Thursday, July 9, 2009

మీ పిల్లలకి మీరే ఇవ్వగలిగే అందమైన కానుక.

మీ పిల్లలకి మీరు మధురమైనది ఏమి ఇవ్వాలని అనుకుంటున్నారు..?

మంచి జీవితాన్ని.. అని అంటారని నాకు తెలుసు. ఇంకా..?
మంచి ఇల్లు, బంగాళా, జీవిత భాగస్వామి, మంచి ఉన్నత విద్య.. నేను అడిగేది ఈ కోణములో కాదు.. వివాహ సమయానికి / యుక్త వయస్సుకి రాగానే మీరు మాత్రమే ఇవ్వగలిగే ఒక మంచి కానుక ఏమిటో చెప్పండి?..

ఒకసారి ఊహించండి..
...
తట్టలేదా..?

ఒక ఐదు నిముషాలు విరామం తీసుకొని మరీ ఆలోచించండి..

పోనీ క్లూస్ కావాలా..
# కేవలం మీరు మాత్రమే (తల్లి, తండ్రులు) ఇవ్వగలిగేది..
# మీ బంధువులు, మీ పిల్లల అక్కా, అన్నయ్యలు, తాత, అమ్మమ్మలూ, నాయనమ్మలూ కూడా ఇది ఇవ్వగలరు. కాని మీ అంతగా న్యాయం చేకూర్చరు.
# ఇది ఎంతో విలువైనది.. ఎప్పటికప్పుడే దాచివుంచాలి.. అవన్నీ సేకరించి భద్రపరచాలి.
# ఇది వారికి (పిల్లలకి) ఇచ్చినప్పుడు మొదట్లో అర్థంకాదు గానీ, తరవాత మీరు చేసిన ఈ పనిని చాలా గొప్పగా మెచ్చుకుంటారు. వారి సన్నిహితులల్లో మీకు మంచి గుర్తింపు వస్తుంది..
# ఇది చాలా ఓపికగా, చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని.. ..... ఇవి చాలుగా..

ఈపాటికి మీకు కొద్దిగా అర్థము అయ్యింది, కాని అది అస్పష్టముగా, ఇది అంటూ చెప్పలేని స్థితిలో ఉన్నారు కదూ!..

సరేలే!. ఇక నేనే చెప్పేస్తాను..

మీరు మాత్రమే మీ పిల్లలకి కానుకగా ఇవ్వగలిగేది - వారియొక్క "చిన్ననాటి జ్ఞాపకాల గుచ్ఛం".

అంటే పిల్లలు తల్లి గర్భములో ఉన్నప్పటి నుండియుక్తవయస్సునకు వచ్చేవరకూ వారు ఎలా ఉన్నారు, ఎలా పెరిగారు, ఏమేమి వస్తువులు వాడారో, ఎటేటు వెళ్ళారో.. ఇలాంటివన్నీ జ్ఞాపకాలకి అందమైన రూపునిచ్చి వారికి బహుమతిగా ఇవ్వడం.. మనం వారికి మంచి వ్యక్తిత్వం, చదువు, ఉపాధి, ఆస్థులూ, మంచి జీవన భాగస్వామిని ఇవ్వగలము కానీ వారి జ్ఞాపకాలని మనం ఇవ్వటం లేదు.. ఈ బిజీ లైఫ్ లో పడి.

నా చిన్నప్పుడు మా నాన్న తనకి వీలున్నప్పుడల్లా నా చిన్నప్పటి సంగతులు చెప్పేవాడు.. అలా కొన్ని విషయాలు నాకు గుర్తుండిపోయాయి.. తను ఇప్పుడు లేరు - కాని నా చిన్ననాటి విషయాలు నాకు చెప్పి అవైనా కొన్ని మధురానుభూతులు నాకు మిగిల్చారు. ఆ తరవాత నా బీజీ లో ఉండి ఈ విషయం అసలే మరచిపోయాను..

