే! మీరు వారిని క్షమించేసేయవచ్చును, మీరు వారిని ఆడ్ చేసుకోవచ్చును కూడా.


నిజానికి ఇవన్నీ బాగా తెలుసుకొని, వాడటం నేర్చుకుంటే - ఆన్ లైన్ స్నేహాల్లో కాస్త హాయిగా ఉండోచ్చును. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న నా స్నేహితురాలు - స్క్రాపుల్లో అసహ్యకర మాటలు చూడలేక, వారి అక్కౌంట్ ని తన ఫ్రెండ్స్ లిస్టు నుండి తీసేస్తే, వారి నుండి వచ్చే పదే పదే ఆడ్ రిక్వెస్ట్ ల బాధ నుండి తప్పించుకోవటానికి ఎలాగో తెలీక, ఏకముగా అక్కౌంట్ డెలీట్ చేసేశారు. ఇలా ఎంతమంది ఇబ్బంది పడ్డారో! అప్పుడే అనుకున్నాను.. ఇలాంటివారికోసం ఏదైనా చెయ్యాలని. అందుకే ఇలా సేవ చేస్తున్నానేమో!.. కనీసం ఇప్పుడైనా ఈ ఆప్షన్ పెట్టారు. సంతోషం. అప్పుడు ఈ ఆప్షన్ లేదు. ఇప్పుడూ నాకు తెలీదు. నా ఇంకో స్నేహితురాలు ఇది నాకు పరిచయం చేశారు. (అన్నీ నాకు తెలిసి ఉండాలని రూల్ ఏమీ లేదుగా) ఇదేదో బాగుందే అనుకోని, మీకు నేనూ పరిచయం చెయ్యటం. 

Wednesday, April 13, 2011

Social NW Sites - 25 - మనం మిత్రులకి ఆడ్ అయ్యాక..

పోయిన టపా దాంట్లో మనకి మిత్రులని ఆడ్ చేసుకున్నాక చూడాలని చెప్పానుగా.. ఈసారి మనం ఆడ అయ్యాక ఎలా ఉండాలో చెబుతాను. నేను చెప్పేవి అన్నీ ISO : 9000 మార్క్ వి కాకున్నా, అన్నీ నా అనుభవాల నుండీ తీసుకొని, తెలుసుకొని చెబుతున్నాను. ఇవి అన్నీ ప్రామాణికం కాకపోవచ్చును. కాని నాకు తెలిసినంతవరకూ చెప్పాలని నా తాపత్రయం.

చాలావరకు అన్నీ నా అనుభవాలే ఇందులో ఉన్నాయి. కొద్దిమంది వారి అనుభవాలు చెప్పారు. అవన్నీ పేర్లూ, లింక్స్ తప్ప యధాతథముగా పెట్టాను. ముందే చెప్పానుగా.. ఇది జస్ట్ క్రొత్తగా, ఇంతకు ముందే సోషల్ సైట్ల లోకి ప్రవేశించిన వారికి కాస్త ఉపయోగపడేటివి గా ఉండాలనీ.. చాలా ఇబ్బందులని తగ్గించుకొని, ఈ సోషల్ సైట్లలో జాగ్రత్తగా ఉంటారని కోరుకోవటమే. అంతే కాని ఎవరినో ఇబ్బందులపాలు చెయ్యాలని కాదు. ఇది ఫలానా వారిది కదా అని నన్ను అడిగితే కాదు అని నా సమాధానం. ఎందుకంటే వారిని ఇబ్బంది పెట్టకూడదు అని. ఒకరి అనుభవం ఇంకొకరికి పాఠం అవుతుంది. ఒకరి గెలుపు మరొకరికి ప్రేరణ అవుతుంది కూడా..

మీరు మీ మిత్రులకు ఆడ్ అయ్యాక ఈ సూచనలని గమనించండి.

1. మీరు మీ మిత్రులకి క్రొత్తగా ఆడ్ అయ్యాక వారికి, వారు మిమ్మల్ని వారి స్నేహితుల గుంపు లోకి చేర్చుకున్నందులకు ముందుగా వారికి కృతజ్ఞతలు చెప్పండి. 

2. వారితో ముందుగా కామన్ విషయాలు  మాట్లాడండి. అంటే గుడ్ మార్నింగ్, గుడ్ ఎవెనింగ్.. వాతావరణం ఎలా ఉంది?.. కులాసాయేనా? భోజనం చేశారా? టీ టిఫిన్స్ చేశారా?.. అలాంటివి.

3. తరవాత వారి వయస్సు దృష్టిలో ఉంచుకొని, ఏమని పిలవాలో అడిగి, అలాగే ఆవిధముగా పిలవండి. కాస్త పెద్దవారిని అంకుల్, ఆంటీ, అత్తా, తాత.. లాంటి పేర్లు కాకుండా మధ్యేమార్గముగా అండీ అనుకుంటూ పిలిచేస్తే సరి. ఏ ఇబ్బందీ ఉండదు.

4. వారికి ఇబ్బంది పెట్టే స్క్రాప్స్ అసలు పెట్టకండి. ఈ ఇబ్బంది స్క్రాప్స్ అనేవి ఒక్కొక్కరికీ ఒక్కొరకం. ఇందులో ఏదీ వారికి ఇది నచ్చదు అని ఒక పట్టాన తెలియదు మనకి. అలాంటి పెట్టి మనం ఇబ్బంది పెట్టొద్దు, ఇబ్బంది పడొద్దు. ఒక ఉదాహరణ చెబుతాను. నాకు ఉన్న ఇద్దరు మిత్రులు నాకు ఒక దేవుడి ఫోటో పంపి - ఈ ఫోటో పదిమందికి పంపితే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది అంటే - దైవ భక్తి ఒక రేంజ్ లో ఉండే నేను ఏమి చెయ్యాలో పాలుపోక వారికే పదిసార్లు పంపాను. ఆ చర్యకి వారు బాగా ఫీలయ్యి, మాటలు తగ్గించారు. వారు ఇబ్బంది పెడితే, నేనేం చేసేది మరి. అసలు వారే నన్ను ముందు ఇబ్బంది పెట్టారు అని వారు గమనించుకోవాలి.

5. మరికొందరికి గుడ్ మార్నింగ్ విషేష్ చెప్పినా మళ్ళీ వారు ఎదురు విషేష్ చెప్పరు. మనం ఇలా అసలే ఏమీ బదులు చెప్పకుండా ఉండకూడదు. అలా ఉన్నామే అనుకోండి. అవతలివారు మళ్ళీ మనకి ఏమీ చెప్పరు కూడా. ఆ స్నేహం చేసినా సమయం వృధా తప్ప మరొకటి కాదు.

6. మీకు విష్ చేసినవారికి ప్రతి విష్ చెయ్యటం మర్యాద. కష్టపడి విషేష్ చెప్పితే, కనీసం మర్యాద కోసమైనా బదులు ఇవ్వండి. లేకపోతే మర్యాద తెలీని వ్యక్తిగా మీకో ముద్ర పడుతుంది. ఉదాహరణకి మీ ఆఫీస్ లో ఒకరికి విష్ చేశారు అనుకోండి. వారు అది పట్టించుకోకుండా వారి పనిలో వారే ఉన్నారే అనుకోండి. కాసేపాగి మళ్ళీ చెబుతారు.
అప్పటికీ మళ్ళీ బదులే రాలేకపోతే, మీరేం చేస్తారు.? మళ్ళీ విష్ చెయ్యటానికి మన మనసు ఒప్పుకుంటుందా..? లేదు కదా? మళ్ళీ చెప్పబుద్ది కాదు కదా.. ఇక్కడా అంతే!. ఇది ఈ సోషల్ సైట్లలో దాదాపుగా అందరూ చేసే పెద్ద పొరబాటు. మీరీ పొరబాటు చేయ్యరనే ఆశిస్తున్నాను.

7. మీ మిత్రుల నుండి ఇలా విషేష్ రావటం ఇష్టం లేకపోతే - ఒకసారి వారికి, చాట్ లోనో, ప్రైవేట్ గానో చెప్పండి. వారు మానుకుంటారు. ఒక పత్రికలో పనిచేసే ఒకతనికి నేను ఇలాగే పంపిస్తే అతను నాకు అలాగే చెప్పాడు - నాకు ఇలా రోజూ చెప్పాల్సిన అవసరం లేదు అనీ. అతని మీద నేను ఏమాత్రం కోపగించుకోలేదు. నేనూ ఇది చిన్నతనముగా ఫూలిష్ గా కూడా అనుకోలేదు. దానివలన నా పొరబాటు ఏమిటో తెలిసివచ్చింది. నేను అతని అభిప్రాయాన్ని గౌరవించాను. ఇప్పుడు అతనూ, నేనూ ఒక మంచి స్నేహితులం కూడా. ఎప్పుడో ఒకసారి తప్ప నేను అతనికి చెప్పటం లేదు. ఇలా చెప్పటం ఎలాగా కనిపించినా, ఇది చాలా మంచి పద్ధతి. రిప్లై రావటం లేదు అన్న బెంగ ఉండదు.

