Wednesday, September 23, 2009

హలో కి బదులుగా..

అలెగ్జాండర్ గ్రాహంబెల్ కనిపెట్టిన టెలిఫోన్ వెన్నెన్నో వయ్యారాలు పోతూ ఏనాడో అరచేతిలో ఒదిగిపోయింది.. ఈ నానో యుగములో - అంతకన్నా మరింతచిన్నగా అవబోతున్నది.. మనలో చాలామందికి టెలిఫోన్లు, మొబైల్ ఫోన్లు ఉన్నాయి.. వాటిని ప్రతిదినమూ వాడుతున్నాము కూడా.. ఫోన్ లేని జీవితాన్ని ఊహించడానికే కష్టము.. ఇంతగా మనతో మమేకము అయిపోయిన ఈ ఫోన్ వాడకములో మీకు మరిన్ని మెలకువలు ఇప్పుడు చెప్పబోతున్నాను.. అందులో మీకిష్ట మైన వాటిని ఆచరించుకోవచ్చును..

1. మీ ఫోనులో ఎక్కువ నంబర్లు పట్టేలా ఉన్న (మొబైల్) ఫోన్ ని వాడండి. క్రొత్తగా వచ్చే ఫోన్ లలో ఉండే మెమొరీ లో ఒక వేయి ఫోన్ నంబర్లు వరకూ ఫీడ్ చేసుకోవచ్చును. ఇలాని సౌకర్యం కల ఫోన్ లతో మనం చేయవలసిన ఫోన్ నంబర్లు / కావలిసిన నంబర్లు అన్నీ మనవద్దె ఉంటాయి.

2. మనకి కావలసిన ముఖ్యమైన ఫోన్ నంబర్లని సిమ్ కార్డులో కాపీ చేసుకోవాలి. ఎప్పుడైనా వేరే ఫోన్ యూనిట్ వాడితే ఈ సిమ్ వేసినప్పుడు వెంటనే ఈ ముఖ్యమైన నంబర్లు అందుబాటులో ఉంటాయి.

3. సిమ్ కార్డు లోని నంబర్లు అన్నీ కాపీ చేసుకున్నామని నిర్లక్ష్యం వద్దు. ఒకవేళ మన ఖర్మకాలి సిమ్ బ్లాక్ అయితే ఇబ్బంది. ఎందుకైనా మంచిది - ఒక డైరీలో ఫోన్నంబర్లు అన్నింటిని వ్రాసుకోవడం మంచిది.

4. సిమ్ ఫోన్ బుక్ లోని నంబర్లు అన్నీ ఫోన్ లోని మెమరీ కార్డులోకి కాపీ చేసి.. తరవాత కంప్యూటర్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులోకి USB డాటా కేబుల్ ద్వారా కాపీ చేసి భద్రపరచుకోవాలి. ఎపుడైనా మీ ఫోన్ పోతే.. క్రొత్త ఫోన్ కొన్నప్పుడు అన్ని నంబర్లు లనీ మళ్ళీ కష్టపడి టైపు చేయకుండా, సింపుల్గా ఈ ఫోల్డర్ నుండి USB ద్వారా కాపీ చేసుకుంటే చాలు. (ఫోల్డర్ ; మెమరీ కార్డు ; ఫోన్ బుక్ ; సిమ్ కార్డు). కొన్ని మొబైల్ సంస్థలు మీ సిమ్ లోని నంబర్లు అన్నీ కాపీ చేసి భద్రపరిచే సౌకర్యాన్ని కల్పించాయి, కాని నెలకు 30 రూపాయల చేతి చమురు వదిలిపోతుంది. నెలకే అంత అయితే సంవత్సరానికి 360 రూపాయలే! వామ్మో!! అంత అవసరమా!

5. మొబ్లె షాపులలో మీకు బాగా తెలిసిన షాపులోకి వెళ్లి పాతది పడేసిన సిమ్ కానీ, యాక్టివేషన్ కాకుండానే గడువు ముగిసిన సిమ్ (అమ్మకుండా మిగిలినది) అడిగి తీసుకోండి. దాన్ని మీ మొబైల్ లో వేస్తే "sim rejected" అని వస్తుంది. ఆ విషయం పట్టించుకోకుండా ఫోన్ బుక్ ఓపెన్ చేసి, ఫోన్ బుక్ లోని పేర్లన్నీ ఆ సిమ్ లోకి కాపీ చేసుకోవచ్చు. ఆ తరవాత ఆ సిమ్ ని భద్రముగా దాచుకోవచ్చు. ఎప్పుడైనా క్రొత్త ఫోన్ కొంటే ఈ సిమ్ వేసి పేర్లన్నీ ఫోన్ లోకి కాపీ చేసుకోవచ్చు. ఇది చాలా తేలికగా ఉంది కదూ!

