Tuesday, January 25, 2011

Social NW Sites - 9 - కమ్యూనిటీలు

కమ్యూనిటీలు - అంటే ప్రత్యేక సమూహాలు. అసలు ఈ సోషల్ సైట్లలో ఉండే బలమైన వాటిల్లో, ఆన్లైన్ కి బాగా రావాలనుకునే అనిపించేసేలా చేసేవాటిల్లో ఇవీ ఒకటి. మన అభిరుచులూ, మనస్తత్వాల ప్రకారం వాటికి తగిన కమ్యూనిటీలలో చేరాలి. అందులో ఉన్న ఫోరమ్స్ లలో, వోటింగ్ లలో పాల్గొంటూ ఉండాలి. నిజానికి ఈ కమ్యూనిటీ లను సభ్యుల మనస్తత్వాలూ, అభిరుచులూ పెంపొందించుకోవటానికి, అభివృద్ధి చేసుకోవటానికీ, ఇతరులకూ సహాయపడటానికి.. ఇలా ఎన్నెన్నో తమ తమ వాంఛలూ, కోరికలూ, ఇష్టాలూ, నెరవేర్చుకోవటానికి బాగా ఉపయోగపడుతాయి.

ఉదాహరణకి : మీకో బైక్ ఉందనుకోండి. ఆ బైక్ గురించి ఏదైనా డౌట్స్ వస్తే - ఆ బైక్ ఫోరం లో చేరి, ఆ బైక్ గురించి మీరు అడిగేది అక్కడ పోస్ట్ చేస్తే, అందులోని సభ్యులు మీకు సలహాలూ, జవాబులూ ఇస్తారు. బైక్ మాడిఫికేషన్, బైక్ పార్ట్స్, బైక్ లో వచ్చిన లేటెస్ట్ అసేస్సరీస్, బైక్ మైంటైన్స్, చిన్న చిన్న ప్రొబ్లెంస్ ఎలా సరిదిద్దుకోవాలో.. అన్నీ పోస్ట్ చేసి మీ మీ సహాయాలను షేర్ చేసుకోవచ్చును.

మ్యూజిక్ లవర్స్ అనుకోండి.. మీరు ఏదైనా మ్యూజిక్ సైట్ లోకి చేరి ఏదైనా పాట కావాలీ అంటే - ఆ కమ్యూనిటీ లోని సభ్యులలో ఎవరో ఒకరు మీకు ఆ పాట మెయిల్ చెయ్యొచ్చు, లేదా లింక్ అయినా పంపగలరు.

మీ ఉన్నత చదువులలో ఏదైనా ఇబ్బంది వస్తే - దానికి సంబంధించిన కమ్యూనిటీ లో చేరి, అక్కడ అడిగితే, అక్కడ ఉన్నవారు ఎవరైనా సహాయం చెయ్యగలరు.

- ఇలా అన్ని అవసరాలకూ కమ్యూనిటీలు ఉన్నాయి. వీటిలో చేరితే - మనం సహాయం పొందొచ్చు, లేదా సహాయం చెయ్యొచ్చు. కాని వాస్తవముగా అన్ని కమ్యూనిటీలు ఇలా లేవు. అందులో చేరే సభ్యుల అలసత్వం, నిర్లక్ష్యం, సహాయ నిరాకరణ, కమ్యూనిటీ పేరు ఒకటి, అందులో చర్చలు జరిగేవి వేరొకటి అన్నట్లుగా ఉంటాయి. ఆయా కమ్యూనిటీ ఒనర్స్ వి చాలా తప్పులు. వారు ఆ కమ్యూనిటీని సాఫీగా సాగటానికి ఎల్లప్పుడూ కృషి చేస్తుండాలి. తనకు వీలు కాకపోతే, తనకి సహాయముగా మాడరేటర్స్ ని పెట్టుకోవాలి. అలా మాడరేటర్స్ ని పెట్టుకునే మందు - ఆ కమ్యూనిటీలో బాగా తరచుగా పోస్టింగ్స్ చేస్తూ, టాలెంట్ ఉండి, కొద్దిగా నాయకత్వ లక్షణాలు ఉన్నవారిని, భాష మీద పట్టు, ఉచితానుచితాలు ఏమిటో తెలుసుకొన్నవారిని ఇలా పెట్టడం మంచిది. వారు ఆ పోస్ట్ కి వాల్యూ ఇవ్వలేరు - అని అనిపించినప్పుడు వారిని తీసేసి వేరేవారిని పెట్టడం మంచిది. నన్నూ ఒక కమ్యూనిటీకి మాడరేటర్ గా పెట్టారు. అంతా నేనై చూసుకున్నాను. ఆ కమ్యూనిటీ చాలా అందముగా, పద్దతిగా ఉంది. ఆ తరవాత నాకూ అందులో మొనాటనీ వచ్చేసి (పార్టిసిపెంట్స్ బాగోలేకపోతే నేనేం చేస్తాను..?) దూరం అయ్యాను.

కమ్యూనిటీలలో చేరేముందు గమనించాల్సిన విషయాలు.:

1. మన అభిరుచుల మేరకు అందులో ప్రవేశం, ఆసక్తి ఉన్న రంగాల్లో ఉన్న కమ్యూనిటీ లలో చేరటం మంచిది.

2. కొన్ని కమ్యూనిటీలలో - న మిత్రుల కోరిక, బలవంతం మేరకు చేరాల్సి ఉంటుంది. అందులో ఇలా చేరి, లౌక్యముగా అలా బయటకు వచ్చెయ్యండి.

3. అన్ని సైట్లలో అన్ని రకాల కమ్యూనిటీలు ఉంటాయి. కాస్త ప్రయత్నిస్తే అన్నీ దొరుకుతాయి. అమ్మాయిలతో మజా కావాలా? భార్యా భర్తలను మార్చుకునే కమ్యూనిటీ, మీరు అబ్బాయా? ఇంకో అబ్బాయి తోడుకావాలా?, ఒకరోజు "ఎంజాయ్" చేయ్యాలనుకుంటున్నాను, నాకు చెన్నైలో ఆంటీ కావాలీ.. ఇలాంటివి (సరిగ్గా ఇవే పేర్లు కాదు - కాస్త మార్చి చెప్పాను. భావం మాత్రం అదే!) కమ్యూనిటీలు చాలా ఉన్నాయి. ఇలా ప్రతీ విషయం మీద కమ్యూనిటీలు ఉన్నాయి. ఇక్కడ మంచీ చెడూ కమ్యూనిటీలు రెండూ ఉన్నాయి. మనం వేటిలో చేరితే - వంటికీ, పరువుకూ మంచిదో వారు వారు తేల్చుకోవాల్సిందే!. చేరాక వెనక్కి రాలేం. అప్పటికే అవతలివారు మీ డిటైల్స్ సేకరించేస్తారు.. బయటపడటం చాలా కష్టమ్.

4. మాడరేటర్, ఓనర్ గా మీ కమ్యూనిటీ ఉంటే ప్రోద్దునా, రాత్రి ఆ కమ్యూనిటీ మీద ఒక లుక్ వెయ్యాల్సిందే! 

5. ఏవైనా గొడవలు వచ్చేలా కామెంట్స్ వ్రాసిన వారికి నచ్చచేప్పగలగాలి. వారు ఏ ఉద్దేశ్యముతో ఆ కామెంట్ వ్రాశారో వారిని అక్కడే - అంటే ఆ పోస్ట్ వ్రాసిన వద్ద సభ్యుల ముందు అడగాలి. అప్పుడు వారు వారి సమాధానం ఇస్తారు. మిగతా సభ్యులు ఏమైనా తరవాత పోస్ట్ లలో తమ తమ ఒపీనియన్స్ చెబుతారు. అప్పుడు ఆ మొదట కామెంట్ చేసిన వారు సారీ చెప్పకుంటే - మొదటితప్పుగా వారం రోజులు వారిని ఆ కమ్యూనిటీ నుండి బ్యాన్ చెయ్యాలి.  అప్పటికీ ఇంకా ఆ గడువులోగా పోస్ట్స్ వేస్తే - ఆ కమ్యూనిటీ నుండి బహిష్కరించాలి. కానీ ఇలా చెయ్యటం అరుదు. వెంటనే పీకేస్తున్నారు. అవతలివారికి ఒక అవకాశం ఇవ్వటమే లేదు. వారి సమాధానంలతో పనే లేదు. వారెంత ఫీలవుతారో కూడా పట్టించుకోవటం లేదు. ఒక కమ్యూనిటీ లో నేను ఇలా తప్పు చేసిన ఒకరిని హెచ్చరించాను - ఇప్పుడు అలాంటి పొరబాట్లు అతడు మళ్ళీ చెయ్యటం లేదు. పొరబాటు చెయ్యని మానవుడేవడూ ఈ లోకంలో లేడు అన్నది బాగా గుర్తు పెట్టుకోవాలి.. ఆ మాటకి వస్తే మనమూ ఎప్పుడో ఒకసారి తప్పు చేసి ఉంటాము. కానీ ఒప్పుకోవటానికి అభిజ్యాతం - ego - అడ్డం వస్తుంది.  