8. మీకు వచ్చిన ప్రతి స్క్రాప్ కీ, రిప్లై ఇవ్వటం అలవాటు చేసుకోండి. అది మీ స్నేహ బంధాలని బాగా పెంచుతుంది.

9. మీకు స్నేహితులు కానివారు కూడా మీకు వ్రాసేలా స్క్రాప్  బుక్ సెట్టింగ్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకోవటం ఇష్టం లేకపోవచ్చును. కాని పెట్టమనే సలహా ఇస్తాను. వారు వ్రాసినవి వారికీ, మీకూ తప్ప మూడోవ్యక్తి, మరెవ్వరికీ కనిపించవు - అలా ఆటోమేటిక్ సెట్టింగ్స్ ఆ సైట్ వాడే ఇస్తాడు. నేను ఇలా పెట్టుకుంటే నాకు ఐదుగురు మంచి స్నేహితులు ఆడ్ అయ్యారు.  

10. మీ నుండి ఏదైనా సహాయం కోరితే - ఖర్చు తక్కువలో, తక్కువ సమయములో అయ్యేది కోరుకుంటే - మీకు వెసులుబాటు ఉంటే ఖచ్చితముగా చెయ్యండి. లేకుంటే సారీ చెప్పెయ్యండి. కాని చేస్తానని చెయ్యకుండా ఆగిపోకండి. అలా చేస్తే మీ నైజం గురించి మీరే చెప్పుకున్నట్లు అవుతుంది.

11. మీరు ఉదయాన ఓపెన్ చెయ్యగానే - పది గుడ్ మార్నింగ్ విషేష్ ఉన్నాయే అనుకోండి. విసుక్కోక వాటన్నింటికీ రిప్లై ఇవ్వండి. "హమ్మో! వాటన్నింటికే.." అని బరువుగా ఫీల్ అవకండి. దీనికో మార్గం చెబుతాను. నేను చేసేదీ ఇలాగే. ఒక వర్డ్ పాడ్ ఓపన్ చేసి డెస్క్ టాప్ మీద సేవ్ చెయ్యండి. అందులో గుడ్ మార్నింగ్.. గుడ్ ఎవెనింగ్ అంటూ ముందే, వరుసగా అందముగా వ్రాసుకోండి. అందులోంచి కాపీ, పేస్ట్ చేసెయ్యండి. చాలు. లేకపోతే ఒక్కరికి వ్రాసి, అది కాపీ చేసి అందరికీ పోస్ట్ చెయ్యండి. నిమిషములో పని అయిపోతుంది కూడా!.. ఈ ఐడియా నాది కాదు. నా మిత్రునిది. అది నా జీవితాన్ని కొద్దిగా మార్చేసింది కూడా. అబ్బో!.. అన్ని మార్నింగ్ విషేష్ కి రిప్లై ఇస్తాడు అని పేరు వచ్చింది. (ఇప్పుడు ఇది తెలుసుకొని - మీరు ఇలా చేస్తారా అని కోప్పడకండి. నావీ చెప్పక తప్పదుగా.)

12. వారి స్క్రాప్స్ బుక్ మొదట్లో - అదీ ఎలాంటివారో చూడటానికి చూడండి కానీ, అందులోని విషయాలని ఇతరులకి స్ప్రెడ్ చెయ్యకండి. దానివలన మీకు అనవసర మానసిక క్లేశాలు ఉంటాయి. ఇలా అందరికీ అంటించే "స్పామర్" (SPAM) అనే బిరుదు రావచ్చును.

13. ఎవరైనా వారితో ఎలా ఉండాలో మీకు చెబితే, అలాగే ఉండటానికి, ప్రయత్నించండి. అలా వీలుకానప్పుడు వారికి దూరం గా ఉండటమే బెస్ట్. ఆ విషయం చెప్పండి. అలా నలుగురు చెబితే వారు వారి పద్ధతి మార్చుకోవచ్చును కూడా.. కాని ఇది ఓపెన్ గా చెప్పకండి. చాట్ లోనో, ప్రైవేట్ గా చెప్పండి.

14. వస్తూ, పోతుంటేనే బంధువులు ఎలాగో, స్క్రాప్స్ వ్రాస్తూ ఉంటేనే స్నేహాలు అని బాగా తెలుసుకోండి.. లేకపోతే మన ఫ్రెండ్స్ లిస్టు లో వేయి మంది ఉన్నా, మనకి వచ్చే స్క్రాప్స్ పదికి మించకపోవచ్చును.

15. మిత్రులకి చిన్నగా విషేష్ చెప్పే అలవాటు ఉంటే మానుకోండి.  GM (గుడ్ మార్నింగ్), GE (గుడ్ ఎవెనింగ్) hpy b'day అంటూ వ్రాయకండి. అది మీలోని ఎదుటివారి పట్ల ఉన్న నిరాసక్తత ని తెలియచేస్తుంది. పైన ఒకటి కిటుకు చెప్పానుగా గుడ్ మార్నింగ్ ఎలా చెప్పాలో.. అలాగే ఇదీ ఫాలో అవండీ.

16. మిత్రులు మనకి పుట్టినరోజు విషేష్, ఏదైనా విజయం సాధిస్తే విషేష్ చెబితే - ప్రతిగా వారికి థాంక్స్ చెప్పటం నేర్చుకోండి. అలా మీ స్నేహబంధాలు బాగా దృడం అవుతాయి. నేను అలా చెప్పటం నేర్చుకున్నాక, నాకు కనీసం యాభై మంది మిత్రులు బాగా దగ్గర అయ్యారు. వారికీ నా కృతజ్ఞతలు.

17. ఈ లోకములో ఎవరూ పరిపూర్ణమైన వ్యక్తులు లేరు. ఈవెన్ నేను కూడా. ఉన్నారు అనుకున్నవారు వారు భ్రమలో ఉన్నారు అన్నమాట.

18. మీకు ఏదైనా సూచన చేస్తే కొట్టిపారేయ్యకండి. శ్రద్ధగా వినండి. ఆసాంతం వినండి. కాదని చెప్పకండీ, అవుననీ చెప్పకండీ!. చూసి ప్రయత్నిస్తాను అని చెప్పండి. ఆ తరవాత ఒంటరిగా ఉన్నప్పుడు వారు చెప్పింది నిజాయితీ గా ఆలోచించండి. ఒప్పు ఉంటే వారికి - థాంక్స్ చెప్పేసి పాటించండి. తప్పు ఉంటే వెంటనే మరచిపోండి. అంతే కాని వారితో గొడవ పడకండి. ఈరోజుల్లో మనకు మేలు చేసే విషయాలు చెప్పేవారు చాలా తక్కువగా ఉన్నారు. పనికిరాని సోది చెప్పేవారు ఎక్కువ అయ్యారు. అవి ఎంత విన్నా బాగుపడం. ఇలా బాగుపడే విషయాలు చెప్పేవారి మీద కసరించుకుంటే / కోప్పడితే  ఇక ఏమీ చెప్పలేరేమో!. మన అభివృద్ధిని మనమే ఆపుకున్నవారిమి అవుతాము.

