తెలంగాణా జిల్లాల్లో పాలపిట్టకి ఎంతో ప్రాధాన్యత ఉంది. చూడడానికి పిడికెడు అంతగా ఉండే ఈ పాలపిట్ట సాధారణముగా పొలాల్లో కనపడుతూ ఉంటుంది. ఆసక్తికర విషయం ఏమిటంటే దసరా రోజున కనపడటం చాలా కష్టం. విజయదశమి రోజున ఈ పిట్ట కనిపిస్తే విజయం సిద్ధిస్తుందని చాలా నమ్మకం. దీనికోసం చిన్నా, పెద్దా అంటూ తేడా లేకుండా చెట్టూ, పుట్టా గాలిస్తారు.. ఈ పిట్ట కనిపిస్తే తాము ధరించిన చెప్పులు వదిలి ఆ పిట్ట వంక చూస్తూ మ్రొక్కుతారు. ఇంత విలువ దీనికేందుకు అంటే - పాండవులు తమ అరణ్య, అజ్ఞాత వాసాలు ముగించుకొని రాజ్యానికి వస్తుండగా ఈ పాలపిట్ట కనపడింది - ట. అప్పటినుండి వారికి విజయాలు సిద్ధించాయని జానపదుల నమ్మకం. దసరా రోజున ఒకరికొకరు ఆలింగనం చేసుకొని, జమ్మి ఆకులతో బాటుగా క్రొత్తగా వచ్చిన ధాన్యం కంకులను పెద్దల చేతుల్లో పెట్టి వారికి పాదాభివందనం చేస్తారు. ఆశీస్సులు తీసుకుంటారు. దేవాలయాలను కూడా దర్శిస్తారు..
పాండవులు - ఆయుధాలు అనే కథనే కాకుండా ఇంకో కథ కూడా ఉంది. అదేమిటంటే - పూర్వకాలములో కౌత్సకుడు అనే విద్యార్థి వరతంతు అనే అనే గురువు వద్ద అన్ని విద్యలూ నేర్చుకుంటాడు. చివర్లో గురుదక్షిణ ఇస్తానని పట్టుపడతాడు. వద్దు వద్దు అని ఎంత చెప్పినా ఆ విద్యార్థి వినకపోవటముతో, అలా గయితే నాకు 14 కోట్ల బంగారు నాణేలు గురుదక్షిణగా ఇవ్వమంటాడు ఆ గురువు. ఆందుకోసం అతడు అయోధ్య రాజు శ్రీరాముని పూర్వికుడైన రఘురాజు ని సంప్రదిస్తాడు. ఆ రాజు వద్దకూడా అంత డబ్బు లేక ఆ రాజు ఇంద్రుణ్ణి ఆశ్రయిస్తాడు. ఆ ఇంద్రుడు కుబేరుడి వద్దకి పంపుతాడు. అప్పుడు ఆ కుబేరుడు అయోధ్యలోని శమీవృక్షం నుండి బంగారు నాణేలని కురిపిస్తాడు. వాటిలోంచి గురుదక్షిణ ఇవ్వగా మిగిలిన నాణేలని ప్రజలకి, ఈ శుక్ల దశమి రోజున ఆ కౌత్సకుడు పంచేస్తాడు. అందుకే ఆ ఆకులని దాచుకుంటే సంపద వృద్ధి చెందుతుందని అనే నమ్మకం స్థిరపడిపోయింది.
No comments:
Post a Comment