6. మనకు ఆసక్తి ఉన్న కమ్యూనిటీలలో మాత్రమే జాయిన్ అవటం మంచిది. కమ్యూనిటీ పేరు ఒకటి, కమ్యూనిటీ లలో చర్చ వేరేది ఆయితే - వెంటనే బయటకు వచ్చేసేయటం చాలా మంచిది. చాలా సమయం మిగిలి, ఇంకోటిని ఏదైనా ఆన్లైన్ లో నేర్చుకోవచ్చును. నేను ఇప్పుడు అలాగే చేస్తున్నాను కూడా.

7. కమ్యూనిటీలవల్ల నిజానికి చాలా అభివృద్ధి చెందొచ్చు, కానీ చాలా కమ్యూనిటీలు అసలు ఎందుకు ఏర్పడిందో మరచి హస్క్ వెయ్యటమే ఎక్కువగా మారిపోతున్నాయి.

8. హాస్చర్యకరమైన విషయం ఏమిటంటే - నిజాయితీ, నిజమైన సహాయపడే కమ్యూనిటీలలో సభ్యులు తక్కువ. ఊబుసుపోక కబుర్లు చెప్పే కమ్యూనిటీలలో సభ్యులు ఎక్కువ. సైనికులకు, ముంబై మారణకాండలో చనిపోయిన వీరులకు శ్రద్ధాంజలి చెప్పే కమ్యూనిటీలలో ఎవరూ చేరటానికి ఇష్టపడరు. అలాంటివాటిల్లో చేరితే చాలు. మనం వారికి శ్రద్ధాంజలి ఘటించినట్లు అవుతుందని ఎవరూ అనుకోరు. పైగా అందులో ఎలాంటి ప్రక్కదారి పట్టించే ఫోరమ్స్ ఏమీ ఉండవు.ఇలాంటి వాటిల్లో ఎవరూ చేరరు. వేరేవాటిల్లో - అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు.. చాలానే ఉన్నాయి. అలాంటివాటిల్లో కమ్యూనిటీ పేరు ఒకటి, అందులో ఉండే ఫోరమ్స్ వేరు.. వాటికే మెంబర్షిప్ ఎక్కువ. ఇదో విచిత్రం.

updated on :
1st - 25-Jan-2011
2nd - 26-Jan-2011 Evening.

Monday, January 24, 2011

Social NW Sites - 8 - మన ప్రొఫైల్ వ్రాసేముందు

మొత్తానికి మీరు ఒక ప్రొఫైల్ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు అభినందనలు. మీరు మీకంటూ ఒక ప్రొఫైల్ తయారు చేసుకోవాలి. మీ ప్రొఫైల్ ని ఆహ్లాదకరముగా, హుందాగా ఉంది అది మీ గురించి, మీ నైజం, మీరు ఎలాంటివారితో స్నేహం చెయ్యాలని అనుకుంటున్నారో,  అది మీ ప్రొఫైల్ తెలియచేస్తూ ఉండాలి. ఏదో కొద్ది కొద్దిగా డాటా వ్రాసి, మీరు చాలా తొందర తొందరగా స్నేహితులని ఆడ్ చేసుకోవాలని, వెంటవెంటనే ఆడ్ రిక్వెస్ట్ లు పంపుతూ ఉంటుంటారు. అలా పంపిస్తే - చాలామంది వెంటనే ఒప్పేసుకుంటారు. ఈవెన్ - ఆడవారు కూడా.. ఈ క్రింది ఫోటో చూడండి. నాకు అనుకోకుండా కనిపించింది. ఒకతను ప్రొఫైల్ పెట్టుకున్నాడు. అతను నాకు మిత్రుడూ కాదూ, శత్రువు అంతకన్నా కాదు. కాబట్టి అతని పేజీ అంతా ఎడిట్ చేసి మరీ పెట్టాను. చూడండి. అతని ప్రొఫైల్ చూస్తే - అతని పేరు, English (US), India అని మాత్రమే ఉంది. చూశారా!.. ఇంకా యే వివరమూ లేదు. ఆ మాత్రం దానికే ఆ ముగ్గురు అమ్మాయిలూ ఆడ్ అయ్యారు. చూశారా? అబ్బాయిలే కాదు - అమ్మాయిలూ అసలు చూసే ఆడ్ చేసుకుంటారా? కళ్ళు మూసుకొని ఆడ్ చేసుకుంటారా? అని అనిపిస్తుంది నాకు. వారి ముఖాలు నేనే కనపడనీయకుండా చేశాను. వారి ప్రొఫైల్ ఫోటోలలో ఒకరిది సినీనటి ఫోటో, మిగతా ఇద్దరిదీ వారి వారి స్వంత ఫొటోస్.. ఇదంతా ఎందుకు చెబుతున్నానూ అనేది ఇంకోదాంట్లో చెప్పుకుందాం. ఇక్కడ - ముందు చెప్పుకున్నట్లు - మనదాంట్లో ఏమీ లేకున్నా కొంతమంది జనాలు ఇలాగే ఒప్పేసుకుంటారు అని చెప్పటానికే!. అంతే!. (ఫోటో మీద డబల్ క్లిక్ చేసి చూడండి)


కానీ చాలామందికి తెలీదు. కొంతమంది మాత్రం - కొద్దిమంది ఫ్రెండ్స్ ఉన్నాసరే, మంచి ప్రోఫైల్స్ ఉన్నవారు కావాలని అనుకుంటారు. ఈ మధ్య ఈ ధోరిణి మొదలయ్యింది. మనకు 500 + స్నేహితులున్నా రోజుకి 20-30 మందికన్నా మనకి ఆన్లైన్ లోకి రారు. మొదట్లో ఇలాంటి యే వివరాలూ లేని ప్రోఫైల్స్ తెలీక, ఒప్పుకొని దెబ్బతిన్న వారు ఇలాంటివి పట్టించుకోవటం లేదు. ఇది అనుభవం అయినవారు - ఇప్పుడు సేలేక్టివ్ గా ఆడ్ రిక్వెస్ట్ లని ఒప్పుకుంటున్నారు. ఇలాంటివారి వద్ద ఇలాంటి ప్రోఫైల్స్ రిజెక్ట్ అవుతుంటాయి. రిజెక్ట్ అయ్యాయి అని ఇంకోసారి పెడితే - బ్లాక్ లిస్టులో పెట్టేస్తున్నారు. అది మీకే దెబ్బ (ఇది ఎలానో ఆ తరవాత చెబుతాను. విషయం లోకి వద్దాం). ఇలా కావద్దు అనుకునేవారు ఈ క్రింది పద్ధతులు పాటించండి.

1. ప్రొఫైల్ పెట్టాక వెంటనే మీ ఫ్రెండ్స్ గా చేర్చుకోవటానికి ఉబలాట పడకండి. కాస్త ఆగండి.

2. ముందుగా మీ డీపీ (ప్రొఫైల్ ఫోటో) పెట్టుకోండి. అలాగే మీ పేరూ కూడా.

3. ఒక్క - అడ్రెస్స్, ఫోన్ నంబర్స్ లైను తప్ప మిగతా అన్నీ పూరించండి. అవన్నీ జనరల్ విషయాలు ఉంటాయి.