19. మీ స్నేహితుల పుట్టినరోజులని మరచిపోకుండా చెప్పటం నేర్చుకోండి. ఒకవేళ మరిస్తే మీ మీద ఒక నెగెటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది. మిత్రుల పుట్టినరోజులు పదిహేను రోజుల ముందుగానే మీ ప్రొఫైల్ లో కనిపిస్తాయి. ఆ పదిహేను రోజులుగా అలా వస్తున్నప్పుడు ఎలా మరచిపోతారు? అని వారు అడిగితే మనదగ్గర సమాధానం ఉండదు. ఏదైనా అబద్ధం చెప్పినా అది అబద్ధం అని ఏదో ఒకరోజు తెలిసిపోతుంది. ఇక్కడో ఉదాహరణ : నాకు బాగా దగ్గరి స్నేహితురాలు నా గత సంవత్సరం పుట్టినరోజుకి సాయంత్రం విషేష్ చెప్పారు. నేను మరచిపోయానూ, ప్రొద్దున నుండీ ఆన్లైన్ కి రాలేదు అనీ!. నిజమా ఆనుకొని తను చెప్పిన దాంట్లో నిజమెంత ఆనుకొని ఇన్వెస్టిగేషన్ లా చేస్తే (అది తప్పే) - ఆ రోజు ఉదయాన తను వేరేవారికి గుడ్ మార్నింగ్ విషేష్ చెప్పారు. ఆన్లైన్ కి రాలేదూ అన్నవారు ఇలా కూడా మనకు చెవిలో పూలు పెడుతుంటారు. ఇలాంటివారిని కాస్త దూరంగా ఉంచుకుంటే సరి.

20. మీమిత్రుల ఇబ్బందులని అర్థం చేసుకోండి. నేను తెలుగులో స్క్రాపింగ్, చాటింగ్ చేస్తుంటాను. అంతా తెలుగే ఉంటుంది. అయినా బ్రెజిల్ నుండి ఒకావిడ నాకు ఆడ్ రిక్వెస్ట్ పెట్టారు. ఓకే చేశాను. చిత్రం ఏమిటంటే ఆవిడకి తెలుగు అసలే రాదు. ఇంగ్లీష్ కూడా. పోర్చుగీస్ భాష తప్ప మరేమీ రాదు. ఆవిడ పోర్చుగీస్ లోనే సమాధానం ఇస్తారు. నేను దాన్ని గూగుల్ ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ లోకి మార్చుకొని,  అర్థం చేసుకొని, జవాబుని ఇంగ్లీష్ లోనే వ్రాసి, పోర్చుగీస్ లోకి మార్చి పంపాల్సివస్తున్నది. అయినా ఇబ్బంది అనుకోకుండా ఇష్టముగా చేస్తున్నాను. అదొక అందమైన మరపురాని అనుభవం. స్నేహం ఎన్నడూ భాష, దూరం, జాతీయత చూడలేదు. ఈ క్రింది ఫోటో చూడండి. ఇలా మార్క్ చేస్తే చిన్న బాణం గుర్తు ఉన్న డబ్బా వస్తుంది. దాన్ని నొక్కితే ఒక సబ్ మెనూ వస్తుంది. అందులో ఉన్న Translate with Live Search అనే దాని మీద కర్సర్ పెట్టగానే, ఆ భాష ఏమిటో.. ఆ వాక్యానికి అర్థం ఏమిటో వస్తుంది. అప్పుడు ఆ వాక్యానికి అర్థం ఏమిటో సర్వర్ లోని, డాటా బేస్ లో చూసుకొని, చెప్పేస్తుంది. ఇది కేవలం ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 8 లో మాత్రమే వస్తుంది. గూగుల్ క్రోం లో రాదు.

21. ఇతరుల పుట్టిన రోజులకి మీరు ఆరోజు అందుబాటులో లేకుంటే - ముందే గ్రీటింగ్స్ చెప్పేసి, ఆరోజు అందుబాటులో ఉండకపోవటానికి గల కారణం చెబితే బాగుంటుంది. వారు మంచి అభిప్రాయముతో బాగా గుర్తుపెట్టుకుంటారు. గత సంవత్సరములో నా స్నేహితురాలు వారి ఫ్యామిలీతో కూలూ, మనాలికి వెళుతూ ఇలా అడ్వాన్సుగా చెప్పేసి వెళ్ళిపోయారు. (ఇలా ప్రతివారి నుండీ ఒక్కో విషయం నేర్చుకోవచ్చును.)

22. మీరు కొద్దిరోజులు ఆన్లైన్ కి దూరముగా ఉంటే - ఆవిషయం స్టేటస్ మెస్సేజ్ లో చెప్పండి. అది అందుకోసమే ఉద్దేశించింది.

23. మీకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ తయారు చేసుకోండి. అది చూస్తే మీరే గుర్తుకురావాలి. గుంపులో గోవిందలా ఉండకండి. నా మిత్రుడు ఒకరు తెలుగులో ఈస్ట్ గోదావరి యాసని టైపింగ్ లో చూపిస్తాడు. నిజానికి ఈ స్టైల్ అలా మైంటైన్ చేయటం చాలా కష్టమే అయినా నిజానికి చాలా గోప్పవిషయమే!. ఇలా మనలోని ఒక ప్రత్యేకత మనకి ఒక పాపులారిటీ తెస్తుంది. అది ఇచ్చే కిక్కు - అనుభవిస్తేనే గానీ తెలియదు. చిన్న సైజు సెలెబ్రిటీ హోదాగా ఉంటుంది.

24. మీరు బీజీ గా ఉన్నప్పుడు ఎవరైనా చాటింగ్ కి పింగ్ చేస్తే - సున్నితముగా చెప్పండి ఇలా బీజీ అని. వారు అర్థం చేసుకొని వెళ్ళిపోతారు. ఆ తరవాత గుర్తు పెట్టుకొని వారితో మాట్లాడండి.. ఏమిటా అవసరం అనీ.

25. మిత్రులు ఏదైనా సాధించాము అన్నట్లు ఏదైనా ఫొటోస్ పెడితే - మరచిపోకుండా అభినందించండి. నిజానికి మీ స్పందన కోసమే కదా వారు ఆ ఫొటోస్ ని అప్లోడ్ చేసేది. ఇబ్బందిగా ఉండి, చెప్పేది బాగోలేనప్పుడు వారికి ప్రైవేట్ లో చెప్పండి.

26. మీకు మంచి చేసేవారిని, మీ మేలు కోరేవారిని ఎప్పుడూ కాపాడుకోండి. వారిని ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోకండీ!. (ఈరోజుల్లో) అలాంటివారు దొరకడం మీ అదృష్టముగా భావించండి.

27. స్నేహాలని తెంచుకోవటం చాలా ఈజీ. జస్ట్ వారి హోమ్ పేజీలోకి వెళ్లి, రెజెక్ట్ చేస్తే చాలు. కాని స్నేహాన్ని నిలుపుకోవటమే కష్టముగా ఉంటుంది. కాస్త కష్టపడితే ఈజీగానే ఉంటుంది.

28. మన గురించి బాగా తెలిసినవారిని దూరం చేసుకోవటం అవివేకం. మళ్ళీ క్రొత్తగా వేరేవారిని పరిచేసుకొని అందులో వీరిని వెదుక్కున్నా వారిలా మనకి దగ్గరగా ఉండొచ్చు, ఉండకపోవచ్చును. పొరబాట్లు అందరూ చేస్తారు. ఎన్నెన్నో ప్రశ్నల తరవాత కూడా వారి స్నేహం మీకు అనవసరం అని మీకు అనిపించినప్పుడు, అప్పుడు దూరం చేసుకోండి. అలా దూరం చేసుకునే ముందు - వారితో ఒకసారి మాట్లాడండి. లేదా వారికి ఒక అవకాశం ఇవ్వండి. వారలా ఎందుకు, ఏ పరిస్థితుల్లో చేశారో తెలుసుకోవటానికి ప్రయత్నించండి. అప్పటికీ తిన్నగా సమాధానం మీకు దొరకలేదూ అనిపిస్తే ఇక గుడ్ బై చెప్పెయ్యాల్సిందే!. చివరి క్షణాల్లో కూడా ఒక అవకాశం ఇచ్చాం అన్న తృప్తి కలుగుతుంది.

29. పుట్టుకతో ఎవరూ పర్ఫెక్షనిష్టులు అవరు. మాట తేడాలూ, స్క్రాప్ తేడాలూ జరిగి ఉండొచ్చు. దాన్ని హేళనకి గురిచేయ్యకండి. ఎలా మార్చుకోవాలో వారు అడిగితే - మీకు చేతనైనంత సహాయం చెయ్యండి.

30. మీ మిత్రులకి కొన్ని స్క్రాప్స్ వ్రాశాక, వాటికి జవాబు రాలేదే అనుకోండి. వారినేమీ నిందించకండి. మీతో వారికి స్క్రాపింగ్ ఇష్టం లేదులా అనుకోండి. కాస్త దూరం మైంటైన్ చెయ్యండి చాలు. ఆ దూరం అనేది మీ మీ స్నేహాన్ని బట్టి, మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం బట్టి ఉంటుంది.