6. ఫోన్ రింగ్ అవగానే వెంటనే ఫోన్ ఎత్తకండి. అది ఏ నంబర్ నుండి వచ్చిందో చూడటం, రెండు , మూడు రింగులయ్యాక ఫోన్ ఎత్తడం కూడా అలవాటు చేసుకోండి. ఏదైనా అర్జెంట్ / మీరు ఎదురుచూస్తున్న కాల్ అయితే పరవాలేదు కాని నంబర్ చూసాక రెసీవ్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఫోన్ చేస్తున్నది ఎవరో, కారణం ఏమి ఉంటుందో కాస్త అంచనాకి రావచ్చును అంతలోగా.. మీరు ఇబ్బందితో ఏదైనా నిర్ణయం తీసుకోవలసివస్తే ఈ రెండు, మూడు రింగుల కాలాయాపన కారణం చూపి "నేను మీటింగ్ లో ఉన్నాను.. బయట ఉన్నాను.. ఒక అర్జెంట్ విషయమై వేరే సార్ తో.. " అంటూ ఏవో సాకులు చెప్పి తప్పించుకోవచ్చు..

7. ఫోన్ రింగ్ అవగానే ఎవరు కాల్ చేస్తున్నారో చూసి వారి పేరు ఫీడ్ అయి ఉంటుంది కాబట్టి వారెవరో తెసుకొని "హలో" అని అనకుండా డైరెక్ట్ గా వారి పేరుతో వారిని పలకరించండి. ఉదాహరణకి సుబ్బారావ్ మీకు ఫోన్ చేసినట్లయితే - హలో అని అనకుండా "చెప్పండి సుబ్బారావు గారూ! మీరు చాలా కాలము తరవాత ఫోన్ చేసారు! ఏమిటీ సంగతీ!.." అంటూ వారి యోగక్షేమాలు గురించి మాట్లాడండి. అవతలి వ్యక్తి డంగై పోతాడు.. "ఇతను నన్నూ, ఇంతగా నా పేరు గుర్తుంచుకున్నాడా.. " కించిత్ హాశ్చర్య పడిపోతాడు కూడా! మిమ్మల్ని ఇంకా అభిమానిస్తాడు. చాలా మందికి వారికి ఇష్టమైన పిలుపు ఏమిటంటే - వారిని గుర్తుంచుకొని పేరుతో పిలవడం..

8. యోగ క్షేమాలు ఎక్కువగా అడగవద్దు! ఒకటి, రెండు ముక్కల్లో విషయం తేల్చేయ్యాలి చాలామంది తమ విషయాలు చాలా పర్సనల్ గా ఫీల్ అవుతారు.. వారు చెబితేనే వింటేనే బాగుంటుంది. గుచ్చి గుచ్చి అడిగితే మళ్ళీ మనకి ఫోన్ చెయ్యలేక పోవచ్చు..

9. మన దగ్గర ఎంత విలువైన ఫోన్ యూనిట్ ఉందని కాదు.. మనం దాన్ని ఎంతగా వాడుకుంటున్నామని చూడాలి. అంటే వేలకి వేలు పోసి High-end యూనిట్ కొనుక్కొని, అందులోని ఫీచర్స్ అర్థం కాక, ఎలా వాడాలో, జీవితములో వాడని వాటికి డబ్బులు పెట్టి కొనడం తెలివైన పని అనిపించుకోదు. ఉదాహరణకి: నాకు తెలిసిన ఒకతను 16 వేలు పెట్టి ఒక ఫోన్ కొన్నాడు. కాని అతడికి SMS పంపడం కూడా రాదు. 3.2 మేగాపిక్సేల్ కెమరాని కూడా వాడటం చాలా అరుదు. ఇక GPRS / ఇంటర్నెట్ అనేవి కలలో కూడా వాడడు. ఇలాంటివాడికి అంతటి ఫోన్ దండగే అనిపిస్తుంది కదూ! ఫోన్ యూనిట్ ని ఒక హోదా చిహ్నముగా భావించేవారిని చూసి నవ్వుకోండి. వాళ్లింకా పాత రాతి యుగములోనే ఉన్నందులకు జాలిపడండి. కాస్త పెట్టుబడి పెట్టి ఎక్కువగా లాభం పొందేవారిని చూసి నేర్చుకొనడములో సిగ్గుపడాల్సిన పనేమీ లేదు..