4. ఆ జనరల్ విషయాలు బయట తెలిసినా ఏమీ ఇబ్బందులు ఉండవు. యే సైటూ తమ సభ్యులు ఇబ్బంది పడొద్దనే చూస్తాయి.

5. పైన టూల్ బార్ లో ఉండే సర్చ్ ఆప్షన్ లో ఏదైనా పేరు టైప్ చేసి, ఎవరిదైనా ప్రొఫైల్ ఓపెన్ చెయ్యండి.

6. అలా వారి ప్రొఫైల్ లోని డాటా చూడండి. వారు ఎలా వ్రాశారో బాగా గమనించండి.

7. వారి మిత్రుల నుండి మరో మిత్రుల ప్రొఫైల్ లోనికి వెళ్లి వారిదీ చూడండి.

8. ఇలా కొద్దిరోజులు ఒక్కొక్కరి ప్రోఫైల్స్ చూస్తూ ఉంటే, మీ ప్రొఫైల్ ఎలా వ్రాసుకోవాలో మీకే తెలుస్తుంది.

9. ఇలా ఒక యాభై, వంద ప్రోఫైల్స్ చూస్తే మీకే అంతా అర్థం అవుతుంది.

10. దాని ప్రకారం మీ ప్రొఫైల్ ఎలా ఉండాలో మీకూ తెలుస్తుంది. అలా మీ ప్రొఫైల్ ని తీర్చిదిద్దండి.

11. అలా కనీసం 50-60% డాటా మన ప్రొఫైల్ లో ఉన్నాక అప్పుడు ఆడ్ రిక్వెస్ట్ లు పెట్టడం మొదలుపెట్టండి.

12. అప్పుడు అవతలివారు తేలికగా మీ ఆడ్ రిక్వెస్ట్ ఒప్పుకుంటారు.*

13. ఇప్పుడు మీ ప్రొఫైల్ చూడటానికి, చదవటానికీ బాగుంటుంది.

14. మీకు వీలున్నప్పుడల్లా - మీ ప్రొఫైల్ ని మరింత అందముగా తీర్చిదిద్దుకోండి.

15 . మీ ప్రొఫైల్ మీగురించి తెలియచేసేదిలా ఉండాలి గానీ, దేవుళ్లనో, సినీ తారల హైలెట్ చేస్తూ ఉండవద్దు. మనం మనల్ని ప్రొజెక్ట్ చేసుకోవటానికి ఇక్కడికి వస్తున్నాము. అంతే కానీ వారికి మనం ఏజెంట్స్ లా ఉండటం లేదు కదా. ఇక్కడ మీ అబౌట్ మీ లో - మీ గురించి తెలియచేసేలా ఉండాలి. మీరు ఎదుటివారికి ఏమి చెప్పాలనుకుంటున్నారో, వారినుండి ఏమి ఆశిస్తున్నారో అదే వ్రాయాలి. - అందరికన్నా మీ అబౌట్ మీ - కాస్త ప్రత్యేకముగా, ఆహ్లాదకరముగా ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. ఆ అబౌట్ మీ గురించి, మీరంటే ఏమిటో తెలియచేయగలగాలి. అలా ఉంటే నలుగురిలో కాస్త ప్రత్యేకముగా కనిపిస్తారు.  

16 . ఇప్పుడు మీరు కమ్యూనిటీలు కూడా ఆడ్ చేసుకోండి. మీ మీ అభిరుచుల మేరకు, వాటికి ఉద్దేశ్యించిన కమ్యూనిటీలలో చేరండి. (అవి ఎలాగో - తరవాతి టపా చూడండి)

17. మీరు మీ ప్రొఫైల్ ఎలా చేసుకోవాలో వేరేవారి ప్రోఫైల్స్ చూస్తుంటారు కదా. ఇప్పుడు మీరు ప్రొఫైల్ పేరు వారి వారి హొం పేజిలో - రీసెంట్ విజిటర్స్ లో కనిపిస్తుంది. అక్కడ మీ ప్రొఫైల్ పేరు లింక్ లాగా ఉంటుంది. అక్కడ వారు ఆ లింక్ నొక్కితే - మీ పేజి ఓపెన్ అవుతుంది. అలా మీకు ఆడ్ రిక్వెస్ట్ లు వస్తుంటాయి. వాటిని ఎలా గమనించి అంగీకరించాలో వేరే టపాలో చెబుతాను.

18. ఇలా చేశాక మీరు ఆడ్ రిక్వెస్ట్ లు పంపడం కాదు. మీకే ఎదురు రిక్వెస్ట్ లు వస్తాయి. - ఇది నిజం.
__________________________________
* = వెంటనే ఒప్పుకోవటం కాదు.. ఇంకా కొన్ని చూస్తారు / చూడాలి. అవేమిటో వేరే దాంట్లో చెబుతాను. ఇలా అన్నీ వేరే వేరే దాంట్లో చెప్పాల్సి వస్తుందంటే - ఇవన్నీ ఒకదాని మీద ఒకటి - Inter dependebility - ఆధారపడి ఉన్నాయి. శీర్షిక ప్రకారం అదే విషయం చెప్పాల్సిరావటం వల్ల వేరువేరుగా చెప్పాల్సివస్తున్నది. గమనించగలరు.
updated on :
1st - 24-Jan-2011 Noon.
2nd - 25-Jan-2011 Morning.
3rd - 2-february-2011 Morning.

Sunday, January 23, 2011

Social NW Sites - 7 - మన ప్రొఫైల్ ప్రారంభించే ముందు..

ఇప్పుడు మనం నచ్చిన ఒక సోషల్ నెట్వర్కింగ్ సైటులో చేరతాము. ఆ సైటు అడ్రెస్ లోకి వెళ్లి, క్రొత్త ఎకౌంటు ప్రారంభించేందుకు కావలసిన ఒక అప్లికేషన్ ఫారం కనిపిస్తుంది. మీరు దాన్ని నింపండి. వారి వారి మెయిల్ ఐడీ, స్త్రీలా, పురుషులా, ఏ దేశమూ.. ఇలా కొన్ని ప్రశ్నలు ఉంటాయి. వాటిని పూరించండి.

ఇప్పుడు మీరు ఒక సెక్యూరిటీ ప్రశ్నలని ఎదురుక్కుంటారు. మీ అకౌంట్ కి అది రక్షణ గా ఉంటుంది. మీ మోటార్ వెహికిల్ పేరు, మీ చిన్నప్పటి స్కూల్ టీచర్ పేరు... ఇలా ఉంటుంది. ఇందులో సమాధానం నింపిన సమాధానాన్ని మీకు మాత్రమే తెలిసి ఉండాలి. ఆ విషయాన్ని చాట్లో కానీ, మీ మెయిల్ బాక్స్ లో గానీ, స్క్రాప్స్ లలో దాచుకోవద్దు. అలా చేస్తే మీరే ప్రమాదం లో పడతారు. ఆ అకౌంట్ ఇక మీ చేతిలోనుండి జారిపోయినట్లే!.

ఇలా ఇది ఎందుకు ఉంటుంది అంటే - రేపు మీ అక్కౌంట్ హాక్ అయినా, మీ పాస్ వర్డ్ ఎవరైనా తెలుసుకొని, మీ అక్కౌంట్ మైంటైన్ చేస్తున్నా, పాస్ వర్డ్ మార్చి మీ అక్కౌంట్ మైంటైన్ చేస్తున్నా - అప్పుడు ఇది చాలా ఉపయోగం, కీలకం కూడా. ఇది ఎలా అంటే - మీ అక్కౌంట్ ని పాస్ వర్డ్ మార్చి, వేరేవారు వాడుతున్నారు అనుకోండి. అప్పుడు మీరు ఆ సైటు వారికి పాస్వర్డ్ మరిచాను అని చెప్పి, లాగౌట్ అవ్వాలి. కాసేపటి తరవాత ఆ సైటులోకి లాగిన్ అయినప్పుడు - మీకు ఈ ప్రశ్న అడుగుతుంది. మీరు అప్పుడు పోస్ట్ చేసిన సమాధానం పోస్ట్ చెయ్యాలి. అప్పుడు ఆ సైటు ఓపెన్ అవుతుంది. వెంటనే పాస్వర్డ్ మార్చుకొని - ఇక నుండీ జాగ్రత్తగా ఉండండి. ఇది ఒక్కటి ఇతరులకి చెప్పారో - ఇక మీ అక్కౌంట్ ఇతరుల చేతికి చిక్కినట్లే.. మీరు చిక్కుల్లో పడ్డట్లే!.. అలా ఎలానో ఇప్పుడు ఒక ఉదాహరణ చెబుతాను.. ఇది నిజమైన సంఘటన.