31. మీ పరోక్షములో మీ గురించి మాట్లాడేవారిని ఏమీ అనకండి. వారి గుణం ఏమిటో, వారు ఎలాంటివారో వారే మీకు తెలియజేస్తున్నారు అనీ, అది మీకు అడగక ఇచ్చిన గొప్పవరం అనీ అనుకోండి. దానివలన మీకు విలువైన  సమయం వృధా కానందులకు బాగా సంతోషించండి.

32. ఎవరైనా క్రొత్తవారు మిమ్మల్ని సహాయం అడిగితే చెయ్యండి. ఇది ఆసక్తికర విషయం. ఎవరో తెలీదు ఒకరోజు ఒక స్క్రాప్. మీకు దగ్గరలోని ఫలానా ప్రదేశం చూడటానికి వస్తున్నాము. అక్కడ ఏమైనా A/C హోటల్స్ ఉంటే చెప్పండి. నెట్ లో ఎక్కడా దొరకక అడుగుతున్నాను అంటే - ఆ సాయంత్రం వాకింగ్ కి బయలుదేరి నాలుగు హోటల్స్ వివరాలు కనుక్కొని, రెంట్ ఎంతో + ఫోన్ నంబర్స్ తీసుకొని.. వారికి చెప్పాను. దీనివలన నాకు లాభం ఏమిటంటే - వాకింగ్ వల్ల ఆరోగ్యం, ఆ హోటల్స్ ఎలా ఉంటాయో, టారిఫ్ ఏమిటో అన్న కాస్త జెనెరల్ నాలెడ్జీ. వారితో కాస్త పరిచయం, కాస్త అరగంట సేవ. అంతే!. ఇది జరిగి రెండు సంవత్సరాలు అవుతున్నది. నాకూ ఏదైనా సమస్య వస్తే నెట్లో అడుగుతాను. దానికి ముక్కూ,మొహం తెలీనివారు చాలా మంది జవాబులు ఇస్తారు. వారే అంతగా సహాయం చేస్తున్నప్పుడు ఆఫ్ట్రాల్ నాదెంత -  పీపీలికం.

33. చాటింగ్ వల్ల, స్క్రాపింగ్ వల్ల మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా అభివృద్ధి చేసుకోవచ్చును. ఒకప్పుడు ఇంట్రావర్ట్ ని అయిన నేను ఇప్పుడు బాగా మారాను. "కాస్త" కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చాయని అనుకుంటున్నాను. ఈ ఆన్లైన్ స్నేహాల వల్ల అదొక నాకు ప్లస్ పాయింట్.

34. ఇక్కడికి వచ్చింది ఎందుకో బాగా గుర్తుచేసుకుంటూ ఉండండి. స్నేహం కోసం అయితే స్నేహమే చెయ్యండి. ఫన్నీ కోసం అయితే ఫన్నీ గా ఉండండి.

35. నిజమైన స్నేహం చేసేవారితో నిజమైన స్నేహితునిలా ఉండండి. వారిని మోసగించేలా చూడకండి. ఎక్కడైనా పొరబాటు చేశారో మీరు వారికి దూరం అవుతారు.

36. మీకూ, మీ మిత్రుల మధ్య స్నేహం ఎంత ఉందో సంవత్సరానికి ఒక్కసారైనా పరిశీలించుకోండి. ఇది మీకు క్రొత్తగా ఉండొచ్చును. కాని ఈ సూచన మీకు బాగా ఉపయోగపడుతుంది. నిజానికి పరిచయం అయ్యాక నెలలోగా బాగా పెరిగి ఉండాలి. ఆ స్నేహం నిజాయితీతో కూడినది అయిఉండి, మీకు ఆహ్లాదాని, నమ్మకాన్ని కలుగచేయ్యాలి. అలాంటి మిత్రులు దొరికితే మీరు అదృష్టవంతులే. ఆరునెలలైనా ఆ స్నేహం రొటీన్ గా, ఇంకా హాయ్ అనేలా ఉందీ అంటే అంత మంచి స్నేహం కాకపోవచ్చును. ఇలాంటివాటిల్లో కాస్త మీ పాత్రా కాస్త ఉంటుంది. కాని మీరు వారికి తగిన స్క్రాప్స్ పంపాక కూడా ఇంకా అలాగే ఉంటే - అది నిశ్చయముగా గుంపులో గోవింద అన్నట్లుగా ఉండే స్నేహం అన్నమాట. ఇలాంటి వాటితోనే స్నేహం అంటే తెగ బోర్ అనే ఫీల్ వస్తుంది.

37. మనం ఎవరితో సవవాసం చేస్తే వారి గుణాలు మనకీ వస్తాయి. అందుకే వారిని జాగ్రత్తగా ఎంచుకోండి. కవిత్వం వ్రాసేవారితో స్నేహం చేస్తే - కవితలు వ్రాయకున్న కవితలని విని / చదివి భరించే శక్తి వస్తుంది. హ హ హ్హ..

38. వాదనలు ఎప్పుడూ పెట్టుకోకండీ! అది స్నేహం మధ్య పెద్ద లోతైన అఘాతాన్ని సృష్టిస్తుంది. దానివల్ల మునపటిలా స్నేహం ఇకముందూ కుదరకపోవచ్చును.

39. సారీ చెప్పటం పెద్ద నేరం కాదు. అలా చెప్పటం వల్ల మీ ఆస్థులు ఏమీ కరిగిపోవు, మీ వ్యక్తిత్వం ఏమీ దెబ్బ తినదు. అలా చెబితే - మీ స్నేహం మరీ బాగుంటుంది. అలాగే మీ వ్యక్తిత్వం ఇంకా బాగుంటుంది.

updated on 17-April-2011

Monday, April 11, 2011

గోధుమ పడి (ఉగాది సాంప్రదాయ స్వీట్)



గోధుమ పడి (ఉగాది సాంప్రదాయ స్వీట్) అనేది ఆంధ్రప్రదేశ్ లోని, ఒక తెలంగాణా ప్రాంతాలలో ఉగాది రోజులలో చేసే సాంప్రదాయకమైన స్వీట్ పదార్ధం. ఇది చాలా బాగుంటుంది. చల్లగా కన్నా, వేడిగా తింటే చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఆ రిసీప్ ఎలా చెయ్యాలో మీకు చెబుతాను. 

కావలసిన పదార్థములు ::

గోధుమలు - పావుకిలో

బియ్యం - ఒక కప్పెడు

పంచదార - పావు కిలో

శనిగె పప్పు - సగం కప్పు

ఖాజు - 20  గ్రాములు.

సారా పలుకులు - 20 గ్రాములు

కిస్మిస్ - 20 గ్రాములు

గసాలు - రెండు టేబుల్ స్పూన్స్

ఎండుకొబ్బరి కోరు - రెండు టేబుల్ స్పూన్స్

ఇలాచీ పొడి - కొద్దిగా.

నెయ్యి - రెండు టేబుల్ స్పూన్స్

తయారుచేయు విధానం ::


1. గోధుమలను ముందుగా ఒక నీటి గిన్నెలో వేసుకొని, ఒక గంట సేపు నానపెట్టాలి.

2. ఆ గంట సేపు అయిన తరవాత ఆ నీటిని వంపేసుకోవాలి.

3. ఆ తరవాత ఆ గోధుమలని, రోట్లో వేసుకొని బాగా దంచవలెను.

4. ఆ తరవాత ఆ రోకట్లో ఉన్న గోధుమలని తీసి, చేటలో వేసుకొని పొట్టు చేరుగుకోవాలి. ఈ పొట్టు అసలే ఉండనంతగా దంచుకోవాలి. 

5. ఆ తరవాత స్టవ్ మీద ఒక గిన్నెలో నీరు వేడి చేసి, అందులో ఈ గోధుమలని వేసి, బాగా ఉడికించాలి.

6. సగం ఉడికాక అందులో బియ్యం, శనిగె పప్పు వెయ్యాలి.

7. బాగా ఉడికాక, పంచదార వెయ్యాలి.

8. అందులోని నీరు ఆవిరి అయ్యి, ఆ పదార్ధం అంతా దగ్గరికి అయ్యాక నెయ్యిని అందులో పోసుకోవాలి.

9. ఇలాచీ పొడి, గసాలు, సారాపలుకులు, కిస్మిస్, ఎండుకొబ్బరి పొడి అందులో వేసి, బాగా కలియత్రిప్పి, దింపుకోవాలి.

10. అందమైన పాత్రలలో లోకి వంపేసి, ఖాజులతో గార్నిషింగ్ చేసుకోవాలి.