10. ప్రతి ఫోనులో కాల్ హిస్టరీ అంటూ ఉంటుంది. ఏ రోజున, ఏ సమయములో, ఎక్కడికి ఫోన్ చేసారో అందులో ఎప్పటికి అప్పుడు చేరుతూనే ఉంటుంది. అదికాకుండా మనకి వచ్చిన Missed calls, Recieved calls, Dailled calls ఇవి ఒక్కోదానికి 20 నంబర్లు వరకూ ఆడ్ అవుతాయి. 21 వస్తే మొదటిది ఆటోమాటిక్గా డిలిట్ అవుతుంది. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు ఇప్పుడు చెబుతాను. ప్రతి రోజూ రాత్రి / మీకు వీలున్నప్పుడు ఈ లిస్టు అంతా చెక్ చేసుకోండి. అవతలివారు ఎప్పుడు, ఎందుకు కాల్ చేసారో తిరిగి ఒకసారి గుర్తుచేసుకోండి.. దాన్ని విశ్లేషించుకోండి.. అలా ఎవరు చేసారు, 
ఎందుకు చేసాడు, 
ఎప్పుడు చేసాడు, 
ఏమి అడిగాడు, 
నేనేమి చెప్పాను.. 
నేను అప్పుడు ఇంకా ఎలా మాట్లాడితే ఇంకా బాగుండేది?.. అని. ఇలా చేస్తే మానవ సంభంధాల విషయాల్లో మీరు బాగా ఎదుగుతారు. ఇంకో విషయం: ఆ కాల్ ఇక అవసరం లేదు అన్నప్పుడు డిలిట్ చేసేయండి. లేక అవతలివారికి ఏదైనా పని చెప్పి అది ఇంకా పెండింగ్ లో ఉంటే ఆ దేటైల్స్ ని అలాగే ఉంచేయండి. మళ్ళీ కాల్ చేసినప్పుడు ఆ సమయం, తేదీని వారికి చెప్పి గుర్తు చేయవచ్చు. అవతలి వ్యక్తితో ఆ పని ముగిసిన తరవాత డిలిట్ చెయ్యండి.

11. చాలామంది రాత్రిన పడుకునే ముందు ఫోన్ బ్యాటరీ చార్జింగ్ కి పెట్టి పడుకుంటారు! దానివలన బ్యాటరీ మన్నిక కాలం తక్కువ అవుతుంది. ఇలా చేయక పొద్దున్నే లేవగానే మీరు చార్జింగ్ కి పెట్టి, మిగతా కార్యక్రమాలు జరుపుకుంటే.. అంతలోగా చార్జింగ్ అయిపోతుంది. (ఇక్కడ మొబైల్ తయారీ కంపెనీల వారికి ఓ చిన్న సూచన: చార్జింగ్ పూర్తికాగానే చార్జింగ్ అయినట్లు రింగ్ అవుతే చాలా బాగుంటుంది.. దీనికి కొద్దిగా సాఫ్టువేరు మారిస్తే సరి..)

12. చార్జర్ లలో మొబైల్ తో ఇచ్చే అన్ని చార్జర్ లూ సరియైనవి ఉండవు. చాలా చార్జర్స్ 150mA, 300mA ఉంటాయి. కాని 500mA, 800mA చాలా ఫాస్టుగా చార్జింగ్ జరిగిపోతుంది. ఈ 800mA చార్జర్ ఒక మొబైల్ ఫోన్ బ్యాటరీని 40 నిముషాల్లో ఫుల్ చార్జింగ్ ని చేస్తుంది.

13. మీది ఫోన్ ఏదున్నా, చార్జర్ ఏదున్నా chengeover charger pins అంటూ మొబైల్ షాపుల్లో దొరుకుతాయి. అది ఒకటి కొనుక్కొని జేబులో వేసుకొని ఉంచుకుంటే ఎక్కడైనా చార్జింగ్ చేసుకోవచ్చు..

14. ఎవరైనా కొత్తవాళ్ళు ఫోన్ చేస్తే, వారితో మాట్లాడాక వారు మనతో మళ్ళీ ఫోన్ చేస్తారని అనిపిస్తే, ఆ నంబర్ ని సేవ్ చెయ్యండి. వారి పేరు లేదా వృత్తి లేదా ఊరు లేదా పని.. వీలయితే వారి ఫోటో తీసి, ఆ ఫోటోని ఈ నంబర్ కి కలిపితే.. ఆ నంబర్ గల వ్యక్తి మనకి ఫోన్ చేసినప్పుడు మొబైల్ స్క్రీన్ పైన తన ఫోటో వస్తుంది. అప్పడు ఈజీగా తనని గుర్తించవచ్చు..

15. మనం ఎప్పుడూ ఫోన్ చేసే నంబర్లని స్పీడ్ డయల్ లో పెట్టుకోవాలి. ఇందులో కీ బోర్డ్ లోని 2 - 9 వరకు నంబర్లని ఈ స్పీడ్ డయల్ నంబర్లు గా పెట్టుకోవచ్చు. ఉదాహరణకి 5వ నంబర్ ని ఇంటివారికి ఎన్నుకొని ఉంటే - ఈ 5వ నంబర్ ని నొక్కి, తరవాత డయల్ కీ నొక్కితే సరి.. వారికి ఫోన్ కలుస్తుంది. మొత్తం నంబర్ టైపు చేయాల్సిన అవసరం లేకుండా తేలికగా లైను కలుస్తుందికదూ!!!! .. 

last updated on 5-October-2009 10:00am.

4 comments:

Related Posts with Thumbnails