ఆంధ్రప్రదేశ్ లో ఉండే నా సోషల్ సైట్ మిత్రురాలు తన పేరు మీద అక్కౌంట్ ఓపెన్ చేసింది. తను కొద్దిమంది స్నేహితులని మైంటైన్ చేసింది. అప్పటికి నేను తనకి ఆడ్ కాలేదు. తనకి వచ్చే టెక్నికల్ ఇబ్బందులని - ఒక అబ్బాయిని అడిగేది. ఆ అబ్బాయి చాలా సాఫ్ట్ గా, హుందాగా, మిస్టర్ కూల్ గా ఉండేవాడు. అతన్ని నమ్మి - అమాయకురాలైన ఈమె తన అక్కౌంట్ వివరాలూ చెప్పేసింది. ఆఖరికి ఈ సెక్యూరిటీ సెట్టింగ్స్ తాలూకు ప్రశ్నకి సమాధానం కూడా.  ఇంకేం.. ఒక శుభ ముహూర్తాన ఆ అక్కౌంట్ ఆ ఆవిడ గారి చేతినుండి మారిపోయింది. ఆ అక్కౌంట్ యొక్క పాస్వర్డ్, సెక్యూరిటీ పాస్వర్డ్.. అన్నీ మారిపోయాయి. ఆమే ఎంత ప్రయత్నించినా ఆ అక్కౌంట్ తిరిగిపొందలేకపోయింది. ఇప్పుడు ఆవిడ ఇంకో అక్కౌంట్ ఓపెన్ చేసుకుంది. మొదటి అక్కౌంట్ ఇంకా నడుస్తూనే ఉంది కూడా.. ఇప్పుడు ఆవిడ ఓపన్ చేసిన రెండో అక్కౌంట్ యే ఫేక్ అక్కౌంట్ అని నేనే చాలా రోజులుగా నమ్మాను. అసలు విషయం తెలిశాక ఇదాసంగతి అని అప్పుడు హాస్చార్యపడిపోయాను.

ఆ అక్కౌంట్ లో తన ఫ్యామిలీ ఫొటోస్, తాను ఇష్టపడి దిగిన ఫొటోస్, భర్తాపిల్లల ఫొటోస్.. ఇలా ఉన్నాయి. ఆ ప్రొఫైల్ కి వచ్చి చూసేవారికి ఇవన్నీ నిజమే అనుకోని, అది ఒరిజినల్ ప్రొఫైల్ అనుకొని - ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. తనకేమో ఆ అక్కౌంట్ ని చూసినప్పుడల్లా మానసిక క్లేశం ఎలా ఉంటుందో ఇక మీరే ఊహించుకోవచ్చు.. అందుకే మీరు ఈ విషయములో కాస్త జాగ్రత్తగా ఉండండి.. లేకుంటే మీకు మీరే ఇబ్బంది పెట్టుకోగలరు. ఆ తరవాత ఏం చేసినా - అన్నీ వేస్ట్. ఆ సైటు వాడు కూడా "అసలు పాస్వర్డ్ వారికెందుకు ఇచ్చారు, అతనే ఒరిజినల్ ఏమో!. మీరు మీరు కోర్టుకి వెళ్ళండి, మాకేం సంబంధం లేదు - అన్నట్లుగా ఉంటాయి ఆ సైట్లు. ముక్కూ, మొహం తెలీని ఆ హ్యాకర్ ని ఎక్కడని పట్టుకొని కోర్టుకు లాగుతాం.. అందుకే ముందే జాగ్రత్తగా ఉండండి. ఆ తరవాత తీరికగా బాధపడటం అవసరమా..?
updated on 23-Jan-2011 Evening.

Friday, January 21, 2011

Social NW Sites - 6 - మనం సైట్లలో ఒకదాన్ని ఎలా ఎంచుకోవాలి?

అంతర్జాలములో ఉన్న ఎన్నో పుంఖాను పుంఖాల సోషల్ నెట్వర్క్ సైట్స్ లలో మీకు నచ్చిన యే సైట్లలో అయినా మీరు జాయిన్ అవచ్చు. అంతా ఫ్రీగానే సభ్యులై పోవచ్చును కదా.. కనుక మీ మిత్రులూ, బంధువులూ ఎక్కువగా దేనిలో ఉన్నారో అందులోనే చేరండి. ఎందుకంటే - ముందు ముందు వారితో ఏదైనా షేర్ చేసుకునేటప్పుడు ఒకే సైట్లో మిత్రులనీ, బంధువుల్నీ ఏకకాలములో కలవవచ్చును. అలా చెయ్యటం వల్ల చాలా సమయం కలసివస్తుంది. నాకు ఇది అనుభవపూర్వకముగా అర్థం అయ్యింది. స్క్రాప్స్ + ఫొటోస్ షేరింగ్ కి ఇలా చెయ్యటం బాగా అనుకూలము.

మరో విషయం ఏమిటంటే - ఇంట్లో, బంధువుల వారివి గాని ఏవైనా చిన్న, పెద్ద ఫంక్షన్స్ ఉంటే - వాటి తాలూకు ఫొటోస్ అందరికీ షేరింగ్ లో పెట్టి చూపించవచ్చు. ఇలా వారికీ, మీకూ - సమయం, అనుకూలత ఉంటుంది.

*************************************************
ఇక్కడ మీకో సూచన చేయ్యబోతున్నాను. యే సైటులో చేరిననూ - ఆ సైటు మీ పర్సనల్ విషయాలను కాపాడాలి. మళ్ళీ అందరిలో ఉన్నట్లు ఉండాలి. మీ వీడియోలను గానీ, మీ ఫొటోస్ లని గానీ, మీ పర్సనల్ స్క్రాప్స్ - ఈ మూడూ ఇతరుల కంట పడకుండా - అంటే - మీ మెయిల్ ఐడీ, పాస్వర్డ్ లతో చూస్తేనే కనిపించే - యే సైట్ అయినా ఓకే. బంధువులకి, మిత్రులకి ఫొటోస్ షేరింగ్ లో పెట్టినా అది వారికే కనిపించేలా, ఎప్పడు పడితే అప్పడు మార్చుకోగలిగే షేరింగ్ సెట్టింగ్స్ ఉండే సైటు మంచిది అని నా అభిప్రాయం.  ఇది మీరు చేరబోయే / చేరిన  సోషల్ నెట్వర్కింగ్ సైట్ కి ఉండాల్సిన ప్రాథమిక / అసలైన సైటు లక్షణం. ఇది లేని దాంట్లో మీరు అతి మామూలుగా, గుంభనంగా ఉండండి.
*************************************************
నా సలహా :
మీరు యే సోషల్ సైటులోకి వెళ్లి సభ్యత్వం పొందినా, గమనించాల్సిన విషయం ఏమిటంటే - మీ పర్సనల్ సీక్రెట్స్ అందులో పెట్టినా, ఇతరుల కంట కనపడకుండా ఉండేలా సెట్టింగ్స్ ఎప్పటికప్పుడు మార్చుకునేలా సెట్టింగ్స్ ఉండే సైటు చాలా బెస్ట్. అలాంటివాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. మీ మిత్రులనీ, మీ ఇతర బంధువుల్నీ అడిగి మరీ చూసి అందులోకి సభ్యత్వం పొందండి.