సూచనలు :

ఈ స్వీట్ రెండురోజుల వరకూ చాలా బాగుంటుంది. చల్లగా అనిపించినవారు కాస్త పాలని బాగా వేడి చేసి, ఇందులో కలుపుకుంటే చాలా బాగుంటుంది. మైక్రోవేవ్ ఉన్నవారు పాలు పోసుకొని, ముప్పై సెకనులు వేడి చేస్తే సరి. చాలా కమ్మని రుచిగా ఉంటుంది.

Thursday, April 7, 2011

జిమెయిల్ లో తెలుగు టూల్

మీరు మీ జిమెయిల్ లో తెలుగులో ఒక మెయిల్ తయారుచేసి, పంపాలీ అని అనుకుంటున్నారా? అలా కూడా తెలుగులో పంపవచ్చును. చాలాకాలం క్రిందటే గూగుల్ ఈ టూల్ ని జిమెయిల్ కి అందించాడు. మీ జిమెయిల్ లోని Compose Mail ని ఓపెన్ చేస్తే మీకు మెయిల్ వ్రాసుకునే బాక్స్ ఇలా ఓపెన్ ఆవుతుంది. అందులో టూల్ బార్ లోని మొదటగా ఉన్న అనే అక్షరాన్ని నొక్కి, క్రిందన ఉన్న మెస్సేజ్ బాడీలో టైప్ చేస్తే ఎంచక్కా తెలుగులోకి వచ్చేస్తుంది.


అలా తెలుగులో ఎంచక్కా వ్రాసుకోవచ్చును. అలా ఈజీగా రోమన్ ఇంగ్లీష్ లో వ్రాస్తూ, స్పేస్ నొక్కగానే వెంటనే తెలుగులోకి మారిపోతుంది. చాల బాగుంది కదూ!. తెలుగే కాదు అలా పంతోమ్మిది భాషల్లో వ్రాసుకోవచ్చును. ఇది అన్ని మెయిల్ బాక్స్ లలో డిఫాల్ట్ గా ఉంటుంది. ఒకవేళ - ఇలా మీ మెయిల్ బాక్స్ లో ఈ టూల్ కనిపించనప్పుడు, క్రింది ఫోటోలో మాదిరి దాన్ని మీ అందుబాటులోకి తెచ్చుకోవటానికి :  

1. మీ జిమెయిల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి.

2. General ఓపెన్ చెయ్యండి.

3. Enable Transliteration ప్రక్కన ఉన్న గదిలో టిక్ చెయ్యండి.

4. అక్కడ డ్రాప్ బార్ ని నొక్కి అందులో తెలుగుని ఎంచుకోండి. 

5. Right to left encoding support off ని నొక్కండి. 

ఇప్పుడు క్రిందన ఉన్న Save బటన్ నొక్కేస్తే తెలుగు లో మెస్సేజ్ బాడీలో వ్రాసుకోవచ్చును.



మీ మెయిల్ లో ఇలా కనిపించట్లేదు అని మీ ఫిర్యాదే అయితే - మీరు మొత్తం మెయిల్ బాక్స్ ని Basic HTML ని నొక్కి, వాడుతున్నారు అన్నమాట. అప్పుడు మీరు ఆ మెయిల్ బాక్స్ బేసిక్ HTML వాడుతున్నారు అన్నమాట. ఆలాంటప్పుడు మీరు పైన ఉన్న Switch to Standard view ని నొక్కితే సరి. మీకు అలా తెలుగు టూల్ సెలెక్ట్ చేసుకొనే ఆప్షన్ సెట్టింగ్స్ లలో కనిపిస్తుంది. అప్పుడు అక్కడ ఎనేబుల్ చేసుకొని వాడేసేయ్యండి.

ఇలా తెలుగు టూల్ ని, మన జిమెయిల్ అక్కౌంట్ కి వేసుకోవచ్చును.

Wednesday, April 6, 2011

Social NW Sites - 24 - మిత్రులు మనకి ఆడ్ అయ్యాక..

ఎన్నెన్నో వడపోతల తరవాత మనం మిత్రులని ఆడ్ చేసుకుంటాము కదా.. అలా వడపోసి ఆడ్ చేసుకోవటం ఈరోజుల్లో తప్పనిసరి అయ్యింది కూడా! మన దైనందిక జీవితాల్లో స్నేహాలని ఎదురుగా, కంటితో చూసి, మాట్లాడి, పరిశీలించి స్నేహముగా మెలగాలో, వద్దో నిర్ణయించుకుంటాము. కాని ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ మనిషి కనపడదు. మాటలూ వినపడవు. దగ్గరగా ఉండరు కూడా. అయినా ఇది ఇక్కడ తప్పదు. వెనకట్లో కలం స్నేహాలు ఉండేవి. ఉత్తరాలల్లో ఊసులు చెప్పుకుంటూ, ఆ ఊసులని భద్రముగా చేతికి ఇచ్చే ఉత్తరాన్ని, అది తెచ్చి ఇచ్చే పోస్ట్ మ్యాన్ నీ బాగా ఆత్మీయముగా చూశారు. కాలం మారింది. ఇప్పుడు ఆ పోస్ట్ మాన్ స్థానాన్ని ఈ సోషల్ సైట్లూ, ఉత్తరాల స్థానాన్ని స్క్రాప్స్ పూర్తిగా ఆక్రమించుకున్నాయి.

ఈ ఆన్లైన్లో ముక్కూ, మొహం అంతగా కనిపించవు. లేని పోనీ భేషజాలకి పోతుంటారు. కొందరు ఇంకా 1947 కాలం నాటి భావాలని చూపిస్తుంటారు. వారు చెప్పే వివరాలని బట్టే వారు ఎలాంటివారో గమనిస్తూ, స్నేహం చెయ్యాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ క్రొత్తగా, వింతగా ఉంటుంది. అది అంతకు ముందు ఎన్నడూ చవిచూడని అనుభవం. అక్కడే కొన్ని పొరబాట్లు చేస్తుంటాము. తెలీని విషయములో పొరబాట్లు మానవ సహజం. కాని అది ఎంత తొందరగా తెలుసుకొని, తప్పు దిద్దుకుంటామో అనేది అంతా మన చేతుల్లో ఉంటుంది. ఇక్కడ మీకు ఎవరూ సహాయం చెయ్యరు. వారంతట వారుగా ఎవరూ సహాయం చెయ్యరు. అంతా మనంతట మనం గానీ, ఇతరుల సహాయముతో మన సమస్యలకి సలహాలను తీసుకొని బాగుపడాలి. ఇక్కడ ఏర్పడే సమస్యలన్నింటికీ మనం ప్రవర్తించే పద్ధతి బట్టి, ఎంచుకున్న స్నేహాలని బట్టీ ఏర్పడుతుంటాయి. కాబట్టి ముందే స్నేహితుల విషయములో కాస్త జాగ్రత్తగా ఎంపిక ఉంటే స్నేహ మాధుర్యాన్ని, చాలా బాగా ఆస్వాదించవచ్చును.

మొదట్లో నేనూ అంతే!.. అంతా క్రొత్త.. ఎదురుదెబ్బలు బాగా తగిలాయి. కొన్ని అందమైన స్నేహ మాధుర్యాలని పొరబాట్లు చేసి వదులుకున్నాను. కొన్నింట్లో అనవసర స్నేహాలు చేసి ఎదురు దెబ్బలూ తగిలించుకున్నాను. అప్పుడు నేను ఈ సోషల్ సైట్లలో ఎలా ఉండాలో తెలీని స్థితిలో ఉన్నాను. ఇప్పుడు నేను చెబుతున్న విషయాలంటివి నాకు ఎక్కడా అగుపించలేదు. అలాగా ఆరోజుల్లో ఎవరైనా చెబితే శుభ్రముగా ఫాలో అయిపోయేవాడినే! నాలాంటి పొరబాట్లు ఇతరులు ఎవరూ చేయొద్దని, నాలాంటి వారికి ఒక చిన్న సూచిక లా ఉంటుందని, ఇదంతా కష్టపడి చెబుతున్నాను. అది తరవాత ఈ టపా చివర్లో మాట్లాడుకుందాము.  