అనుకోకుండా ఒకరోజు - మా అన్నయ్య దగ్గరికి నా పిల్లలతో కలసి వెళ్ళాను.. అన్నయ్య అమ్మాయి తన ఫోటో ఆల్బం మాకిచ్చి చూడమన్నది. తను చిన్నప్పటి నుండి దిగిన ఫోటోలను వయసువారిగా అందముగా ఆ ఆల్బంలో కూర్చి చూపించింది. నేనూ యధాలాపముగా చూసాను. మా అమ్మాయి "డాడీ! నా ఫోటో ఆల్బం కూడా ఇలా చేసివ్వవా.." అంది. నేనయితే షాక్ తిన్నాను. సన్నగా చిరు చెమట!.. తనతో సరే అన్నాను కాని - మనసంతా ఆలోచనలే! కొద్దిగా బాధ.. ఎదుకంటే అప్పటివరకూ మా అమ్మాయి ఫొటోస్ కేవలం తన 21 వ దిన వేడుకలవే (credle ceremony) వే ఉన్నాయి. ఇప్పటి వరకూ ఆ ఫోటోస్ తప్ప బాల్యమునకు సంబంధించిన ఏ వివరాలు, ఫొటోస్ గాని లేవు.. రేపు పెద్దయ్యాక నన్ను ఇదే ప్రశ్న అడిగితే?.. నా వద్ద సమాధానము లేదు.

ఇలా అయితే లాభము లేదనుకొని కొద్దిరోజులు ఎలా ఆ కోరిక నెరవేర్చాలి.. అని ఆలోచించాను. కెమరాతో ఫొటోస్ తీయడం.. వారి తాలూకు వస్తువులు దాచి పెట్టడం.. అప్పుడు నేనున్నా పరిస్థితుల్లో కెమరా కొనడమే కష్టం. అయినా కొనక తప్పలేదు. చాలా రీళ్ళు వారినే expose చేశాను.. అలా చేసాక ఒక్కో ఫోటోకి 8-9 రూపాయల ఖర్చు (రీలు+ డెవలప్ + ప్రింటింగ్).. కొద్దిరోజుల తర్వాత ఆ ఫొటోస్ ఫేడ్ అయిపోవటం, చేమ్మకు ఫోటోస్ ఆల్బం కి అంటుకొని పాడవటం.. ఇవన్నీ చూసి వీటిని ఎలా భద్రపరచాలి అని అనుకున్నాను..

ఒక మిత్రుడు చెప్పిన సూచన మేరకు డిజిటల్ ఫొటోస్ చాలా ఈజీ, తక్కువ ఖర్చు, సులభముగా కాపీ, చాలా కాలం వరకు మన్నిక, bright, contrast మనం కోరుకున్న రీతిలో రూపాంతరం చేసుకోవచ్చును అని తెలుసుకునేసరికి.. ఆలస్యం చేయకుండా (శాంపిల్ కోసమని) కెమరా ఉన్న మొబైల్ ఫోన్ కొన్నాను. దానితో చాలా ఫొటోస్ తీసి భద్రపరిచాను. ఆ కంప్యూటర్ కొన్నాక ఈ ఫొటోస్ అన్నీ అందులోకి ఎక్కించాక అప్పుడు తెలుసుకున్నాను - డిజిటల్ ఫోటోల సౌలభ్యము గురించి.. తరవాత ఇక ఆగలేదు.. వెంటనే 10 మెగా పిక్షెల్ కెమరా కొన్నాను.. ఇప్పుడు ఫుల్ రిజలూషణ్ లో ఫొటోస్ తీస్తున్నాను. అలా ఎందుకంటే రేపొద్దున వారు జూమ్ చేసి చూసుకున్నా, పెద్దగా ప్రింట్లు వేయించుకున్నా బాగుండాలని. ఇంకా ఫోటోలో ప్రక్కన ఉన్న వస్తువులు కూడా స్పష్టముగా ఉండాలని.

ఇప్పటివరకూ వారివి కనీసం రెండువేల ఫొటోస్ పైగా ఉన్నాయి.. అవి సరిపోవు.. ఇంకా తీయాలి. ఇప్పుడు మా అమ్మాయి నన్ను అడిగిన కోరిక తీరింది..

కాని నాలో ఏదో అసంతృప్తి.. ఈ కోరికని ఇంకా అందముగా ఎలా తీర్చి ఇవ్వగలను - అని.