నేను ఐదు సైట్లలో చేరాను అన్నానుగా. వాటిలో అదే ఇబ్బందిగా ఉండెను. చాలారోజులవరకూ ఇబ్బంది పడ్డాను. నేను వీటిలో చేరిన మొదట్లోనే ఇది గమనించి దూరం అయ్యాను. ఇప్పుడు మార్చారో లేదో తెలీదు. ఇప్పుడు ఒక సైటులో ఇలాంటి సెట్టింగ్స్ ఉండి (మిగతావాటిలో అంతగా అనిపించలేదు అని కాదు) అందులోనే ఉండిపోతున్నాను. వేరేవాటిల్లో అలా ఉన్నాయో లేవో నాకు తెలీదు. ఎందుకంటే - ముందే చెప్పానుగా.. అన్నీ వదిలేసి ఒక సైటులోనే ఉండిపోతున్నాను అనీ!. ఇప్పుడు ఆ సైట్లో ప్రవైట్ గా స్క్రాప్స్ వ్రాసుకుంటున్నాను. అలాగే ఫొటోస్, వీడియో లకీ తాళం పెట్టుకుంటున్నాను.. షేరింగ్ చేసుకుంటున్నాను. ఇలాంటి అవకాశం ఉన్న సైట్లో చేరి మీ సమయాన్ని, మీ ప్రైవసీని కాపాడుకోండి.

Social NW Sites - 5 - మనం ఎన్నింట్లో చేరాలి?

సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఎన్ని ఉన్నాయో మీకు చెప్పానుగా.. చాలా సైట్లు ఉన్నాయిగా - అందులో వేటిలో చేరాలి అనేదీ మీరు ఈపాటికే నిర్ణయించుకొని ఉండొచ్చు.. చేరి ఉండొచ్చు కూడా.. ఓకే.. మీకు అభినందనలు.

మీరు మీ ఓపిక, మీ వీలు సమయం దృష్టిలో పెట్టుకొని మీకు ఎన్నింట్లో చేరాలీ అనుకుంటే - అన్నింట్లో చేరొచ్చు. అన్ని సైట్లూ ఫ్రీగానే రిజిస్ట్రేషన్ చేసుకుంటాయి. జస్ట్ నాలుగైదు వివరాలు నింపి, ఓకే చేస్తే - సెకన్లలో ఇక మనకంటూ ఒక ప్రొఫైల్ ఏర్పడుతుంది. ఇక ఆ ప్రొఫైల్ ని మన వివరాలతో నింపి, సేవ్ చేసుకుంటే - అదే అందరికీ కనిపిస్తుంది. ఎన్నింట్లో చేరాలి అన్నది మీ ఇష్టం. మీకు ఏమీ పనీ లేకుంటే, తాత ముత్తాతలు సంపాదించిన ఆస్థులు బాగా దండిగా ఉంటే - అంటే యే పని చెయ్యాల్సిన అవసరం లేకుంటే మీరు అన్ని సైట్లలోనూ జాయిన్ అవచ్చును. ముందే చెప్పాను. ఇది అందమైన ఊబి. ఖాళీ సమయం అంటూ ఉండి, ఆసక్తి ఉంటే రావటం బెస్ట్. లేకపోతే ఇందులోకి రావటం మీరు రావటం వృధా.

మీకు స్వంత సిస్టం లేకుంటే కాస్త ఇబ్బందే!.. బయట నెట్ సెంటర్ నుండి ఓపెన్ చేస్తూ ఉంటే మాత్రం మీకు నెగటివ్ గా మారుతుంది. ఎలా అంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్  స్క్రాప్స్ వ్రాస్తే - వాటికి రిప్లై ఇవ్వకపోతే మిమ్మల్ని చెడుగా అనుకునే ప్రమాదం ఉంది. ఒకవేళ ఇలా మీ పరిస్థితి ఉంటే - మొబైల్ నుండి GPRS ఎనేబుల్ చేసుకొని, సమాధానాలు ఇవ్వటం బెస్ట్.

నా వివరణ :
మీరు ఎన్నింట్లో జాయిన్ అవ్వాలి అనేదానికి ఏవైనా రెండు సైట్లు సరిపోతాయి అనేది నా అనుభవం. నాకు ఐదింటిలో ప్రవేశం ఉంది. ఇప్పుడు ఒక దాంట్లో తప్పించి, అవన్నింటిలో చాలా తగ్గించేశాను. ఆ ఒక్కటీ చాలు అనుకున్నాను.. అలాగే డిసైడ్ అయ్యాను. ఆ ఒక్కటే అన్నీ అనుకొని దానిలోనే స్నేహితులని వెదుక్కుంటున్నాను. అందులోని వారితోనే మాట్లాడుతున్నాను. రోజూ వేరే సైట్లలో చేరమని కనీసం రెండు మెయిల్స్ అయినా వస్తున్నాయి. వాటన్నింటినీ వెంటనే రిజెక్ట్ చేస్తున్నాను. చెప్పాగా - నాకు ఒక్కటి చాలు. అందులో నాకు సరియైన మిత్రులు దొరకకుంటే - నాలోనే లోపం అని నాకు తెలుసు. ఇక్కడే స్నేహితులని వెదుక్కోలేని వాడిని - ఇంకా వేరే సైట్లలో ఎలా వెదుక్కోగలను. అందుకే ఇలా ఒక్కదానిలోనే ఆగిపోయాను. ఆ వేరేవీ కనీసం లాగిన్ అవటం కూడా లేదు. వాటి సంగతే ఇక మరిచాను. నాకంటూ ఒక యాభై మంది దొరికితే చాలు అనుకున్నాను. దొరికారు. ఇక చాలు. వారితో నేను సంతోషముగా ఉంటున్నాను. కాబట్టి ఎక్కువ సైట్లలో లాగిన్ అవద్దని అనుకుంటున్నాను. ఒకవేళ చేరితే దానికి న్యాయం చెయ్యలేక, ఉన్న మిత్రులని మంచి చేసుకోలేక - నేనే ఇబ్బంది పడాలి. నాకు అంత అవసరమా..? నిక్కమైన నీలం ఒక్కటి ఉన్న చాలు అన్నది ఎలానో - నాకున్న కొద్దిమంది మిత్రులు చాలు. "గంగిగోవు పాలు గరిటడైనను చాలు, కడవనైనా నేమి ఖరము పాలు.." అని వేమన సత్యం ఇక్కడ ఖచ్చితముగా వర్తిస్తుంది. ఇక ఇది నా అంతట నేనుగా తీసుకున్న నిర్ణయం. అలా ఒక్కదాంట్లోనే ఉంటూ నా మిగతా పనులు చేసుకుంటూ ఉన్నాను. మీరు మాత్రం మిమ్మల్ని మీరు పరిశీలించి నిర్ణయం తీసుకోండి.
updated on 21-Jan-2011 evening.

Tuesday, January 18, 2011

Social NW Sites - 4 - షోషల్ నెట్వర్క్ సైట్స్ అడ్రెస్.

పై మూడు పోస్ట్ లు చదివాక మీకూ ఈ ఆన్లైన్ స్నేహాలు అంటే - ఏమిటో అనేది తెలుసుకోవాలనిపించింది జ్కడూ. వాటిల్లో మీరూ సభ్యులైపోయి వెంటనే - స్నేహాలు మొదలెట్టాలని ఉంది కదూ.. గుడ్. ఇక ప్రారంభించేద్దాం!.. ఒకవేళ మీరు ఆల్రేడి మెంబర్ ఆయితే - ఇక టాపిక్ లోకి నేరుగా వచ్చేద్దాం.

ఇక ముందుగా ఈ ప్రపంచములోని ప్రఖ్యాత సోషల్ నెట్వర్కింగ్ సైట్లని చూద్దాం. అవి ఈ జనవరి 3, 2011 న వాటి స్థానాలూ చూడండి. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి. అవన్నీ వ్రాస్తూ పోతుంటే - నాకు సమయం సరిపోదు. కొన్ని మాత్రమే ఇక్కడ పరిచయం చేస్తున్నాను.