ఇప్పుడు మనం ఒక మిత్రుడిని మన స్నేహ హస్తం అందుకోవటానికి అంగీకరించాము కదా!. ఇలాంటి నూతన మిత్రుడిని ఓకే చేశాక, వారి గురించి కాస్త తెలుసుకోండి. ఆడ్ అయ్యే ముందు కన్నా, ఆడ్ అయ్యాక వారి వారి ప్రొఫైల్ లో డిటైల్స్ ఇంకా బాగా కనిపిస్తాయి. ఇక్కడ వారి గురించి తెలుసుకోవాలంటే వారిచ్చే సమాచారము మీదే ఆధారపడాల్సి ఉంటుంది. కాస్త ప్రయత్నం చేస్తే, ఇంకా బాగా తెలుసుకోవచ్చును. అది మీ టాలెంట్ బట్టి ఉంటుంది.

ఇప్పుడు మనం వారి ఆడ్ రిక్వెస్ట్ ఒప్పుకునే ముందు - కొన్ని తెలుసుకుంటాముగా. ఇప్పుడు అవి నిజమా కాదా అనేది బాగా పరిశీలించాలి. కొన్ని సోషల్ సైట్ల సెట్టింగ్స్ వల్ల వారి వివరాలు అన్నీ చీకటిలో ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయితేనే చూసే పద్ధతిలో సెట్టింగ్స్ పెట్టి ఉండోచ్చును. నిజానికి అలా పెట్టడములో వివరాలు జాగ్రత్తగా కాపాడుకోవటం అన్నమాట. మీ పర్సనల్ వివరాలు కాపాడుకోండి. అది ఎక్కడైనా, ఎప్పుడైనా సమ్మతమే.. కాని ప్రొఫైల్ లో ఉండే అభిరుచులు, ఇష్టమైన సినిమాలు, ఇష్టమైన వంటకాలు మొదలైన విషయాలు కూడా నింపేయకుండా ఖాళీగా ఎందుకు వదిలేస్తారో.. అవి బయటకి తెలిసినా ఏమీ ఇబ్బంది ఉండవు. అలాంటి వివరాలు హాయిగా వ్రాసేసుకోవచ్చును. ఇలాంటి వివరాలని మీకు క్రొత్తగా ఆడ్ అయిన మిత్రుల ప్రొఫైల్ లలో చూడండి. మీ రుచులకీ, వారి రుచులకీ ఎంత దగ్గరగా కలసిపోయాయో ఇందులో తెలుస్తుంది. దాని వల్ల భవిష్యత్తులో ఎంత దగ్గరగా మీ స్నేహం ఉండబోతుందో ఇందులోని వివరాల వల్ల చూచాయగా చెప్పవచ్చును.

మీ రుచులూ, అభిరుచులూ, ఇష్టాలూ, అయిష్టాలూ ఒక వృత్తం అనుకుంటే - అవతలి వారి అభిరుచులూ, ఇష్టాయిష్టాలు.. అదొక వృత్తముగా తీసుకొంటే - ఈ రెండు వృత్తాలూ ఎంతగా కలసిపోయాయి అన్నది చూసుకుంటే ఇక మీరు భవిష్యత్తులో అంతగా దగ్గరగా ఉండబోతున్నారు అన్నమాట. ఈ విషయములో మీకు కాస్త అనుభవం ఉంటే ప్రొఫైల్ చూసిన కాసేపట్లోనే ఒక నిర్ణయానికి రాగలరు. ఈ క్రింది పటం చూడండి. ఈ పటం లోని వంకాయ రంగు ఎంతగా ఎక్కువగా ఉంటుందో అంతలా మీ స్నేహం ఉండబోతుంది అన్నమాట. ఒక్కోసారి పరిచయం అయిన మొదట్లో చాలా తక్కువగానో, ఎక్కువగానో ఉండొచ్చు. ఆ తరవాత ఆ భాగం పెరిగేలా చేసుకోవటం ఆ ఇద్దరి మీదా ఉంటుంది. ఒకవేళ అది అలా పెరగలేకపోవటానికి గల కారణం - ఏ ఒక్కరి వల్లనో, ఆ ఇద్దరిమీదనో ఉండవచ్చును.


కొన్ని సోషల్ సైట్స్ సెట్టింగ్స్ వలన ఎదుటివారి విషయాలు అంతగా తెలియక పోవచ్చును. ఆడ్ అయ్యాక - visible to friends అనే సెట్టింగ్ వల్ల ఇప్పుడు వారికి మరింతగా కనిపిస్తాయి. ముందుగా మీరు వారికి స్నేహ హస్తాన్ని మీ నుండి ఇవ్వటం మొదలెట్టండి. "మీ స్నేహాంగీకర అభ్యర్ధన ని మన్నించాను. నేను మిమ్మల్ని నా స్నేహితుల గుంపులోకి చేర్చుకున్నాను.." అని అర్థం వచ్చేలా మీకు వచ్చిన భాషలో చెప్పండి. దీని వలన మీరు కలుపుగోలు మనిషి అంటూ అని కాస్త ఒక లుక్ వస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని అన్నట్లుగా ఉంటుంది. దీని వలన అతనికి ఎప్పుడు పరిచయం అయ్యామో అతని స్క్రాప్ బుక్ లో ఒక మైల్ స్టోన్ లా ఉంటుంది.

ఇప్పుడు అతను ఏమిటో ఒక అవగాహనకి రావటానికి వారి వివరాలు అన్నీ మరొక్కసారి పరిశీలించండి. ఫ్రెండ్స్ కి మాత్రమే చూపే వివరాలు కూడా ఇప్పుడు కనిపిస్తాయి కాబట్టి ఇప్పుడు ఒక స్పష్టమైన అవగాహనకి రావచ్చును. ఇప్పుడు మరొక్కసారి వారి వివరాలు గమనించండి. మీ మ్యూచువల్ స్నేహితులని అడిగి తెలుసుకున్న వివరాలు, అలాగే మీరు అంచనా వేసుకున్న వివరాలు - ఆ ప్రొఫైల్ లోని వివరాలతో సరిపోలాయో చూసుకోండి.   

ఆ తరవాత వారికి కొద్దిరోజులు మరచిపోకుండా పలకరించండి. చాలామంది ఇక్కడే పప్పులో కాలు వేస్తారు. ఈ విషయాన్ని బాగా నిర్లక్ష్యం చేస్తారు. ఆడ్ చేసుకున్నాక మనవంతుగా కొన్ని స్క్రాప్స్ అంటూ వ్రాయాలి. వాటికి జవాబులు ఎలా వస్తున్నాయో గమనించండి. అవన్నీ మామూలుగా, జెనరల్ విషయాల మీద మాట్లాడాలి. చాలామంది మాత్రం వెంటనే పర్సనల్ విషయాలు అడిగేస్తుంటారు. అలా మొదట్లో అడిగితే ఎవరూ చెప్పటానికి ఇష్టపడక పోవచ్చును. ఒకవేళ మిమ్మల్ని ఇలా అడిగారు అనుకోండి. అప్పడే అనుకోండి - ఎదుటివారు తమకి ఏ విధముగా ఉపయోగపడతారు అన్న కోణములోంచి చూస్తున్నవారై ఉంటారు అనీ. నన్ను ఇలా అడిగినవారిలో చాలామంది ఇప్పుడు అంతంత మాత్రమే - ఏదో ఉన్నారా అంటే ఉన్నారు అన్నట్లుగా ఉన్నారు. వారితో నా స్నేహం అంతగా పెరగలేదు. ఏదో హాయ్ అంటే హాయ్. అంతే!. ఇదే విషయం మీద ఎప్పుడో ఒక టపా కూడా వ్రాశాను - పరిచయం అయిన క్రొత్తలోనే రెండో మాటగా మీరేం చేస్తారూ అని అడిగితే ఆ పరిచయం లో ఆర్ధిక లబ్ది మాత్రమే కనిపిస్తుందని. అది ఇక్కడ కూడా అన్వయించుకోవాలి.

వారు అడిగారు కదా అని మీరూ అప్పుడే అడగండి. వారు ఏమి అడుగుతున్నారో అవే ప్రశ్నలని మీరూ వారిని అడగండి. అలా చేస్తే మేమూ వారిలా అవుతాం కదా అనే అనుమానం పెట్టుకోకండి. మొదట ఆ పద్దతి వారు పాటించాక మనమూ వారి దారిలో వెళ్ళటం ఏమీ తప్పుకాదు. నేను ఈ పద్ధతిని బాగా ఫాలో అవుతాను. అలా అడిగాక ఏ సమాధానాలు వచ్చాయో చూడండి. వాటిని కాస్త విశ్లేషించండి.  