తీక్షణ ఆలోచనల ఫలితముగా కొన్ని రూపుదిద్దుకుంటున్నాయి.. అవేమిటంటే వారికి తెలీకుండా చాలా వరకు
వారి నోట్ బుక్ లో వీరి చేతివ్రాత,
చివరి పేజీలలో రాసుకునే పిచ్చి పిచ్చి రాతలూ,
కాగితాలపై, గోడలపై వేసే పిచ్చి పెయింటింగులూ,
వాళ్లు పోట్లాడుకునేటప్ప్పుడు వీడియోలూ,
ఏడుస్తున్నప్పటి నవ్వుతున్నప్పటి ఫొటోస్,
ఇంకా చిలిపి పనులూ,
వారి స్కూల్ ఫొటోస్,
ఫ్రెండ్స్ ఫోటోస్,
స్కూల్ బ్యాడ్జి,
ఐడెంటిటి కార్డు,
స్కూల్ బస్ ఫోటో,
వాళ్లు చూసిన సినిమా ఫోటో.. ఇలా వాళ్లు పెద్దయ్యాక చిలిపిగా, ఆసక్తి చూపే ఫోటోలు అన్నీ తీస్తున్నాను..

అది అలా ఉంటే ఇప్పుడు వారికి వంశవృక్షం తెలిపే చార్ట్ తయారు చేస్తున్నాను. అందులో ముత్తాతలనుండి ఇప్పటి వరకూ ఉన్నవారి ఫోటోలూ సేకరించి వీరు ఫలానా ఫలానా అని తెలియచెప్పేందుకు అదీ మొదలెట్టాను..

ఇంత చేస్తున్నాను.. కాని ఈ పద్దతి ఈమధ్య మొదలెట్టాను గాని కడుపులో ఉన్నప్పటినుండి ఇలా చేస్తే ఎంత బాగుందేడిది.. కడుపులో ఉన్నప్పటి అల్ట్రా సోనిక్ స్కాన్ ల ఫొటోస్, పుట్టిన వెంటనే ఫోటో, 21 డే ఫోటో, మొదటి నెల, రెండవ నెల.. తల ఎత్తి చూసినప్పటి ఫోటో, బోర్లా పడ్డప్పటి వీడియో, పాకినప్పటి, నడుస్తున్నప్పటి వీడియోలూ తీస్తే చాలా బాగుందేడిది. స్కూల్ కి వెళ్ళిన ఫొటోస్.. ఇలా అన్నీ తీసిస్తే చాలా బాగుందేడిది.. తనూ సంతోషిస్తారు.. వారి సంతోషముతో మన కష్టాన్ని మరచిపోగలం.

ఫొటోస్ సిస్టమ్ లోకి లోడ్ చేసిన వెంటనే ఆ ఫోటో properties లోకి వెళ్లి ఆ ఫోటో సందర్భం, ఎక్కడ.. అవన్నీ రాస్తున్నాను. తరవాత ఎవేరికి వారివే ఫోల్డర్లు పెట్టి వారి వారి ఫొటోస్ అన్నీ వారి వారి ఫోల్డర్లు లోకి కాపీ చేస్తున్నాను ఇప్పుడు.. అవన్నీ ఒక DVD అయ్యాక ( 4.7 GB) అయ్యాక ఒక DVD లోకి బర్న్ చేస్తున్నాను.. ఇంకొద్ది రోజులలో స్కానర్ కొని వారివి పెయింటింగులూ, మార్కుల పట్టీలూ, చేతి రాతలూ అన్నీ స్కాన్ చేసి ఉంచుదామని అనుకుంటున్నాను. వారి పాత ఫొటోస్ ని కూడా డిజిటల్ గా మార్పిస్తున్నాను..


updated on 11-July-2009

5 comments:

Anonymous said...

మంచి వ్యక్తిత్వం

Raj said...

అదీ కరక్టే! కాని నేను అనుకున్నది అదికాదండీ.. ఈ పాటికి అదేమిటో మీకు తెలిసే ఉంటుంది. నా బ్లాగ్ చూసినందులకు ధన్యవాదములు.. వీలున్నప్పుడల్లా చూడండి..

Anonymous said...

మనసు మూగదే కాని బాసుండది దానికి
సెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది
ఎద మీద ఎదబెట్టి సొదలన్నీ ఇనుకో
ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో
......
really good
bharani mahankali

Anonymous said...

avanni miss ayete nijamga badhagane vuntundi..i know..bt v r lucky nw..puttina kshanam nundi nudi kuda photos,videos anni tesamu.avanni chala bhadram ga vunayi..ma abbai avi chusi tega siggu padtadu..can u guess how old he??just 3yrs...bt very sharp n naughty
maha

Raj said...

అవునా.. చాలా మంచి పని చేశారు. మీకు అభినందనలు.

Related Posts with Thumbnails