Facebook - ఫేస్ బుక్ - ప్రపంచములో దీనిదే మొదటి స్థానం. http://www.facebook.com/

myspace.com - మై స్పేస్ డాట్ కామ్ - ప్రపంచములో రెండో స్థానం దీనిది. http://www.myspace.com/
 
twitter - ట్విట్టర్ - ప్రపంచములో మూడో స్థానం దీనిది. http://twitter.com/

linkedin - లింక్డ్ఇన్ - ప్రపంచములో నాలుగో స్థానం దీనిది. http://www.linkedin.com/

Ning - నిన్జ్ - ప్రపంచములో ఐదవ స్థానం దీనిది. http://www.ning.com/

TAGGED - టాగ్డ్ - ప్రపంచములో ఆరవ స్థానం. http://www.tagged.com/

classmates.com - క్లాస్ మేట్స్ - ప్రపంచములో ఏడవ స్థానం. http://www.classmates.com/

hi5 - హాయ్ ఫైవ్ - ప్రపంచములో ఎనిమిదవ స్థానం. http://www.hi5.com/

myyearbook - మై యియర్ బుక్ - తొమ్మిదో స్థానం. http://www.myyearbook.com/

meetup - మీట్ అప్ - ప్రపంచములో పదవ స్థానం http://www.meetup.com/

bebo - బెబో - ప్రపంచములో పదకొండవ స్థానం. http://www.bebo.com/

mylife - మై లైఫ్ - ప్రపంచములో పన్నెండవ స్థానం. http://www.mylife.com/

friendster - ఫ్రెండ్ స్టర్ - ప్రపంచములో పదమూడవ స్థానం. http://www.friendster.com/

my heritage - మై హెరిటేజ్ - ప్రపంచములో పద్నాల్గవ స్థానం. http://www.myheritage.com/

multiply - మల్టీ ప్లై - ప్రపంచములో పదిహేనవ స్థానం. http://multiply.com/

Orkut - ఆర్కుట్ - ప్రపంచములో పదహారవ స్థానం. http://www.orkut.com/

నాకు తెలిసీ ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు చాలానే ఉన్నాయి. క్రొత్తగా కూడా చాలానే వస్తున్నాయి. ఇన్నింటిలో / అన్నింటిలో చేరి మీ అమూల్య సమయం వృధా చేసుకొనే బదులు, ఏవైనా ఒకటి రెండింటిలో చేరితే మంచిదని నా అభిప్రాయం. నాకైతే ఐదింటిలో సభ్యత్వం ఉంది. కానీ అవన్నీ వదిలేశాను. వాటి పాస్ వర్డ్స్ కూడా మరిచిపోయాను. ఇప్పుడు ఆయితే ఒకటే మైంటైన్ చేస్తున్నాను. ఆ ఒక్కటే ఎందుకో తరవాత ఎపిసోడ్ లో చెబుతాను. 

Monday, January 17, 2011

Social NW Sites - 3 - e-స్నేహాలు ఎందుకు చేయాలి అంటే?

ఈ ప్రపంచములో స్నేహం చెయ్యని వాడంటూ ఎవడూ లేడు. ఎప్పుడో ఒకప్పుడు స్నేహితులతో మాట్లాడటం తప్పనిసరి. చిన్నప్పుడు కలసి తిరిగిన స్నేహితులు పెద్దయ్యాక కూడా కలసి తిరగటం చాలా తక్కువ ఈ రోజుల్లో. విధ్యాభ్యాస కాలములో ఏర్పడే స్నేహాలు - ఆ విద్యాభ్యాసాల సమయములోనే ముగిసిపోతున్నాయి. నా దృష్టిలో ఇవే నిజమైన స్నేహాలు. ఆ తరవాత క్రొత్త క్రొత్త పరిచయాలతో, స్నేహాలు ఏర్పడుతూ ఉంటాయి. అవన్నింటిలో అవసరార్థ స్నేహాలు ఎక్కువగా ఉంటాయి. "పని" అయ్యాక కనిపించని స్నేహాలే ఎక్కువ. జీవనం సాగించుటకో, లేదా మనలోని స్నేహ వెలతిని దూరం చేసుకోవటానికో ఈ ఆన్లైన్ స్నేహాలు తప్పనిసరి అవుతున్నాయి. మామూలుగా స్నేహితులని ఎప్పుడు అంటే కలవటం అంటే కాస్త ఇబ్బందే!.. వ్యాపార పరముగా గానీ, ఉద్యోగ రీత్యా గానీ ఉండే బీజీ వల్ల కలవలేకపోతాము. ఈ ఆన్లైన్ స్నేహాల వల్ల వెనువెంటనే కలవవచ్చును.

అలా మనకి మంచి స్నేహాల కోసం ఆన్ లైన్ స్నేహాలు చెయ్యటములో తప్పులేదు.. నిజజీవితములో పరిచయం అయ్యేవారు అందరూ మంచివారే ఉంటారని ఎలా అనుకుంటాము. అందులో కూడా మోసపోతున్నామే! ఇదీ అలాగే.. కురిసే ప్రతి వర్షం బిందువు స్వాతి ముత్యం ఎలా కాదో, కనపడే ప్రతి రాయీ విగ్రహం ఎలా కాదో.. పారే ప్రతి సెలయేరు నది కాలేదో, ఇదీ అలాగే. ఒకమంచివ్యక్తిని కలిసేముందు పదిమంది (అంతకన్నా ఎక్కువే) పనికిరాని వాళ్ళని కలవాల్సివస్తుంది. మనిషి ఆశాజీవి. ఎప్పుడూ ఆ ఆశతోనే బ్రతకాలి. తప్పదు. లేకుంటే జీవితం నిస్సారం అయిపోతుంది. మన ఆలోచనలకి తగినవాళ్ళని ఎంచుకుంటే మరీ బాగుంటుంది. అలాని వారికోసమే ఎదురుచూస్తూ కూర్చూ ఉంటే ఇక మనకు స్నేహితులు దొరికినట్లే!.. అందుకే కనీసం మన అంచనాలకి సగమైనా కలిసేవారిని ఫ్రెండ్స్ గా చేసుకుంటే మరీ మంచిది. ఈ విషయం గురించి విపులముగా తరవాత మాట్లాడుకుందాం..

కానీ ఇక్కడ ఒక భయంకర నిజం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి వారి వద్ద నుండీ ఏదో ఒకటి నేర్చుకోలేకుండా ఉండలేము.. ఈరోజు మంచివారు అనుకున్నవారు రేపు మోసగాల్లై కావచ్చును. ఈరోజు బేకార్ అన్నవారు రేపు మనకే మంచీ చేయవచ్చు. ముందే చెప్పాగా - మనకు నచ్చే స్నేహితుడి కోసం బాగా ఎదురుచూడాల్సి వస్తుంది. చెప్పాగా మనిషి ఆశాజీవి అనీ. హిందీలో ఒక సామెత ఉంది. అదిప్పుడు చెబుతాను .."సోనా ఘస్కే దేఖ్ నా, దోస్తాన్ కర్కె దేఖ్ నా.." అనేది. అంటే - బంగారాన్ని రాయి మీద గీటు పెడితే తెలుస్తుంది. స్నేహాన్ని మాత్రం చేస్తేనే తెలుస్తుంది అని. నిజమే కదూ.. స్నేహం చేస్తేనే ఎదుటివారి గురించి తెలుస్తుంది. కానీ అలా అందరి గురించీ తెలుసుకుంటూ వెళితే మన సమయం కాస్తా హరించుకపోతుంది.