ఏదో ఒక స్క్రాప్ వ్రాసేసి వెళ్లిపోయేవారికి - స్నేహాన్ని ఎలా పెంచుకోవాలో తెలీదు అన్నమాట. వారికి ఎలా ఇతరులతో వ్యవహరించాలో కూడా సరిగా తెలీని పరిస్థితుల్లో ఉంటారు. ఏమి మాట్లాడాలో తెలీని వారు కూడా చాలామంది ఉన్నారు. ఇందులో ఏముందీ! కాస్త టీవీ చానల్ ప్రోగ్రామ్స్ చూస్తే చాలు - ముక్కూ మొహం తెలీనివారితో ఆ టీవీ యాంకర్స్  ఎలా మాట్లాడుతున్నారో కాస్త గమనించండి. ఎలా మాట్లాడాలో మీకు కాస్త అర్థం అవుతుంది. అలా కంటిన్యూ చేస్తూ పోతూ ఉంటే స్నేహం అలా దృడం గా మారుతుంది. ఇది తెలియక చాలా స్నేహాలు మొదట్లోనే ఆగిపోతాయి. కొద్దిరోజుల తరవాత చూస్తే - మన ఫ్రెండ్ లిస్టులో చాలామంది ఉంటారు కాని, మాట్లాడేవారు తక్కువగా ఉంటారు. స్నేహం అనేది కేవలం ఆడ్ చేసుకుంటేనే పెరిగేది కాదు. మాట్లాడుతుంటే పెరిగేది.

వెనకటికి ఒక సామెత - వస్తూ పోతుంటేనే బంధుత్వాలు అనే సామెతని కాస్త మార్చుకుంటే, స్క్రాప్స్ వ్రాస్తూ ఉంటేనే గదా స్నేహాలు అని ఇక్కడ ఫిక్స్ అయిపోవచ్చును. మనం చిన్నప్పుడు క్లాసుల్లో ఈ విషయాన్ని స్పష్టముగా గమనిస్తాము. ఎవరితో మనం ఎక్కువగా మాట్లాడుతుంటే వారితో బాగా క్లోజ్ గా ఉంటాము. మనం మాట్లాడించినా, వారు మాట్లాడకపోతే అక్కడ వారిని వదిలేసి ఇంకొకరితో ఎలా ఉంటామో ఇక్కడా అంతే!. అది అక్కడ అనుభవమే. అప్పుడే ఈ సోషల్ సైట్స్ బోర్ అనిపిస్తుంటాయి. ఇది కాదనుకొని ఇంకో సైట్లలోకి వెళుతుంటారు. అక్కడా ఇలాంటివారు తగులుకుంటూనే ఉంటారుగా. అందుకే మొదటి నుండీ చెబుతున్నాను. ఈ ఆన్లైన్ లో స్నేహితుల ఎంపికని జాగ్రత్తగా ఎన్నుకోండి. దాని వలన మీకు మానసిక శాంతి, మంచి సజ్జన సాంగత్యం, మంచి మిత్రులూ, మంచి ఆహ్లాదకరమైన స్నేహం చవిచూస్తారు.

ఆడ్ అయ్యాక వారి వివరాలు అన్నీ చూశారుగా. అలాగే ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాడు, ఎలాంటి స్క్రాప్స్ వారి మధ్య నడుస్తున్నాయి అనేది చూడండి. "మీ స్నేహితుల గురించి చెప్పండి మీ గురించి చెబుతాను.." అన్న ప్రవచనం ప్రకారం వారి మిత్రుల గురించి చూస్తే చాలు. ఈమధ్య కాలములో ఒక ఆడ్ రిక్వెస్ట్ వస్తే పరిశీలించాను. అన్నీ ఉన్నాయి. ఫుల్ డిటైల్స్, హాబీస్, అతని ఫొటోస్.. ఇలా అన్నీ ఉన్నాయి. వీడియోలకి, స్క్రాప్ బుక్ కీ తాళం ఉంది. అన్ని విధాల అర్హుడే!. ఓకే చేశాను. తీరా స్క్రాప్ బుక్ లోపల ఏమున్నాయా అని జెనరల్ గా చూద్దామని వెళ్ళా - అతని వ్యక్తిత్వం ఎలా ఉంటుందో, అతని స్నేహితులు ఎలాంటివారో, అతనికి ఎలా స్క్రాప్స్ పంపిస్తున్నారో అనీ! లోపల చూడగానే నిజముగా నేను షాక్ కి గురయ్యాను. నిజమా అనుకున్నాను. నిజమే. డీపీ గా అమ్మాయి ఫోటో, అమ్మాయి పేరు పెట్టుకొని పంపిన ఒకరి స్క్రాప్స్ చాలా ఉన్నాయి. అవన్నీ నగ్న చిత్రాల తాలూకు వీడియోలూ, బొమ్మలకి సంబందించినవి. అవంటే అతనికి బాగా ఇష్టములా ఉన్నాయిలా ఉంది. చాలావరకూ అవే. ఓపెన్ గా స్క్రాప్స్ లోనే ఇలా ఉంటే, ఇక లాక్ వేసిన వీడియోలలో ఇంకెన్ని ఉన్నాయో! అవన్నీ అతనికి ఇష్టములా ఉంది అనుకొని, ఆ వెంటనే అతన్ని రిజెక్ట్ చేసి, బ్లాక్ లిస్టులో పెట్టేశాను. అతన్ని నేను అలాగే ఫ్రెండ్ గా ఉంచేసుకుంటే నేనూ అలాంటివాడినేమో అనుకొనే ప్రమాదం ఉంది. ఈ టపా వ్రాయటానికి కారణమూ అయ్యింది. అందుకే అన్నీ చూడమని అంటున్నాను. అలా  అయ్యాకే మీ స్నేహితునిగా ఆడ్ చేసుకోండి అని చెప్పేది.


ఇది ఆ స్క్రాప్ బుక్ లోని పేజీ యే!.. ఫ్రీ పబ్లిసిటీ, బ్లాగ్ రేటింగ్స్ పెంచుకోవటానికి, ఆడవారినీ కించపరిచేలా, ఇతరులపై నిందలు మోపుతున్నానని.. ఇలాంటివి కామెంట్స్ రాకుండా ఉండటానికి ఇలా మొత్తం పేజీయే చాలా అస్పష్టముగా మార్చి పెడుతున్నాను. నిజానికి ఈ ఫోటో పెట్టొద్దు అని అనుకున్నాను. కాని చాలా తర్జన భర్జన తరవాత ఇలా చేసి పెట్టాను. నేను చెప్పే టపాలు ఊహించి కాల్పానిక కథ అని కాకుండా ఉండాలని, దానికో ఆధారం చూపాలని అనుకొని, ఈ సోషల్ సైట్లలో ఇలా జాగ్రత్తగా ఉండాలని చెప్పే భాగములో ఇలా పెట్టడం జరిగింది. ఒకవేళ అలా కాకుండా చూపాలీ అనుకుంటే ఏ ఆటవికునిలా అంతా స్పష్టముగా కనిపించేలా పెట్టేసేవాడినే. ఇక్కడ ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి చెప్పట్లేదు. ఇక్కడ కేవలం విషయ పరిచయం చేస్తున్నాను. అంతే!.

అవతలివారు ఆడ్ అయ్యాక మనకి ఎంత త్వరగా రిప్లై ఇస్తున్నారో గమనించండి. వారు వ్రాసే పద్ధతినీ గమనించండి. చాలా మంది ఆడ్ అయ్యాక ఎలా మాట్లాడాలో తెలీకనో, ఇంకేచేతనో సరిగా వ్రాయరు. అలా వ్రాయని వారి విషయం తెలుసుకోవాలని ఉంటే చిన్న కిటుకు ద్వారా తెలుసుకోవచ్చును. అది చాలా సింపుల్. ఏమిటంటే వారి స్క్రాప్ బుక్ లోని మొదటి రెండు పేజీలలో ఏమేమి స్క్రాప్ వచ్చాయో అవి ఎన్ని రోజుల తేడాతో ఉన్నాయో చూడండి. అవతలి వారు ఆక్టివ్ గా ఉన్నట్లయితే ఆ స్క్రాప్స్ డేట్స్ దగ్గర దగ్గరగా ఉంటాయి. దాన్ని బట్టి వారు ఎన్నిరోజులకి ఒకసారి వస్తున్నారో ఎదుటి వారు తేలికగా తెలుసుకోవచ్చును. అలా వారి స్క్రాప్ బుక్ లో ఉంటే "వీరు ఇన్ని రోజులకి ఒకసారి వస్తుంటారు.." అని మీరు ఒక నిర్ణయానికి రావచ్చును. అంతే అనుకోండి గానీ, డెలీట్  చెయ్యటానికి వెళ్ళకండి. ఎందుకో చెబుతాను వినండి.