ఇలా అన్నింటి కన్నా విలువైన సమయం వృధా కావద్దనే - అలాగే కొన్ని పనికిమాలిన ప్రొఫైల్స్ ఆడ్ చేసుకుంటూ మన విలువైన సమయం వృధా చేసుకోవటం ఎందుకూ - ఇలా చేస్తే మీకు అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఎలా చూసుకోవాలో తెలియచేస్తాను. ఇవన్నీ నేను గమనించినవే! అనుభవించినవే!!.. నాలా మీరు ఇలా ప్రతి విషయాన్ని అనుభవించి తెలుసుకోకుండా ఉండాలని ఇదంతా చెప్పటం. నచ్చితే పాటించండి. లేకుంటే చదివి వదిలెయ్యండి. ఎవరైనా నిజమైన అవసర వ్యక్తి వీటికోసం ఎదురుచూస్తూ ఉండొచ్చు. ముఖ్యముగా మన తెలుగువారికి ఉపయోగపడే విషయాల సమాచారం చాలా తక్కువగా ఉంది. అలాంటి వారికోసమే ఇక్కడ పెట్టడం / వ్రాయటం చేస్తున్నాను. అంతర్జాలములో ఎన్నెన్నో విషయాల మీద పోస్ట్స్ ఉన్నాయి. ఇలాంటివాటి మీద ఎక్కడా జాగ్రత్తలు చెబుతూ నాకు మాత్రం కనిపించలేదు. ఆ లోటు ని నా వంతుగా తీరుద్దామని ఈ చిన్ని ప్రయత్నం.

e-స్నేహాల తో నేను :
నా విద్యాభ్యాసములో ఏర్పడ్డ స్నేహితులు ఉద్యోగ రీత్యా, మరికొన్ని కారణాల వల్లనో వేరు వేరు ప్రదేశాల్లో సెటిల్ అయ్యారు. నేనూ బీజీ అయ్యాను. లైఫ్ లో ఒక స్టేజీ కి వచ్చాక, ఈ విషయములో వెనక్కి చూసుకుంటే ఏదో తెలీని వెలతి. అస్తమానూ టీవీ చూడటమే పనిగా అయ్యింది. ఒక్కోసారి ఎనిమిది గంటలకు చూడటం మొదలెట్టానూ అంటే అర్థరాత్రి రెండు గంటలవరకూ చూసిన రోజులూ ఉన్నాయి. దానివలన వచ్చిన ఫలితం ఏమైనా ఉందీ అని చూసుకుంటే - ఏమీ లేదు. కంటికి శ్రమ తప్పితే.

కాస్త డిఫరెంట్ గా ఏముందీ అని చూసుకుంటే - ఇలా ఆన్ లైన్ స్నేహాలు కనిపించాయి. వీటిలోకి దూరాను. ఈ రెండున్నర సంవత్సరాల కాలములో విశ్లేషించుకుంటే - నాకు ఒక యాభై మంది వరకూ మిత్రులు దొరికారు. ఆ మిత్రుల వల్ల మానసికముగా చాలా ఎనర్జటిక్ గా మారాను. నిరాసక్తమైన జీవితంలో ఆనందం వచ్చింది. ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు చాలా చలాకీగా మారాను. చాలా నేర్చుకున్నాను కూడా. మొదట్లో వారు నాకు తెలీని వాటిల్లో చాలా సహాయం చేశారు. ఇప్పుడు వారికి తెలీని విషయాల్లో నేను సహాయం చేస్తున్నాను.. అలా చాలా సాఫ్ట్వేర్స్ గురించీ, బ్లాగ్స్.. ఇలా ఎన్నో నేర్చుకున్నాను. వారందరికీ నా ధన్యవాదములు. ఇప్పుడు అందరూ అంటారు కదా.. ఇప్పుడు కూడా అలా ఎలా చలాకీగా ఉండగలుగుతున్నారు అనీ!. ఇదే ఆ రహస్యం.
updated on 17-Jan-2011 - 11:15 p.m

Thursday, January 13, 2011

Social NW Sites - 2 - ముందుమాట.

మనం చదువుకున్నప్పుడో, వృత్తిపరముగా  ఏర్పడే స్నేహాలు ఎలాగో ఇవీ అంతే! కూడా. కాకపోతే అవి ఒక ప్రదేశములో, ప్రత్యక్షముగా తాకి, అనుభవిస్తాము. కానీ ఈ ఆన్లైన్ సోషల్ సైట్లలో ఆ టచ్ మాత్రం ఉండదు. ఇక్కడ అంతా ఒక మాయ / ఊహాలోకములో స్నేహం అనుభవిస్తాం. ఇదొక్కటే ఇందులో ఉండదు. మిగతా అన్నీ ఒక్కటే. నిజమైన స్నేహాల్లోని ప్రేమ, వాత్సల్యం, దయ, జాలి, కారుణ్యం, ఆత్మీయత, ఆరాధన, అమాయకత్వం, తాము సాధించినవీ, విన్నవీ, కన్నవీ.. అలాగే మోసం, చాడీలూ, దగా, చాటుగా ఒకరిమీద మాట్లాడుకోవటం, ఒకరిమీద అభిప్రాయాలను  తెలుసుకోవటం, ఫిర్యాదులని ఇవ్వటం, చెడుగా చెప్పటం, నమ్మించి మోసం చెయ్యటం, అవసరానికి వాడుకొని అవతలకి జంప్ అవటం, మనదగ్గరవి దొంగిలించటం.. ఇలా నిజ స్నేహాలు ఎలా ఉంటాయో - ఇందులో ఇక్కడా అంతే!.. ఏమీ తేడా ఉండదు. అక్కడ స్నేహం కోసం కనీసం టీ అయినా ఇస్తే - ఇక్కడ ఆ ఖర్చే ఉండదు.

నిజ స్నేహాల్లో ఉన్న కొన్ని విషయాలు ఇందులో ఉండవు. ఇందులో ఉన్న కొన్ని ప్రత్యేకతలు నిజ స్నేహం లో ఉండవు. ఉదాహరణకి - నిజ స్నేహాల్లో మనిషిని ప్రత్యక్షముగా ముందు ఉండే మాట్లాడుతాము. ఇందులో అలా కాదు. ఇందులో ఉన్న ఒక గొప్ప అడ్వాంటేజ్ ఏమిటంటే - వ్యక్తులు ఎక్కడైనా ఉండనీ, యే చోటనైనా ఉండనీ, వెంటనే కలుసుకోవచ్చు, అభిప్రాయాలని పంచుకోవచ్చు. రానున్న కాలములో ఇది మరింత ఊపు కి వస్తుంది. ఇంటింటికీ టీవీల్లా, కంప్యూటర్స్ ఉంటున్నాయి. యువతా పెరిగిపోతున్నది. దూరాన ఉన్న బంధు మిత్రులకి టచ్ లో ఉండేలా వీటిని వాడుకునేవారు ఎక్కువగా అవుతున్నారు. ఇలా వాడుకొనేవారు తమకంటూ ఒక ప్రొఫైల్ మైంటైన్ చేస్తూ వాళ్ళు మాత్రమే వాడుకొనేలా సెట్టింగ్స్ పెట్టుకొని వారు వారు ఎంజాయ్ చేసేవారూ పెరిగిపోతున్నారు. ఇలా వాడుకునేవారికి ఇదొక వరం. అందునా ఇది ఫ్రీ కాబట్టి. అది ఎలా వాడుకోవచ్చో ముందు ముందు చెబుతాను.

ఇలా కాకుండా ఏదో ఆన్లైన్ లో విహరిద్దామనుకునే స్నేహాలు చేసేవారు మాత్రం - ఈ ఆన్లైన్ స్నేహాలని కాస్త అదుపులో పెట్టుకోవాలి. నిజానికి ఇదొక అందమైన ఊబి. ఉన్నా కొద్దీ ఉండాలనిపించే మాయాలోకం ఇది. మీ ఆర్ధిక, ఉద్యోగాలకు భంగం కాకుండా వీటిని మైంటైన్ చేసుకుంటే - వీటిలో ఆనందం పొందుతారు. లేకుంటే అధఃపాతాళానికి వెళ్ళటం ఖాయం. ఇది రెండువైపులా బాగా పదునున్న కత్తి లాంటిది. ఎలా వాడుకోవాలో బాగా తెలిసుండాలి. లేకుంటే  - అంతే!. నేనూ ఈ ఆన్లైన్ స్నేహాల వల్ల చాలా నేర్చుకొన్నాను. పోగొట్టుకున్నాను. అయినా ఒకటి పొందాలీ అంటే ఒకటి పోగొట్టుకోవటం తప్పనిసరి. కానీ అది ఎంత తక్కువగా పోగొట్టుకుంటే - ఎంత ఎక్కువగా దొరకబుచ్చుకోవచ్చు అనే ఇక్కడ మీ విజయానికి గీటురాయి.