కాని ఇక్కడ మీరు మరచిపోలేని ఒక విషయం చెబుతాను. కనిపించేవన్నీ నిజాలు అని అనుకోవద్దు. నిజానికి వారు ఏ హాస్పిటల్ పనిమీదో, లేదా ఏ డెడ్ లైన్ పెట్టుకొని సాఫ్ట్ వేర్ డెవలపింగ్ పనిలో ఉండొచ్చును. అంతమాత్రాన అలా స్క్రాప్ బుక్ చూసి ఒక నిర్ణయానికి రాకండి. అది ఎన్నడూ మంచిది కాదు. ఇక్కడ ఏమీ కనపడదు. అక్షరాలే కనిపిస్తాయి. వాటిని చూసి ఒకరిని జడ్జ్ ఎన్నడూ చెయ్యలేం!. వారిని గమనించాల్సి ఉంటుంది. అవతలి వ్యక్తి ఎలాంటివాడు, ఎదుటివారితో ఎలా ఉంటున్నాడూ అనేది బాగా పరిశీలించాక నిర్ణయం తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైన పధ్ధతి అంటే - వారినే డైరెక్ట్ గా అడగటమే! అలా చేస్తేనే అన్ని విషయాలకి సమాధానాలు దొరుకుతాయి. అవతలివారి సమస్య ఏమిటో, ఎందుకు ఆన్ లైన్ కి రావటం లేదో తెలుస్తుంది. తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రావటం ఎంత తప్పో ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి ముగిస్తాను.

నా ఆన్లైన్ మిత్రురాలు ఒకరు రెండు సంవత్సరాల క్రింటే పరిచయం. ఆవిడ గారు అప్పట్లో బాగా మాట్లాడేవారు. ఆ తరవాత వారు ఇల్లు కట్టుకొని, ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఇల్లు కట్టే సమయములో ఆవిడకి ఆడ్ అయిన మిత్రులకి ఈ విషయం తెలీదు. ఈవిడగారు ఆడ్ చేసుకొని నాతో మాట్లాడటం లేదు అని నాకు కంప్లైంట్ చేస్తే, చెప్పాను తన పరిస్థితి. తనకి ఆన్లైన్ లోకి వీలున్నప్పుడు వస్తారు. జాబ్ చేస్తున్నారు అనీ. వారు అర్థం చేసుకున్నారు. ఇంకో మిత్రుడు ఉద్యోగం వచ్చిందని అసలు ఆన్ లైన్ కి రావటమే లేదు. ఎప్పుడో ఒకసారి వస్తుంటాడు. ఈ విషయం అతని లిస్టు లో ఉన్న మిత్రులకి తెలీక నన్ను అడిగితే చెప్పాను ఇలా అనీ. ఇంకొకరు హాస్పిటల్ లో ఉన్నారు. తన మిత్రురాలు అడిగితే చెప్పాను. తనకు జ్వరం - త్వరలో వస్తారు అనీ. ఇక్కడ కామన్ గా గమనించాల్సిన విషయం ఏమిటంటే - అవతలివారు నన్ను పట్టించుకోవటం లేదు కాబట్టి వారిని నా ఫ్రెండ్ లిస్టు నుండి తీసేస్తాను అనేది. తెలీక అన్నీ అలా నిజమే అనుకుంటే ఎలా.?

పోరపోచ్చాలు రావటం ఆన్లైన్ లో అతి సహజం. దాన్ని పెద్దగా చేసుకొని డెలీట్ వరకూ పోతే ఎలా.? అసలు విషయం తెలిశాక - సారీ చెప్పినా వినే స్థితిలో వారు ఉండరు. నిజం. ఇలా నాకు ఒక అనుభవం జరిగింది కూడా. ఒక రచయిత్రి విషయములో అలాగే జరిగింది. చాలారోజులుగా ఆవిడ గారు నా స్క్రాప్స్ కి జవాబులు ఇవ్వటంలేదు అని తీసేశా. తరవాత ఏదో సందర్భములో ఇంకో మిత్రురాలు చెప్పారు (తనకి తరవాత చెప్పారట) - తనకి చాలా మేజర్ ఆపరేషన్స్ జరిగాయనీ, అందువల్లే ఆన్లైన్ లోకి రాలేకపోయారనీ.. హయ్యో అదా విషయం అనుకోని నేను సారీ చెబుతూ, ఆడ్ రిక్వెస్ట్ పెడితే రిజెక్ట్ చేశారు. మళ్ళీ సారీ చెబుతూ స్క్రాప్ పెట్టబోయాను గానీ, మిత్రులు కాని వారు వ్రాయకుండా సెట్టింగ్స్ ఉన్నాయి. అలా చాలా గొప్ప స్నేహాన్ని వదులుకున్నాను. ఇలాంటివి మీకు ఎదురు కావద్దని ఇదంతా మరియు నా వైఫల్యాలూ చెబుతున్నాను. కనీసం మీరైనా జాగ్రత్తల్లో ఉంటారనీ!.

అంతకు ముందూ, మొన్న వరల్డ్ కప్ ఫైనల్ అప్పుడు, కొద్దిమంది మిత్రులు అడిగారు - చిట్ చాట్ గా. ఇంతగా అందరికీ ఎందుకు ఇంత కష్టపడి ఎందుకు వివరముగా చెబుతున్నారు అనీ!. పైన ఉన్న మూడో  పేరాలోని ఆ విషయం చెప్పాను. ఇంకో విషయమూ వారికి చెప్పాను - అది ఏమిటంటే పైన చెప్పిన ఉదాహరణ లాగానే!. నేను వారి లాగానే ఇంకొద్ది రోజులవరకూ వారిలాగా ఆన్ లైన్ కి వచ్చేది. అతనికి అర్థం కాలేదు. నిజానికి ఇది ఈ సీరీస్ చివరలో చెప్పాలి. చెబుతాను కూడా.

అయినా ఇక్కడ కాస్త చెబుతాను. వారికి ప్రైవేట్ గా చెప్పొచ్చు, కాని ఎలాగూ చివరలో ఓపెన్ గా చెప్పాలి కాబట్టి కాస్త ఇక్కడ చెప్పేస్తున్నా. ఏమిటీ! అని షాక్ అయ్యారా? నిజమే! జూన్ 2010 లో అనుకున్నాను. ఆగస్ట్ 15 వరకూ అనీ. ఆ తరవాత కొందరు నిజమైన మిత్రుల విషయములో ఆన్లైన్ కి వచ్చాను. (ఈ విషయం నా ముగ్గురు మిత్రురాళ్ళకీ, ఒక మిత్రుడికి మాత్రమే తెలుసు. ఇందులో ఒకరికి ఆ జూన్ లోనే తెలుసు.) ఇప్పుడు ఇంకా కొద్దిరోజుల గడువు అంతే! ఆ తరవాత నా బీజీ లైఫ్ లో మునిగిపోతాను. అలా ఎందుకు అంటే - నా మిత్రురాళ్ళు, మిత్రులూ కొంతమంది ఆన్లైన్ లో ఎదురు దెబ్బలు తినడం చూసి, నన్ను సలహాలు అడిగితే చెప్పేవాడిని. నేను వెళ్ళిపోతే ఎలా అంటే - వారి సూచన మేరకు నాకు తెలిసిన విషయాలని (ఈ బ్లాగ్ హెడ్ లైన్ లో చెప్పినట్లు) ఇక్కడ ఒక మాన్యువల్ గా వ్రాస్తున్నాను. ఇంకా నాలుగో ఐదో పోస్ట్స్ ఉన్నాయి. (ఈ చివరి పోస్ట్స్ తప్పక చూడండి. దయచేసి మిస్ అవకండి. అవే మీకు బాగా ఉపయోగపడేవి.) అది అసలు విషయం. అందులోని చివరి పోస్ట్ లో ఈ విషయం వివరముగా చెబుతాను. అందుకే నా అనుభవాలన్నింటినీ గుది గుచ్చి, కష్టపడి మీకు అందించటం.

First updated on : 7-March-2010 Morning

Sunday, April 3, 2011

భారత క్రికెట్ జట్టుకి శుభాకాంక్షలు

ప్రపంచ కప్ గెలిచిన భా క్రికెట్ జట్టుకి శుభాకాంక్షలు..
Related Posts with Thumbnails