అలాని ఇదేదో అందమైన భయంకర ఊబిలా ఉందని డీలా పడకండి. రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నాయని అసలు రోడ్డు మీదకి ఎక్కకుండా ఆగుతున్నామా? రోడ్డు మీద ఎలా జాగ్రత్తగా ఉంటామో ఇక్కడే అలాగే ఉండండి. అంతే!. ఒక్కోసారి ఎదుటివాడు - మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వాడే తప్పుడు దారిలో వచ్చేసి, ఆక్సిడెంట్ చేసేస్తాడు. అంత మాత్రాన మన తప్పు ఉన్నట్లు ఫీలయ్యి, అసలు రోడ్డు మీదకే - ఈజన్మలో రాము అని శపథం చెయ్యలేముగా. అలా ప్రమాదాలు ఈ భూమ్మీద ఉన్న వారికి అతి సహజాతి సహజం. ఇక్కడా అంతే!. రోడ్డు మీద ఎలా నడపాలో డ్రైవింగ్ క్లాసెస్ ఉంటాయే, శిక్షకులు ఉంటారు కానీ ఇక్కడ ఎవరూ ఉండరు. ఈ లోటుని కాస్త తగ్గిద్దామని నావంతుగా ఈ చిన్ని ప్రయత్నం అంతే!.. ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను.

ఇక్కడ మీరు చెయ్యాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే - మీ పర్సనల్ డాటా మాత్రం ఎవరికీ చెప్పకండి. మరీ అంత లోతుగా వెళ్ళకండి. ఇక్కడ స్నేహమే ముఖ్యం కానీ అంత కుటుంబ డిటైల్స్ అవసరం లేదని నా అభిప్రాయం. బాగా పరిచయాలయ్యాక అలా సమాచారం ఇచ్చి పుచ్చుకోండి. అలా ఎందుకో తరవాత చెబుతాను..

నేను ఈ షోషల్ సైట్లలో జాయిన్ అయినప్పుడు ఇలాంటి సమాచారం కోసం ఎంతగానో వెదికాను. ఊహు.. నాకు దొరకలేదు. నేనే ఒక్కొక్కటీ నేర్చుకుంటూ వెళ్లాను. ఇప్పుడు - నాలా తెలీని వారికి / తెలుసుకునేవారికీ చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రయత్నములో ఎంతవరకూ విజయవంతం అవుతానో వేచి చూడాలి.

ఇలా ఎన్నెన్నో విషయాలు చెప్పోచ్చును. కానీ ఇక్కడే అన్నీ చెప్పుకుంటూ వెళితే - ముందు ముందు టపాల్లొ ఏమి చెప్పుకుంటాము. కనుక ఇక మనం ముందుకు సాగుదాము.
updated on 17-Jan-2011

Tuesday, January 11, 2011

Social NW Sites - 1 - శ్రీకారం

ఈ సృష్టిలో మధురాతి మధురమైన వాటిల్లో స్నేహం కూడా ఒకటి. మన జీవితములో ఒక భాగముగా, అసలు స్నేహం చెయ్యని మనిషి - ఒక వింత పశువు అనిపించేలా - కనిపించే స్నేహం చాలా లోతైనది. గంభీరమైనదీ, అద్భుతమైనదీ కూడా. చిన్నప్పటి నుండీ ఇంటి పరిసర ప్రాంతాలలో ఉండే వారితో మొదలెట్టిన స్నేహం - ఆ తరవాత పాఠశాలలోనూ, కాలేజీల్లోనూ.. చేసే ఉద్యోగాలోనూ.. ఆఖరికి జీవిత మలిసంధ్యలో కూడా కొనసాగుతూనే ఉంటుంది. అప్పుడు కూడా ఇంకా క్రొత్త క్రొత్త స్నేహాలు చేస్తూనే పోతూ ఉంటాము. నిజానికి ఇదో అంతులేని దాహం అని అనుకుంటాను..

మౌఖిమముగా చేసే స్నేహాలు కాకుండా, కలం స్నేహాలూ, ఫోన్ స్నేహాలూ, SMS స్నేహాలూ.. ఇలా ఎన్నో వచ్చాయి. వాటన్నింటినీ అందరూ విశేషముగా ఆదరించారు. ఇప్పుడు అంతర్జాలముతో ప్రపంచమే కుగ్రామం అయిన సందర్భములో - ఈ ఇంటర్నెట్ లోని సోషల్ నెట్వర్కింగ్ సైట్లు వల్ల ప్రపంచములోని అన్ని వర్గాల ప్రజలూ, జాతులూ, తరతమ భేదం, లింగ భేదం.. అంటూ ఏమీ పట్టించుకోకుండా ఈ ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ల వల్ల స్నేహాలు చేస్తూనే ఉన్నారు. నెటిజనులూ వీటిని బాగానే ఆదరించారు.. ఆదరిస్తూనే ఉన్నారు. ప్రతి రోజూ క్రొత్తవారు చేరుతూనే ఉన్నారు..

నేనూ అలాగే వాటిల్లో రెండున్నర సంవత్సరాల క్రిందటే చేరాను. అందులో బాగానే స్నేహాలు సంపాదించుకున్నాను. ఇప్పటివరకూ ఒక యాభై వరకూ మంచి మిత్రులని సంపాదించుకోగాలిగాను.రకరకాల వ్యక్తులూ, రకరకాల అనుభవాలు.. కొన్ని మధురాతిభూతులు, కొన్ని మనసు చివుక్కుమనిపించే విషయాలు.. దాదాపు అన్నీ చవి చూశాను. అందులో అమాయకులనూ చూశాను.. మోసాలు చేసేవారినీ చూశాను.. మోసపోయేవారినీ చూశాను.. ఏమీ తెలీక ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో తెలీని వారినీ చూశాను. నాకున్న అనుభవాలు చాలా ఉన్నాయి. అవన్నీ నాతోనే అంతం అయ్యే బదులు నలుగురికీ పంచాలన్న కోరికా - నేనిలా మోసపోయాను, అలా మోసపోకుండా ఉండాలీ అంటే నేనేమి చెయ్యాలో చెప్పమనే మిత్రులూ, మిత్రురాళ్ళు.. ఒక్కక్కరి వ్యధలూ, బాధలూ, సంతోషాలూ, వైట్ కాలర్ హారాస్మేంట్.. ఇలా దాదాపు అన్నీ చవి చూశాను.

వారికోసం ఒక్కక్కరికీ చెప్పలేక - అందరికీ ఉపయోగపడాలని ఇక్కడ చెప్పాలని అనుకున్నాను. వాళ్ళందరూ బాగా అడిగితే కాదనలేక - ఈ పని మొదలెట్టాను. మీకూ ఉపయోగపడవచ్చన్న ఆలోచనతో ఈ బ్లాగుని వేదికగా మీకు చెప్పాలనుకుంటున్నాను. కాస్తో కూస్తూ ఎవరికైనా ఒక్కరికైనా సహాయపడుతాయని బాగా నా అనుభవాన్ని జోడించి మరీ వ్రాయబోతున్నాను. వీటిల్లో ఎక్కువగా మళ్ళీ అప్డేట్స్ ఉంటాయి. ఎందుకంటే - ముందుగా అనుకొని వ్రాస్తున్న విషయాలు కావు. మనసులో ఒకటి అనుకొని ఫ్లో లో వ్రాస్తూ, అనుభవాలు కలుపుకుంటూ అలా సాగిపోవటం వల్ల అప్డేట్స్ ఆనివార్యం. ఈ విషయాన్ని ఆ యా టపాల్లో చెబుతాను.

ఇదంతా నా అనుభవాలే - కన్నవీ, విన్నవీ, చూసినవీ కాబట్టి వివరముగా చెప్పాల్సినది ఉంటుంది. అసలు ఇలా వ్రాస్తానూ అని కూడా అనుకోలేదు. ఆధారాల కోసం,  కొన్ని ఫోటోల కోసం చాలారోజులుగా సేకరించాల్సి వస్తుంది. అంత సమయం లేదు కాబట్టే - ముందుగా ఫ్లో లో వ్రాస్తూ పోతుంటాను. ఎప్పుడైనా మధ్యలో ఏదైనా దొరికితే - అప్డేట్స్ లో (ఆ టపాలో క్రింది భాగాన) మళ్ళీ ఎడిట్ చేసి పెడతాను. ఆ విషయం గమనించగలరు. ఇది ఎవరినీ ఇబ్బంది పెట్టడానికో, కష్టపెట్టదానికో, నా పగ (?) తీర్చుకోవటానికో వ్రాయలేదు అని అలాని అనుకునేవారు గమనించగలరు.
Related Posts with Thumbnails